గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే | Gulzar Dada Saheb Phalke | Sakshi
Sakshi News home page

గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే

Published Thu, Apr 17 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే

గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే

క్రీడలు
 .ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా ధోని
 ఐసీసీ ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా భారత  జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపికయ్యాడు. ధోనితోపాటు మరో ముగ్గురు భారత క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్‌లకు కూడా ఈ జట్టులో స్థానం లభించింది.
 
 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా శిఖర్ ధావన్
 భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌తోపాటు మరో నలుగురు క్రికెటర్లు.. ర్యాన్‌హారిస్ (ఆస్ట్రేలియా), క్రిస్‌రోజర్స్ (ఆస్ట్రే లియా), జో రూట్ (ఇంగ్లండ్), ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ ఎడ్వర్డ్స్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013లో కనబరిచిన ఉత్తమ ఆటతీరుకు వీరిని ఎంపిక చేశారు.  విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నిలిచాడు.
 
 మానవ్‌జిత్‌కు స్వర్ణం
 ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ పురుషుల ట్రాప్ విభాగంలో భారత షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధు స్వర్ణం సాధించాడు. సంధు నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లోను విజేతగా గెలిచాడు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన మైకేల్ డైమండ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
 
 ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా
 సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20 టోర్నీ విజేతగా బరోడా జట్టు నిలిచింది. ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది.
 
 దక్షిణాసియా జూడోలో భారత్‌కు పది స్వర్ణాలు
 నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగిన దక్షిణాసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఏప్రిల్ 10 నుంచి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతో పాటు చెరో రజతం, కాంస్యం సాధించింది.
 
 టెక్సాస్ రన్నరప్ దీపిక
 భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ టెక్సాస్ ఓపెన్‌టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్‌ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక  ఓడిపోయింది.
 
 
 జాతీయం
 ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు
 అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 7న చేరింది.  ఈ రైలు డెకర్‌గావ్ (అసోం) నుంచి ఇటానగర్‌కు సమీపం లోని నహర్‌లగున్‌కు చేరింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2008 జనవరి 31న ప్రకటించిన ప్యాకేజీలో ఈ రైలు సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో భారత రాజధాని న్యూఢిల్లీతో అనుసంధానిస్తూ రైల్వే సర్వీసులను ప్రవేశపెడతామని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌తుకీ ప్రకటించారు.
 
 దేశంలోకి ప్రవేశించిన ‘హార్ట్‌బ్లీడ్ వైరస్‌‘
 అత్యంత ప్రమాదకరమైన హార్ట్‌బ్లీడ్ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తోంది. హార్ట్‌బ్లీడ్ వైరస్‌తో లక్షలాది పాస్‌వర్‌‌డలు,  క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని హ్యాకర్లు తేలిగ్గా చేజిక్కించుకోగలుగుతారు. హ్యాకింగ్‌పై పోరాడుతున్న భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం ఈ వైరస్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుమానిత ఈ-మెయిళ్లు, సందేశాలు,ఆడియో, వీడియో క్లిప్‌లు, ఈ-లింకులను వెంటనే తొలగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, ఓపెన్ ఎస్.ఎస్.ఎల్ ను 1.0.1జి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్,ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సైబర్ భద్రతా సంస్థ సూచిస్తోంది.
 
 ఉత్తమ రైల్వే స్టేషన్లు
 దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో విజయవాడ ఉత్తమస్టేషన్‌గా ఎంపికైంది. అదే విధంగా పునర్నిర్మించిన ప్రాంగణాల్లో ఉత్త మ స్టేషన్ పురస్కారానికి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎంపికైంది. 59వ రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డులను ప్రక టించినట్లు రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు.
 
 భారత వృద్ధిని అంచనావేసిన

 ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్
 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.  ఈ  రేటును 2013లో 4.4 శాతం, 2012లో 4.7 శాతంగా పేర్కొంది. 2015-16 వృద్ధిని 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇది లా ఉండగా.. 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఏప్రిల్ 9న విడుదల చేసిన సౌత్ ఏసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బలపడుతున్న రూపాయి మారకపు విలువ, పలు భారీస్థాయి పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం లభించడంతో వృద్ధి రేటులో అనుకూలత చోటుచేసుకుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు తెలిపాయి.
 
 బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
 బ్లాక్-3 రకానికి చెందిన ఆధునీకరించిన అణ్వాయుధ సామర్థ్యం గల సూపర్ సోనిక్  క్షిపణి బ్రహ్మోస్‌ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఏప్రిల్ 7న సైన్యం పరీక్షించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ఈశాన్యప్రాంత రాష్ట్రాల్లో చైనా చొరబాటును ఎదుర్కొనేందుకు పర్వత ప్రాంతాల్లో వినియోగించడానికి అనువుగా బ్లాక్-3 రకానికి చెందిన క్షిపణిని తీర్చిదిద్దారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకొనేందుకు భారత్ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ ను పశ్చిమ బెంగాల్‌లోని పానాఘర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన బ్రహ్మోస్‌ని ఇక్కడే మొహరిస్తారు. బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యానికి అప్పగించారు. దీన్ని ఉపరితలం, జలాంతర్గామి, ఆకాశం నుంచి ప్రయోగించేందుకు అనువుగా రూపొందించారు. బ్రహ్మోస్‌ను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
 
 
 వార్తల్లో వ్యక్తులు
 విజ్డ్డన్ ముఖచిత్రంపై సచిన్
 విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్-2014 పుస్తకం 151వ సంచిక ముఖచిత్రంపై భారత మాజీ క్రికెటర్ సచిన్‌టెండూల్కర్ చిత్రాన్ని ప్రచురించింది. తద్వారా ఈ అల్మనాక్ పుస్తకంపై ముఖచిత్రంగా ప్రచురితమైన తొలి భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఈ పుస్తకం ఏప్రిల్ 10న లండన్‌లో విడుదలైంది.
 
 ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా
 సీజేగా జస్టిస్ రోహిణి
 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్రకెక్కారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తికి దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏప్రిల్ 11న ఆమోదముద్ర వేశారు.
 
 సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోథా
 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోథా (64) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 27న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం తరువాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.ఎం.లోథాయే అత్యంత సీనియర్ న్యాయమూర్తి. వయో పరిమితి రీత్యా లోథా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనుండటంతో ఐదు నెలల కాలమే ఈ పదవిలో కొనసాగనున్నారు. జోధ్‌పూర్‌లో జన్మించిన లోథా రాజస్థాన్, బాంబే హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పాట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 డిసెంబర్ 27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు బృందానికి లోథాయే నేతృత్వం వహిస్తున్నారు. ఔషధ పరీక్షలకు సంబంధించిన కేసులనూ ఆయన నేతృత్వంలో ధర్మాసనమే విచారించింది. అలాగే మైనారిటీ పాఠశాలల్లో విద్యా విధానాలను పరిశీలించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలోనూ లోథా ఉన్నారు.
 
 నాస్కామ్ చైర్మన్‌గా ఆర్.చంద్రశేఖరన్
 కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛీఫ్‌మేనేజింగ్ డెరైక్టర్ అయిన బీవీఆర్ మోహన్‌రెడ్డి నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
 
 
 అవార్డులు
 గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
 ప్రముఖ కవి, సినీ గేయరచయిత, దర్శక-నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు, కథ, మాటల రచయితగా , దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ పురస్కారాన్ని అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. అవార్డు కింద రూ. 10 లక్షల నగదుతోపాటు స్వర్ణకమలం అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్‌సర్‌లో స్థిరపడింది. 2002లో ఆయనకు సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు గాను ఏఆర్‌రెహ్మాన్‌తో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది.
 
 రతన్‌టాటాకు బ్రిటిష్ అవార్డు
 టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్
 టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాస్ లభించింది. బ్రిటన్, భారత్‌ల మధ్య సంబంధాలు, బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ఏప్రిల్10న ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీస్ వెల్లడించింది. 2014కి ఐదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటీష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్‌టాటా ఒకరు. 2009లో టాటాకు నైట్ కమాండర్ అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది.
 
 విజయ్ శేషాద్రికి పులిట్జర్
  భారత సంతతికి చెందిన విజయ్‌శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. శేషాద్రి కవితా సంకలనం ‘3-సెక్షన్స్’ కుగాను ఈ పురస్కారం లభించింది. 98 వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ఎంపిక కమిటీ జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రకటించింది. అవార్డు కింద 10 వేల డాలర్లను అందజేస్తారు. శేషాద్రి 1954లో బెంగళూర్‌లో జన్మించారు. అమెరికాలోని కొలంబియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో సారాలారెన్స్‌లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో పద్యవిభాగంలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు.
 
 
 అంతర్జాతీయం
 స్వాతంత్య్రం ప్రకటించుకున్న
 తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్
 తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్‌లో రష్యా అనుకూల కార్యకర్తలు ఏప్రిల్ 7న ఉక్రెయిన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. డొనెస్క్‌లోని ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ డొనెస్క్‌ను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ నుంచి విడిపోతున్న్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజాభిప్రాయం సేకరించి మే 11 లోగా రష్యాలో చేరాలని పీపుల్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement