Jhansi ki Vani
-
సరిపని.. సిరిగని
సొంత లాభం కోసం పొరుగువారికి ఎంత నష్టం వచ్చినా ఫర్వాలేదనుకునే నేటితరాన్ని చూసి గురజాడవారు ‘దేశమంటే మట్టి కాదోయ్..! ఒట్టి మట్టి బుర్రలోయ్..!’ అని సెలవిచ్చేవారేమో.. !!. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని అనుకునే ఈ రోజుల్లో.. ప్రతి పనికీ డబ్బే కొలత. ఎంత పనికి అంత డబ్బు అనే రోజులు పోయి.. ఎంత డబ్బుకు అంత పని అనే రోజులొచ్చేశాయి. నిజానికి తక్కువ పనికి ఎక్కువ డబ్బులు ఎక్కడొస్తాయని చూసే రోజుల్లో ఉన్నాం. ఇంకొంత మంది గుర్తింపు ఉన్న పని కోసం పాకులాడుతూ ఉంటారు. దీన్ని పనికి వచ్చే గుర్తింపనుకొని కన్ఫ్యూజ్ కాకండి. అది వేరు సుమా..! ఏ పనికైనా నాకేంటి అని ప్రశ్నించే జాతి ఎక్కువైపోతున్న ఈ తరుణంలో, వారి పని చేయడమే మహాభాగ్యమనుకుంటుంటే.. తమ పనిలోనే మరొక్క అడుగు ముందుకేసి పక్కవారికి సహాయపడదామనుకునే వారిని దేవుళ్లనుకోవాలి మరి. పెద్దపెద్ద పనులు అక్కర్లేదు.. ఒక్కోసారి చిన్నచిన్న పనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. పక్కవాడికి సాయపడటం మర్చిపోయిన రోజుల్లోనే.. మానవత్వం అనే మాట కూడా మాయమైపోయి చిన్నపనుల్లోనే దైవత్వం కనిపిస్తుంది. అలా నాకెదురైన చిన్నచిన్న సంఘటనల్లో కనిపించిన దైవత్వం గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేలైన పనితనం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఏసీ వెయిటింగ్ హాల్.. ఓ హౌస్ కీపర్ తన షిఫ్ట్ అయిపోవడంతో యూనిఫాం మార్చుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. నన్ను గుర్తుపట్టి నవ్వుతూ పలకరించిందామె. రైల్వేస్టేషన్లో అంత నీట్‌గా ఉన్న బాత్రూమ్ల గురించి మెచ్చుకుంటున్నానో లేదో.. ఇంతలో ఓ పెద్దావిడ వాంతులతో లోపలికి వచ్చింది. ఆమెకు నేను మంచినీళ్ల సాయం మాత్రమే చేశాను. కాని, ఆ అజ్ఞాత హౌస్‌కీపర్ దేవత అంతకంటే ఎక్కువ సేవే చేసింది. పెద్దావిడ తేరుకొని బయటకు వచ్చాక.. టాయ్‌లెట్‌ని శుభ్రంగా కడిగేసింది. ఆమె హౌస్‌కీపర్ కదా.. అది ఆమె డ్యూటీ అని అనుకోవచ్చు. కాని, ఆ అమ్మాయి డ్యూటీ దిగిపోతూ.. తన తర్వాత షిఫ్ట్‌లో వచ్చేవాళ్లు ఆ పని చూసుకుంటారులే అని అనుకోలేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో ఆమెను చూస్తేనే అర్థమైంది. మనసు దోశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. మధ్యాహ్నం ఫ్లయిట్ కోసం.. బ్రేక్‌ఫాస్ట్‌కి.. లంచ్‌కి మధ్య సంధికాలంలో ఎయిర్‌పోర్ట్‌కి చేరాను. ఇండియన్ ప్యారడైజ్‌కి చేరి దోశ అని ఆర్డరిచ్చాను. అక్కడున్న మేనేజర్.. ఇబ్బందిపడుతూ, ‘లంచ్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి.. బ్రేక్ ఫాస్ట్ క్లోజ్’ అని చెప్పాడు. కాఫీతోనో, షాండ్విచ్తోనో సరిపెట్టుకోవాల్సిందే అని డిసైడై కూర్చున్నాను. నా వెనుక రెండేళ్ల చిన్నారితో వచ్చిన ఓ ఫ్యామిలీ కూడా దోశ అని ఆర్డరిచ్చింది. కాని, అదే సమాధానం. ఆ పాప దోశ తప్ప మరేమీ తిననని మారాం చేస్తోంది. ఇంతలో లోపల్నుంచి చెఫ్ బయటకు వచ్చి ఆ పాప కోసం దోశ వేస్తాను అన్నాడు. అంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. పాప ఆకలి తీర్చడం తన బాధ్యత అనుకున్న ఆ చెఫ్‌కి, ఆ దోశ వల్ల ప్రమోషనూ రాదు.. ఆ కంపెనీకి గిరాకీ పెరగదు. అయినా తన పనికి మించి స్పందించిన ఆయనలో మానవత్వాన్ని మించిన దైవత్వం కనిపించింది నాకు. యారా తుఝ్‌మే రబ్ దిఖ్తాహై అనుకున్నాను. వర్క్ విజన్ ఈ మధ్యకాలంలోనే మా నాన్నగారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కోసం.. మాక్సివిజన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాం. థియేటర్ బయట వార్డ్‌లో.. కళ్ల మీద స్టిక్కర్ గుర్తులతో.. కళ్లలో చుక్కలతో.. చాలామంది ఉన్నారక్కడ. అందులో పెద్దవయసు వారే ఎక్కువ ! మా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో.. చూస్తున్న సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ వెంకట్రావుగారు అక్కడి ఫోన్ ఒకటే మోగుతుంటే గబగబా వెళ్లి ఆన్సర్ చేశారు. నర్స్ రాగానే విషయం చెప్తాను అని పెట్టేశారు. అలా ఒక్కసారి కాదు.. అక్కడ ఆయనున్న పది నిమిషాల్లో.. కనీసం ఐదుసార్లయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఒకసారి ఫైల్లో డిటెయిల్స్ చూసి చెప్పారు. మళ్లీ ఫోన్ మోగితే.. ఈసారి నంబర్ నోట్ చేసుకున్నారు. అది అక్కడున్న నర్స్ పని కదా..! తనకెందుక ని అనుకోలేదు. అది తన సంస్థ.. ఆ పనిలో తనకూ భాగస్వామ్యం ఉందని అనుకున్నారు. అందుకే ఆ చిన్న పనిని కూడా ఆయన పనిగానే భావించారు. గాడ్ ఈజ్ ఇద్ ద డీటెయిల్స్ అంటే ఇదేనేమో! నీకు కుశలమేగా.. మొన్నీమధ్యే బ్యూటీపార్లర్‌లో నా పక్క సీట్లో కూర్చున్న ఓ చిన్నారి హెయిర్ కటింగ్‌కు భయపడి నానాయాగీ చేస్తోంది. ఇది గమనించిన నా హెయిర్ స్టయిలిస్ట్ పవన్.. తన పని కాదని ఊరుకోలేదు. తోటి హెయిర్‌స్టయిలిస్ట్ దగ్గర కత్తెర అందుకుని, ఆ పాపను మాటల్లో పెట్టి.. హాయిగా నవ్విస్తూ పని పూర్తి చేశాడు. చిన్నపనులే కావొచ్చు. కాని అవి పెద్ద హృదయాన్ని సూచిస్తాయి. ‘యోగః కర్మ సుకౌశలం..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు, కర్మల్లో కుశలత్వమే యోగం. పని డబ్బు కోసమే చేస్తాం, కాని హృదయంతో చేయండి. పొరుగువారికి సాయపడటానికి సొంతలాభం మానక్కర్లేదండి. డూ గుడ్.. ఫీల్ గుడ్. -
ఒత్తిడికి ఎగ్జామ్పుల్
ఎండలు మండే ముందే వేడి పెరిగే కాలం ! ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ చేయడానికి భయపడే కాలం ! కేబుల్ కనక్షన్లు కట్ అయ్యే కాలం..! తల్లిదండ్రులకు టెన్షన్ కాలం..! అదే పిల్లల పరీక్షా కాలం.. !! సాయంత్రం వేళల్లో ఇంట్లో ఉంటే నాకు అన్నింటికంటే ఇష్టమైన వ్యాపకం.. బాల్కనీలో కూర్చుని, కింద వీధిలో ఆడుకుంటున్న పిల్లలను చూడటం. కానీ గత వారం నుంచి పిల్లల సందడి లేక వీధంతా బోసిపోయింది. నాకు ఖాళీ దొరికిందని పిల్లలు కేరింతలు విందామనుకుంటే సరా..! పిల్లలకు తీరిక ఉండొద్దూ. ఆడుకుందామని ఉన్నా, పెద్దలు ఒప్పుకోవద్దూ..!. చిన్నాపెద్దా తేడా లేదు మార్చి వచ్చిందంటే అందరికీ పరీక్షా కాలం. ఈ కాలంలో ఆటలు కట్.. కేబుల్ ఫట్.. పరీక్షలు రాసేంత వరకూ పిల్లలకు.. మార్కులు వచ్చే వరకు పెద్దలకు టెన్షన్.. టెన్షన్. మార్కులే మనకు ముఖ్యం.. ‘కొండలా కోర్సు ఉంది ఎంతకీ త రగనంది’ అంటూ సాగే పాటలా సిలబస్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. పుస్తకాలతో దోస్తీ పోయి కుస్తీపట్లు పెరిగిపోతున్నాయి. సంవత్సరమంతా నేర్చుకున్నది ఎంత అని పరీక్షించేందుకే ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, నేర్చుకున్నది ఇంతే అని చెప్పేందుకు కాదని నా అభిప్రాయం. రెండొందల పైచిలుకు రోజుల చదువు రెండు గంటల్లో పరీక్షించి రెండు మార్కులు తగ్గితే పనికిరావని సెలవిచ్చే విధానంలో మార్పు రావాలి. ఈ మధ్య కాలంలో ఎవరూ ఫెయిల్ అనే మాట గురించి బాధ పడట్లేదు. ఇప్పుడు సమస్యల్లా.., తొంభైలపైనే ఉంటూ ర్యాంకు సంపాదించడం గురించే. హైదరాబాద్ మహానగరంలో గల్లీకో స్కూలు.. ర్యాంకులు, మార్కులు.. ఫొటోలతో సహా ఫ్లెక్లీలపైకి ఎక్కించేసి మరీ అడ్మిషన్స్ అమ్మి సొమ్ము చేసుకుంటోంది. పరీక్షానాం అనేకం.. ఇక తల్లిదండ్రుల ఆరాటం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. ర్యాంకు రావడం, సీటు సాధించడం.. ఇవి ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోయాయి. అందుకే పరీక్షల కాలం అంటే పిల్లలకు హడల్. ఒకటా రెండా ఎన్ని పరీక్షలో. ఒక్కో పరీక్షదీ ఒక్కో తీరు. ముఖ్యంగా టెన్త్ నుంచి పరీక్షల సీజన్ మొదలైనట్టే. ర్యాంకుల పర్వంలో పద్మవ్యూహంలాంటి ఎంట్రెన్స్‌లు ఛేదించడానికి పిల్లలు సదా సిద్ధంగా ఉండాలి. ఒక్క పరీక్ష రాసి ప్రతిభ నిరూపించుకోవచ్చు అనే భరోసా లేదు. ఇంటర్ తర్వాత ఎంసెట్, జేఈఈ.. ఇవి రావేమోనని ఇతర వర్సిటీల సొంత ఎంట్రెన్స్‌లు.. ఇలా ఎవరికి ఎన్ని వీలైతే అన్ని పరీక్షలు రాసుకోవచ్చు. ఇందు మూలంగా ఏం చెప్పదలుచుకున్నారయా అంటే.. పక్కోడి పరీక్ష వేస్టు.. మా పరీక్ష బెస్ట్ అని. ఇలా టెస్ట్ టెస్ట్‌కీ మధ్య రోస్టు అయిపోవడం స్టూడెంట్స్ వంతు. ఇన్ని పరీక్షల్లో టెన్షన్స్‌తో వెనుకపడిపోతే ఆ ఫెయిల్యూర్స్ విద్యార్థిది కాదు, పరీక్షల విధానం మార్చలేని మన విద్యావ్యవస్థదే. తొంభై శాతం మార్కలు వచ్చే విద్యార్థులు తొంభై శాతం ఉన్నా.. అంత సాధించిన తర్వాత కూడా పనికిరాలేదంటే ఆ బాధ్యత ముమ్మాటికీ వ్యవస్థదే. మార్పులు కావాలి తథ్యం.. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు పరీక్షలంటే ఒత్తిడి పెంచే ప్రక్రియలా మారిపోయింది. మన దేశంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు, రిజల్ట్స్ సమయాల్లో పిల్లలు ఆత్మహత్యల గురించి వార్తలు వినిపిస్తున్నాయంటే దాని వెనుక కారణం ప్రభుత్వాలకు అర్థం కావడం లేదెందుకని. తల్లిదండ్రులు సైతం కార్పొ‘రేటు’ విద్యని కళ్లకద్దుకుని పిల్లలపై ఒత్తిడి పెంచుకుంటుంటే కారణం పర్సనల్ రీజన్స్ అని వదిలేద్దామా..! మార్పు రావాలి. మన విద్యావిధానంలో సమూలంగా ప్రక్షాళన జరగాలి. ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ.. ’ అన్న రవీంద్రుని కలలు నిజమవ్వాలి. పరీక్షల్లో ఒత్తిడి లేకపోతేనే పిల్లలు బాగా పెర్ఫార్మ్ చేయగలరు. అందుకే ముందు రియలైజ్ అవ్వాల్సింది పెద్దలే. పిల్లలను ఎగ్జామ్స్ ఎంజాయ్ చేయనివ్వండి. ఆల్ ద బె స్ట్. -
ఆల్ లైన్స్ ఆర్ బిజీ..
పదండి ముందుకు పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి.. మహాకవి పదాలను తు.చ తప్పకుండా పాటించే ఘనత మన నగరానిదే. ‘నేనెక్కడుంటే అక్కడి నుంచే లైను మొదలవుతుంది’ అని బిగ్ బీతో పూరి పలికించిన డైలాగ్‌లకు హైదరాబాదీలే ఇన్స్పిరేషన్ అని నా నమ్మకం. క్యూ అన్న పదం మా డిక్షనరీలో లేదు. సినిమా హాల్లోనో, రైల్వే స్టేషన్లోనో టికెట్ల కోసం క్యూలో బలవంతాన నిల్చోవాల్సి వస్తే తప్ప మరెక్కడా క్యూలు కట్టం, అవసరమతే క్యూని బద్దలు కొడతాం. ఈ మధ్య ఆన్లైన్ బుకింగ్‌లు మొదలయ్యాక క్యూల గొడవ నుంచి కొంత ఊరట లభించింది. అది కూడా ఒక్క టికెట్లు కొనేదగ్గర కొంత శాతం మంది ప్రజలకే. మిగతా సందర్భాల్లో అసలు క్యూలు అవసరమే లేనట్టు భావిస్తాం. బస్‌స్టాప్‌లో క్యూ అనే పదానికి వాల్యూ లేదు. బలవంతులకే మొదటిస్థానం. గంటల తరబడి ఎదురుచూసినా కండబలం, పిక్కబలం లేకుంటే బస్సు ఎక్కేటప్పుడు వెనక్కి నెట్టేస్తారు. ఈ మధ్య బస్‌స్టాప్‌లో షేరింగ్ ఆటోలనైనా క్యూ పద్ధతిలో నిలబెడుతున్నారు కానీ, బస్సు ఎక్కే ప్రయాణీకులకు మాత్రం క్యూలుండవు. క్యోంకీ క్యూ.. మనకంటే ముందు వచ్చిన వారిది మొదటి అవకాశం అనే చిన్ని మర్యాదను మరచిపోతున్నాం. నేను ఎప్పుడొస్తే అప్పుడు నాకు అన్నీ జరగాలనే ఆటిట్యూడ్ పెరిగిపోయింది. ఇది నిరూపించడానికి పెద్ద సర్వేలేమీ చేయక్కర్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా లిఫ్ట్ దగ్గర ఒక పది నిమిషాలు నిల్చుంటే చాలు. క్యూల్లేవ్, క్యూలో నిల్చోవడాలు అసలే లేవ్.. అని అర్థమవుతుంది. లిఫ్ట్ కోసం మీరు ముందొచ్చి ఎంతసేపు నిలబడ్డా సరే, వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా దూసుకెళ్లిపోతాయి. మీ వంతు కోసం ఎదురుచూస్తూ నిలబడితే లిఫ్ట్ వెళ్లిపోతుంది అందుకని మీరు పదం కలిపి తోసుకెళ్లేందుకు అలవాటు పడిపోతారు. పదండి ముందుకు.. పదండి తోసుకు.. ఎవరూ నేర్పించకుండానే అబ్బిన విద్యలు. అంతేనా లిఫ్ట్ నుంచి లోపలి వారు బయటకు వచ్చేంత వరకైనా వేచి చూసే ఓపిక లేనితనం ప్రతి మాల్లోనూ కనిపిస్తుంది. భుజాలు రాసుకుంటూ, కాళ్లు తొక్కేసుకుంటూ దూసుకెళ్తుంటారు. లిఫ్ట్ ఎక్కడం ఒక కళ అయితే, దిగడం కూడా అంతే. కావాల్సిన ఫ్లోర్లో దిగడానికి బోలెడంత మందిని దాటి, బయట నుంచి వస్తున్న వరదని తోసుకుంటూ బయటపడాలి. కదం తొక్కుతూ హృదంతరాళం గర్జిస్తూ.. నా ఈ లిఫ్టావేశంతో ఎంతో మందికి క్యూపదేశం చేశాను. బాసూ నేను ముందొచ్చానని భుజం తట్టి మరీ చెప్పాను. ఒక తిక్క చూపు, వెర్రి నవ్వు తప్ప పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదు. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్.. మరో సందర్భంలో నా కూతురు ఐస్‌క్రీమ్ కొనుక్కనే క్రమంలో సక్రమంగా నిల్చుంది. ఎంతసేపైనా బిల్లు కౌంటర్ వరకూ తను చేరదే ! దూరం నుంచి చూసీ చూసీ ఇక లాభం లేదని నేనే స్వయంగా వెళ్లి డబ్బులు ఇవ్వబోయాను. వెంటనే పక్కనుంచి కలకలం. నేను లైన్ బ్రేక్ చేశానని ! హలో సారూ మీ పక్కన ఈ చిన్నది మీకంటే ముందు నుంచీ ఉందని గుర్తు చేశాను. ఆ సారు నాలుక్కరుచుకుని సారీ చెప్పి తప్పుకున్నాడు. పిల్లల పైనే కాదు వయసు మళ్లిన పెద్దలపై కూడా మర్యాద పాటించని తనం చూస్తే ఒక్కోసారి సిగ్గేస్తుంది. ఒకసారి సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్నాం. నా వెనకే వస్తున్న ఓ పెద్ద జంట కోసం.. తలుపు తెరిచి పట్టుకున్నాను. ఇంతలో నలుగురు టీనేజర్లు గలగలా తోసుకుంటూ వెళ్లిపోయారు. మనకంటే ముందున్నవారు ఇబ్బందిపడతారన్న భావన ఆ పిల్లల్లో కలిగించలేక పోయినందుకు మన సమాజం సిగ్గుపడాలి. ఆల్ లైన్స్ ఆర్ బిజీ.. క్యూలో నిల్చోవాలంటే అసహనం, చిరాకు. ఇక ప్రార్థనా స్థలాల్లో, అప్లికేషన్ కౌంటర్లలో తోపులాటలు సహజమే అనే స్థాయిలో అలవాటుపడ్డాం. స్త్రీలకు ఒక లైన్ ప్రత్యేకంగా కేటాయించి పురుషులను వేరు చేసినా, స్త్రీల లైన్లలోనూ పురుషుల లైన్లలోనూ కొన్ని టచ్ ఇబ్బందులుంటాయి. రష్ ఉన్నా, లేకపోయినా ఎదుటి మనిషిని తాకేంత దగ్గరగా జరగడం నేను గమనించాను. విమానాశ్రయాల్లోనూ ఈ క్యూ తిప్పలు తప్పవు. లైన్ జంపింగ్‌లు, వెనుక నుంచి పుషింగ్లతో పాటు, ఫ్లైట్ దిగేటప్పుడు తోపులాటలు సర్వసాధారణం. దిగేటప్పటి తొందర ఎక్కేటప్పుడు ఉండదు సుమీ. ఫైనల్ కాల్ అనౌన్స్ చేసేంత వరకూ క్యూలోకి రాని మహానుభావులు చాలా మందే ఉంటారు. అందరూ చివర్లో తాపీగా ఎక్కాలనుకుంటే క్యూలు ఉండీ లాభం ఏంటి. దీనికి విరుద్ధంగా అంతార్జాతీయ ఫ్లైట్లలో మనవాళ్లు అత్యుత్సాహం మరీ విడ్డూరంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు ముందు ఎక్కండి అని అనౌన్స్మెంట్ వచ్చినా ఫలానా సీట్ నంబర్లే ముందుకు రండి అని పిలిచినా, అందరూ వచ్చి గేటు చుట్టూ దడి కట్టి నిలబడిపోతారు. అవతలి దేశస్తులకు తెలియదు కదా మనకు క్యూ అనే పదానికి అర్థం తెలీదని. వెనుకబడిపోవడం నీ అసమర్థత, దమ్ముంటే దూసుకెళ్లిపో అనే ఈ ఆటిట్యూడ్ ఆరోగ్యకరమైన సమాజానికి దారితీయదు. ఇక్కడ ఒక్క చోట సమానంగా ఉండలేని మనం ట్రాఫిక్ లాంటి మిగతా విషయాల్లోనూ సహనాన్ని, మర్యాదనీ కోల్పోతున్నాం. పక్కవారిని గౌరవిద్దాం. ఇది చెబితే వచ్చే పాఠం కాదు. సమాజం నేర్పే విధానం. తర్వాతి తరాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో పరిశీలించుకోవాలి. మనం నిరీక్షిస్తే అవతలి వారూ నిరీక్షించే రోజు కోసం నిరీక్షిస్తూ.. -
మనకేదీ చెత్తశుద్ధి!
ఝాన్సీ కి వాణీ వట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ !! వెన్నుతట్టి లేపిన చిరు పట్టణంలోని చెత్త మూటల నిర్వహణ ముందు మహానగర పెద్దరికం చిన్నబోయింది. గతవారం ఓ సినిమా షూటింగ్ కోసం బొబ్బిలిలో ఉన్నాను. విజయనగరం జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన బొబ్బిలిలో విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. బొబ్బిలి కోట, వేణుగోపాల స్వామి దేవాలయం, వీణల తయారీ అన్నీ చూసి చివరగా అక్కడి బెల్లం కూడా బావుంటుందని ఓ బెల్లం బట్టీలో వేడి వేడి బెల్లం కొన్నాను. మట్టి ముంతలోని మెత్తని బెల్లం ముచ్చటగా ఉంది. రాత్రికి గట్టి పడుతుందని జాగ్రత్తగా పట్టుకుని కోటలో షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముంత మీద కవర్ కట్టి సీల్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే ఇవ్వమని ఆ కోటలో పని చేస్తున్న సూపర్వైజర్ను అడిగాను. వెంటనే కోటలో హడావిడి మొదలైంది. మేడంగారు మైకా కవర్ అడిగారంటూ కోటంతా పాకిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత హడావిడి ఎందుకో అర్థం కాలేదు. చివరికి అక్కడి వంట మనిషి నా దగ్గరకొచ్చి ‘ఎందుకమ్మ మైకా కవర్ కోసం అందరినీ ఇబ్బంది పెడతావు, పేపర్ తెచ్చి తాడుతో కట్టేసుకోవచ్చును కదా’ అని జ్ఞానోపదేశం చేసింది. బొబ్బిలిలో నో పాలిథిన్.. ఇంతకీ మైకా కవర్ వెనుక ఈ హడావిడి ఏంటంటే బొబ్బిలి మున్సిపాలిటీలో పాలిథిన్ నిషేధం. ఇందులో వింతేముంది. మన దగ్గర కూడా ఇంతే కదా అనుకోకండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్నా కూడా పట్టించుకోం. అక్కడి ప్రజలు చట్టాన్ని వంట బట్టించుకున్నారు. తు.చ. తప్పకుండా నియమ నిబంధనలను పాటిస్తూ పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని తమ జీవితాల నుంచి తుడిచి వేసిన ఈ నవనాగరికులను చూసి ఎంతో గర్వపడ్డాను. అక్కడ పర్యావరణం కేవలం నినాదం కాదు జీవన విధానం. నేను కలసిన ఈ కోటలోని ఉద్యోగులే కాదు బయటకు వచ్చి ఎవరిని కదిపినా ఇదే సమాధానం వచ్చింది. అక్కడ పాలిథిన్ వాడినా, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా కట్టాల్సిందే. ఇందులో అమలుపరుస్తున్న యంత్రాంగం పాత్ర ఎంతుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. మహానగరంలో నివసిస్తున్న మహానుభావులంతా.. నాగరికతకు ఆనవాళ్లు అని చాటుకునే వారు దూరంగా విసిరేనట్టున్న మున్సిపాలిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తడిని తరిమి.. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి చెత్తని వేరు చేసే బాధ్యతని ప్రజలే అలవరుచుకున్నారు. ఆరెంజ్, బ్లూ రెండు రంగుల బుట్టలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. సారీ, అది డంపింగ్ యార్డ్ అంటే వారు ఒప్పుకోరు. దాని పేరు ఎస్డబ్ల్యూఎమ్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పార్క్. నిజంగానే అది సుందరవనంగా కనిపించింది. మన హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ని బాగుచేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అని అనుమానం వస్తుంది. ఎంత ఆధునిక టెక్నాలజీ సాయం ఉందనుకున్నా.. మన చెత్త కొండలా పేరుకుపోతోంది. ప్రజల భాగస్వామ్యం పెరగనంత వరకూ హైదరాబాద్‌లోని చెత్తకు పరిష్కారం దొరకదు. స్టిక్ ఫర్ నో ప్లాస్టిక్.. ప్లాస్టిక్, పాలిథిన్ మన చెత్తలో అత్యంత పెద్ద సమస్య. దాని నియంత్రణ వినియోగం దగ్గరే జరగాలి. మైక్రాన్ల పెరుగుదల ఒక్కటే పాలిథిన్‌కు పరిష్కారం కాదు. రీసైక్లింగ్ వరకూ రాని ప్లాస్టిక్ ఎటు చూస్తే అటు పేరుకుపోతోంది. పార్కులు, చెరువులు, గుట్టలు, మైదానాలు, నాలాలు.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం. దీనికి పూర్తి విరుద్ధంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పాలిథిన్ కనబడదు. వస్తువు కొనాలన్నా, చెత్త మూట కట్టాలన్నా.. కవర్లు కావాలనుకుంటే డబ్బుకు సైతం వెనుకాడకుండా కొనేస్తాం. టీ తాగాలన్నా, పార్సిల్ చేయాలన్నా, పార్టీలైనా ప్లాస్టిక్‌ని యూజ్ అండ్ త్రోగా వాడేస్తాం. కన్వీనియన్స్ మాట అటుంచితే.. చెత్తభారం ఎంత పెచుతున్నామో కనీసం ఆలోచించం. పెరుగుతున్న క్యాన్సర్‌కి పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగానికి ఉన్న సంబంధం గురించి తెలిసినా తేలిగ్గానే తీసుకుంటున్నాం. లక్షల్లో ఉన్న జనాభాకి వేలల్లోని జనాభా స్ట్రాటజీలు ఉపయోగ పడకకోవచ్చు. కాని, గ్రామీణ ప్రజలకు ఉన్న అవగాహన నగరవాసుల్లో ఎందుకు లేదు ? అన్నింట్లోనూ ఆధునికంగా జీవిస్తున్న మనం ఇందులో మాత్రమే ఎందుకు వెనుకబడి ఉన్నాం. బొబ్బిలి పరిశుభ్రతలో పది శాతం అయినా పురోగతి హైదరాబాద్ సాధించాలంటే వంద శాతం ప్రజల భాగస్వామ్యం కావాలి. లెట్స్ స్టార్ట్ టు డే! facebook.com/anchorjhansi ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
తెగబడిన ఉన్మాదం
మాట పెగలని బరువైన క్షణాలివి. నా హృదయం ఓ తల్లిగా, ఓ స్త్రీగా కాదు సాటి మనిషిగా రోదిస్తోంది. మానవత్వం హత్యకు గురైంది. హంతకుడూ మనిషే !! టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ నా ఆలోచనలకు కళ్లెం వేసింది. రక్తమోడుతున్న చిన్నారులను మూటల్లా మోసుకెళ్తుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. ఏ మనిషీ, ఏ జాతి, ఏ మతమూ సహించలేని ఘాతుకం మన పొరుగు దేశంలో జరిగింది. ఇది నేను రాస్తున్న సమయానికి 140కి పైగా పసిమొగ్గలు రాలిపోయాయి. మీరు చదివే సమయానికి మరెన్ని ప్రాణాలు ఆవిరి అయిపోతాయో అని భయంగా ఉంది. ఈ భయం సృష్టించాలనే కదా మారణహోమం చేస్తోంది ఉగ్రవాదం. ఈ భయానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటి దగ్గరా ఉన్న ఆయుధం ధైర్యం. ఏకే47లు, కలష్నికోవ్‌లు, ట్యాంకర్లు, బంకర్లు, బాంబులు, మిసైల్స్ ఇవి సైన్యం దగ్గర మాత్రమే ఉండే రోజులు కావివి. మనం ఇప్పుడు భయపడాల్సింది, ఉగ్రవాదుల చెంతనున్న ఆయుధ బలం చూసి కాదు, ప్రాణాలను సైతం లెక్క చేయనంతగా యువత మనసులను ప్రభావితం చేస్తున్న ఛాందస భావజాలం చూసి. తమ ప్రాణాలనే లెక్క చేయని కరడుగట్టిన ఉన్మాదులకు పసిపిల్లల ప్రాణం విలువ ఏం అర్థమవుతుంది. అందుకే విచక్షణ రహితంగా కాల్చారు, పేల్చారు, తగులబెట్టారు. వాళ్లు రగిల్చిన చిచ్చు చూసేందుకు వాళ్లు ఎలాగూ మిగిలి ఉండరు. కానీ, ఈ వినాశనం ఓ భయంకరమైన దృశ్యంగా బతికి ఉన్న పిల్లలను వెంటాడుతూనే ఉంటుంది. తెర వెనుక మత రాజకీయాలకు ఆజ్యం పోసే వ్యవస్థలకూ ఇది పీడకలలా వేధిస్తూనే ఉంటుంది. మానవత్వానికి మచ్చగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రభుత్వాలు, అగ్రరాజ్యాలు ఇప్పుడు ఏం చేస్తాయో వేచి చూడాలి. సోమవారం సిడ్నీలోని చాక్లెట్ కెఫేలో ఒక్క దుండగుడు సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం తేరుకోకముందే మంగళవారం పాకిస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. రేపు మళ్లీ ఏ మూల నుంచి పంజా విసురుతారో అనే భయం అందరి మనసుల్లోనూ ఉంది. పరాకు చేటుగా.. గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లు మన మనసుల నుంచి ఇప్పుడిప్పుడే మాయమవుతున్నాయి. అంతా సాధారణంగా నడిచిపోతోంది అని మన భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నాం. భద్రత మన హక్కు అయితే అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. హైఅలర్ట్ ప్రకటిస్తేనే తనిఖీలు మొదలవుతాయి, మెటల్ డిటెక్టర్లు మోగుతాయి. మామూలు రోజుల్లో తనిఖీ అంటే మనకు అవమానం, మెటల్ డిటెక్టర్లు మనకు టైమ్ వేస్ట్. మాల్స్‌లో సెక్యూరిటీ తనిఖీలను పెద్ద ఫార్స్లా మార్చిన ఘనత మనకే చెందుతుంది. మనకు క్యూలో నిల్చోవడమే సరిగ్గా రాదు.. ఇక మాక్ డ్రిల్స్, ఎమెర్జెన్సీ ప్రాక్టీస్‌లు ఏం తెలుస్తాయి. అవగాహన మనమూ పెంచుకోవాలి. పొరుగింట్లో ఎవరుంటారో వారి కార్యకలాపాలు, భావజాలం ఇవన్నీ తెలుసుకోవడం మన బాధ్యత. ఇవి తెలుసుకోవాలంటే కనీసం వారితో మాట్లాడటం అవసరం. నిఘాతో పాటుగా.. ఇక భద్రతావిభాగాల సంసిద్ధత మరో కోణం. మన బలగాల బల ప్రదర్శన అవసరం రాకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ అలాంటి సమయమే వస్తే.. ఆస్ట్రేలియా సిడ్నీ కెఫే ఉదంతంలో సైనిక చర్య మనకు ఉదాహరణగా నిలవాలి. మనదీ ఉగ్రవాద పిరికిపంద చర్యలు చూసిన దేశమే. మనదీ ఈ దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్న ఇంటెలిజెన్సే. నిఘా వర్గాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్లున్నారు.. బాధ్యత కేవలం వారిదే అనుకుని కళ్లు మూసుకుని చల్లగా ఉండటం మనకు తగదు. కళ్లు తెరవండి. నిఘా నేత్రాలకు మీ అప్రమత్తతను జోడించండి. తనిఖీలు సరిగ్గా జరిగేలా సహకరిద్దాం. చేయని పక్షంలో డిమాండ్ చేసి మరీ తనిఖీలు చేయిద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేకింగ్ న్యూస్ ఉంటే కానీ తోచని మొద్దు చర్మం సమాజంలా తయారవ్వొద్దు మనం. వేయి మలాలాల దీటుగా.. కళ్ల ముందు మాంసపు ముద్దల్లా పసికందులు కనిపిస్తుంటే చలించని హృదయం లేదు. ఆ కుటుంబాలను మాత్రమే కాదు ఈ నష్టం, ఆ దేశం అంతటికీ కోలుకోలేని నష్టం ఈ ఉగ్రపర్వం. భయానకమైన ఈ సంఘటన నుంచి బయటపడిన పిల్లలు ద్వేషం, భయం, కోపం, పగ వంటి ఎమోషనల్ డిస్ట్రబెన్స్‌లో పెరగకుండా చూడాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న మన సమాజానిదే. మలాలాపై దాడి జరిగిన వాయవ్య పాకిస్థాన్‌లోనే ఈ స్కూల్ దాడి కూడా జరిగింది. వేల మంది బాలికల విద్య కోసం గొంతువిప్పిన మలాలా లాగ నేల రాలిన వంద మంది చిన్నారుల నుంచి రేపు వేల మంది మలాలాలు జనించాలి. హక్కుల గళం వినిపించాలి. ఈ రోజు భయంతో కాదు బాధతో నిద్రపట్టదు. రేపు ఉదయం భయంతో కాదు బాధ్యతతో లేస్తాను. వేయి మలాలాల సూర్యోదయం కోసం ఎదురు చూస్తాను. -
ఫేమస్త్.. ఝాన్సీకి వాణి
రాతి కట్టడాల్లోని రాజసం నేటి అద్దాల మేడల్లో ఏదీ..? అలనాటి ఆ వైభవానికి ప్రతీకగా ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉన్న పురాతన కట్టడాల్లో మన మొజాంజాహి మార్కెట్ ఒకటి. ఏడో నిజాం కాలంలో వెలసిన ఈ విపణి నాలుగు వీధుల మధ్య ఠీవీగా నిలబడి ఎన్ని రకాల వ్యాపారాల కళ కళలను చూసిందో. గత కాలానికి గుర్తుగా మొజాంజాహి మార్కెట్ బురుజులోని క్లాక్ టవర్ బూజు పట్టి ఆగిపోయినట్టు కనిపించింది. రాతి గోడలు.. గోపురాలకు నీడపట్టే గొడుగులాంటి బురుజులు.. ‘ఏ మార్కెట్ హమారా హై’ అంటూ రెక్కలు విదిలిస్తూ ఎగిరే పావురాలు.. ఇవన్నీ మొజాంజాహి మార్కెట్‌ను హుందాగా మార్చేశాయి. చిన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి బస్‌లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ ఈ మార్కెట్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేది. అప్పట్లో చేతికి గడియారం ఉండేది కాదు. అందుకే క్లాక్ టవర్ రాగానే టైం ఎంతైందో ఉత్సాహంగా చూసేదాన్ని. క్లాక్ టవర్ పక్కనే నన్ను ఊరిస్తూ మురిపించిన మరో ప్రధానమైన ఆకర్షణ ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’! ఒకసారా రెండుసార్లా, మార్కెట్ దాటిన ప్రతిసారీ నన్ను ఆకర్షించేది ఆ బోర్డు. దిల్సే బనాతా హై.. ఐస్‌క్రీమ్ తిందామని లోపలికి వెళ్తే కేవలం ఒక్క షాపు మాత్రమే కాదు అది ఏకంగా ఐస్‌క్రీమ్ కాంప్లెక్ ్స అని అర్థమవుతుంది. దాదాపు 80 ఏళ్ల నుంచి హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్న 4 షాపులు పక్కపక్కనే కనిపిస్తాయి. ఫేమస్‌గా కనిపించే రెండు ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’ షాపులు (ఇద్దరు అన్నదమ్ములవి). ఇటుపక్క ‘షా’ ఐస్‌క్రీమ్, అటుపక్క బిలాల్ ఐస్‌క్రీమ్. ఏ షాపులోకి వెళ్లినా.. చల్లని, చిక్కని హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్ స్వాగతం పలుకుతుంది. నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..! వీళ్లంతా పక్కపక్కనే ఉంటూ ఇంత పోటీలో ఎలా వ్యాపారం చేస్తున్నారా అని. ఎవరి రుచి మరొకరితో తీసిపోదు. ఇంత చిక్కగా, ఇంత రుచిగా అరగంటలో ఒక బ్యాచ్ ఐస్‌క్రీమ్ ఎలా తాయారు చేస్తారు..? అని అడిగి చూడండి..! ‘హాత్ సే నహీ దిల్సే బనాతే హై..!’ అని సమాధానం వస్తుంది. పక్క పక్కనే ఇన్ని షాపులున్నా అన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. రాత్రి పన్నెండయినా ఇక్కడ జోరు తగ్గదు. ఇక రంజాన్ నెలలో అయితే రాత్రి రెండు దాటినా హడావుడి కొనసాగుతూనే ఉంటుంది. ఒకరి షాపులో మ్యాంగో, మరొకరి షాప్‌లో చికూ.. ఇంకొకరి షాపులో అంజీర్.. ఇలా నేచురల్ ఫ్రూటీ ఫ్లేవర్స్ చవులూరిస్తూనే ఉంటాయి. బ్రాండ్.. బ్యాండ్.. ఈ మధ్య కాలంలో ఎన్నో బహుళ జాతి ఐస్‌క్రీమ్ పార్లర్లు సిటీలో మనకు దర్శనమిస్తున్నాయి. నగరంలోని బ్రాండ్ పూజారులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. సంపన్న ప్రాంతాల్లో, మాల్స్‌లో ఐస్‌క్రీమ్‌ల హవా జోరుగా ఉంది. బిల్లు బ్యాండ్ బజాయించినా.. ఫర్వాలేదంటూ క్యూ కడుతున్నారు. అలా వేచి ఉండలేని వారి కోసం రోడ్డు పక్కనున్న కారు వద్దకే సర్వీసు అందించే సంస్కృతి ప్రారంభమైంది. డ్రెయిన్ ఇన్ సిస్టం పుణ్యమా అని ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐస్‌క్రీమ్ టైం అయిపోయాక.. అంటే ఏ తెల్లవారుజామునో అటుగా వాకింగ్‌కు వెళ్తే.. రాత్రి తాలూకు హిమక్రీమ్ ఫ్లేవర్స్ ఖాళీ కప్పుల రూపంలో కనిపిస్తాయి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాలు కింద పెట్టకపోయినా పర్లేదు.. కానీ, తినేసిన తర్వాత ఆ అంతర్జాతీయ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కు తగ్గట్టు ఇంటర్నేషనల్ సివిక్ సెన్స్ పాటించి రెండడుగులు వేసి చెత్తబుట్ట వరకు వెళ్తే.. పెద్ద ఖర్చు కాదు.. కొన్ని కేలరీల శక్తి తప్ప. లోకల్ ఫ్లేవర్.. అసలు నన్నడిగితే రాతి మీద చేసే ఆ కొత్త తరం ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే మన పాతరాతి మార్కెట్లోని లోకల్ ఫ్లేవర్ మాజానే వేరు. మన లోకల్ డైరీ పాలతో, మన వ్యక్తుల చేతుల్లో.. మన మొజాంజాహి మార్కెట్లో మన ఇండియన్ ఫ్లేవర్స్‌తో తయారైన లోకల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాదీ భావనను పెంపొందిస్తుంది. ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి మూడ్ అయినా ఐస్‌క్రీమ్ ఎప్పుడూ సూపర్ిహ ట్టే. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడేది ఐస్‌క్రీమ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేను కాసేపు కేలరీల గొడవ మరచిపోయి మొజాంజాహి మార్కెట్లో ‘త్రీ ఇన్ వన్ స్పెషల్’ ఐస్‌క్రీమ్ ఎంజాయ్ చేసేశాను. ఒక్కసారి ఐస్‌క్రీమ్ చుట్టూ ఉన్న జ్ఞాపకాలన్నీ కదిలాయి. అసలు ఐస్‌క్రీమ్ అంటే చిన్నప్పుడు ఎంత గొప్పో. ఎండాకాలంలో ఐస్ అబ్బాయి గంట వినిపిస్తే బండి చుట్టూ మూగిపోయే రోజులు గుర్తొచ్చాయి. పది పైసలకు పుల్ల ఐస్, పావలాకి పాల ఐస్, అందులోనూ స్పెషల్‌గా సేమియా ఐస్. రూపాయికి కప్పైస్. ఇప్పుడా చారాణా, ఆఠాణా, బారాణాలే లేవు.. రూపాయలు పదులైతే కానీ విలువ లేదు. అయినా ఐస్‌క్రీమ్‌కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే మొజాంజాహిలో ఫేమస్ ఐస్ అయినా బారాదరిలో స్టోన్ ఐస్ అయినా.. పదులైనా వందలైనా ఐస్‌క్రీమ్ పదికాలాలు చల్లగానే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎన్ని ఐస్‌లు రుచి చూసినా మన హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్‌ని మాత్రం మిస్‌కాకండి. -
మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా
అది జూలై ఫోర్త్.. అమెరికన్ ఇండిపెండెన్స్ డే! ఆ రోజు అమెరికాలో పదివేలమంది తెలుగువారు ఓ చోటికి చేరి తెలుగు సంబరాలు చేసుకుంటున్నారు. వేదికమీద ‘ద స్టార్ స్ట్రాంగల్డ్ బ్యానర్ ’ అంటూ అమెరికా జాతీయగీతం పాడుతున్నారు. ఆ పాటలో చాలా పదాలు అర్థంకావట్లేదు కానీ దేశభక్తి మాత్రం తొణికిసలాడుతోంది. ఏ దేశ జాతీయగీతమైనా అంతేనేమో! వెంటనే ‘జనగణమన..’ ప్రారంభమైంది.. నరాల్లో రక్తం పరుగులిడుతోంది.. గుండెలో శ్వాసబరువుగా మారుతోంది... కళ్లు ఊటబావులవుతున్నాయ్.. నా చుట్టూ ఉన్న చాలామందిదీ అదే స్థితి. దీనినే దేశభక్తి అనాలా? ఇక ఆ తర్వాత షరా మామూలే! డాలర్లు, రూపాయలు మాట్లాడుకుంటాయ్. కస్టమ్ సూట్లు, డిజైనర్ చీరలు ఫొటోలు దిగుతాయ్. బర్గర్లు, బూరెలు పళ్లేలు వెతుక్కుంటాయ్. అమెరికా అక్కున చేర్చుకున్నా భారతీయతను మర్చిపోకుండా ఉండటానికి వారు పడుతున్న కష్టం రెండు పడవల మీద ప్రయాణంలా అనిపించింది! ఓర్లాండాలో మిత్రుడు శ్రీనివాస్ అన్న మాటలు గుర్తొచ్చాయి..‘అమెరికన్ సిటిజన్‌షిప్ కోసం వెళ్లినప్పుడు గుండెల మీద కుడిచేయి వేసి ఆ దేశ జాతీయగీతం పాడుతుంటే అమ్మని తాకట్టుపెట్టినట్టు అనిపించింది’ అని! తప్పులేదు బ్రదర్.. కూటి కోసం కోటి తిప్పలు! కానీ.. అవసరమొస్తే అదే అమ్మ కోసం శ్రీనివాస్ ఈ దేశానికి తిరిగిరాగలడా?.. అనుమానమే! న్యూయార్క్‌లో ఓ తెలుగులక్ష్మి నాలుగు చేతులా (వాళ్లాయనవి కూడా కలిపి) డాలర్ల పంట పండించింది. మట్టివాసన పిలుస్తోందంటూ చేస్తున్న వ్యాపారాన్ని చుట్టేసి, ఉద్యోగాన్ని కట్టేసి ‘ఫర్ గుడ్’ అంటూ ఈ దేశానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబాన్ని వెరీగుడ్ అనొచ్చా... ఏమో.. ఎందుకంటే మట్టికొట్టుకుపోతున్న విలువల్ని కడిగేయడానికి డాలర్లను కరిగించేసింది మరి! ఆమె మళ్లీ వెళ్లిపోతుందా? శ్రీనివాస్ రాడేమో అన్న అనుమానానికీ.. లక్ష్మీ వెళ్లిపోతుందేమో అన్న భయానికీ లింక్.. దేశభక్తి! .. ఎన్ఆర్ఐలకున్న పాటి దేశాభిమానం మనకి లేదా? ఇదేం ప్రశ్న! 68 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పండగలా మనమూ జరుపుకుంటున్నాం కదా.. వాట్సప్పుల్లో ప్రొఫైల్ పిక్‌గా మువ్వన్నెల పతాకం పెట్టేస్తాం.. ఈ ఒక్క రోజుకి! ఫేస్బుక్లో దేశభక్తి నినాదాలు పోస్ట్ చేస్తాం.. లైకులు ఎక్కువ రాకపోయినా పర్లేదని! గల్లీ గల్లీలో తిరంగా ఎగరేస్తాం.. ట్రాఫిక్‌కు అడ్డయినా సరే! ఫ్రీడం సేల్‌లో తెగ కొనేస్తాం..డిస్కౌంట్లు మళ్లీ రావని! ఇంతేనా.. దేశభక్తి? నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తి?? పరాయిపాలకులను తరిమికొట్టిన స్ఫూర్తి ఏది? స్వరాజ్యంలో సొంతపాలకుల దోపిడీని తిప్పికొట్టే ధైర్యాన్ని ఎక్కడ దాచుకున్నాం? ఓటును నోటుకి ఎందుకు అమ్ముకుంటున్నాం? ఫ్రీడంని సేల్ చేశామా? లంచగొండి తనాన్ని నిలదీసే బదులు అదే లంచంతో మనం పాలకులకు బానిసలవుతున్నామా? బీ ద చేంజ్.. అని పిలుపునిచ్చిన బాపూజీ ఈ మార్పులను చూసి నోరెళ్లబెడతారేమో! పక్క దేశాల్లోని చట్టాలు మన దేశంలో ఎందుకు పనికిరావో తెలుసా? అక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా చట్టానికి లోబడే ఉంటారు. ఇక్కడ అన్నింటికంటే ముందు ‘నేను’ అనుకుంటూ.. ఆ ‘నేను’కి స్వేచ్ఛ ఇవ్వాలనే దూకుడులో పక్కవాడికీ స్వేచ్ఛ ఉందని మరిచిపోతున్నాం. మూత లేని సీసాల్లో పీతల్లా మిగిలిపోతున్నాం. అందుకే.. కొంత స్వేచ్ఛని త్యాగం చేద్దాం. అధికారబలంతో అందినంత దోచే స్వేచ్ఛ.. పేదోడిని ఎప్పటికీ పేదరికంలో ఉంచే స్వేచ్ఛ.. లంచం అడిగే స్వేచ్ఛ.. ఇచ్చే స్వేచ్ఛ రూల్స్ బ్రేక్ చేసే స్వేచ్ఛ.. బాధ్యతని తెగ్గొట్టే స్వేచ్ఛ.. మానవతకు మచ్చ తెచ్చే స్వేచ్ఛ.. మనకొద్దు! అందుకే.. స్వాతంత్య్ర సంగ్రామం స్ఫూర్తిగా ఇప్పుడు మళ్లీ ఉద్యమిద్దాం. స్వరాజ్య ఉద్యమం చేద్దాం.. రాజకీయ ప్రక్షాళన చేద్దాం. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభిద్దాం.. అధర్మంపై గళమెత్తుదాం. సహాయనిరాకరణ మొదలెడదాం.. నయవంచకులు, కీచకులను బహిష్కరిద్దాం. స్వదేశీ నినాదాన్ని ఉద్యమంగా చేసుకుందాం.. ఉత్పత్తులను, హస్తకళలను ప్రోత్సహిద్దాం. చివరగా..ఒక ఉద్యమాన్ని బలంగా చేద్దాం.. Don't Quit India. మేధా వలసలు ఆపండి! ఆశ మిగిలే ఉంది.. యువతరంలో స్ఫూర్తి, శక్తి కొత్తగానే ఉంది. యంగ్ ఎనర్జీ ఇంకా సుషుప్తావస్థలోకి జారుకోలేదు. ఫేస్బుక్ వాల్స్ పసలేని నినాదాలను కాదు ప్రభుత్వాలను వణికించే విప్లవాలనూ సృష్టించాయి! రాజకీయాల్లో పేరుకున్న చెత్తను ప్రక్షాళన చేయడానికి చట్టసభల్లో చేరి తమ సత్తాను చాటుతున్నారు! మట్టికొట్టుకుపోయిన వీధులనే కాదు మనుషుల మనసులనూ శుభ్రంచేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు! బాపూ... బీ ద ఛేంజ్.. నువ్వన్న మాటలు వట్టిపోలేదు! దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్.. గురజాడా.. నీ జాడలు నిజం నిజం! ఇది నా దేశం! మేరా భారత్ మహాన్! ఈ మార్పులను అమలుచేసే ఆ యంగ్ ఎనర్జీకి సలాం! జైహింద్! ఖద్దరు ధరించండి... వివేకవర్ధిని పాఠశాల ప్రాంగణంలో మహాత్మాగాంధీ 1929లో ఇచ్చిన ఈ పిలుపు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. అనిబిసెంట్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబా ఆమ్టే వంటి మహోద్యమకారులు ప్రసంగించిన, సందర్శించిన 107 ఏళ్ల చరిత్ర ఉన్న విద్యాలయాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అణువణువునా చరిత్ర స్ఫూర్తిని ప్రసరిస్తున్న వివేకవర్ధినికి వందనం.