తెలంగాణపై చంద్రబాబు కుట్ర
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పడ్డా ఆంధ్రపాలకుల కుట్రలు ఆగలేదని, 2019లో టీడీపీ తెలంగాణలో అధికారంలో వస్తుందని చెప్పడం ఇందుకు ఉదాహరణ అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇలాంటివి తెలంగాణ ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రచించిన ‘తెలంగాణ జైత్రయాత్ర’ గ్రంథావిష్కరణ సభ ఆదివారం బొగ్గులకుంటలోని ఆంధ్రసారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి ఆంధ్రపాలకులు ఢిల్లీలో ఉన్న సంబంధాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని నడవనివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఇది తెలంగాణకు ప్రమాదకరమన్నారు.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని ఆయన కోరారు. చంద్రబాబుకు అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలేనని, కానీ ప్రజల జీవన ప్రమాణాలు మారేదే అసలైన అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలోని కీలక ఘట్టాలు, లోటుపాట్లను వర్ణించి, సూత్రీకరించి, సిద్ధాంతీకరణ చేసే వ్యాసాలు రాయడంలో దిట్ట ఘంటా చక్రపాణి అని పేర్కొన్నారు. కీలకమైన ఉద్యమాలు జరిగే సందర్భంలో వీటిపై వ్యాసాలు రాయాలని పలువురిని కోరామని, చక్రపాణి ఉద్యమంలో లోటుపాట్లపై తెలంగాణ కోణంలో వ్యాసాలు రాసారన్నారు. అవి సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మెకు ఎంతో దోహాదపడ్డాయని కోదండరాం గుర్తుచేశారు.
తెలంగాణ రాకమునుపు ఏ సమస్యపై మాట్లాడాలన్నా భయం ఉండేదని, ఇప్పుడు ఆ భయం లేదన్నారు. సీహెచ్.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉండేలా పరిపాలన ఉండాలన్నారు. నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రాష్ట్రం కొత్త జీవం పుంజుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త విఎస్.ప్రసాద్, విరసం నేత వరవరవరావు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్, విమలక్క పాడిన గీతాలు అలరించాయి.