శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ | HICC convention center C/o for Training, Investigation | Sakshi
Sakshi News home page

శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ

Published Sun, Aug 31 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ

శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ

ఇన్‌స్టిట్యూట్ వాచ్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీ యూ)గా విద్యార్థి లోకంలో సుపరిచితమైన పేరు. ఈ విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటై.. బోధన, శిక్షణ, పరిశోధనల్లో ఎప్పటికప్పుడు నవ్యతను ప్రదర్శిస్తూ.. ఇటు స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులనూ ఆకర్షిస్తోంది. ఉన్నత విద్యలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన హెచ్‌సీయూపై ఇన్‌స్టిట్యూట్ వాచ్..
 
 శ్రీఒక విద్యా సంస్థ పనితీరును తెలుసుకోవాలంటే అందులో పట్టభద్రులైన విద్యార్థులు, సదరు విద్యా సంస్థ అకడమిక్ ప్రతిభే ప్రామాణికం్ణ.. సాధారణంగా ఏదైనా వర్సిటీ/కాలేజీ గురించి విద్యావేత్తల అభిప్రాయమిది! ఈ కోణంలో పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు!  
 
 ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు
 వివిధ కోర్సుల్లో ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. మొత్తం 47 విభాగాల ద్వారా 59 యూజీ/పీజీ కోర్సులను, 27 ఎంటెక్/ఎంఫిల్ కోర్సులను, 47 పీహెచ్‌డీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 5000 మందికిపైగా విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. ట్రాన్స్‌లేషన్ స్టడీస్ నుంచి టెక్నికల్ రీసెర్చ్ వరకు వినూత్న కోర్సులను అందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని విభాగాల్లో క్రెడిట్ ఆధారిత అభ్యసన వ్యవస్థ(సీబీఎల్‌ఎస్) ను అమలు చేస్తుండటం విశేషం.
 
 ప్రత్యేక గుర్తింపు
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రముఖ సంస్థలు ఇస్తున్న ర్యాంకుల ఆధారంగా దానికున్న గుర్తింపును అంచనా వేయొచ్చు. అవుట్ లుక్, కెరీర్స్ 360, ఇండియా టుడే తదితర మేగజైన్లు నిర్వహిస్తున్న ‘ఉత్తమ విశ్వవిద్యాలయాల’ సర్వేలో హెచ్‌సీయూ టాప్-10, టాప్-20 పరిధిలో స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకుల కేటాయింపులో ప్రసిద్ధిగాంచిన  క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ర్యాంకింగ్స్ జాబితాలోనూ చోటు సంపాదించింది. 2010లో క్యూఎస్ టాప్-200 ఆసియా విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది.
 
 నిత్య నూతనంగా శిక్షణ
 శిక్షణ పరంగా హెచ్‌సీయూ నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమ వర్గాలను ఎప్పటికప్పుడు సంప్రదించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల పాఠ్యప్రణాళికలో మార్పులుచేర్పులు చేపడుతోంది. కొత్త కోర్సుల రూపకల్పనలోనూ తనదైన ముద్రను చాటుకుంటోంది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయం గత దశాబ్ద కాలంలో 30కి పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. అధ్యాపకుల బోధనా శైలి, కోర్సు స్వరూపం-దాన్ని అందిస్తున్న విధానం తదితర అంశాల్లో విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని, లోటుపాట్లను సరిదిద్దుకుంటోంది. బోధనలో నాణ్యతను పెంచేందుకు పీహెచ్‌డీ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో ముందుంటోంది.
 
 404 మంది అధ్యాపకుల్లో 379 మంది పీహెచ్‌డీ ఫ్యాకల్టీ కావడం ఇందుకు నిదర్శనం. విదేశీ విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలు, పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు పెద్దపీట వేస్తోంది. బోధనా సిబ్బందిలో నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అకడమిక్ స్టాఫ్ కాలేజీని ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాల ను సాధించగలుగుతున్నారు. సీఎస్‌ఐఆర్-నెట్, స్లెట్ వంటి పరీక్షల్లో వర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధిస్తున్నారు.
 
 పరిశోధనలకు ప్రాధాన్యం: కేవలం అకడమిక్ కోర్సుల తరగతి బోధనకే పరిమితం కాకుండా పరిశోధనలకూ ప్రాధాన్యమిస్తోంది. డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్, డీఆర్‌డీఓ తదితర సంస్థల కోసం స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. యూనివర్సిటీకి అధికారిక గుర్తింపు తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.283 కోట్లు లభించడం విశేషం. ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఆవిష్కరణల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 15 పరిశోధన ప్రాజెక్టులకు పేటెంట్ల కోసం భారత్‌తోపాటు, అమెరికా, యూకేల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు.
 ఠ అకడమిక్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి కలిగించేలా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆసరా ఇచ్చేలా విశ్వవిద్యాలయం ‘టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ను ప్రారంభించింది.
 
 -   విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో సదరు విద్యాసంస్థ లో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విషయం లో విశ్వవిద్యాలయం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. విశ్వవిద్యా లయ గ్రంథాలయంలో 3.7 లక్షల పుస్తకాలు, 2.5 లక్షల జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐసీటీ బోధన పద్ధతులకు సంబంధిం చిన పలు సాధనాలు కూడా ఉన్నాయి.
 
 దూర విద్య కోర్సులు     : విశ్వవిద్యాలయం ‘సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్’ పరిధిలో దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న కోర్సుల్లో ప్రస్తుతం 17 పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 1994లో ఏర్పాటు చేసిన దూరవిద్య కేంద్రంలో నవ్యతకు నిదర్శనంగా క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్; టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్; కన్జూమర్ ఎడ్యుకేషన్ తదితర  కోర్సులను చెప్పుకోవచ్చు.
 వెబ్‌సైట్: www.uohyd.ac.in
 
 ‘న్యాక్’ గుర్తింపు
 మన దేశంలో విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చే అత్యున్నత సంస్థ నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్(న్యాక్). దీని గుర్తింపు విషయంలోనూ హెచ్‌సీయూ ముందు వరుసలో నిలుస్తోంది. 2014లో న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపును పొంది.. వరుసగా మూడోసారి ఈ ఘనతను సాధించింది.
 
 నిపుణులైన ఫ్యాకల్టీ
 శ్రీహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఇక్కడి బోధన విధానాలే. ఇందుకోసం నిపుణులైన ఫ్యాకల్టీని నియమించుకునేందుకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సభ్యులు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటర్మీడియెట్ అర్హతతోనే విశ్వవిద్యాలయ స్థాయి విద్య లభించేలా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు రూపకల్పన చేయడం కూడా యూనివర్సిటీ ప్రాధాన్యానికి మరో కారణంగా చెప్పొచ్చు. ప్లేస్‌మెంట్స్ పరంగానూ విద్యార్థులకు సహకరిస్తున్నాం. ఏటా 90 శాతానికి తగ్గకుండా ప్లేస్‌మెంట్స్ నమోదవుతున్నాయి.
 - ప్రొఫెసర్. రామకృష్ణన్ రామస్వామి,
 వీసీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 
 కోర్సుల్లో ప్రవేశాలు
 కోర్సుల్లో ప్రవేశానికి హెచ్‌సీయూ ఏటాఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 35 నగరాల్లో నిర్వహిస్తారు. దీనికి ఏటా జనవరి/ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. హెచ్‌సీయూలో చదివేందుకు విదేశీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. వీరికి 15 శాతం సీట్లను కేటాయించగా.. ఈ సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement