రూ.లక్ష ఇవ్వాల్సిందే
కడప కార్పొరేషన్: ఆయన వామపక్షాలకు చెందిన ఓ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండేవాడు.. ఏదేదో చేయడంతో ఆ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. కేవలం ఐదేళ్లలోనే యువసేనను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ నాయకుడు ఎదిగాడు. అనంతర ఆయన చేరనిపార్టీలేదు.. చేయని వివాదం లేదు.. కొన్నాళ్లకు సినీనటుడు స్థాపించిన పార్టీలోకి చేరిపోయాడు. ఆ పార్టీ మరో పార్టీలో విలీనం కావడంతో తాను కూడా అక్కడికి చేరిపోయాడు.. అప్పటి మంత్రి అనుచరులే తన కారును కాల్చివేశారని ఆరోపణలు చేసి పత్రిలకెక్కాడు.
ఈ వివాదాలవల్లే ఆ పార్టీలో అధికారప్రతినిధి పదవి సంపాదించాడు. గత ఎన్నికల్లో కార్పోరేటర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓడిపోక తప్పలేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి, నెలతిరక్కుండానే అక్కడా ఇమడలేక ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఆశ్రయించాడు. ఆయన పార్టీలు మారడం ఎవ రికీ అభ్యంతరం లేకపోయినా ఆ కారణంతో చేసిన అక్రమ వసూళ్లు వివాదంగా మారుతున్నాయి. తాను అడిగిన సొమ్మును ఇవ్వలేదని ఓ ఇంజినీర్‌ను ఏకంగా తుపాకీతో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కడప కార్పొరేషన్‌లో చర్చనీయాంశమైంది.
బెదిరింపులు ఇలా...
నేను పార్టీ మారాను.. మా నాయకుడు రేపు కడపకు వస్తున్నారు.. మీ తరుపున లక్ష రూపాయలు ఇవ్వాలి..అంత లేదంటే కనీసం యాభై వేలైనా ఇవ్వాలి.. అంతకు ఏమాత్రం తగ్గినా మీ స్థాయికి బాగుండదు... ఇలాంటి మాటలు చెప్పే కడప నగరపాలక సంస్థలో ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులనుంచి సుమారు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఐదువేలో, పదివేలో అంటే ఇవ్వగలంగానీ లక్షరూపాయలంటే ఎక్కడినుంచి తేవాలి.. అంత ఇవ్వలేను అని ఎదురుతిరిగిన ఇంజినీరుపై కార్పొరేషన్‌లోనే తుపాకీ చూపెట్టి బెదిరించినట్లు తెలుస్తోంది.
కాగా అదే ఇంజినీరుపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి లెటర్‌హెడ్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కడప నగరపాలక సంస్థలో అధికారులనుంచి చేసిన వసూళ్ల పట్ల మేయర్ సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. ఎవరెవరైతే డబ్బు ఇచ్చారో వారికి సంబంధించిన వర్క్‌లను తానే తనిఖీ చేస్తానని, ఆ తర్వాతే వారికి బిల్లులు చేస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం.
* మీ డివిజనల్ స్థాయి అధికారిని ఇక్కడికి నేనే రప్పించాను.. మీకు భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా నాకు చెప్పండి. చేయిస్తా. ప్రస్తుతం నేను ఉంటున్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటూ ఉద్యోగుల నుంచి సుమారు రెండున్నర లక్షల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది.
* గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కడపకు వచ్చినప్పుడు కూడా అధికారులనుంచి ఇదేరీతిలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమర్ హాస్పిటల్ వద్ద ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు 40 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.
ఆయన ఉంటున్న ఇంటిపై కూడా గతంలో వివాదం ఏర్పడింది. తమ ఇళ్లు ఆక్రమించుకుని బాడుగ చెల్లించడం లేదని, గట్టిగా అడిగితే తుపాకీ చూపించి బెదిరించాడని ఆలంఖాన్‌పల్లెకు చెందిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించి వాపోయారు. ఇన్ని చేస్తున్నా.. తుపాకీ ై లెసైన్సును దుర్వినియోగం చేస్తున్నా ఈయనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.