రెచ్చగొట్టడం బాబు డిక్షనరీలోనే ఉంది: కోదండరాం
హైదరాబాద్: రెచ్చగొట్టడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిక్షనరీలోనే ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. తెలంగాణపై విషం కక్కడాన్ని బాబు ఇంకా మానుకోలేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెచ్చగొట్టడం జేఏసీ డిక్షనరీలోనే లేదన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినాన్నిఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ‘‘జూన్ ఒకటి రాత్రి 8 గంటలకు అమరవీరులకు నివాళులర్పిస్తాం. జేఏసీ జెండా ఎగరేస్తాం. ఆ రాత్రంతా తెలంగాణ ధూంధాం తో సంబురాలు జరుపుకుంటాం’’ అని తెలిపారు. జూన్ 2న ఎవరికి తోచినట్టు వారు సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జేఏసీ నేత సి.విఠల్‌ను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించడాన్ని నిరసిస్తున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామని చెప్పారు.
జేఏసీ నేతలకు టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనడం సరికాదన్నారు. కేసీఆర్ మావాడే. ఆయనను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుస్తాం. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు’’ అని చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఉద్యోగులంతా అమరవీరులకు నివాళులర్పించి విధులకు హాజరు కావాలని జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్ కోరారు. మల్లేపల్లి లక్ష్మయ్య, పి.రఘు, విఠల్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.