ఎండల్లో హాయ్‌హాయ్
⇒ మండే వేసవిలో రక్షణ కవచాలు
రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. బయటికి రావాలంటే భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొందరు శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. మరికొందరు ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలు, కొబ్బరినీళ్లను తీసుకుంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు వడదెబ్బ తగలకుండా ముఖానికి స్కార్ఫ్‌లు, కల్లజోళ్లు, టోపీలను వినియోగిస్తున్నారు. కళ్లజోళ్లు రూ.100 నుంచి రూ.150 వరకూ దొరుకుతున్నాయి. టోపీలు, స్కార్ఫ్‌లు కూడా ఇంచుమించు ఇదే ధరకు లభ్యమవుతున్నాయి.
టోపీలు, కళ్లజోళ్లమ్మే స్టాళ్లు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి. సామాన్యుడి ఫ్రిజ్ కుండకు కూడా డిమాండ్ పెరిగింది. నీళ్లు ముంచుకోడానికి ఇబ్బంది లేకుండా కుండకు టాప్‌ను అమర్చి విక్రయిస్తున్నారు. ఒక్కో కుండ ధర రూ.150 నుంచి రూ.250 వరకూ ఉంటుంది. వీటిని ఎక్కువగా ఇసుక మట్టి, గట్టి మట్టితో తయారు చేస్తారు. వీటిలో ఇసుక మట్టి (ఎర్ర కుండ)తో చేసే కుండకే గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా కృష్ణాజిల్లా వీరవల్లి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు
- ఏలూరు(వన్ టౌన్)