ఝాన్సీ కి వాణీ
వట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ !! వెన్నుతట్టి లేపిన చిరు పట్టణంలోని చెత్త మూటల నిర్వహణ ముందు మహానగర పెద్దరికం చిన్నబోయింది.
గతవారం ఓ సినిమా షూటింగ్ కోసం బొబ్బిలిలో ఉన్నాను. విజయనగరం జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన బొబ్బిలిలో విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. బొబ్బిలి కోట, వేణుగోపాల స్వామి దేవాలయం, వీణల తయారీ అన్నీ చూసి చివరగా అక్కడి బెల్లం కూడా బావుంటుందని ఓ బెల్లం బట్టీలో వేడి వేడి బెల్లం కొన్నాను. మట్టి ముంతలోని మెత్తని బెల్లం ముచ్చటగా ఉంది. రాత్రికి గట్టి పడుతుందని జాగ్రత్తగా పట్టుకుని కోటలో షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముంత మీద కవర్ కట్టి సీల్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే ఇవ్వమని ఆ కోటలో పని చేస్తున్న సూపర్‌వైజర్‌ను అడిగాను. వెంటనే కోటలో హడావిడి మొదలైంది. మేడంగారు మైకా కవర్ అడిగారంటూ కోటంతా పాకిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత హడావిడి ఎందుకో అర్థం కాలేదు. చివరికి అక్కడి వంట మనిషి నా దగ్గరకొచ్చి ‘ఎందుకమ్మ మైకా కవర్ కోసం అందరినీ ఇబ్బంది పెడతావు, పేపర్ తెచ్చి తాడుతో కట్టేసుకోవచ్చును కదా’ అని జ్ఞానోపదేశం చేసింది.
బొబ్బిలిలో నో పాలిథిన్..
ఇంతకీ మైకా కవర్ వెనుక ఈ హడావిడి ఏంటంటే బొబ్బిలి మున్సిపాలిటీలో పాలిథిన్ నిషేధం. ఇందులో వింతేముంది. మన దగ్గర కూడా ఇంతే కదా అనుకోకండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్నా కూడా పట్టించుకోం. అక్కడి ప్రజలు చట్టాన్ని వంట బట్టించుకున్నారు. తు.చ. తప్పకుండా నియమ నిబంధనలను పాటిస్తూ పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని తమ జీవితాల నుంచి తుడిచి వేసిన ఈ నవనాగరికులను చూసి ఎంతో గర్వపడ్డాను. అక్కడ పర్యావరణం కేవలం నినాదం కాదు జీవన విధానం. నేను కలసిన ఈ కోటలోని ఉద్యోగులే కాదు బయటకు వచ్చి ఎవరిని కదిపినా ఇదే సమాధానం వచ్చింది. అక్కడ పాలిథిన్ వాడినా, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా కట్టాల్సిందే. ఇందులో అమలుపరుస్తున్న యంత్రాంగం పాత్ర ఎంతుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. మహానగరంలో నివసిస్తున్న మహానుభావులంతా.. నాగరికతకు ఆనవాళ్లు అని చాటుకునే వారు దూరంగా విసిరేనట్టున్న మున్సిపాలిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
తడిని తరిమి..
బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి చెత్తని వేరు చేసే బాధ్యతని ప్రజలే అలవరుచుకున్నారు. ఆరెంజ్, బ్లూ రెండు రంగుల బుట్టలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. సారీ, అది డంపింగ్ యార్డ్ అంటే వారు ఒప్పుకోరు. దాని పేరు ఎస్‌డబ్ల్యూఎమ్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) పార్క్. నిజంగానే అది సుందరవనంగా కనిపించింది. మన హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ని బాగుచేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అని అనుమానం వస్తుంది. ఎంత ఆధునిక టెక్నాలజీ సాయం ఉందనుకున్నా.. మన చెత్త కొండలా పేరుకుపోతోంది. ప్రజల భాగస్వామ్యం పెరగనంత వరకూ హైదరాబాద్‌లోని చెత్తకు పరిష్కారం దొరకదు.
స్టిక్ ఫర్ నో ప్లాస్టిక్..
ప్లాస్టిక్, పాలిథిన్ మన చెత్తలో అత్యంత పెద్ద సమస్య. దాని నియంత్రణ వినియోగం దగ్గరే జరగాలి. మైక్రాన్ల పెరుగుదల ఒక్కటే పాలిథిన్‌కు పరిష్కారం కాదు. రీసైక్లింగ్ వరకూ రాని ప్లాస్టిక్ ఎటు చూస్తే అటు పేరుకుపోతోంది. పార్కులు, చెరువులు, గుట్టలు, మైదానాలు, నాలాలు.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం. దీనికి పూర్తి విరుద్ధంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పాలిథిన్ కనబడదు. వస్తువు కొనాలన్నా, చెత్త మూట కట్టాలన్నా.. కవర్లు కావాలనుకుంటే డబ్బుకు సైతం వెనుకాడకుండా కొనేస్తాం. టీ తాగాలన్నా, పార్సిల్ చేయాలన్నా, పార్టీలైనా ప్లాస్టిక్‌ని యూజ్ అండ్ త్రోగా వాడేస్తాం.
కన్వీనియన్స్ మాట అటుంచితే.. చెత్తభారం ఎంత పెచుతున్నామో కనీసం ఆలోచించం. పెరుగుతున్న క్యాన్సర్‌కి పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగానికి ఉన్న సంబంధం గురించి తెలిసినా తేలిగ్గానే తీసుకుంటున్నాం. లక్షల్లో ఉన్న జనాభాకి వేలల్లోని జనాభా స్ట్రాటజీలు ఉపయోగ పడకకోవచ్చు. కాని, గ్రామీణ ప్రజలకు ఉన్న అవగాహన నగరవాసుల్లో ఎందుకు లేదు ? అన్నింట్లోనూ ఆధునికంగా జీవిస్తున్న మనం ఇందులో మాత్రమే ఎందుకు వెనుకబడి ఉన్నాం. బొబ్బిలి పరిశుభ్రతలో పది శాతం అయినా పురోగతి హైదరాబాద్ సాధించాలంటే వంద శాతం ప్రజల భాగస్వామ్యం కావాలి. లెట్స్ స్టార్ట్ టు డే!
facebook.com/anchorjhansi
ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్
మనకేదీ చెత్తశుద్ధి!
Published Fri, Feb 13 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement