గుల్జార్‌కు ఫాల్కే పురస్కారం
అవార్డు కింద స్వర్ణకమలం.. రూ. 10 లక్షల నగదు
ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగానికి సేవ చేసిన గుల్జార్
న్యూఢిల్లీ: ‘తుజ్‌సే నారాజ్ నహీ..’, ‘తెరె బిన జిందగీ సే..’ లాంటి మధురమైన పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది.
ఐదు దశాబ్దాలకుపైగా తన సాహిత్యంతో గుల్జార్ సినీ ప్రేక్షకులనే కాక.. ఆసేతు హిమాచలాన్నీ మైమరపింపజేశారు. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలతోనే కాదు.. కథ, మాటల రచయితగా.. దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కేకు 2013 సంవత్సరానికి గుల్జార్‌ను ఏడుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 45వ ప్రజ్ఞాశాలి గుల్జార్. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలంతో పాటు, పది లక్షల రూపాయల నగదు పురస్కారం, శాలువా అందజేస్తారు.
79 ఏళ్ల గుల్జార్ అసలు పేరు సంపూరణ్‌సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్‌సర్ చేరింది. అయితే గుల్జార్ ముంబై చేరుకుని గ్యారేజ్ మెకానిక్‌గా పనిలో చేరారు. ఖాళీ సమయంలో కవిత్వం రాసేవారు. 1956లో సినీ గేయ రచయితగా గుల్జార్ సినీ జీవితం ప్రారంభమైంది. బిమల్ రాయ్ చిత్రం ‘బందినీ’తో గుల్జార్ దశ తిరిగింది. ఆ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూడలేదు.
ఆ తర్వాత ఎస్‌డీ బర్మన్, సలీల్ చౌధురి, శంకర్ జైకిషన్, హేమంత్ కుమార్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, మదన్ మోహన్, రాజేశ్ రోషన్, అనూ మాలిక్, శంకర్-ఎహ్‌సాన్-లాయ్ తదితర ప్రముఖ సంగీత దర్శకులతో కలసి పని చేశారు. ఆర్‌డీ బర్మన్, ఏఆర్ రెహ్మాన్, విశాల్ భరద్వాజ్‌తో కలసి పలు అల్బమ్‌లకు, ప్రోగ్రామ్‌లకు ఆయన పనిచేశారు. దర్శకుడిగానూ ఎన్నో కళాత్మక చిత్రాలను రూపొందించారు. 1971లో ‘మేరే ఆప్నే’ చిత్రంతో గుల్జార్ తొలిసారి మెగాఫోన్ చేపట్టారు. పరిచయ్, కోషిష్, ఆంధ్రీ, మౌసమ్, అంగూర్, నమ్‌ఖీన్, ఖుష్బూ వంటి మేటి చిత్రాలు రూపొందించారు.ఆయన చివరిసారిగా టబు నటించిన ‘తుహుహు’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నటి రాఖీని గుల్జార్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మేఘనా. మేఘనకు ఏడాది వయసు ఉండగా రాఖీ, గుల్జార్ విడిపోయారు. తండ్రిబాటలోనే నడిచిన మేఘన ఫిల్‌హాల్, జస్ట్ మ్యారీడ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 2002లో గుల్జార్‌ను సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. ఆయన అందుకున్న జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులకు లెక్కలేదు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జయ హో’ పాటకుగానూ ఏఆర్ రెహ్మన్‌తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది.
గొప్ప గౌరవం: గుల్జార్
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా గుల్జార్ స్పందిస్తూ.. ‘‘ఈ పురస్కారం దక్కడం గొప్ప గౌరవం. దీంతో పరిపుర్ణత సాధించినట్టు భావిస్తున్నా. ఇది ఒక పాట, స్క్రీన్ ప్లే రాసినందుకు వచ్చింది కాదు. ఒక వ్యక్తి చేసిన అన్ని సేవలకు దక్కిన గౌరవం. నన్ను ప్రేమించి, మద్దతు ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. గుల్జార్‌కు ఫాల్కే అవార్డు దక్కడంపై గాన కోకిల లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అనుపమ్ ఖేర్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.