distance education courses
-
అప్పుడు చదువకపోతేనేం..!
అనివార్య కారణాల వల్ల చిన్న వయసులోనే చదువుకు దూరమైనవారికి ఓపెన్ స్కూల్(సార్వత్రిక విద్యాపీఠం) ఆశాదీపంలా నిలుస్తోంది. ఆర్థిక కారణాలు, కట్టుబాట్లు సంప్రదాయాల పేరిట మధ్యలోనే చదువు మానేసిన వారు, ఇతర కారణాలతో అర్ధంతరంగా చదువు ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ బాసటగా ఉంటోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం సార్వత్రిక విద్యాపీఠం ఇటీవల ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. సాక్షి, ఆరిలోవ(విశాఖపట్టణం) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో సార్వత్రిక, దూరవిద్య విధానంలో టెన్త్, ఇంటర్మీడియెట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్తోపాటు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొల్పిన అధ్యయన కేంద్రాల ద్వారా ఈ కోర్సులను అందిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం టెన్త్‌కు 56 , ఇంటర్మీడియెట్‌కు 43 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సార్వత్రిక విద్యాపీఠం ఇచ్చిన సర్టిఫికెట్లపై చాలా మందికి అపోహ ఉంది. అయితే అవన్నీ అవాస్తవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు, యూనివర్సిటీ అధికారులు సైతం స్పష్టంచేస్తున్నారు. ఈ సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందటమే కాక ఉన్నత చదువులు, ఉద్యోగాలకు నేడు సైతం అర్హమై ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యాసకులు త్రివిధ దళాలతోపాటు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. ముఖ్యమైన తేదీలు ► ప్రాస్పెక్టస్ లభ్యత, ప్రవేశాల ప్రారంభం: 2019 జూన్ 28 నుంచి ► ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ: 2019 జూలై 26 ► నిర్ణీత ప్రవేశ రుసు చెల్లించేందుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 31 ► రూ. 200 అపరాధ రుసుంతో దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: 2019 సెప్టెంబర్ 26 ► హెల్ప్‌లైన్ కేంద్రాలు: సార్వత్రిక విద్యాపీఠం గుంటూరు: 0863–2239151, విశాఖపట్నం: 80084 03662 మహిళలకు ప్రత్యేక రాయితీ.. సార్వత్రిక విద్య ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకోవడానికి అన్ని వర్గాల స్త్రీలకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మాజీ సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశ రుసుం ఫీజులోను రాయితీ కల్పిస్తున్నారు. దీని కోసం అభ్యర్థులు తహసీల్దార్/మెడికల్ బోర్డు/సైనిక సంక్షేమాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జనరల్ కేటగిరి ఫీజులనే చెల్లించాలి. ముఖ్యమైన అంశాలు.. వయో పరిమితి ఆగస్టు 31 నాటికి లేదా ప్రవేశం కోరే సమయానికి పదో తరగతికి 14, ఇంటర్మీడియట్‌కు 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఉర్దూ మాధ్యమం కూడా అందుబాటులో ఉంది. సబ్జెక్టుల ఎంపికనేది అభ్యాసకులు ఆసక్తిని బట్టి, ఒక అదనపు సబ్జెక్టును ప్రవేశ సమయంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.∙గ్రూపుల లిస్టులో 5 సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. గ్రూపు–ఎలో ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరి. ఇంటర్లో సైన్స్ గ్రూపు ఎంపిక చేసుకునే వారు టెన్త్‌లో తప్పనిసరిగా గణితం, జనరల్ సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి.∙నియత పాఠశాలలో పదో తరగతి/కళాశాలలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ఫెయిలైనప్పటికీ.. పాసైన రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకునే వెసులుబాటు ఉంది. ఏ కోర్సులో చేరినా రిజిస్ట్రేషన్ పొందిన నాటి నుంచి ఐదేళ్ల వరకు ప్రవేశం చెల్లుబాటు అవుతుంది. ఏపీ ఓపెన్ స్కూల్లో రెండు సార్లు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. క్తిగతంగా కానీ, ఏపీ ఆన్లైన్ ద్వారా అభ్యాసకులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు పూర్తి చేయండి ఇలా.. ఓపెన్ స్కూల్, ఇంటర్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నవారు వ్యక్తిగతంగానైనా ఏపీ ఆన్లైన్, మీ–సేవ కేంద్రాల్లో అన్ని దశల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో పూర్తిచేయాలి. టెన్త్ లేదా ఇంటర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తదుపరి అభ్యాసకులు తమ పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత మీసేవ, క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్, ఏపీఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. తదుపరి దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ సమయంలో అభ్యర్థులకు సంబంధించిన ఆధార్, మొబైల్ నంబర్, సమీప అధ్యయన కేంద్రం పేరు–కోడ్ నంబర్, అభ్యాసకుల పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అభ్యాసకుల ఫొటో, సంతకం, సంరక్షకుని పేరు, లింగ నిర్ధారణ, వైవాహిక పరిస్థితి, పుట్టిన తేదీ, కమ్యూనిటీ వివరాలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, విద్యార్హతలు, మార్కుల బదలాయింపులు, సబ్జెక్టుల ఎంపిక, అదనపు సబ్జెక్టు ఎంపిక, మీడియం, ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా వంటి వివరాలను ఔత్సాహికులు సిద్ధం చేసుకోవాలి. చదువు నిలిపి వేసిన వారికి మంచి అవకాశం చదువు మధ్యలో నిలిపి వేసిన వారికి సార్వత్రిక విద్య మంచి అవకాశం. దీని ద్వారా వచ్చిన సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యకు వచ్చిన దానితో సమానమే. ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో పది, ఇంటర్మీడియెట్ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువు కొనసాగించాలి. దీని వల్ల వచ్చే సర్టిఫికెట్తో ఉద్యోగాలు రావనే ప్రచారంలో నిజం లేదు. – బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో 14 ఏళ్లు నిండిన వారు అర్హులు సార్వత్రిక విద్యా విధానంలో చదువుకోవడానికి 14 ఏళ్ల నిండి ఉండాలి. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు. బాలురు, బాలికలు, మహిళలు, ఉద్యోగం చేస్తున్నవారు చదువుకోవచ్చు. మధ్యలో చదువు మానేసినవారు ఈ విధానం ద్వారా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు గడువుంది. – దేవి, జిల్లా కో–ఆర్డినేటర్ సెలవుల్లో తరగతుల నిర్వహణ.. సాధారణ విద్యకు భిన్నంగా సార్వత్రిక తరగతులను నిర్వహిస్తున్నారు. ఓపెన్ స్కూల్ తరగతులను సెలవు రోజుల్లోనే నిర్వహిస్తారు. ఎంపిక చేసిన స్టడీ సెంటర్లలో జరిగే తరగతులకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్ సైన్స్ గ్రూపునకు సంబంధించి ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షల క్లాసులకు హాజరు కావాలి. ప్రతి విద్యార్థి కనీసం 30 తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీ ఆర్‌ఆర్‌సీడీఈ) పరిధిలోని వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యూజీ, పీజీ, పీడీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ
ఇన్స్టిట్యూట్ వాచ్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీ యూ)గా విద్యార్థి లోకంలో సుపరిచితమైన పేరు. ఈ విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటై.. బోధన, శిక్షణ, పరిశోధనల్లో ఎప్పటికప్పుడు నవ్యతను ప్రదర్శిస్తూ.. ఇటు స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులనూ ఆకర్షిస్తోంది. ఉన్నత విద్యలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన హెచ్‌సీయూపై ఇన్స్టిట్యూట్ వాచ్.. శ్రీఒక విద్యా సంస్థ పనితీరును తెలుసుకోవాలంటే అందులో పట్టభద్రులైన విద్యార్థులు, సదరు విద్యా సంస్థ అకడమిక్ ప్రతిభే ప్రామాణికం్ణ.. సాధారణంగా ఏదైనా వర్సిటీ/కాలేజీ గురించి విద్యావేత్తల అభిప్రాయమిది! ఈ కోణంలో పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు! ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. మొత్తం 47 విభాగాల ద్వారా 59 యూజీ/పీజీ కోర్సులను, 27 ఎంటెక్/ఎంఫిల్ కోర్సులను, 47 పీహెచ్డీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 5000 మందికిపైగా విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. ట్రాన్స్లేషన్ స్టడీస్ నుంచి టెక్నికల్ రీసెర్చ్ వరకు వినూత్న కోర్సులను అందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని విభాగాల్లో క్రెడిట్ ఆధారిత అభ్యసన వ్యవస్థ(సీబీఎల్‌ఎస్) ను అమలు చేస్తుండటం విశేషం. ప్రత్యేక గుర్తింపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రముఖ సంస్థలు ఇస్తున్న ర్యాంకుల ఆధారంగా దానికున్న గుర్తింపును అంచనా వేయొచ్చు. అవుట్ లుక్, కెరీర్స్ 360, ఇండియా టుడే తదితర మేగజైన్లు నిర్వహిస్తున్న ‘ఉత్తమ విశ్వవిద్యాలయాల’ సర్వేలో హెచ్‌సీయూ టాప్-10, టాప్-20 పరిధిలో స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకుల కేటాయింపులో ప్రసిద్ధిగాంచిన క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ర్యాంకింగ్స్ జాబితాలోనూ చోటు సంపాదించింది. 2010లో క్యూఎస్ టాప్-200 ఆసియా విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది. నిత్య నూతనంగా శిక్షణ శిక్షణ పరంగా హెచ్‌సీయూ నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమ వర్గాలను ఎప్పటికప్పుడు సంప్రదించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల పాఠ్యప్రణాళికలో మార్పులుచేర్పులు చేపడుతోంది. కొత్త కోర్సుల రూపకల్పనలోనూ తనదైన ముద్రను చాటుకుంటోంది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయం గత దశాబ్ద కాలంలో 30కి పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. అధ్యాపకుల బోధనా శైలి, కోర్సు స్వరూపం-దాన్ని అందిస్తున్న విధానం తదితర అంశాల్లో విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని, లోటుపాట్లను సరిదిద్దుకుంటోంది. బోధనలో నాణ్యతను పెంచేందుకు పీహెచ్డీ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో ముందుంటోంది. 404 మంది అధ్యాపకుల్లో 379 మంది పీహెచ్డీ ఫ్యాకల్టీ కావడం ఇందుకు నిదర్శనం. విదేశీ విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలు, పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు పెద్దపీట వేస్తోంది. బోధనా సిబ్బందిలో నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అకడమిక్ స్టాఫ్ కాలేజీని ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాల ను సాధించగలుగుతున్నారు. సీఎస్ఐఆర్-నెట్, స్లెట్ వంటి పరీక్షల్లో వర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధిస్తున్నారు. పరిశోధనలకు ప్రాధాన్యం: కేవలం అకడమిక్ కోర్సుల తరగతి బోధనకే పరిమితం కాకుండా పరిశోధనలకూ ప్రాధాన్యమిస్తోంది. డీఎస్టీ, సీఎస్ఐఆర్, డీఆర్డీఓ తదితర సంస్థల కోసం స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. యూనివర్సిటీకి అధికారిక గుర్తింపు తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.283 కోట్లు లభించడం విశేషం. ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఆవిష్కరణల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 15 పరిశోధన ప్రాజెక్టులకు పేటెంట్ల కోసం భారత్‌తోపాటు, అమెరికా, యూకేల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఠ అకడమిక్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి కలిగించేలా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆసరా ఇచ్చేలా విశ్వవిద్యాలయం ‘టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ను ప్రారంభించింది. - విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో సదరు విద్యాసంస్థ లో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విషయం లో విశ్వవిద్యాలయం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. విశ్వవిద్యా లయ గ్రంథాలయంలో 3.7 లక్షల పుస్తకాలు, 2.5 లక్షల జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐసీటీ బోధన పద్ధతులకు సంబంధిం చిన పలు సాధనాలు కూడా ఉన్నాయి. దూర విద్య కోర్సులు : విశ్వవిద్యాలయం ‘సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్’ పరిధిలో దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న కోర్సుల్లో ప్రస్తుతం 17 పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 1994లో ఏర్పాటు చేసిన దూరవిద్య కేంద్రంలో నవ్యతకు నిదర్శనంగా క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్; టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్; కన్జూమర్ ఎడ్యుకేషన్ తదితర కోర్సులను చెప్పుకోవచ్చు. వెబ్సైట్: www.uohyd.ac.in ‘న్యాక్’ గుర్తింపు మన దేశంలో విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చే అత్యున్నత సంస్థ నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్(న్యాక్). దీని గుర్తింపు విషయంలోనూ హెచ్‌సీయూ ముందు వరుసలో నిలుస్తోంది. 2014లో న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపును పొంది.. వరుసగా మూడోసారి ఈ ఘనతను సాధించింది. నిపుణులైన ఫ్యాకల్టీ శ్రీహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఇక్కడి బోధన విధానాలే. ఇందుకోసం నిపుణులైన ఫ్యాకల్టీని నియమించుకునేందుకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా పీహెచ్డీ ఫ్యాకల్టీ సభ్యులు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటర్మీడియెట్ అర్హతతోనే విశ్వవిద్యాలయ స్థాయి విద్య లభించేలా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు రూపకల్పన చేయడం కూడా యూనివర్సిటీ ప్రాధాన్యానికి మరో కారణంగా చెప్పొచ్చు. ప్లేస్‌మెంట్స్ పరంగానూ విద్యార్థులకు సహకరిస్తున్నాం. ఏటా 90 శాతానికి తగ్గకుండా ప్లేస్‌మెంట్స్ నమోదవుతున్నాయి. - ప్రొఫెసర్. రామకృష్ణన్ రామస్వామి, వీసీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్సుల్లో ప్రవేశాలు కోర్సుల్లో ప్రవేశానికి హెచ్‌సీయూ ఏటాఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 35 నగరాల్లో నిర్వహిస్తారు. దీనికి ఏటా జనవరి/ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. హెచ్‌సీయూలో చదివేందుకు విదేశీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. వీరికి 15 శాతం సీట్లను కేటాయించగా.. ఈ సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి.