ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ రోజున చాలా విరివిగా వాడుతున్న మాట, ‘బడ్జెట్’. వ్యక్తిగత స్థాయిలో గృహస్థు, లేదా గృహిణి ఎప్పటికప్పుడు జమా, ఖర్చులు బేరీజు వేసుకుంటూ ఒడుపుగా సంసారాన్ని నడపడం కూడా బడ్జెట్ కూర్పు లాంటిదే. ప్రభుత్వాల స్థాయిలో అయితే ఏడాది కాలానికి సరిపోయే ఆదాయ, వ్యయాల ప్రణాళికకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అది యావద్దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది కనుక అన్ని వర్గాలవారూ దానికోసం చకోరపక్షులవుతారు. తీరా వచ్చాక ఆశాభంగాలూ ఉంటాయి, ఆశోద్దీపనలూ ఉంటాయి. ఆ విధంగా బడ్జెట్ ఆర్థికాంశాల కూర్పే కాదు; ఆశ నిరాశల కలగలుపు కూడా! కిందటి వారమే కేంద్రం స్థాయిలో మరో బడ్జెట్ సమర్పణ ముగిసింది కానీ, దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది.
బడ్జెట్ అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడమూ ఆసక్తిదాయకమే. లాటిన్‌లో తోలుసంచీని ‘బుల్గా’ అనేవారు. ఆ మాటే ఫ్రెంచిలో ‘బూజ్’, ‘బగెట్’ అయింది. వాటినుంచే ‘బడ్జెట్’ పుట్టి 15వ శతాబ్ది నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆదాయ, వ్యయాల ముందస్తు ప్రకటన అనే అర్థంలో ఈ మాటను మొదటిసారి 1733లో ఉపయోగించారట. కోశాగార మంత్రి తన ద్రవ్య ప్రణాళికను ఉంచుకునే తోలుసంచీ ‘బడ్జెట్’ అనే మాటను ప్రపంచానికి అందించింది. ఈ రోజున విరివిగా వాడే ‘వాలెట్’, ‘పౌచ్’లు కూడా బడ్జెట్ అనే తోలుసంచీకి లఘురూపాలే.
14వ శతాబ్ది నుంచి వాడుకలో ఉన్న ‘వాలెట్’కు వస్తువులను చుట్టబెట్టేదని అర్థం. ఇది ‘వెల్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలం నుంచి వచ్చింది. విశేషమేమిటంటే, సంస్కృతంలో ‘వలతే’, ‘వలయం’ అనే మాటల మూలాలు కూడా ‘వెల్’లోనే ఉన్నాయని భాషావేత్తలు అంటారు. ‘పౌచ్’ అనే మాటే రకరకాల రూపాల మీదుగా ‘ప్యాకెట్’ అయింది. బడ్జెట్ అనబడే తోలుసంచే బడ్జెట్ రోజున నేటి ఆర్థికమంత్రులు చేతుల్లో బ్రీఫ్ కేస్‌గా మారిన సంగతిని ఊహించడం కష్టం కాదు. బడ్జెట్ వివరాల గోప్యతకు సంకేతంగా కూడా దానిని తీసుకోవచ్చు.
ఆధునిక కాలంలో మన దేశంలో బడ్జెట్ సంప్రదాయం 1860లో మొదలైందనీ, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భారత ఆర్థికమంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్ దానికి నాంది పలికారనీ చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ సమర్పకులు ఆర్.కె.షణ్ముగం చెట్టి కాగా, బడ్జెట్‌కు నేటి రూపూ, రేఖా కల్పించిన ఆర్థిక పండితుడు పి.సి.మహలనోబిస్. అయితే, చరిత్ర కాలానికి వెళితే, మౌర్యుల కాలంలోనే ఒక ఏడాదికి సరిపోయే బడ్జెట్‌నూ, గణాంకాలనూ కూర్చేవారని చరిత్ర నిపుణులంటారు. ఆ కాలానికే చెందిన కౌటిల్యుని అర్థశాస్త్రం దానికి ఆధారం. కాకపోతే, అప్పట్లో ఏడాదికి 354 రోజులు. గురుపూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ నుంచి సంవత్సరాన్ని లెక్కించేవారు.
నేటి బడ్జెట్ తరహా కూర్పే ఇంచుమించుగా అర్థశాస్త్రంలోనూ కనిపిస్తుంది. అర్థమంటే డబ్బు కనుక అర్థశాస్త్రం కేవలం ఆర్థిక విషయాలే చెబుతుందనుకుంటారు కానీ, కౌటిల్యుని ఉద్దేశంలో అర్థమంటే, మనుషుల జీవన విధానానికీ, వారు నివసించే భూమికీ చెందిన అన్ని విషయాలనూ చెప్పేదని– ప్రసిద్ధ సంçస్కృత పండితుడు, అర్థశాస్త్ర వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు అంటారు. అర్థశాస్త్రం ప్రకారం నాటి బడ్జెట్ సంవత్సరాన్ని ‘రాజవర్షం’ అనేవారు. నేటి ఆర్థికమంత్రిని పోలిన అధికారిని ‘సమాహర్త’ అనేవారు. ఏయే ఆదాయ వనరు నుంచి ఎంత ఆదాయం రావాలో నిర్ణయించడం, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం అతని బాధ్యత. ‘ఆయముఖాలు’ అనే పేరుతో ఆదాయాన్ని వర్గీకరించేవారు.
ఆదాయమిచ్చే వస్తువును ‘ఆయశరీర’ మనేవారు. నగరం, జనపదం, గనులు, సేద్యపు నీటి వనరులు, అడవులు, పశువుల పెంపకం, వర్తక మార్గాలు, వ్యవసాయం, సుంకాలు, జరిమానాలు, తూనికలు, కొలతలు, ప్రవేశానుమతులు (పాస్‌పోర్ట్‌లు), మద్యం, దారం, నెయ్యి, ఉప్పు, ఖనిజాలు, రంగురాళ్ళు, బంగారపు పని, కళారంగం, ఆలయాలనే కాక; ఆ కాలపు రీతి రివాజులను బట్టి వేశ్యావృత్తిని, జూదాన్ని కూడా ఆదాయ మార్గంగానే చూసేవారు. వీటిలో ఒక్కోదానికీ పర్యవేక్షణాధికారి ఉండేవాడు. మతపరమైన తంతులు, సాయుధ దళాలు, ఆయుధాలు, గిడ్డంగులు, కర్మాగారాలు, కార్మికులు, రాజప్రాసాద నిర్వహణ ప్రభుత్వం ఖర్చు కిందికి వచ్చేవి. రాజుకు వ్యక్తిగత సంపద ఉండేది కానీ, రాచకుటుంబంలోని మిగతా సభ్యులకు జీతాలు చెల్లించేవారు.
అయితే, ఆదాయం చాలావరకు వస్తురూపంలో ఉండేది కనుక గిడ్డంగులలో భద్రపరిచేవారు. గిడ్డంగులపై అధికారిని ‘సన్నిధాత్రి’ అనేవారు. ఇంకా విశేషమేమిటంటే, నేటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ లాంటిదే అప్పుడూ విడిగా ఉండేది. ఆదాయవ్యయ పత్రాలనూ, లెక్కలనూ తనిఖీ చేసే ఆ విభాగాధికారిని ‘అక్షపటలాధ్యక్షుడ’నేవారు. ఇప్పుడున్నట్టు ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నులు, వడ్డీ రాయితీ వంటివీ; సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవల వంటి వర్గీకరణలూ; సంక్షేమ స్పృహా అప్పుడూ ఉండేవి. కాకపోతే ఇప్పటిలా అభివృద్ధి కేంద్రితమైన ఆలోచనలు అర్థశాస్త్రంలో లేవని పండితులంటారు. కాలానుగుణమైన తేడాలను అలా ఉంచితే, ‘‘ప్రజాహితమే రాజు హితం, ప్రజలకు ప్రియమైనదే రాజుకూ ప్రియమైనది కావా’’లనే అర్థశాస్త్ర నిర్దేశం త్రికాల ప్రభుత్వాలకూ వర్తించే తిరుగులేని సూత్రం.
Comments
Please login to add a commentAdd a comment