సరిపని.. సిరిగని | Time is equal to money | Sakshi
Sakshi News home page

సరిపని.. సిరిగని

Published Thu, Apr 23 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

సరిపని.. సిరిగని

సరిపని.. సిరిగని

సొంత లాభం కోసం పొరుగువారికి ఎంత నష్టం వచ్చినా ఫర్వాలేదనుకునే నేటితరాన్ని చూసి గురజాడవారు ‘దేశమంటే మట్టి కాదోయ్..! ఒట్టి మట్టి బుర్రలోయ్..!’ అని సెలవిచ్చేవారేమో.. !!. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని అనుకునే ఈ రోజుల్లో.. ప్రతి పనికీ డబ్బే కొలత. ఎంత పనికి అంత డబ్బు అనే రోజులు పోయి.. ఎంత డబ్బుకు అంత పని అనే రోజులొచ్చేశాయి. నిజానికి తక్కువ పనికి ఎక్కువ డబ్బులు ఎక్కడొస్తాయని చూసే రోజుల్లో ఉన్నాం.

ఇంకొంత మంది గుర్తింపు ఉన్న పని కోసం పాకులాడుతూ ఉంటారు. దీన్ని పనికి వచ్చే గుర్తింపనుకొని కన్‌ఫ్యూజ్ కాకండి. అది వేరు సుమా..!

 
ఏ పనికైనా నాకేంటి అని ప్రశ్నించే జాతి ఎక్కువైపోతున్న ఈ తరుణంలో, వారి పని చేయడమే మహాభాగ్యమనుకుంటుంటే.. తమ పనిలోనే మరొక్క అడుగు ముందుకేసి పక్కవారికి సహాయపడదామనుకునే వారిని దేవుళ్లనుకోవాలి మరి. పెద్దపెద్ద పనులు అక్కర్లేదు.. ఒక్కోసారి చిన్నచిన్న పనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. పక్కవాడికి సాయపడటం మర్చిపోయిన రోజుల్లోనే.. మానవత్వం అనే మాట కూడా మాయమైపోయి చిన్నపనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. అలా నాకెదురైన చిన్నచిన్న సంఘటనల్లో కనిపించిన దైవత్వం గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
 
మేలైన పనితనం..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఏసీ వెయిటింగ్ హాల్.. ఓ హౌస్ కీపర్ తన షిఫ్ట్ అయిపోవడంతో యూనిఫాం మార్చుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. నన్ను గుర్తుపట్టి నవ్వుతూ పలకరించిందామె. రైల్వేస్టేషన్‌లో అంత నీట్‌గా ఉన్న బాత్రూమ్‌ల గురించి మెచ్చుకుంటున్నానో లేదో.. ఇంతలో ఓ పెద్దావిడ వాంతులతో లోపలికి వచ్చింది. ఆమెకు నేను మంచినీళ్ల సాయం మాత్రమే చేశాను. కాని, ఆ అజ్ఞాత హౌస్‌కీపర్ దేవత అంతకంటే ఎక్కువ సేవే చేసింది. పెద్దావిడ తేరుకొని బయటకు వచ్చాక.. టాయ్‌లెట్‌ని శుభ్రంగా కడిగేసింది. ఆమె హౌస్‌కీపర్ కదా.. అది ఆమె డ్యూటీ అని అనుకోవచ్చు. కాని, ఆ అమ్మాయి డ్యూటీ దిగిపోతూ.. తన తర్వాత షిఫ్ట్‌లో వచ్చేవాళ్లు ఆ పని చూసుకుంటారులే అని అనుకోలేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో ఆమెను చూస్తేనే అర్థమైంది.
 
మనసు దోశాడు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.. మధ్యాహ్నం ఫ్లయిట్ కోసం.. బ్రేక్‌ఫాస్ట్‌కి.. లంచ్‌కి మధ్య సంధికాలంలో ఎయిర్‌పోర్ట్‌కి చేరాను. ఇండియన్ ప్యారడైజ్‌కి చేరి దోశ అని ఆర్డరిచ్చాను. అక్కడున్న మేనేజర్.. ఇబ్బందిపడుతూ, ‘లంచ్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి.. బ్రేక్ ఫాస్ట్ క్లోజ్’ అని చెప్పాడు. కాఫీతోనో, షాండ్‌విచ్‌తోనో సరిపెట్టుకోవాల్సిందే అని డిసైడై కూర్చున్నాను. నా వెనుక రెండేళ్ల చిన్నారితో వచ్చిన ఓ ఫ్యామిలీ కూడా దోశ అని ఆర్డరిచ్చింది. కాని, అదే సమాధానం.

ఆ పాప దోశ తప్ప మరేమీ తిననని మారాం చేస్తోంది. ఇంతలో లోపల్నుంచి చెఫ్ బయటకు వచ్చి ఆ పాప కోసం దోశ వేస్తాను అన్నాడు. అంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. పాప ఆకలి తీర్చడం తన బాధ్యత అనుకున్న ఆ చెఫ్‌కి, ఆ దోశ వల్ల ప్రమోషనూ రాదు.. ఆ కంపెనీకి గిరాకీ పెరగదు. అయినా తన పనికి మించి స్పందించిన ఆయనలో మానవత్వాన్ని మించిన దైవత్వం కనిపించింది నాకు. యారా తుఝ్‌మే రబ్ దిఖ్తాహై అనుకున్నాను.
 
వర్క్ విజన్
ఈ మధ్యకాలంలోనే మా నాన్నగారికి క్యాట్‌రాక్ట్ ఆపరేషన్ కోసం.. మాక్సివిజన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాం. థియేటర్ బయట వార్డ్‌లో.. కళ్ల మీద స్టిక్కర్ గుర్తులతో.. కళ్లలో చుక్కలతో.. చాలామంది ఉన్నారక్కడ. అందులో పెద్దవయసు వారే ఎక్కువ ! మా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో.. చూస్తున్న సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ వెంకట్రావుగారు అక్కడి ఫోన్ ఒకటే మోగుతుంటే గబగబా వెళ్లి ఆన్సర్ చేశారు. నర్స్ రాగానే విషయం చెప్తాను అని పెట్టేశారు.

అలా ఒక్కసారి కాదు.. అక్కడ ఆయనున్న పది నిమిషాల్లో.. కనీసం ఐదుసార్లయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఒకసారి ఫైల్‌లో డిటెయిల్స్ చూసి చెప్పారు. మళ్లీ ఫోన్ మోగితే.. ఈసారి  నంబర్ నోట్ చేసుకున్నారు. అది అక్కడున్న నర్స్ పని కదా..! తనకెందుక ని అనుకోలేదు. అది తన సంస్థ.. ఆ పనిలో తనకూ భాగస్వామ్యం ఉందని అనుకున్నారు. అందుకే ఆ చిన్న పనిని కూడా ఆయన పనిగానే భావించారు. గాడ్ ఈజ్ ఇద్ ద డీటెయిల్స్ అంటే ఇదేనేమో!
 
నీకు కుశలమేగా..
మొన్నీమధ్యే బ్యూటీపార్లర్లో నా పక్క సీట్లో కూర్చున్న ఓ చిన్నారి హెయిర్ కటింగ్‌కు భయపడి నానాయాగీ చేస్తోంది. ఇది గమనించిన నా హెయిర్ స్టయిలిస్ట్ పవన్.. తన పని కాదని ఊరుకోలేదు. తోటి హెయిర్‌స్టయిలిస్ట్ దగ్గర కత్తెర అందుకుని, ఆ పాపను మాటల్లో పెట్టి.. హాయిగా నవ్విస్తూ పని పూర్తి చేశాడు. చిన్నపనులే కావొచ్చు. కాని అవి పెద్ద హృదయాన్ని సూచిస్తాయి. ‘యోగః కర్మ సుకౌశలం..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు, కర్మల్లో కుశలత్వమే యోగం. పని డబ్బు కోసమే చేస్తాం, కాని హృదయంతో చేయండి. పొరుగువారికి సాయపడటానికి సొంతలాభం మానక్కర్లేదండి. డూ గుడ్.. ఫీల్ గుడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement