నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటైన కంప్యూటర్ ఆధారిత స్కానర్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లలో రవాణా చేసే పార్శిళ్లను తనిఖీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటుచేసి, పరిశీలించాకే పార్శిళ్లను రైళ్లలోకి ఎక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి పార్శిళ్ల స్కానర్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటైంది. త్వరలో మిగిలిన ప్రధాన స్టేషన్లలోనూ ఏర్పాటు కానున్నాయి.
దర్భంగా పేలుడుతో..
గతేడాది బిహార్‌లోని దర్భంగా స్టేషన్‌లో పార్శిల్ వ్యాగన్‌లో తీవ్రవాదులు అమర్చిన బాంబు పేలిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రయాణికుల రైళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పార్శిళ్లను వినియోగించాలని పథకాలు రచిస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. ప్రయాణికుల రైళ్లలో తీసుకెళ్లే పార్శిళ్ల కోసం తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రైల్వేని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రయాణికుల రైళ్లలో పార్శిళ్లు పెద్దమొత్తంలో తరలే స్టేషన్లలో నాంపల్లి తొలి స్థానంలో ఉంటుంది. దీంతో తొలి స్కానర్ ఏర్పాటుకు ఈ స్టేషన్‌నే ఎంపిక చేశారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో..
స్కానర్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే దిశగా రైల్వే యోచిస్తోంది. ఇదే తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ యూనిట్‌ను ఇటీవలే ప్రారంభించింది. తాజాగా పార్శిల్ స్కానర్‌నూ ఏర్పాటు చేయించింది. ఇందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది.
నాంపల్లి నుంచి టన్నుల కొద్ది పార్శిళ్లు వెళ్తాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా వ్యాగన్ మొత్తాన్ని పార్శిల్ కోసం బుక్ చేసుకుంటాయి. వీటిని లీజ్డ్ వ్యా న్లుగా పేర్కొంటారు. ఇలాంటి లీజ్డ్ వ్యాన్లలో తరలే పార్శిల్‌కి రూ.5, లీజ్డ్ కాని వ్యాన్లలో తీసుకెళ్లే ప్రతి పార్శిల్‌కి రూ.10 చార్జ్ చేస్తారు. ఈ మొత్తం ఆ ప్రైవేటు సంస్థ తీసుకుంటుంది.
స్కానింగ్ తరువాతే లోడింగ్..
భారతీయ రైల్వేలోని న్యూఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. స్కానర్ ద్వారా తనిఖీ చేసిన పార్శిళ్లపై ప్రత్యేకం గా స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. కంప్యూటర్ ఆధారిత స్కానర్ల వల్ల పార్శిళ్లలో ఉన్న వస్తువులను, ప్రమాదకర పదార్థాలను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి స్టేషన్‌లో స్కానర్లు అమర్చటంలో కీలకంగా ఉన్న సికింద్రాబాద్ డీఆర్‌ఎం అభయ్‌కుమార్ గుప్తా, సిబ్బందిని దక్షిణ మధ్యరైల్వే ఇన్‌చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment