హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఏ విద్యార్థులు
హైదరాబాద్: రాజధానిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను నిలిపివేయించి, ఆరుగురు విద్యార్థులను పోలీసులు పట్టుకెళ్లడం పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. క్యాంపస్‌లోకి పోలీసులు రావడం, ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం పట్ల ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ‘రామ్ కే నామ్’డాక్యుమెంటరీ చిత్రాన్ని సోషల్ సైన్సెస్ భవనంలోని న్యూ సెమినార్ హాల్‌లో ప్రదర్శించాలని ఏఐఎస్‌ఏ నాయకులు నిర్ణయించారు. అయితే ఆ హాల్‌ను చిత్ర ప్రదర్శనకు ఇవ్వడం కుదరదని డీన్ స్పష్టం చేశారు. దీంతో సోషియాలజీ భవనంలోని సెకండ్ ఫ్లోర్‌లోని ఎంఏ ఫస్ట్ ఇయర్ లెక్చర్ హాల్‌లో ప్రదర్శించేందుకు అనుమతి పొందారు.
ఆ తర్వాత చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు సోషల్ సైన్సెస్ భవనానికి చేరుకుని ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ల్యాప్‌టాప్, స్క్రీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని బాబాజాన్, సోనాల్, నిఖిల్, వికాస్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థి నేతలను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి విద్యార్థులు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులంతా నినాదాలు చేసుకుంటూ హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని, చీటికీమాటికీ పోలీసులు క్యాంపస్‌లోకి రావడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులను వదిలిపెట్టాలని, చిత్ర ప్రదర్శనకు అనుమతించాలని, పోలీసులు క్యాంపస్‌లోకి రాకూడదని ఏఐఎస్‌ఏ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు విడుదల చేయడంతో ఏఐఎస్‌ఏ నాయకులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment