మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా | Don't Quit India and not to migrate other countries | Sakshi
Sakshi News home page

మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా

Published Fri, Aug 15 2014 12:24 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా - Sakshi

మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా

అది జూలై ఫోర్త్.. అమెరికన్ ఇండిపెండెన్స్ డే!  ఆ రోజు అమెరికాలో పదివేలమంది తెలుగువారు ఓ చోటికి చేరి తెలుగు సంబరాలు చేసుకుంటున్నారు. వేదికమీద ‘ద స్టార్ స్ట్రాంగల్డ్ బ్యానర్ ’ అంటూ అమెరికా జాతీయగీతం పాడుతున్నారు. ఆ పాటలో చాలా పదాలు అర్థంకావట్లేదు కానీ దేశభక్తి మాత్రం తొణికిసలాడుతోంది.  ఏ దేశ జాతీయగీతమైనా అంతేనేమో!
 వెంటనే ‘జనగణమన..’ ప్రారంభమైంది.. నరాల్లో రక్తం పరుగులిడుతోంది.. గుండెలో శ్వాసబరువుగా మారుతోంది... కళ్లు ఊటబావులవుతున్నాయ్.. నా చుట్టూ ఉన్న చాలామందిదీ అదే స్థితి.  దీనినే దేశభక్తి అనాలా?
 ఇక ఆ తర్వాత షరా మామూలే! డాలర్లు, రూపాయలు మాట్లాడుకుంటాయ్. కస్టమ్ సూట్లు, డిజైనర్ చీరలు ఫొటోలు దిగుతాయ్. బర్గర్లు, బూరెలు పళ్లేలు వెతుక్కుంటాయ్.  అమెరికా అక్కున చేర్చుకున్నా భారతీయతను మర్చిపోకుండా ఉండటానికి వారు పడుతున్న కష్టం రెండు పడవల మీద ప్రయాణంలా అనిపించింది! ఓర్లాండాలో మిత్రుడు శ్రీనివాస్ అన్న మాటలు గుర్తొచ్చాయి..‘అమెరికన్ సిటిజన్‌షిప్ కోసం వెళ్లినప్పుడు గుండెల మీద కుడిచేయి వేసి ఆ దేశ జాతీయగీతం పాడుతుంటే అమ్మని తాకట్టుపెట్టినట్టు అనిపించింది’ అని! తప్పులేదు బ్రదర్.. కూటి కోసం కోటి తిప్పలు! కానీ.. అవసరమొస్తే అదే అమ్మ కోసం శ్రీనివాస్ ఈ దేశానికి తిరిగిరాగలడా?.. అనుమానమే!

 న్యూయార్క్‌లో ఓ తెలుగులక్ష్మి నాలుగు చేతులా (వాళ్లాయనవి కూడా కలిపి) డాలర్ల పంట పండించింది. మట్టివాసన పిలుస్తోందంటూ చేస్తున్న వ్యాపారాన్ని చుట్టేసి, ఉద్యోగాన్ని కట్టేసి ‘ఫర్ గుడ్’ అంటూ  ఈ దేశానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబాన్ని వెరీగుడ్ అనొచ్చా... ఏమో.. ఎందుకంటే మట్టికొట్టుకుపోతున్న విలువల్ని కడిగేయడానికి డాలర్లను కరిగించేసింది మరి! ఆమె మళ్లీ వెళ్లిపోతుందా?
 శ్రీనివాస్ రాడేమో అన్న అనుమానానికీ.. లక్ష్మీ వెళ్లిపోతుందేమో అన్న భయానికీ లింక్.. దేశభక్తి!
 .. ఎన్‌ఆర్‌ఐలకున్న పాటి దేశాభిమానం మనకి లేదా? ఇదేం ప్రశ్న!
 68 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పండగలా మనమూ జరుపుకుంటున్నాం కదా.. వాట్సప్పుల్లో  ప్రొఫైల్ పిక్‌గా మువ్వన్నెల పతాకం పెట్టేస్తాం.. ఈ ఒక్క రోజుకి! ఫేస్‌బుక్‌లో దేశభక్తి నినాదాలు పోస్ట్ చేస్తాం.. లైకులు ఎక్కువ రాకపోయినా పర్లేదని! గల్లీ గల్లీలో తిరంగా ఎగరేస్తాం.. ట్రాఫిక్‌కు అడ్డయినా సరే! ఫ్రీడం సేల్‌లో తెగ కొనేస్తాం..డిస్కౌంట్‌లు మళ్లీ రావని!
 
 ఇంతేనా.. దేశభక్తి? నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తి??
 పరాయిపాలకులను తరిమికొట్టిన స్ఫూర్తి ఏది? స్వరాజ్యంలో సొంతపాలకుల దోపిడీని తిప్పికొట్టే ధైర్యాన్ని ఎక్కడ దాచుకున్నాం? ఓటును నోటుకి ఎందుకు అమ్ముకుంటున్నాం? ఫ్రీడంని సేల్ చేశామా? లంచగొండి తనాన్ని నిలదీసే బదులు అదే లంచంతో మనం పాలకులకు బానిసలవుతున్నామా?
 బీ ద చేంజ్.. అని పిలుపునిచ్చిన బాపూజీ ఈ మార్పులను చూసి నోరెళ్లబెడతారేమో!
 పక్క దేశాల్లోని చట్టాలు మన దేశంలో ఎందుకు పనికిరావో తెలుసా?
 అక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా చట్టానికి లోబడే ఉంటారు. ఇక్కడ అన్నింటికంటే ముందు ‘నేను’ అనుకుంటూ.. ఆ ‘నేను’కి స్వేచ్ఛ ఇవ్వాలనే దూకుడులో పక్కవాడికీ స్వేచ్ఛ ఉందని మరిచిపోతున్నాం. మూత లేని సీసాల్లో పీతల్లా మిగిలిపోతున్నాం.
 
  అందుకే.. కొంత స్వేచ్ఛని త్యాగం చేద్దాం.
 అధికారబలంతో అందినంత దోచే స్వేచ్ఛ..
 పేదోడిని ఎప్పటికీ పేదరికంలో ఉంచే స్వేచ్ఛ..
 లంచం అడిగే స్వేచ్ఛ.. ఇచ్చే స్వేచ్ఛ
 రూల్స్ బ్రేక్ చేసే స్వేచ్ఛ.. బాధ్యతని తెగ్గొట్టే స్వేచ్ఛ..
 మానవతకు మచ్చ తెచ్చే స్వేచ్ఛ.. మనకొద్దు!
 అందుకే.. స్వాతంత్య్ర సంగ్రామం స్ఫూర్తిగా ఇప్పుడు మళ్లీ
 ఉద్యమిద్దాం.
 స్వరాజ్య ఉద్యమం చేద్దాం.. రాజకీయ ప్రక్షాళన చేద్దాం.
 సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభిద్దాం.. అధర్మంపై గళమెత్తుదాం.
 సహాయనిరాకరణ మొదలెడదాం.. నయవంచకులు, కీచకులను బహిష్కరిద్దాం.
 స్వదేశీ నినాదాన్ని ఉద్యమంగా చేసుకుందాం.. ఉత్పత్తులను, హస్తకళలను ప్రోత్సహిద్దాం.
 చివరగా..ఒక ఉద్యమాన్ని బలంగా చేద్దాం.. Don't Quit India. మేధా వలసలు ఆపండి!
 ఆశ మిగిలే ఉంది.. యువతరంలో స్ఫూర్తి, శక్తి కొత్తగానే ఉంది.
 
 యంగ్ ఎనర్జీ ఇంకా సుషుప్తావస్థలోకి జారుకోలేదు. ఫేస్‌బుక్ వాల్స్ పసలేని నినాదాలను కాదు ప్రభుత్వాలను వణికించే విప్లవాలనూ సృష్టించాయి! రాజకీయాల్లో పేరుకున్న చెత్తను ప్రక్షాళన చేయడానికి చట్టసభల్లో చేరి తమ సత్తాను చాటుతున్నారు! మట్టికొట్టుకుపోయిన వీధులనే కాదు మనుషుల మనసులనూ శుభ్రంచేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు! బాపూ... బీ ద ఛేంజ్.. నువ్వన్న మాటలు వట్టిపోలేదు! దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్.. గురజాడా.. నీ జాడలు నిజం నిజం! ఇది నా దేశం! మేరా భారత్ మహాన్! ఈ మార్పులను అమలుచేసే ఆ యంగ్ ఎనర్జీకి సలాం! జైహింద్!
 
 ఖద్దరు ధరించండి...
 వివేకవర్ధిని పాఠశాల ప్రాంగణంలో మహాత్మాగాంధీ 1929లో ఇచ్చిన ఈ పిలుపు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. అనిబిసెంట్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబా ఆమ్టే వంటి మహోద్యమకారులు ప్రసంగించిన, సందర్శించిన 107 ఏళ్ల చరిత్ర ఉన్న విద్యాలయాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అణువణువునా చరిత్ర స్ఫూర్తిని ప్రసరిస్తున్న వివేకవర్ధినికి వందనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement