అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్) : చారిత్రక మొజాంజాహీ మార్కెట్‌లోని ఓ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని రాయల్ చాలియా స్టోర్‌లో అన్వర్ అనే వ్యక్తి చాలియా, పాన్ మసాలాలను విక్రయిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం షాపు పైఅంతస్తులో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం గమనించి అంతా బయటికి పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. అప్పటికే మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లను రప్పించారు.
చాలా ఇరుకైన గదులు ఉండడంతోపాటు ఎటువంటి వెంటిలేషన్ లేకపోవడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. షాపుపైన గోడలను పగుల కొట్టారు. రాత్రి 7గంటల వరకు శ్రమపడి మంటలను అదుపులోకి తెచ్చినట్లు హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. పెద్ద ఎత్తున పాన్‌మసాలా స్టాక్ స్టోర్ చేసి ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయన్నారు. ఆస్తి నష్టం లక్షల్లోనే సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రమాదం కారణంగా నిరంతరం రద్దీగా ఉంటే మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాలో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
మొజాంజాహీ మార్కెట్‌లో అగ్నిప్రమాదం
Published Thu, Jul 9 2015 8:11 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement