తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుబాళిస్తున్న ఉస్మానియా కళాశాల
నేడు అంతర్జాతీయ సాహితీ సదస్సు ప్రారంభం
దేశ, విదేశీ ప్రముఖ రచయితల హాజరు
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ప్రాంగణంలో ఒకప్పుడు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత తెలుగు సాహితీ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ పద్యం మారుమోగింది. నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ కవిత నిప్పులు చెరిగింది. నరాల రామారెడ్డి పద్యం ప్రేక్షకుల గుండెలను సుతిమెత్తగా సృశించింది. సాహితీవనంలో వాసంత సమీరాలైన షేక్ దావూద్, ఆచార్య ఎన్‌వి.కృష్ణమూర్తి, మేడూరి వెంకటసుబ్బయ్యల మధురమైన గళం నేటికీ ఆ ప్రాంగణంలో మారు మోగుతూనే ఉంది. రాయలసీమకే తొలి డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన ఉస్మానియా కళాశాల ప్రాంగణంలో సాహితీ సుగంధం అలుముకుని ఉంది. 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ కళాశాల ప్రాంగణంలో మంగళవారం తెలుగు భాష, సాహితీ సంస్కృతులపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమవుతోంది. ఉస్మానియా కళాశాలలో తెలుగు, సంస్కృత భాషల్లో ఉద్దండులైన ఉత్తమ అధ్యాపకులు షేక్ దావూద్ కవి, మేడూరి వెంకటసుబ్బయ్య, ఆచార్య ఎన్‌వి.కృష్ణమూర్తి, గాలి నారాయణరావు, ప్రొఫెసర్ కేఎస్‌ఎస్.శర్మ, రామచంద్రారావు, వరప్రసాద్, కాద్రి, గౌరీశ్వరప్పలు పని చేశారు. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తెలుగు సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు నిర్వహించి ఉస్మానియా ప్రాంగణంలో సాహితీ సుగంధాన్ని వెదజల్లారు.
తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో ఈ కళాశాలలో ఎన్నెన్నో అద్వితీయమైన సాహిత్యోపన్యాసాలు, సాహిత్య సమ్మేళనాలు జరిగాయి. 1960 దశకం నుంచి ఏటేటా కళాశాల వార్షికోత్సవాలు, ఆ వార్షికోత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించి విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. అలనాటి ముఖ్యమంత్రి సాహితీవేత్త దామోదరం అంజయ్య, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి రాజకీయ దురంధరులు సైతం ఉస్మానియా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా కళాశాలలో ప్రస్తుత తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు మంగళవారం ప్రారంభం కానున్నది. ప్రపంచీకరణ-తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ భాషల మనుగడ అనే ప్రధాన అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధులైన కవులు, రచయితలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విశ్వనాథ, శ్రీశ్రీల సాహిత్య సభలు..
తెలుగు సాహిత్య వినీలాకాశంలో విద్యుల్లతలై మెరిసిన విశ్వనాథ సత్యనారాయణ ఉస్మానియా కళాశాలలో జరిగిన సాహితీ సభలో పాల్గొన్నారు. ఆచార్య ఎన్‌వి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఒక సభలో మహాకవి శ్రీశ్రీ పాల్గొని ప్రసంగించారు. 1980 దశకంలో గానగంధర్వగా పేరు గాంచిన రాజన్న కవి, శతావధాని నరాల రామారెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ ముకురాల రామారెడ్డి తదితరులు పాల్గొని ఆధునిక కవిత పట్ల ఆసక్తి పెంపొందించే సాహిత్యోపన్యాసాలు చేశారు. కళాశాలలోని ఆంగ్ల అధ్యాపకులు ప్రొఫెసర్ కేఎస్‌ఎస్.శర్మ ప్రతి క్లాసులో శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని కవితలు వల్లె వేస్తూ విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. 1969లో హైదరాబాద్ ప్రిన్స్ మొకర్రంజా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు కృష్ణ, చంద్రమోహన్‌లు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
రెండు రోజుల సదస్సులో మహా మహులు
ప్రపంచీకరణ తెలుగు భాషా సంస్కృతులపై జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో మాజీ మంత్రి టీజీ వెంకటేష్, అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, రాయలసీమ యూనివర్సిటీ వీసీ కృష్ణానాయక్, ఉస్మానియా విద్యా సంస్థల కరస్పాండెంట్ అజ్రాజావేద్, సీఐఎల్ మైసూరు డెరైక్టర్ అవదేశ్‌కుమార్ మిశ్రా, ప్రముఖ సాహితీ విమర్శకులు యోగి వేమన యూనివర్శిటీ తెలుగు శాఖాధిపతి రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి మాడభూషి సంపత్‌కుమార్, మారిషస్ ఆంధ్ర లలిత కళా సమితి అధ్యక్షులు సంజీవ నరసింహ అప్పడు, ఆర్‌యు రిజిస్ట్రార్ పుణ్యశేషుడు పాల్గొనున్నారు. సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు ఈ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలి.
- డాక్టర్ ఎం.అన్వర్ హుసేన్, హెచ్‌ఓడీ, తెలుగు శాఖ,ఉస్మానియా కళాశాల
డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే..
కర్నూలులో 1901 ఫిబ్రవరి 21న ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే ఉస్మానియా కళాశాల. 1912లో కర్నూలులోని మునిసిపల్ హైస్కూల్(మెయిన్)లో ఆయన పాఠశాల విద్యను అభ్యసించారు. మద్రాసు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డి.ఫిల్ పట్టా పొందారు. మద్రాసులోని మహమ్మదన్ కళాశాలలో అధ్యాపకులుగా, ప్రెసిడెన్సి కళాశాల అధ్యక్షులుగా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి, ప్రొఫెసర్ వైస్ చాన్స్‌లర్‌గా, ఉమ్మడి మద్రాస్‌రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులుగా పని చేసిన అబ్దుల్ హఖ్ కర్నూలు విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల స్థాపించాలని సంకల్పించారు. 1947లో అబ్దుల్ హఖ్ రాయలసీమ వాసుల ఉన్నత విద్య కోసం తొలిసారిగా ఉస్మానియా డిగ్రీ కళాశాలను స్థాపించారు. హంద్రీనదీ తీరంలో చారిత్రాత్మకమైన గోల్ గుంబజ్ కట్టడం పక్కనే అత్యంత ఆకర్షణీయంగా నిర్మింతమైన ఉస్మానియా కళాశాల అలనాటి విద్యార్థుల ఉన్నత విద్యా కలల సౌధమై నిలిచింది.
సాహితీ బృందావనం
Published Tue, Feb 25 2014 3:00 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement