సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న మొజంజాహీ మార్కెట్ క్లాక్ టవర్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. మొజంజాహీ మార్కెట్‌ను దత్తత తీసుకున్న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ దాని పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన కొత్త గడియారం అమర్చారు. నాలుగు వైపులా లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని గడియారాలు పని చేసేలా చర్యలు తీసుకున్నారు.
చాలా ఏళ్ల తరువాత గడియారం ఠంగ్.. ఠంగ్.. మంటూ మోగడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో సమయం తెలుసుకునేందుకు ఇలా క్లాక్‌టవర్లను ఏర్పాటు చేసేవారు. ఇలాగే మొజంజాహీ మార్కెట్‌లోనూ ఎత్తైన గోపురం నిర్మించి నాలుగు వైపుల గడియారాలను అమర్చారు. ఇది ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడేది.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయ్యాక నగరం నడిబొడ్డున ఉన్న మొజంజాహీ మార్కెట్ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో వచ్చింది. అనంతరం కొన్నేళ్ల వరకు మార్కెట్ క్లాక్‌టవర్‌లోని గడియారం పని చేసిందని, అయితే నిర్వహణ లేకపోవడంతో తరువాత ఆగిపోయింది.
ప్రస్తుతం గడియారం పని తీరు..
ఈ గడియారం సక్రమంగా పని చేసేందుకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా బ్యాటరీ బ్యాకప్‌తో గడియారం పని చేసేలా చర్యలు తీసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో బ్యాటరీ బ్యాకప్ లేకపోయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే గడియారం తిరిగి సమయాన్ని సరి చేసుకుని పని చేస్తుంది.
అలాగే ప్రతి గంటకు గడియారం మోగుతుంది. రాత్రి పూట ప్రజలకు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు గడియారం గంటలు మోగకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే రాత్రి వేళలో దూరం నుంచి గడియారం కనిపించేలా లైట్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మొజంజాహీ మార్కెట్ గడియారం చరిత్ర...
1908లో హైదరాబాద్ నగరం భారీ వరదలతో అతలాకుతలమైంది. దీంతో 1912లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిటీ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పా టు చేశాడు. ఈ బోర్డుకు అతని రెండో కుమారుడు మొజంజా(షుజాత్ అలీఖాన్)ను అధ్యక్షుడిగా వ్యవ హరించారు.
అప్పటికే నగరంలో మహెబూబ్‌చౌక్, రెసిడెన్సీ బజార్, బేగంబజార్ వంటి మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకేచోటా అన్ని రకాల వస్తువులు, పండ్లు, కిరాణంతో పాటు తినుబండారాలు లభించేలా 1933–35 మధ్య మొజంజాహీ మార్కెట్‌ను నిర్మించారు. మార్కెట్ అంతా రాళ్లతో నిర్మించి పై భాగంలో ఎత్తైన ఓ గోపురం నిర్మించారు. ఆ గోపురానికి నాలుగు వైపుల గడియారాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment