Telugu literary figure
-
కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్ర ‘కలలు–కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచన. ఎనిమిది దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో మమేకమైన ఒక మహాకవి మనసుతో వ్యక్తీకరిం చిన అరుదైన ఆత్మకథ. స్వాతంత్య్రోద్యమ పూర్వం నాటి పరిస్థి తులు మొదలుకొని ఆధునిక కాలంలో వెల్లువెత్తిన అనేక అభ్యుదయ ఉద్యమాలకు సోమసుందర్ ప్రత్యక్ష సాక్షి. అందుకేనేమో వజ్రాయుధ కవిగానే కాక విలక్షణమైన విమర్శకుడిగా, ‘కళాకేళి’ పత్రికా స్థాపకునిగా, కమ్యూనిస్టు ఉద్యమశీలిగా, అన్నింటినీ మించి నిరంతర స్వాప్నికుడిగా కలకాలం జీవించారు.కవులు జీవిత చరిత్రలు రాసి మెప్పించడం అరుదు. తెలుగులో ఆ సంఖ్య మరీ తక్కువ. అలాంటిది రెండు భాగాలుగా ఆత్మకథను రాసి... ముఖ్యంగా మొదటి భాగంలో అసాధారణ రచనా కౌశలాన్ని చూపిన ఘనత సోమసుందర్కే చెల్లుతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2005లో ‘కళాకేళి’ తరపున ప్రచురించిన ‘కలలు – కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ఒక అద్భుతమైన అక్షర కళా శిల్పం.‘నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక... మొదటి జ్ఞాపకం మా అమ్మ... మలి జ్ఞాపకమూ మా అమ్మే. అందుకే మాతృవందనంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాను. మా అమ్మే నిరంతర స్మృతి వీచిక... మా అమ్మ నన్ను విడిచి వెళ్ళకముందే నేను మా అమ్మను విడిచి వెళ్ళిపోయాను; దూరంగా... అనంతంగా... సుదీర్ఘమైన ఎడబాటుగా. బాట మారింది. ఉనికి మారింది. ఆశ్రయం మారింది. అమ్మా మారింది...’1924 నవంబరు 18న శంఖవరంలో పుట్టినప్పటికీ, బాల్యంలోనే దత్తునిగా పిఠాపురానికి వలస వచ్చిన పసి జ్ఞాపకాల్ని స్పృశిస్తూ ఆత్మకథలో సోమసుందర్ రాసిన ఆరంభ వాక్యాలు ఇవి. నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి ఎడబాటుకు లోనైన పసి హృదయం బహుశా ఆనాడే కార్చిన కన్నీటి ధారల్ని కవితా పంక్తులుగా మార్చే ప్రక్రియను అభ్యసించి ఉంటుంది. భవిష్యత్తులో శ్రామిక వర్గం తరఫున ప్రాతి నిధ్యం వహించే బలమైన వజ్రా యుధ కలం ఆవిర్భావానికి అంకురార్పణ ఆనాడే జరిగిందేమో!మూడొందల పుటల ‘కలలు–కన్నీళ్ళు’ ఆత్మకథ అంతా ఒకెత్తయితే, దీనికి సో.సు. రాసిన ఐదు పుటల ముందుమాట ఒకటీ ఒకెత్తు. రూసో మహాశయుడి మాట, ‘రెక్కల చేప కథ విప్పింది’అంటూ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ కవులు, రచయి తలు, మేధావుల ఆత్మ కథలను స్థూలంగా పాఠకుడికి పరిచయం చేశారు. అలా చేస్తూనే స్వీయచరిత్ర రాయటం ఎంత కష్టమో వివరించారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలు మొదలు వర్జీనియా ఉల్ఫ్, జీన్‌పాల్ సార్త్రే వంటి పాశ్చాత్య మేధావుల స్వీయ చరిత్రల్ని గురించి చెబుతారు. అవి కాక, ఏనుగుల వీరాస్వామి, కందుకూరి వీరేశలింగం, చలం వంటి వారి ఆత్మకథల గురించి కూడా తడుముతారు. ఇన్నింటిలోకీ సో.సు.ను ప్రభావితం చేసింది మాత్రం డామ్ మోరీస్ రాసిన ‘మై సన్స్ ఫాదర్’ అనే ఆత్మకథ. సోమసుందర్ అనితర సాధ్యమైన అధ్యయనశీలతకి ఈ మున్నుడే ఒక ప్రతీక. ముందు మాటకి ముగింపుగా సో.సు, ‘నా చేతిలోని లేఖినిని మృత్యువు తప్ప వేరెవ్వరూ అపహరించలేరని’ అంటారు. అలా అన్న మాటల్ని నిలుపుకొని 2016 ఆగష్టు 16న చివరి శ్వాస వరకూ విస్తృతమైన సారస్వత సేవ కావించిన అరుదైన ప్రజాకవి సోమసుందర్.అల్లూరి సీతారామరాజుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబ నేపథ్యం నుండీ అల్లారు ముద్దుగా సంస్కృత శ్లోకాలు, సంగీత కచేరీలు, నాటకాలు, సినిమాలు, కౌమార ప్రేమ కలాపాలు... ఇలా ఒకటేమిటి ఎన్నో వర్ణాలు మనకి సో.సు. జీవితంలో కనబడతాయి. హైస్కూల్ విద్యార్థిగా స్టూడెంట్ యూనియన్ సభలకని కోల్ కతా వెళ్ళినప్పుడు హౌరా బ్రిడ్జి మీద చూసిన జీవచ్ఛవానికి కలత చెంది నవ యువకుడు పట్టిన కలం, కట్టిన కవిత తెలుగు నేలమీద దశాబ్దాల పాటు వెల్లువలా సాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదమై రగిలింది. ‘హే నిజాం పాదుషా, ఖబడ్దార్ !’ అని హెచ్చరించింది. నిషేధానికి గురై చరిత్ర సృష్టించింది.చదవండి: గల్ఫ్ వలస జీవిత సారం‘కవిత్వమూ, కమ్యూనిజమూ తప్ప మరే ధ్యాసా నాకు లేదు’ అని తన ఆత్మకథలో ప్రకటించుకున్న సో.సు. జీవితాన్ని ఆ రెంటికే అంకితం చేశారు. సుమారు ముప్పై మూడు భాగాల్లో ఎన్నెన్నో అపురూప విషయాల్ని నమోదు చేశారు. పిఠాపురం సంస్థానంలో సాహిత్య వాతావరణం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన అభ్యుదయ కవిత్వోద్యమం వరకూ ఎంతో హృద్యంగా చెప్పారు. హైదరాబాదు కవి మిత్రుల నుండీ మద్రాసు మేధాసాంస్కృతిక స్రవంతి దాక, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి వారితో అనుభవాలు, మిత్రులతో చేసిన ఉత్తర భారత యాత్రా విశేషాలు... ఒక్కటేమిటి తన జీవన చిత్రంలోని గాఢమైన రంగులన్నిటినీ ఆత్మకథ రూపంలో పాఠక లోకానికి అందించారు సో.సు. అయితే, ఎందుకనో తెలీదు కానీ సోమసుందర్ స్వీయచరిత్రకి రావాల్సిన గుర్తింపు సాహితీ లోకంలో సైతం రాలేదు.చదవండి: వెనక్కి నడవమంటున్నారా?విశాలమైన పచ్చిక బయళ్ళ పైన పిండార బోసినట్లు ‘నా జీవితంలో మంచిపనులు ఎన్ని చేశానో అంతకు మించిన చెడ్డ పనులు చేశాను. అందుకే మంచి పనులు సవిస్తరంగా ఏకరువు పెట్టలేదు. చెడ్డపనులు మచ్చుకు కొన్నే చెప్పకుండా విడిచిపెట్టనూలేదు. అసలు జీవితం అంటే ఏమిటి? చెడ్డ పనులు రహస్యంగా చేసు కుంటూ పోవడం. మంచి పనులు తక్కువే అయినా బహి రంగంగా చేయడం...’ అని చెప్పుకున్న సోమసుందర్ ధైర్యాన్ని, పారదర్శకతను చదివి అంగీకరించి, స్వీకరించేందుకు కూడా కొంత సాహసం కావాలేమో అనిపిస్తుంది. బహుశా అందుకనే వృద్ధాప్యంలో డిక్టేట్ చేసి రాయించిన సో.సు. స్వీయచరిత్ర రెండో భాగం ‘పూలు, ముళ్ళు’ అంతగా కదిలించదు. ఏదో భారంగా రాసినట్టు సాగుతుంది. ఇదంతా ఒకెత్తయితే ఏకకాలంలో కవిగా, కార్య కర్తగా కూడా మసిలిన ఆయన కార్యదీక్ష ఒక్కటీ ఒకెత్తు. స్వాతంత్య్రం వచ్చే నాటికి జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా ఈ దేశంలో సోషలిజం కోసం నిబద్ధతతో కృషి చేసిన సో.సు. తర్వాత కాలంలో పూర్తిస్థాయి సాహితీవేత్తగా మారారు.ప్రజా చైతన్యమే లక్ష్యంగా సకల సాహితీ ప్రక్రియలను ప్రయోగించారు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి ఎందరో యువకవుల్నీ, రచయితల్నీ పురస్కారాలతో ప్రోత్సహించారు. శతాధిక గ్రంథాల్ని రచించి తెలుగులో ఎన్నదగిన అభ్యుదయ దిక్సూచిగా భాసించారు. ఆయన స్పూర్తిని అందుకుని కొనసాగించగలగడమే మహాకవి ఆవంత్స సోమసుందర్‌కు మనం ఇచ్చే అర్థవంతమైన ఆత్మీయ నివాళి.- గౌరవ్ సామాజిక కార్యకర్త (నేడు ఆవంత్స సోమసుందర్ శతజయంతి) -
సాహితీ బృందావనం
తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుబాళిస్తున్న ఉస్మానియా కళాశాల నేడు అంతర్జాతీయ సాహితీ సదస్సు ప్రారంభం దేశ, విదేశీ ప్రముఖ రచయితల హాజరు కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ప్రాంగణంలో ఒకప్పుడు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత తెలుగు సాహితీ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ పద్యం మారుమోగింది. నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ కవిత నిప్పులు చెరిగింది. నరాల రామారెడ్డి పద్యం ప్రేక్షకుల గుండెలను సుతిమెత్తగా సృశించింది. సాహితీవనంలో వాసంత సమీరాలైన షేక్ దావూద్, ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి, మేడూరి వెంకటసుబ్బయ్యల మధురమైన గళం నేటికీ ఆ ప్రాంగణంలో మారు మోగుతూనే ఉంది. రాయలసీమకే తొలి డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన ఉస్మానియా కళాశాల ప్రాంగణంలో సాహితీ సుగంధం అలుముకుని ఉంది. 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ కళాశాల ప్రాంగణంలో మంగళవారం తెలుగు భాష, సాహితీ సంస్కృతులపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమవుతోంది. ఉస్మానియా కళాశాలలో తెలుగు, సంస్కృత భాషల్లో ఉద్దండులైన ఉత్తమ అధ్యాపకులు షేక్ దావూద్ కవి, మేడూరి వెంకటసుబ్బయ్య, ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి, గాలి నారాయణరావు, ప్రొఫెసర్ కేఎస్ఎస్.శర్మ, రామచంద్రారావు, వరప్రసాద్, కాద్రి, గౌరీశ్వరప్పలు పని చేశారు. తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తెలుగు సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు నిర్వహించి ఉస్మానియా ప్రాంగణంలో సాహితీ సుగంధాన్ని వెదజల్లారు. తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో ఈ కళాశాలలో ఎన్నెన్నో అద్వితీయమైన సాహిత్యోపన్యాసాలు, సాహిత్య సమ్మేళనాలు జరిగాయి. 1960 దశకం నుంచి ఏటేటా కళాశాల వార్షికోత్సవాలు, ఆ వార్షికోత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు, విద్యావేత్తలు పాల్గొని ప్రసంగించి విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. అలనాటి ముఖ్యమంత్రి సాహితీవేత్త దామోదరం అంజయ్య, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి రాజకీయ దురంధరులు సైతం ఉస్మానియా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా కళాశాలలో ప్రస్తుత తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు మంగళవారం ప్రారంభం కానున్నది. ప్రపంచీకరణ-తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ భాషల మనుగడ అనే ప్రధాన అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధులైన కవులు, రచయితలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశ్వనాథ, శ్రీశ్రీల సాహిత్య సభలు.. తెలుగు సాహిత్య వినీలాకాశంలో విద్యుల్లతలై మెరిసిన విశ్వనాథ సత్యనారాయణ ఉస్మానియా కళాశాలలో జరిగిన సాహితీ సభలో పాల్గొన్నారు. ఆచార్య ఎన్వి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఒక సభలో మహాకవి శ్రీశ్రీ పాల్గొని ప్రసంగించారు. 1980 దశకంలో గానగంధర్వగా పేరు గాంచిన రాజన్న కవి, శతావధాని నరాల రామారెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ ముకురాల రామారెడ్డి తదితరులు పాల్గొని ఆధునిక కవిత పట్ల ఆసక్తి పెంపొందించే సాహిత్యోపన్యాసాలు చేశారు. కళాశాలలోని ఆంగ్ల అధ్యాపకులు ప్రొఫెసర్ కేఎస్ఎస్.శర్మ ప్రతి క్లాసులో శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని కవితలు వల్లె వేస్తూ విద్యార్థులను ఉత్తేజ పరిచేవారు. 1969లో హైదరాబాద్ ప్రిన్స్ మొకర్రంజా కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు కృష్ణ, చంద్రమోహన్లు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. రెండు రోజుల సదస్సులో మహా మహులు ప్రపంచీకరణ తెలుగు భాషా సంస్కృతులపై జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో మాజీ మంత్రి టీజీ వెంకటేష్, అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, రాయలసీమ యూనివర్సిటీ వీసీ కృష్ణానాయక్, ఉస్మానియా విద్యా సంస్థల కరస్పాండెంట్ అజ్రాజావేద్, సీఐఎల్ మైసూరు డెరైక్టర్ అవదేశ్‌కుమార్ మిశ్రా, ప్రముఖ సాహితీ విమర్శకులు యోగి వేమన యూనివర్శిటీ తెలుగు శాఖాధిపతి రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి మాడభూషి సంపత్‌కుమార్, మారిషస్ ఆంధ్ర లలిత కళా సమితి అధ్యక్షులు సంజీవ నరసింహ అప్పడు, ఆర్యు రిజిస్ట్రార్ పుణ్యశేషుడు పాల్గొనున్నారు. సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు ఈ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలి. - డాక్టర్ ఎం.అన్వర్ హుసేన్, హెచ్ఓడీ, తెలుగు శాఖ,ఉస్మానియా కళాశాల డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే.. కర్నూలులో 1901 ఫిబ్రవరి 21న ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ హఖ్ కృషి ఫలితమే ఉస్మానియా కళాశాల. 1912లో కర్నూలులోని మునిసిపల్ హైస్కూల్(మెయిన్)లో ఆయన పాఠశాల విద్యను అభ్యసించారు. మద్రాసు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డి.ఫిల్ పట్టా పొందారు. మద్రాసులోని మహమ్మదన్ కళాశాలలో అధ్యాపకులుగా, ప్రెసిడెన్సి కళాశాల అధ్యక్షులుగా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి, ప్రొఫెసర్ వైస్ చాన్స్‌లర్‌గా, ఉమ్మడి మద్రాస్రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులుగా పని చేసిన అబ్దుల్ హఖ్ కర్నూలు విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల స్థాపించాలని సంకల్పించారు. 1947లో అబ్దుల్ హఖ్ రాయలసీమ వాసుల ఉన్నత విద్య కోసం తొలిసారిగా ఉస్మానియా డిగ్రీ కళాశాలను స్థాపించారు. హంద్రీనదీ తీరంలో చారిత్రాత్మకమైన గోల్ గుంబజ్ కట్టడం పక్కనే అత్యంత ఆకర్షణీయంగా నిర్మింతమైన ఉస్మానియా కళాశాల అలనాటి విద్యార్థుల ఉన్నత విద్యా కలల సౌధమై నిలిచింది.