![Malayalam poet Akkitham wins Jnanpith Award 2019 - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/30/namb.jpg.webp?itok=n9PfPjit)
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘అక్కితమ్ అరుదైన సాహితీవేత్త. కలకాలం నిలిచిపోయే ఎన్నో రచనలు చేశారు. ఆయన కవిత్వం అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్వికత, నైతిక విలువలకు, సంప్రదాయం, ఆధునికతకు వారధిగా ఆయన కవిత్వం నిలుస్తుంది.
వేగంగా మారుతున్న సమాజంలో మానవ భావోద్వేగాలకు ఆయన కవిత్వం అద్దంపడుతుంది’ అని జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలో 1926లో జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అక్కితమ్ ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment