Mozamjahi Market
-
గంట గంటకు ఠంగ్... ఠంగ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న మొజంజాహీ మార్కెట్ క్లాక్ టవర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. మొజంజాహీ మార్కెట్‌ను దత్తత తీసుకున్న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ దాని పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన కొత్త గడియారం అమర్చారు. నాలుగు వైపులా లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని గడియారాలు పని చేసేలా చర్యలు తీసుకున్నారు. చాలా ఏళ్ల తరువాత గడియారం ఠంగ్.. ఠంగ్.. మంటూ మోగడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో సమయం తెలుసుకునేందుకు ఇలా క్లాక్‌టవర్లను ఏర్పాటు చేసేవారు. ఇలాగే మొజంజాహీ మార్కెట్లోనూ ఎత్తైన గోపురం నిర్మించి నాలుగు వైపుల గడియారాలను అమర్చారు. ఇది ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడేది. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయ్యాక నగరం నడిబొడ్డున ఉన్న మొజంజాహీ మార్కెట్ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో వచ్చింది. అనంతరం కొన్నేళ్ల వరకు మార్కెట్ క్లాక్‌టవర్‌లోని గడియారం పని చేసిందని, అయితే నిర్వహణ లేకపోవడంతో తరువాత ఆగిపోయింది. ప్రస్తుతం గడియారం పని తీరు.. ఈ గడియారం సక్రమంగా పని చేసేందుకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా బ్యాటరీ బ్యాకప్‌తో గడియారం పని చేసేలా చర్యలు తీసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో బ్యాటరీ బ్యాకప్ లేకపోయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే గడియారం తిరిగి సమయాన్ని సరి చేసుకుని పని చేస్తుంది. అలాగే ప్రతి గంటకు గడియారం మోగుతుంది. రాత్రి పూట ప్రజలకు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు గడియారం గంటలు మోగకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే రాత్రి వేళలో దూరం నుంచి గడియారం కనిపించేలా లైట్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొజంజాహీ మార్కెట్ గడియారం చరిత్ర... 1908లో హైదరాబాద్ నగరం భారీ వరదలతో అతలాకుతలమైంది. దీంతో 1912లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిటీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పా టు చేశాడు. ఈ బోర్డుకు అతని రెండో కుమారుడు మొజంజా(షుజాత్ అలీఖాన్)ను అధ్యక్షుడిగా వ్యవ హరించారు. అప్పటికే నగరంలో మహెబూబ్చౌక్, రెసిడెన్సీ బజార్, బేగంబజార్ వంటి మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకేచోటా అన్ని రకాల వస్తువులు, పండ్లు, కిరాణంతో పాటు తినుబండారాలు లభించేలా 1933–35 మధ్య మొజంజాహీ మార్కెట్‌ను నిర్మించారు. మార్కెట్ అంతా రాళ్లతో నిర్మించి పై భాగంలో ఎత్తైన ఓ గోపురం నిర్మించారు. ఆ గోపురానికి నాలుగు వైపుల గడియారాలు ఏర్పాటు చేశారు. -
మొజాంజాహీ మార్కెట్లో అగ్నిప్రమాదం
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్) : చారిత్రక మొజాంజాహీ మార్కెట్లోని ఓ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్లోని రాయల్ చాలియా స్టోర్‌లో అన్వర్ అనే వ్యక్తి చాలియా, పాన్ మసాలాలను విక్రయిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం షాపు పైఅంతస్తులో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం గమనించి అంతా బయటికి పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. అప్పటికే మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లను రప్పించారు. చాలా ఇరుకైన గదులు ఉండడంతోపాటు ఎటువంటి వెంటిలేషన్ లేకపోవడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. షాపుపైన గోడలను పగుల కొట్టారు. రాత్రి 7గంటల వరకు శ్రమపడి మంటలను అదుపులోకి తెచ్చినట్లు హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. పెద్ద ఎత్తున పాన్‌మసాలా స్టాక్ స్టోర్ చేసి ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయన్నారు. ఆస్తి నష్టం లక్షల్లోనే సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రమాదం కారణంగా నిరంతరం రద్దీగా ఉంటే మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాలో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
ఫేమస్త్.. ఝాన్సీకి వాణి
రాతి కట్టడాల్లోని రాజసం నేటి అద్దాల మేడల్లో ఏదీ..? అలనాటి ఆ వైభవానికి ప్రతీకగా ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉన్న పురాతన కట్టడాల్లో మన మొజాంజాహి మార్కెట్ ఒకటి. ఏడో నిజాం కాలంలో వెలసిన ఈ విపణి నాలుగు వీధుల మధ్య ఠీవీగా నిలబడి ఎన్ని రకాల వ్యాపారాల కళ కళలను చూసిందో. గత కాలానికి గుర్తుగా మొజాంజాహి మార్కెట్ బురుజులోని క్లాక్ టవర్ బూజు పట్టి ఆగిపోయినట్టు కనిపించింది. రాతి గోడలు.. గోపురాలకు నీడపట్టే గొడుగులాంటి బురుజులు.. ‘ఏ మార్కెట్ హమారా హై’ అంటూ రెక్కలు విదిలిస్తూ ఎగిరే పావురాలు.. ఇవన్నీ మొజాంజాహి మార్కెట్‌ను హుందాగా మార్చేశాయి. చిన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి బస్‌లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ ఈ మార్కెట్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేది. అప్పట్లో చేతికి గడియారం ఉండేది కాదు. అందుకే క్లాక్ టవర్ రాగానే టైం ఎంతైందో ఉత్సాహంగా చూసేదాన్ని. క్లాక్ టవర్ పక్కనే నన్ను ఊరిస్తూ మురిపించిన మరో ప్రధానమైన ఆకర్షణ ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’! ఒకసారా రెండుసార్లా, మార్కెట్ దాటిన ప్రతిసారీ నన్ను ఆకర్షించేది ఆ బోర్డు. దిల్సే బనాతా హై.. ఐస్‌క్రీమ్ తిందామని లోపలికి వెళ్తే కేవలం ఒక్క షాపు మాత్రమే కాదు అది ఏకంగా ఐస్‌క్రీమ్ కాంప్లెక్ ్స అని అర్థమవుతుంది. దాదాపు 80 ఏళ్ల నుంచి హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్న 4 షాపులు పక్కపక్కనే కనిపిస్తాయి. ఫేమస్‌గా కనిపించే రెండు ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’ షాపులు (ఇద్దరు అన్నదమ్ములవి). ఇటుపక్క ‘షా’ ఐస్‌క్రీమ్, అటుపక్క బిలాల్ ఐస్‌క్రీమ్. ఏ షాపులోకి వెళ్లినా.. చల్లని, చిక్కని హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్ స్వాగతం పలుకుతుంది. నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..! వీళ్లంతా పక్కపక్కనే ఉంటూ ఇంత పోటీలో ఎలా వ్యాపారం చేస్తున్నారా అని. ఎవరి రుచి మరొకరితో తీసిపోదు. ఇంత చిక్కగా, ఇంత రుచిగా అరగంటలో ఒక బ్యాచ్ ఐస్‌క్రీమ్ ఎలా తాయారు చేస్తారు..? అని అడిగి చూడండి..! ‘హాత్ సే నహీ దిల్సే బనాతే హై..!’ అని సమాధానం వస్తుంది. పక్క పక్కనే ఇన్ని షాపులున్నా అన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. రాత్రి పన్నెండయినా ఇక్కడ జోరు తగ్గదు. ఇక రంజాన్ నెలలో అయితే రాత్రి రెండు దాటినా హడావుడి కొనసాగుతూనే ఉంటుంది. ఒకరి షాపులో మ్యాంగో, మరొకరి షాప్‌లో చికూ.. ఇంకొకరి షాపులో అంజీర్.. ఇలా నేచురల్ ఫ్రూటీ ఫ్లేవర్స్ చవులూరిస్తూనే ఉంటాయి. బ్రాండ్.. బ్యాండ్.. ఈ మధ్య కాలంలో ఎన్నో బహుళ జాతి ఐస్‌క్రీమ్ పార్లర్లు సిటీలో మనకు దర్శనమిస్తున్నాయి. నగరంలోని బ్రాండ్ పూజారులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. సంపన్న ప్రాంతాల్లో, మాల్స్‌లో ఐస్‌క్రీమ్‌ల హవా జోరుగా ఉంది. బిల్లు బ్యాండ్ బజాయించినా.. ఫర్వాలేదంటూ క్యూ కడుతున్నారు. అలా వేచి ఉండలేని వారి కోసం రోడ్డు పక్కనున్న కారు వద్దకే సర్వీసు అందించే సంస్కృతి ప్రారంభమైంది. డ్రెయిన్ ఇన్ సిస్టం పుణ్యమా అని ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐస్‌క్రీమ్ టైం అయిపోయాక.. అంటే ఏ తెల్లవారుజామునో అటుగా వాకింగ్‌కు వెళ్తే.. రాత్రి తాలూకు హిమక్రీమ్ ఫ్లేవర్స్ ఖాళీ కప్పుల రూపంలో కనిపిస్తాయి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాలు కింద పెట్టకపోయినా పర్లేదు.. కానీ, తినేసిన తర్వాత ఆ అంతర్జాతీయ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కు తగ్గట్టు ఇంటర్నేషనల్ సివిక్ సెన్స్ పాటించి రెండడుగులు వేసి చెత్తబుట్ట వరకు వెళ్తే.. పెద్ద ఖర్చు కాదు.. కొన్ని కేలరీల శక్తి తప్ప. లోకల్ ఫ్లేవర్.. అసలు నన్నడిగితే రాతి మీద చేసే ఆ కొత్త తరం ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే మన పాతరాతి మార్కెట్లోని లోకల్ ఫ్లేవర్ మాజానే వేరు. మన లోకల్ డైరీ పాలతో, మన వ్యక్తుల చేతుల్లో.. మన మొజాంజాహి మార్కెట్లో మన ఇండియన్ ఫ్లేవర్స్‌తో తయారైన లోకల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాదీ భావనను పెంపొందిస్తుంది. ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి మూడ్ అయినా ఐస్‌క్రీమ్ ఎప్పుడూ సూపర్ిహ ట్టే. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడేది ఐస్‌క్రీమ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేను కాసేపు కేలరీల గొడవ మరచిపోయి మొజాంజాహి మార్కెట్లో ‘త్రీ ఇన్ వన్ స్పెషల్’ ఐస్‌క్రీమ్ ఎంజాయ్ చేసేశాను. ఒక్కసారి ఐస్‌క్రీమ్ చుట్టూ ఉన్న జ్ఞాపకాలన్నీ కదిలాయి. అసలు ఐస్‌క్రీమ్ అంటే చిన్నప్పుడు ఎంత గొప్పో. ఎండాకాలంలో ఐస్ అబ్బాయి గంట వినిపిస్తే బండి చుట్టూ మూగిపోయే రోజులు గుర్తొచ్చాయి. పది పైసలకు పుల్ల ఐస్, పావలాకి పాల ఐస్, అందులోనూ స్పెషల్‌గా సేమియా ఐస్. రూపాయికి కప్పైస్. ఇప్పుడా చారాణా, ఆఠాణా, బారాణాలే లేవు.. రూపాయలు పదులైతే కానీ విలువ లేదు. అయినా ఐస్‌క్రీమ్‌కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే మొజాంజాహిలో ఫేమస్ ఐస్ అయినా బారాదరిలో స్టోన్ ఐస్ అయినా.. పదులైనా వందలైనా ఐస్‌క్రీమ్ పదికాలాలు చల్లగానే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎన్ని ఐస్‌లు రుచి చూసినా మన హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్‌ని మాత్రం మిస్‌కాకండి. -
మెట్రోపై ముందడుగు!
* ‘మెట్రో’ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష * ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం * ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామంటూ హామీ! సాక్షి, హైదరాబాద్: ‘మెట్రో’ ప్రతిష్టంభన వీడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం, అది సాధ్యపడదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చెబుతుండటంతో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కొంతకాలంగా నీలినీడలు కమ్ముకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుతో పాటు ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిపై నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. మెట్రో పనులపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే సమస్యలు, ఇతర ప్రత్యామ్నాయాలను సమగ్రంగా నివేదించాలని సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించబోదని, గడువులోగా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. అలాగే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయరాదని అధికారులను ఆయన గట్టిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయమై మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్అండ్టీ మెట్రో రైలు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా తాను అమెరికాలో ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అధికారుల సమావేశం విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. వివాదం పూర్వాపరాలివీ... నగరంలో రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాలన్న సూచనపై విముఖత వ్యక్తం చేస్తూ సర్కారుకు ఎల్అండ్టీ రాసిన లేఖ కలకలం సృష్టించింది. 2010లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో పేర్కొన్న పనులనే చేపడతామని, ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పాయి. నాటి ఒప్పందంలో భూగర్భ మెట్రో అంశం లేదని గుర్తు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హెచ్ఎంఆర్ అధికారులతో మంగళవారం సీఎం నేరుగా సమావేశమయ్యారు. నగర చరిత్ర, సంస్కృతులకు భంగం కలిగించని రీతిలో మెట్రో మార్గాన్ని నిర్మించాలని తాము భావిస్తున్నట్టు అధికారులతో పేర్కొన్నారు. బలవంతంగా భూగర్భ మెట్రో పనులు చేపట్టాల్సిందేనని తాము ఆదేశించడం లేదన్నారు. ప్రత్యామ్నాయాలను నిశితంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.