ఫేమస్త్.. ఝాన్సీకి వాణి | Mozamjahi market a Famous of Hyderabad city,says Jhansi | Sakshi
Sakshi News home page

ఫేమస్త్.. ఝాన్సీకి వాణి

Published Fri, Oct 10 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

ఫేమస్త్.. ఝాన్సీకి వాణి

ఫేమస్త్.. ఝాన్సీకి వాణి

రాతి కట్టడాల్లోని రాజసం నేటి అద్దాల మేడల్లో ఏదీ..? అలనాటి ఆ వైభవానికి ప్రతీకగా ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉన్న పురాతన కట్టడాల్లో మన మొజాంజాహి మార్కెట్ ఒకటి. ఏడో నిజాం కాలంలో వెలసిన ఈ విపణి నాలుగు వీధుల మధ్య ఠీవీగా నిలబడి ఎన్ని రకాల వ్యాపారాల కళ కళలను చూసిందో. గత కాలానికి గుర్తుగా మొజాంజాహి మార్కెట్ బురుజులోని క్లాక్ టవర్ బూజు పట్టి ఆగిపోయినట్టు కనిపించింది. రాతి గోడలు.. గోపురాలకు నీడపట్టే గొడుగులాంటి బురుజులు.. ‘ఏ మార్కెట్ హమారా హై’ అంటూ రెక్కలు విదిలిస్తూ ఎగిరే పావురాలు.. ఇవన్నీ మొజాంజాహి మార్కెట్‌ను హుందాగా మార్చేశాయి.
 
 చిన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి బస్‌లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ ఈ మార్కెట్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేది. అప్పట్లో చేతికి గడియారం ఉండేది కాదు. అందుకే క్లాక్ టవర్ రాగానే టైం ఎంతైందో ఉత్సాహంగా చూసేదాన్ని. క్లాక్ టవర్ పక్కనే నన్ను ఊరిస్తూ మురిపించిన మరో ప్రధానమైన ఆకర్షణ ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’! ఒకసారా రెండుసార్లా, మార్కెట్ దాటిన ప్రతిసారీ నన్ను ఆకర్షించేది ఆ బోర్డు.
 
 దిల్‌సే బనాతా హై..
 ఐస్‌క్రీమ్ తిందామని లోపలికి వెళ్తే కేవలం ఒక్క షాపు మాత్రమే కాదు అది ఏకంగా ఐస్‌క్రీమ్ కాంప్లెక్ ్స అని అర్థమవుతుంది. దాదాపు 80 ఏళ్ల నుంచి హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్న 4 షాపులు పక్కపక్కనే కనిపిస్తాయి. ఫేమస్‌గా కనిపించే రెండు ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’ షాపులు (ఇద్దరు అన్నదమ్ములవి). ఇటుపక్క ‘షా’ ఐస్‌క్రీమ్, అటుపక్క బిలాల్ ఐస్‌క్రీమ్. ఏ షాపులోకి వెళ్లినా.. చల్లని, చిక్కని హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్ స్వాగతం పలుకుతుంది. నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..! వీళ్లంతా పక్కపక్కనే ఉంటూ ఇంత పోటీలో ఎలా వ్యాపారం చేస్తున్నారా అని. ఎవరి రుచి మరొకరితో తీసిపోదు. ఇంత చిక్కగా, ఇంత రుచిగా అరగంటలో ఒక బ్యాచ్ ఐస్‌క్రీమ్ ఎలా తాయారు చేస్తారు..? అని అడిగి చూడండి..! ‘హాత్ సే నహీ దిల్‌సే బనాతే హై..!’ అని సమాధానం వస్తుంది. పక్క పక్కనే ఇన్ని షాపులున్నా అన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. రాత్రి పన్నెండయినా ఇక్కడ జోరు తగ్గదు. ఇక రంజాన్ నెలలో అయితే రాత్రి రెండు దాటినా హడావుడి కొనసాగుతూనే ఉంటుంది. ఒకరి షాపులో మ్యాంగో, మరొకరి షాప్‌లో చికూ.. ఇంకొకరి షాపులో అంజీర్.. ఇలా నేచురల్ ఫ్రూటీ ఫ్లేవర్స్ చవులూరిస్తూనే ఉంటాయి.
 
 బ్రాండ్.. బ్యాండ్..
 ఈ మధ్య కాలంలో ఎన్నో బహుళ జాతి ఐస్‌క్రీమ్ పార్లర్లు సిటీలో మనకు దర్శనమిస్తున్నాయి. నగరంలోని బ్రాండ్ పూజారులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. సంపన్న ప్రాంతాల్లో, మాల్స్‌లో ఐస్‌క్రీమ్‌ల హవా జోరుగా ఉంది. బిల్లు బ్యాండ్ బజాయించినా.. ఫర్వాలేదంటూ క్యూ కడుతున్నారు. అలా వేచి ఉండలేని వారి కోసం రోడ్డు పక్కనున్న కారు వద్దకే సర్వీసు అందించే సంస్కృతి ప్రారంభమైంది. డ్రెయిన్ ఇన్ సిస్టం పుణ్యమా అని ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐస్‌క్రీమ్ టైం అయిపోయాక.. అంటే ఏ తెల్లవారుజామునో అటుగా వాకింగ్‌కు వెళ్తే.. రాత్రి తాలూకు హిమక్రీమ్ ఫ్లేవర్స్ ఖాళీ కప్పుల రూపంలో కనిపిస్తాయి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాలు కింద పెట్టకపోయినా పర్లేదు.. కానీ, తినేసిన తర్వాత ఆ అంతర్జాతీయ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కు తగ్గట్టు ఇంటర్నేషనల్ సివిక్ సెన్స్ పాటించి రెండడుగులు వేసి చెత్తబుట్ట వరకు వెళ్తే.. పెద్ద ఖర్చు కాదు.. కొన్ని కేలరీల శక్తి తప్ప.
 
 లోకల్ ఫ్లేవర్..
 అసలు నన్నడిగితే రాతి మీద చేసే ఆ కొత్త తరం ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే మన పాతరాతి మార్కెట్‌లోని లోకల్ ఫ్లేవర్ మాజానే వేరు. మన లోకల్ డైరీ పాలతో, మన వ్యక్తుల చేతుల్లో.. మన మొజాంజాహి మార్కెట్‌లో మన ఇండియన్ ఫ్లేవర్స్‌తో తయారైన లోకల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాదీ భావనను పెంపొందిస్తుంది. ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి మూడ్ అయినా ఐస్‌క్రీమ్ ఎప్పుడూ సూపర్‌ిహ ట్టే. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడేది ఐస్‌క్రీమ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేను కాసేపు కేలరీల గొడవ మరచిపోయి మొజాంజాహి మార్కెట్‌లో ‘త్రీ ఇన్ వన్ స్పెషల్’ ఐస్‌క్రీమ్ ఎంజాయ్ చేసేశాను. ఒక్కసారి ఐస్‌క్రీమ్ చుట్టూ ఉన్న జ్ఞాపకాలన్నీ కదిలాయి. అసలు ఐస్‌క్రీమ్ అంటే చిన్నప్పుడు ఎంత గొప్పో. ఎండాకాలంలో ఐస్ అబ్బాయి గంట వినిపిస్తే బండి చుట్టూ మూగిపోయే రోజులు గుర్తొచ్చాయి.
 
  పది పైసలకు పుల్ల ఐస్, పావలాకి పాల ఐస్, అందులోనూ స్పెషల్‌గా సేమియా ఐస్. రూపాయికి కప్పైస్. ఇప్పుడా చారాణా, ఆఠాణా, బారాణాలే లేవు.. రూపాయలు పదులైతే కానీ విలువ లేదు. అయినా ఐస్‌క్రీమ్‌కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే మొజాంజాహిలో ఫేమస్ ఐస్ అయినా బారాదరిలో స్టోన్ ఐస్ అయినా.. పదులైనా వందలైనా ఐస్‌క్రీమ్ పదికాలాలు చల్లగానే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎన్ని ఐస్‌లు రుచి చూసినా మన హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్‌ని మాత్రం మిస్‌కాకండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement