మేమున్నామని... | this is a real story to Devika | Sakshi
Sakshi News home page

మేమున్నామని...

Published Tue, Jun 28 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

మేమున్నామని...

మేమున్నామని...

బండి చక్రాలు రెండూ విరిగిపోతే గమ్యమే కాదు, మార్గం కూడా శూన్యం అనిపిస్తుంది. బలమైన వాళ్లయితే ఇరిగిన చక్రాల బండిని కూడా లాక్కెళ్లగలుగుతారు. శక్తి లేని చిన్నారి దేవిక బండి... కదిలే పరిస్థితిలో లేదు. బతుకు బండి, చదువుల బండి, భవిష్యత్తు బండి.. అన్నీ ఆగిపోయాయి. క్లాస్‌మేట్సే ఈ బండిని, బాటసారినిభుజానికెత్తుకుని ముందుకు నడిపిస్తున్నారు.

 

కంబాలపల్లి శివారు సండ్రలగూడెంకు చెందిన అమ్మాయి ఈసం దేవిక. కంబాలపల్లి జిల్లాపరిషత్  సెంకడరీ పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఎమినిదవ తరగతి చదువుతోంది. దేవిక తండ్రి ఈసం  రమేశ్ హైదరాబాద్‌లో లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2012లో కాలు ఎముక విరగడంతో సండ్రలగూడెంకు వచ్చాడు. చికిత్స తీసుకుంటూనే మూడు నెలలకు అంటే ఏప్రిల్ 9న మరణించాడు. దేవిక తల్లి యశోద గృహిణి. ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతూ 2015, డిసెంబర్‌లో చనిపోయింది. ఆ దంపతుల ఏకైక కుమార్తె దేవికే కావడంతో ఆ ఇద్దరికీ ఈ చిన్నారే తలకొరివి పెట్టి జన్మరుణం తీర్చుకుంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఏకాకైన దేవిక తాత, మేనమామల పంచన చేరింది.

 
దేవిక తలిదండ్రులకు సండ్రలగూడెంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి,  తాటాకుల గోడలు, రేకుల పైకప్పుతో ఒక్క గది ఇల్లు ఉన్నాయి. వర్షం వస్తే బురదమయమే ఆ ఇల్లు. ఇదీ దేవిక నేపథ్యం!

 
వారం కిందట..

కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అంకటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు తాను దత్తత తీసుకున్న పేద విద్యార్థులు  వల్లపు లావణ్య, హరిచంద్రప్రసాద్‌కు బ్యాగులు, చెప్పులు, నోట్ పుస్తకాలు, జామెట్రికల్ బాక్సు, డిక్షనరీ ఇచ్చారు. అప్పుడు దేవిక తన తల్లిదండ్రులు బతికి ఉంటే తనకూ ఇవన్నీ కొనిపెట్టేవారని బాధపడింది. అమ్మానాన్నను తలచుకొని ఏడ్చింది. ఈ విషయాన్ని ఆమె తోటి విద్యార్థులైన వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష, సుమాలిక, ప్రియాంక, ఉమామహేశ్వరి గమనించారు. ఎలాగైన దేవిక బాధను దూరం చేయాలని అనుకున్నారు. దేవికకు తమ వంతు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. తమ తరగతిలోని 47 మంది విద్యార్థులతో తమ ఆలోచనను పంచుకున్నారు. వాళ్ల నిర్ణయానికి ముక్తకంఠంతో మద్దతు తెలిపారు తోటి విద్యార్థులు. అంతే  పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులెవరికీ చెప్పకుండా   47 మంది క్లాస్‌మేట్స్  కలిసి కొంత మొత్తం డబ్బును సమకూర్చారు. నోట్‌బుక్స్, దేవిక చదువుకోవడానికి ఉపయోగపడే ఇతర సామాగ్రిని అంటే తమ తల్లిదండ్రులు తమకు కొనిపెట్టిన వస్తువులన్నిటినీ దేవిక కోసం కొన్నారు ఆ పిల్లలు.

 
నాలుగురోజుల కిందట...

ఉదయం బడిలో ప్రార్థనా సమయమప్పుడు వాటన్నిటినీ ప్రధాన ఉపాధ్యాయుడు మైస శ్రీనివాసులు, పీఈటీ పిల్లి కాశీనాథ్ సమక్షంలో దేవికకు అందజేశారు. ఎనిదవ తరగతి విద్యార్థుల ఈ చొరవకు  ఉపాధ్యాయ బృందంమంతా ఆనందాశ్చర్యాలకు లోనయింది. ఆ పిల్లల పెద్ద మనసు చదువుచెప్పే పెద్దలను కదిలించింది. తోటి మనిషికి చేయూనందించే విషయంలో స్ఫూర్తి పాఠం నేర్పించింది. అందుకే వాళ్ల  క్లాస్‌టీచర్ గురునాథరావు వెంటనే స్పందించి దేవికకు స్కూల్ బ్యాగ్‌ను కొనిపెట్టారు.  ‘మా దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలు చేసిన ఈ గొప్ప పని చూస్తుంటే నిజంగా మాకు గర్వంగా ఉంది. వాళ్ల పెద్ద మనసు మాకూ ప్రేరణే! నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వం ఉన్న మనిషనని నిరూపించుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు మా పిల్లలు చేసింది అదే. ఈ సంఘటనతో మమ్మల్ని కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు మా పిల్లలు. మేం చెప్పే పాఠాలే కాదు మా ఆలోచనా ధోరణి కూడా ముఖ్యమే అన్న విషయాన్ని గుర్తు చేశారు. గురువుల బాధ్యత పెంచారు!’ అన్నారు గురునాథరావు.

 
బాధ అనిపించింది...

‘‘వెంకటేశ్వర్లు సార్ పుస్తకాలు డొనేట్ చేస్తున్నప్పుడు దేవిక పక్కకు వెళ్లి ఏడ్వడం మాకు మస్తు బాధనిపించింది. తనను చూసుకోవడానికి అమ్మానాన్న లేరనే కదా అట్లా ఏడ్చింది అనుకున్నాం. అమ్మానాన్న లేకపోతే ఏంది.. మనమున్నం కదా.. దేవికకు కావల్సినవి మనమే కొనిద్దాం అని మాట్లాడుకున్నం. మా క్లాస్‌మేట్స్ అందరూ ఒప్పుకున్నరు. దేవికకు మేమందరం తోడున్నమని చెప్పడానికే ఈ సహాయం చేసినం అంతే’ అన్నారు ఈ సాయానికి సారథ్యం వహించిన  వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష.  ‘ఆమెకు వాళ్ల తాత, మేనమామ ఉన్నా దేవిక అట్లా ఏడిస్తే మాకు మంచిగనిపించలేదు. ఆమె దోస్తులు ఆమెకు ఏదైనా చేయాలనిపించింది’ అన్నారు కల్లాకపటం లేని ఆ చిన్నారులు. దేవికకు 10వ తరగతి వరకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి పాఠశాల పీఈటీ పిల్లి కాశీనాథ్ ముందుకు వచ్చారు. ఇందుకు ఆయనను ఉపాధ్యాయ బృందమంతా అభినందించింది.

 
కంబాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థుల ఈ స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాల కీర్తిని ఇనుమడింపచేసిందని, సర్కారు బడి ప్రగతికి దారివేసిందని కొనియాడారు ఆ స్కూల్ టీచర్లు.  - బోనగిరి శ్రీనివాస్, సాక్షి మహబూబాబాద్ రూరల్, వరంగల్

 

 

మా ఫ్రెండ్స్, టీచర్లే ఆదర్శం
మొదటి నుంచీ మేం పేదోళ్లమే. అయినా మా అమ్మ, నాన్న ఉన్నప్పుడు బాగానే చూసుకునేటోళ్లు. తాత, మేనమామ ఉన్నా అమ్మానాన్న బాగా గుర్తొస్తరు. బాధనిపిస్తుంటుంది. అందుకే ఆ రోజు వెంకటేశ్వర్లు సార్ లావణ్య, హరిశ్చంద్రప్రసాద్‌లను దత్తత తీసుకుని వాళ్లకు అన్ని కొనిస్తుంటే మా అమ్మానాన్న గుర్తొచ్చి బాగా ఏడ్పొచ్చింది. కాని ఆ సంఘటనే నాకు ఫ్రెండ్‌షిప్ వాల్యూని చెప్పింది. తోటివారికి ఎలా హెల్ప్ చేయాలో నేర్పింది. నా లైఫ్‌లో నాకు ఫ్రెండ్స్, మా టీచర్లే ఆదర్శం. అందుకే పెద్దయ్యాక నేనూ టీచర్‌నే కావాలనుకుంటున్నా. పూర్ స్టూడెంట్స్‌కి సహాయం చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిలకు. వీలైనంత వరకు తోటివారికి సహాయడాలనేదే నా లక్ష్యం. ఇప్పుడు నాకు అమ్మానాన్న లేరనే దిగుల్లేదు. నా ఫ్రెండ్స్, టీచర్లే నాకు అన్నీ. నాకు సహాయం చేసి నాకు అండగా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ థాంక్స్. వాళ్లను ఎప్పటికీ మరిచిపోలేను’

  - ఈసం దేవిక

 

ఆ బాధ నాకు తెలుసు
‘నాకు నాన్న లేడు. అమ్మ ఉన్నా నాన్న లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. అట్లాంటిది దేవికకు అమ్మానాన్న ఇద్దరూ లేరు. కాబట్టి ఆమెకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అందుకే దేవిక ఆ లోటు ఫీల్‌కాకుండా చూడాలనే ఫ్రెండ్స్ అందరం అనుకొని ఆమెకు కావల్సినవి కొనిచ్చినం’ - వల్లపు లావణ్య. దేవిక క్లాస్‌మేట్

 

ఇదే ఉదాహరణ
‘తోటి విద్యార్థి కష్టానికి క్లాస్‌లోని పిల్లలంతా స్పందించడం వాళ్లలోని మానవతా విలువకు నిదర్శనం. దీనినే ఆదర్శంగా తీసుకొని ప్రతి బడిలో పాఠ్యపుస్తకాలతోపాటు పిల్లలకు సామాజిక పరిస్థితుల గురించి, నైతిక విలువల గురించీ బోధించాలి.  దేవిక విషయానికి వస్తే టెన్త్ పూర్తయ్యే దాకా ఆమె బాగోగులు మేమే చూసుకుంటాం.  - మైస శ్రీనివాసులుప్రధానోపాధ్యాయుడు

 

బాగా చదువుకోవాలి
తనకు ఎవరూ లేరనే బాధతో, దిగులుతో దేవిక చదువునెక్కడ కేర్‌లెస్ చేస్తుందోనని భయపడ్డాం. ఆమె ఎప్పుడూ బాధపడొద్దని.. బాగా చదువుకోవాలని.. ఏ విషయంలో ఇబ్బందిపడొద్దనే దేవికకు ఈ హెల్ప్ చేసినం’ - గంధసిరి సుమాలిక  దేవిక మరో క్లాస్‌మేట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement