ఒత్తిడికి ఎగ్జామ్‌పుల్ | to the presure of examfull | Sakshi
Sakshi News home page

ఒత్తిడికి ఎగ్జామ్‌పుల్

Published Fri, Mar 13 2015 3:41 AM | Last Updated on Tue, Oct 2 2018 6:27 PM

ఒత్తిడికి ఎగ్జామ్‌పుల్ - Sakshi

ఒత్తిడికి ఎగ్జామ్‌పుల్

ఎండలు మండే ముందే వేడి పెరిగే కాలం !
ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ చేయడానికి భయపడే కాలం !
కేబుల్ కనక్షన్లు కట్ అయ్యే కాలం..!
తల్లిదండ్రులకు టెన్షన్ కాలం..!
అదే పిల్లల పరీక్షా కాలం.. !!


సాయంత్రం వేళల్లో ఇంట్లో ఉంటే నాకు అన్నింటికంటే ఇష్టమైన వ్యాపకం.. బాల్కనీలో కూర్చుని, కింద వీధిలో ఆడుకుంటున్న పిల్లలను చూడటం. కానీ గత వారం నుంచి పిల్లల సందడి లేక వీధంతా బోసిపోయింది. నాకు ఖాళీ దొరికిందని పిల్లలు కేరింతలు విందామనుకుంటే సరా..! పిల్లలకు తీరిక ఉండొద్దూ. ఆడుకుందామని ఉన్నా, పెద్దలు ఒప్పుకోవద్దూ..!. చిన్నాపెద్దా తేడా లేదు మార్చి వచ్చిందంటే అందరికీ పరీక్షా కాలం. ఈ కాలంలో ఆటలు కట్.. కేబుల్ ఫట్.. పరీక్షలు రాసేంత వరకూ పిల్లలకు.. మార్కులు వచ్చే వరకు పెద్దలకు టెన్షన్.. టెన్షన్.
 
మార్కులే మనకు ముఖ్యం..

‘కొండలా కోర్సు ఉంది ఎంతకీ త రగనంది’ అంటూ సాగే పాటలా సిలబస్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. పుస్తకాలతో దోస్తీ పోయి కుస్తీపట్లు పెరిగిపోతున్నాయి. సంవత్సరమంతా నేర్చుకున్నది ఎంత అని పరీక్షించేందుకే ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, నేర్చుకున్నది ఇంతే అని చెప్పేందుకు కాదని నా అభిప్రాయం. రెండొందల పైచిలుకు రోజుల చదువు రెండు గంటల్లో పరీక్షించి రెండు మార్కులు తగ్గితే పనికిరావని సెలవిచ్చే విధానంలో మార్పు రావాలి.

ఈ మధ్య కాలంలో ఎవరూ ఫెయిల్ అనే మాట గురించి బాధ పడట్లేదు. ఇప్పుడు సమస్యల్లా.., తొంభైలపైనే  ఉంటూ ర్యాంకు సంపాదించడం గురించే. హైదరాబాద్ మహానగరంలో గల్లీకో స్కూలు.. ర్యాంకులు, మార్కులు.. ఫొటోలతో సహా ఫ్లెక్లీలపైకి ఎక్కించేసి మరీ అడ్మిషన్స్ అమ్మి సొమ్ము చేసుకుంటోంది.
 
పరీక్షానాం అనేకం..
ఇక తల్లిదండ్రుల ఆరాటం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. ర్యాంకు రావడం, సీటు సాధించడం.. ఇవి ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోయాయి. అందుకే పరీక్షల కాలం అంటే పిల్లలకు హడల్. ఒకటా రెండా ఎన్ని పరీక్షలో. ఒక్కో పరీక్షదీ ఒక్కో తీరు. ముఖ్యంగా టెన్త్ నుంచి పరీక్షల సీజన్ మొదలైనట్టే. ర్యాంకుల పర్వంలో పద్మవ్యూహంలాంటి ఎంట్రెన్స్‌లు ఛేదించడానికి పిల్లలు సదా సిద్ధంగా ఉండాలి. ఒక్క పరీక్ష రాసి ప్రతిభ నిరూపించుకోవచ్చు అనే భరోసా లేదు.

ఇంటర్ తర్వాత ఎంసెట్, జేఈఈ.. ఇవి రావేమోనని ఇతర వర్సిటీల సొంత ఎంట్రెన్స్‌లు.. ఇలా ఎవరికి ఎన్ని వీలైతే అన్ని పరీక్షలు రాసుకోవచ్చు. ఇందు మూలంగా ఏం చెప్పదలుచుకున్నారయా అంటే.. పక్కోడి పరీక్ష వేస్టు.. మా పరీక్ష బెస్ట్ అని. ఇలా టెస్ట్ టెస్ట్‌కీ మధ్య రోస్టు అయిపోవడం స్టూడెంట్స్ వంతు. ఇన్ని పరీక్షల్లో టెన్షన్స్‌తో వెనుకపడిపోతే ఆ ఫెయిల్యూర్స్ విద్యార్థిది కాదు, పరీక్షల విధానం మార్చలేని మన విద్యావ్యవస్థదే. తొంభై శాతం మార్కలు వచ్చే విద్యార్థులు తొంభై శాతం ఉన్నా.. అంత సాధించిన తర్వాత కూడా పనికిరాలేదంటే ఆ బాధ్యత ముమ్మాటికీ వ్యవస్థదే.
 
మార్పులు కావాలి తథ్యం..
ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు పరీక్షలంటే ఒత్తిడి పెంచే ప్రక్రియలా మారిపోయింది. మన దేశంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు, రిజల్ట్స్ సమయాల్లో పిల్లలు ఆత్మహత్యల గురించి వార్తలు వినిపిస్తున్నాయంటే దాని వెనుక కారణం ప్రభుత్వాలకు అర్థం కావడం లేదెందుకని. తల్లిదండ్రులు సైతం కార్పొ‘రేటు’ విద్యని కళ్లకద్దుకుని పిల్లలపై ఒత్తిడి పెంచుకుంటుంటే కారణం పర్సనల్ రీజన్స్ అని వదిలేద్దామా..! మార్పు రావాలి. మన విద్యావిధానంలో సమూలంగా ప్రక్షాళన జరగాలి.
 
‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ.. ’ అన్న రవీంద్రుని కలలు నిజమవ్వాలి. పరీక్షల్లో ఒత్తిడి లేకపోతేనే పిల్లలు బాగా పెర్‌ఫార్మ్ చేయగలరు. అందుకే ముందు రియలైజ్ అవ్వాల్సింది పెద్దలే. పిల్లలను ఎగ్జామ్స్ ఎంజాయ్ చేయనివ్వండి. ఆల్ ద బె స్ట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement