Wilson
-
అంతా ఈయనే చేశారు...
జేమ్స్ విల్సన్.. మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈయనే తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు, తదనంతర పరిణామాల ఫలితంగా ఈస్టిండియా కంపెనీకి ఆర్థి కంగా చాలా నష్టం జరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యతను క్వీన్ విక్టోరియా స్కాట్లాండ్కు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్‌కు అప్పగించారు. అలా ఆమె ఆదేశం మేరకు విల్సన్ 1859లో భారత్‌కు వచ్చారు. 1860 ఏప్రిల్ 7న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆయన మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను, లైసెన్స్ పన్ను, పొగాకు సుంకం.. ఇందులో ఆదాయపు పన్నును మాత్రమే అమల్లోకి తెచ్చారు. మిగిలినవాటిని పక్కనపెట్టారు. అయితే, భారత్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జమీందారులు, వ్యాపారవేత్తలు ఈ నిర్ణయంపై కినుక వహించారు. 1793లో అప్పటి గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ అమల్లోకి తెచ్చిన శాశ్వత భూమి శిస్తు విధానం స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని అన్నారు. అప్పట్లో భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. అదనంగా ఆదాయపు పన్నును విధించడాన్ని విమర్శించారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. జేమ్స్ విల్సన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దేశంలో భారతీయులు వ్యాపారం చేసుకునేందుకు బ్రిటిషర్లు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినందున ఆదాయంపై పన్ను విధించడం సబబే అని ఆయన వాదించారు. అయితే, బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొన్ని నెలలకే ఆగస్టులో రక్త విరోచనాలతో బాధపడుతూ జేమ్స్ విల్సన్ కోల్‌కతాలో మరణించారు. దేశంలో సివిల్ పోలీసు విభాగం ఏర్పాటు, తొలిసారిగా పేపర్ కరెన్సీ తేవడం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, ఆడిటింగ్, పబ్లిక్ వర్క్స్, రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, మిలటరీ ఫైనాన్స్ కమిషన్, సివిల్ ఫైనాన్స్ కమిషన్ల ఏర్పాటు.. ఇలా అన్ని ఆయన కృషి ఫలితమే అని చెబుతారు. ప్రస్తుత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పూర్వ సంస్థ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు కూడా ఈయనే.. ఎలాగూ ఐటీ విషయం వచ్చింది కాబట్టి.. ఓ తాజా వార్త.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్ అనుకుంటున్నారట.. మేడమ్ వింటున్నారా? -
లెదరు బ్యాగూ... బ్రీఫు కేసూ...
ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ రోజున చాలా విరివిగా వాడుతున్న మాట, ‘బడ్జెట్’. వ్యక్తిగత స్థాయిలో గృహస్థు, లేదా గృహిణి ఎప్పటికప్పుడు జమా, ఖర్చులు బేరీజు వేసుకుంటూ ఒడుపుగా సంసారాన్ని నడపడం కూడా బడ్జెట్ కూర్పు లాంటిదే. ప్రభుత్వాల స్థాయిలో అయితే ఏడాది కాలానికి సరిపోయే ఆదాయ, వ్యయాల ప్రణాళికకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అది యావద్దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది కనుక అన్ని వర్గాలవారూ దానికోసం చకోరపక్షులవుతారు. తీరా వచ్చాక ఆశాభంగాలూ ఉంటాయి, ఆశోద్దీపనలూ ఉంటాయి. ఆ విధంగా బడ్జెట్ ఆర్థికాంశాల కూర్పే కాదు; ఆశ నిరాశల కలగలుపు కూడా! కిందటి వారమే కేంద్రం స్థాయిలో మరో బడ్జెట్ సమర్పణ ముగిసింది కానీ, దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడమూ ఆసక్తిదాయకమే. లాటిన్లో తోలుసంచీని ‘బుల్గా’ అనేవారు. ఆ మాటే ఫ్రెంచిలో ‘బూజ్’, ‘బగెట్’ అయింది. వాటినుంచే ‘బడ్జెట్’ పుట్టి 15వ శతాబ్ది నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆదాయ, వ్యయాల ముందస్తు ప్రకటన అనే అర్థంలో ఈ మాటను మొదటిసారి 1733లో ఉపయోగించారట. కోశాగార మంత్రి తన ద్రవ్య ప్రణాళికను ఉంచుకునే తోలుసంచీ ‘బడ్జెట్’ అనే మాటను ప్రపంచానికి అందించింది. ఈ రోజున విరివిగా వాడే ‘వాలెట్’, ‘పౌచ్’లు కూడా బడ్జెట్ అనే తోలుసంచీకి లఘురూపాలే. 14వ శతాబ్ది నుంచి వాడుకలో ఉన్న ‘వాలెట్’కు వస్తువులను చుట్టబెట్టేదని అర్థం. ఇది ‘వెల్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలం నుంచి వచ్చింది. విశేషమేమిటంటే, సంస్కృతంలో ‘వలతే’, ‘వలయం’ అనే మాటల మూలాలు కూడా ‘వెల్’లోనే ఉన్నాయని భాషావేత్తలు అంటారు. ‘పౌచ్’ అనే మాటే రకరకాల రూపాల మీదుగా ‘ప్యాకెట్’ అయింది. బడ్జెట్ అనబడే తోలుసంచే బడ్జెట్ రోజున నేటి ఆర్థికమంత్రులు చేతుల్లో బ్రీఫ్ కేస్‌గా మారిన సంగతిని ఊహించడం కష్టం కాదు. బడ్జెట్ వివరాల గోప్యతకు సంకేతంగా కూడా దానిని తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో మన దేశంలో బడ్జెట్ సంప్రదాయం 1860లో మొదలైందనీ, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భారత ఆర్థికమంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్ దానికి నాంది పలికారనీ చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ సమర్పకులు ఆర్.కె.షణ్ముగం చెట్టి కాగా, బడ్జెట్‌కు నేటి రూపూ, రేఖా కల్పించిన ఆర్థిక పండితుడు పి.సి.మహలనోబిస్. అయితే, చరిత్ర కాలానికి వెళితే, మౌర్యుల కాలంలోనే ఒక ఏడాదికి సరిపోయే బడ్జెట్‌నూ, గణాంకాలనూ కూర్చేవారని చరిత్ర నిపుణులంటారు. ఆ కాలానికే చెందిన కౌటిల్యుని అర్థశాస్త్రం దానికి ఆధారం. కాకపోతే, అప్పట్లో ఏడాదికి 354 రోజులు. గురుపూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ నుంచి సంవత్సరాన్ని లెక్కించేవారు. నేటి బడ్జెట్ తరహా కూర్పే ఇంచుమించుగా అర్థశాస్త్రంలోనూ కనిపిస్తుంది. అర్థమంటే డబ్బు కనుక అర్థశాస్త్రం కేవలం ఆర్థిక విషయాలే చెబుతుందనుకుంటారు కానీ, కౌటిల్యుని ఉద్దేశంలో అర్థమంటే, మనుషుల జీవన విధానానికీ, వారు నివసించే భూమికీ చెందిన అన్ని విషయాలనూ చెప్పేదని– ప్రసిద్ధ సంçస్కృత పండితుడు, అర్థశాస్త్ర వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు అంటారు. అర్థశాస్త్రం ప్రకారం నాటి బడ్జెట్ సంవత్సరాన్ని ‘రాజవర్షం’ అనేవారు. నేటి ఆర్థికమంత్రిని పోలిన అధికారిని ‘సమాహర్త’ అనేవారు. ఏయే ఆదాయ వనరు నుంచి ఎంత ఆదాయం రావాలో నిర్ణయించడం, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం అతని బాధ్యత. ‘ఆయముఖాలు’ అనే పేరుతో ఆదాయాన్ని వర్గీకరించేవారు. ఆదాయమిచ్చే వస్తువును ‘ఆయశరీర’ మనేవారు. నగరం, జనపదం, గనులు, సేద్యపు నీటి వనరులు, అడవులు, పశువుల పెంపకం, వర్తక మార్గాలు, వ్యవసాయం, సుంకాలు, జరిమానాలు, తూనికలు, కొలతలు, ప్రవేశానుమతులు (పాస్‌పోర్ట్‌లు), మద్యం, దారం, నెయ్యి, ఉప్పు, ఖనిజాలు, రంగురాళ్ళు, బంగారపు పని, కళారంగం, ఆలయాలనే కాక; ఆ కాలపు రీతి రివాజులను బట్టి వేశ్యావృత్తిని, జూదాన్ని కూడా ఆదాయ మార్గంగానే చూసేవారు. వీటిలో ఒక్కోదానికీ పర్యవేక్షణాధికారి ఉండేవాడు. మతపరమైన తంతులు, సాయుధ దళాలు, ఆయుధాలు, గిడ్డంగులు, కర్మాగారాలు, కార్మికులు, రాజప్రాసాద నిర్వహణ ప్రభుత్వం ఖర్చు కిందికి వచ్చేవి. రాజుకు వ్యక్తిగత సంపద ఉండేది కానీ, రాచకుటుంబంలోని మిగతా సభ్యులకు జీతాలు చెల్లించేవారు. అయితే, ఆదాయం చాలావరకు వస్తురూపంలో ఉండేది కనుక గిడ్డంగులలో భద్రపరిచేవారు. గిడ్డంగులపై అధికారిని ‘సన్నిధాత్రి’ అనేవారు. ఇంకా విశేషమేమిటంటే, నేటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ లాంటిదే అప్పుడూ విడిగా ఉండేది. ఆదాయవ్యయ పత్రాలనూ, లెక్కలనూ తనిఖీ చేసే ఆ విభాగాధికారిని ‘అక్షపటలాధ్యక్షుడ’నేవారు. ఇప్పుడున్నట్టు ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నులు, వడ్డీ రాయితీ వంటివీ; సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవల వంటి వర్గీకరణలూ; సంక్షేమ స్పృహా అప్పుడూ ఉండేవి. కాకపోతే ఇప్పటిలా అభివృద్ధి కేంద్రితమైన ఆలోచనలు అర్థశాస్త్రంలో లేవని పండితులంటారు. కాలానుగుణమైన తేడాలను అలా ఉంచితే, ‘‘ప్రజాహితమే రాజు హితం, ప్రజలకు ప్రియమైనదే రాజుకూ ప్రియమైనది కావా’’లనే అర్థశాస్త్ర నిర్దేశం త్రికాల ప్రభుత్వాలకూ వర్తించే తిరుగులేని సూత్రం. -
దుబాయ్
‘‘స్వర్ణా... అంతా బాగేనా?’’ మల్లేష్.‘బాగే మల్లేషన్నా.. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా.. ఈలోపు నువ్వే..’’ ‘‘షాలినీ కలుస్తుందా స్వర్ణా?’’ ఆమె మాటను పూర్తికానివ్వని మల్లేష్ ఉత్సుకత..‘‘ఫోన్?’’ ‘‘విల్సన్‌తో మాట్లాడకపోయినవా?’’ మల్లేష్.‘‘ఫోన్ చేశా. చాలా రాష్‌గా మాట్లాడాడు షాలినీ గురించి’’ అని ఓ క్షణం ఆగి.. ‘‘ఏం కథ పెట్టింది నీ ఫ్రెండ్? అబార్షన్ ఇల్లీగల్ అని తెలియదా? పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎరక్కపోయి ఇరుకున్నా. ఇలాంటిదని తెలిస్తే.. వీసానే ఇప్పించకపోదును అంటూ చాలా అసహ్యంగా వాగాడు! షాలినీని కలవడానికి, మాట్లాడ్డానికి చాలా ట్రై చేశా. ప్చ్..! ఇప్పుడైతే ఫోన్‌కూడా పనిచేయట్లేనట్టుంది. ఎక్కడుందో.. ఏమో’’ బాధగా స్వర్ణ.‘‘షాలిని వాళ్ల అమ్మ నంబర్ ఏమన్నా ఉందా? ఆమెతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా?’’ అడిగాడు.‘‘ఉన్నట్టుంది.. ఆమెతో మాట్లాడి..నీకు కాల్ చేస్తా..’’ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్వర్ణ. షర్ట్ పాకెట్లో ఫోన్ పడేసుకుంటూ గతంలోకి జారుకున్నాడు మల్లేష్. షాలిని ప్రెగ్నెంట్ అని తెల్వంగానే ఇండియా వచ్చేసిండు. అంతకుముందే.. మస్తు సార్ల సేuŠ‡ని చుట్టీ అడిగిండు. ఇయ్యలే. కరెక్ట్‌గా శాలినీ కడుపుతో ఉన్నా అని చెప్పుడు.. చుట్టీ దొరుకుడు ఒక్కసారే అయినయ్. ‘‘మా అమ్మకు బాగాలేదంట షాలినీ..! సోనాపూర్ క్యాంప్‌లో ఉండే మా ఊరాయన మొన్ననే ఇండియా నుంచి అచ్చిండు. మా అమ్మ మంచలకెంచి అస్సలు లేస్తలేదని చెప్పిండు. నేను బోవాలే. పదిహేను రోజులల్ల అస్తా మల్లా!’’ తెల్లవారి ప్రయాణం అనగా ముందు రోజు రాత్రి ఎప్పటిలెక్కనే గ్యారేజ్‌లో కల్సుకున్నడు షాలినీని. గుడ్ల నిండా నీళ్లు దీసుకుంది తప్ప ఏం మాట్లాడ్లే ఆ పిల్ల. దగ్గరకు దీసుకుంటూ చెప్పిండు ‘‘ఏం ఫికర్వెట్టుకోకు. తొందరగనే అస్తా..ఒకవేళ రాకపోతే మా అమ్మ ప్రాణం కిందమీదైంది అనుకో. ఫోన్ చేస్తా. ఏజెంట్‌తో మట్లాడి నువ్వే ఇండియాకు వచ్చేటట్టు చేస్తా. సరేనా..’’అని. అయినా ఆమె ఏం మాట్లాడ్లే. ఒక్కసారి తన కండ్లల్లకు జూసింది. గద్వ వట్టుకుని మళ్లా అన్నడు. ‘‘సరేనా’’ అని. కౌగిలి ఇడిపించుకుని ఎన్కకు తిరిగి చూడకుండా పోయింది. అబద్ధం చెప్తుండని ఆ పిల్లకు అర్థమైందా? ప్రెగ్నెంట్ అని తెల్వంగనే పారిపోతున్నడు అనుకుందా? పారిపోవుడు.. భయపడుడు నివద్దే కదా! ఊర్ల పెండ్లాం ఉందని నిజం చెప్పలే. ఇద్దరు పిల్లల తండ్రి అనీ చెప్పలే. లేని అమ్మకు రోగం అంటగట్టిండు. ఏం జేస్తడు? అప్పటికే తుట్టి యెవుసంతో పుట్టెడు అప్పులు. పెండ్లం మెడల పుస్తె అమ్మి మరీ దుబాయ్వాయే. ఎప్పుడో చిన్నప్పుడు గమ్మత్గా నేర్సుకున్న కార్ డ్రైవింగ్ అక్కరకొచ్చింది. తాను డ్రైవర్‌గా చేసే సేuŠ‡ ఇంట్లనే షాలిని పని మనిషి. తనను జూసి ఆ పిల్ల తెలుగు మాట్లాడేసరికి ప్రాణం లెషొచ్చిన్నట్టయింది. అట్ల అయిన దోస్తాని దొంగతనంగా రొట్టెలు, కూరలు తెచ్చిచ్చేదాకా వెరిగింది. ప్రేమిస్తున్నా అని ఇంకా దగ్గరైండు. ఇల్లు, పిల్లలు ఎవ్వరు గుర్తురాలే. మూడ్నెల్లకు ఒకసారి ఇంటికి పైసలు పంపిస్తున్నప్పుడు ఇంటోల్లకు ఒక కాల్ చేస్తుండే గంతే. ఆ పిల్ల గర్భవతి అని తెల్సినంకనే ఇల్లు, పెండ్లాం, పిల్లలు గుర్తొచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పిచ్చుకొని ఇండియాకొచ్చేషిండు. టపాటపా వేప చెట్టు ఆకులు రాలుతూండడంతో వాస్తవంలోకి వచ్చాడు మల్లేష్. చుట్టూ చూశాడు. ఎండ మండుతోంది. తను కూర్చున్న చెట్టు తప్ప ఇంకే చెట్టూ ఊగట్లేదు. ఉక్కపోత ఉగ్గబట్టి రవ్వంత గాలికీ చోటివ్వట్లేదు. ఆ పెద్ద వేప చెట్టు మాత్రం వేర్లు పెకలి నేల కూలుతుందా అన్నంతగా ఊగుతోంది.. వింతగా! దడ పట్టుకుంది మల్లేష్‌కి. లేచి నిలబడ్డాడు.అతని ముందుకు ఒక్కసారిగా సుడి గాలి.. మనిషి ఆకారంలో! గిర్రున తిరుగి మాయమైంది. రెండు మొహాలు.. కనిపించాయి.. మల్లేష్‌కి.. అంత వేగంలో కూడా ఒక మొహాన్ని గుర్తుపట్టగలిగాడు.. శాలిని! మరి ఇంకో మొహం..? అపరిచితమైందీ కాదు.. సుపరిచితం అంతకన్నా కాదు. ఎవరు ఆమె.. ఎక్కడ చూశాడు? చూశాడా? లేక భ్రమా?మొహం పాలిపోయింది.. ఎండకు గొంతు తడారి పెదవులు పొడిబారాయి!దాహం.. దాహం.. మంచి నీళ్లు.. నోరు ఎండిపోతోంది. చేనును తడుపుతున్న బోర్ పంప్ దగ్గరికి వెళ్లాడు. నీటి ధారకు దోసిలి పట్టాడు. ఠక్కున నీళ్లు ఆగిపోయాయి. బోర్ మాత్రం నడుస్తూనే ఉంది. ‘‘ఎడారి దేశంలో ఉండొచ్చావ్.. దప్పిక అలవాటవలేదా?’’ వినిపించింది వెనకనుంచి.షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. ఓ స్త్రీ.. ఇందాకటి ఇంకో మొహం.నవ్వుతోంది.. తనను చూసి. నల్ల చీర.. చెవులదాకా వెడల్పు.. మెడ మీద పడేంత పొడవు ఉన్న దట్టమైన తెల్లటి జుట్టు ముడి.. రూపాయి బిళ్లంతా నల్లటి బొట్టుతో ఉంది ఆ స్త్రీ. జలజలమని నీటి ప్రవాహం పంప్ వెంట. ఆ చప్పుడికి అటు వైపు చూశాడు. ‘‘పో..’’ గద్దించింది ఆమె.తన ప్రమేయం లేకుండానే ఎవరో వెనక నుంచి తోసినట్టు.. వచ్చి పంప్ దగ్గర పడ్డాడు. దోసిలి పట్టాడు. మళ్లీ ఆగిపోయింది. బిత్తరపోయి వెనక్కి తిరిగాడు. ఆవిడ లేదు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు దీశాడు. పది అడుగులు వేస్తే వచ్చే ఇల్లు.. ఎంత పరిగెత్తినా రావట్లేదు. మధ్యాహ్నం మొదలుపెడితేపొద్దుగుంకింది.. చూస్తుండగానే చీకట్లూ అలుముకున్నాయి. అల్లంత దూరంలోనే కనపడుతోంది ఇల్లు.. అయినా చేరుకోలేకపోతున్నాడు. మొసతో వగరుస్తున్నాడు. ఇంట్లో లైట్వెలుగుతోంది. భార్య చేటలో బియ్యం చెరుగుతోంది. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నీడలుగా కనపడుతున్నారు. చేయి చాస్తే అందుకునేంత చేరువగా ఉన్నారు. ఆయసంతో అడుగులు వేయలేక చేయి చాచాడు.. ఎవరినీ అందుకోలేకపోతున్నాడు. గుండెలో నొప్పి.. ఓ చేత్తో గుండెను పట్టుకొనే ఇంకో చేత్తో తన వాళ్లను అందుకోవాలనే ఆరాటంతో పరిగెడ్తున్నాడు.. అర్ధరాత్రి అయింది.. అయినా ఇల్లు చేరలేదు మల్లేష్. ఆగిపోయాడు.. తన వల్ల కాదు.. మాట్లాడలేనంత ఎండిపోయి ఉంది నోరు.. దాహం.. దాహం.. మాట గొంతులో ఉంది.. బయటకు రావట్లేదు..కళ్లు మూతలు పడ్తున్నాయి..ఎదరుగా ఆమె.. ‘‘చేరుకున్నావా నీ వాళ్లను? వీళ్ల కోసమే కదా.. షాలినీని ఒంటరిగా వదిలి వచ్చేశావ్? పిరికితనంతో బిడ్డను పుట్టకుండానే చంపేశావ్.. వెళ్లు... నీ వాళ్ల దగ్గరకు వెళ్లు.. పో... ఊ.. ’’ గర్జించింది ఆ స్వరం. మళ్లీ అప్రయత్నంగానే పరుగు మొదలుపెట్టాడు మల్లేష్. జేబులో ఉన్న ఆయన ఫోన్ మోగుతోంది.. చాలా సేపటి నుంచి.. ఛాతి దగ్గర ఎడమవైపు కలుక్కు మంటూంటే.. చేత్తో పట్టుకున్నాడు. ఆ స్థానంలోనే ఉన్న జేబులోని ఫోన్ ప్రెస్ అయి స్పీకర్‌తో సహా ఫోన్ కాల్ ఆన్ అయింది..‘‘మల్లేషన్నా.. షాలినీ మీద బెంగతో వాళ్లమ్మ చనిపోయిందట అన్నా.. ’’ కుప్పకూలిపోయాడు మల్లేష్. - సరస్వతి రమ -
మోదీ హత్యకు కుట్ర.. కట్టు కథ: గద్దర్
సాక్షి, హైదరాబాద్: భీమా కోరేగావ్ హింసకు కారకులైన నిందితులను తప్పించేందుకే దళిత, ఆదివాసీ ఉద్యమనేతలను, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని, కుట్ర కేసులు బనాయిస్తోందని విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోపించారు. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రోనా విల్సన్ వద్ద లభించినట్లు చెబుతున్న లేఖల్లో వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత చిక్కుడు ప్రభాకర్ తదితరులతో కలసి మాట్లాడారు. రోనావిల్సన్ వద్ద లభించినట్లుగా చెబుతున్న లేఖలన్నీ అబద్ధాలనీ, కట్టుకథలనీ, మావోయిస్టులు రాసినట్లుగా చెబుతు న్న ఆ లేఖల్లోని భాష, రాసిన తీరు ఈ అంశాలను వెల్లడి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆరు నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీగ్రాఫ్ పడిపోతోందని, ప్రజల్లో సానుభూతిని పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రధానిని హతమార్చే కుట్రకు పాల్పడుతున్నట్లు తప్పుడు ప్రచారాన్ని సృష్టించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా ఈ అబద్ధపు రాతలు, లేఖల ఆధారంగా అసత్య కథనాలను ప్రచారం చేస్తోందని, సత్యం గొంతులోంచి వెలువడక ముందే అసత్యం ప్రపంచాన్ని పదిసార్లు చుట్టివచ్చినట్లుగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆ లేఖలు ముమ్మాటికీ పోలీసుల సృష్టే.... ‘సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులకు మావోయిస్టు పార్టీ రాసే లేఖలు ఎలా ఉంటాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భం గా అందరికీ తెలుసు. ప్రజాజీవితంలో ఉన్న తనను ‘మా మహానేత’ అని సంబోధిస్తూ మావోయిస్టులు రాసినట్లుగా చెబుతున్న లేఖల్లో ఉందని అంటున్నారు. సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులను మావోయిస్టు పార్టీ ఎప్పటికీ అలా సంబోధించదు. అదే లేఖలో మరో చోట ‘లాల్ జోహార్’ అనే మాట ఉన్నట్లు తెలిసింది. లాల్‌జోహార్ అనే పదం అమరు లకు నివాళులర్పించేటప్పుడు చెబుతారు. కానీ ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులకు రాసే లేఖల్లో అలా ఉం డదు. పైగా ‘వరవరరావు’ అని పూర్తి పేరు లేఖలో రాసినట్లుగా ప్రస్తావించారు. ఇలాంటి అనేక అం శాలు ఆ లేఖలు పచ్చి అబద్ధాలు, పోలీసుల కల్పితాలేనని తెలియజేస్తున్నాయి. కానీ, వాస్తవాలను నిర్ధారించుకోకుండా జాతీయస్థాయి మీడియా సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి’ అని ఆరోపించారు. 200 ఏళ్లనాటి భీమా కోరేగావ్ పోరాటంలో అమరులైనవారిని స్మరించుకొనేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, సుధీర్ రావత్, పీబీ సావంత్ వంటి ప్రముఖుల సారథ్యంలో తరలివచ్చిన దళిత, ఆదివాసీలపై ఆరెస్సెస్ శక్తులు హింసకు పాల్పడ్డాయని, అందుకు బ్రాహ్మణీయ ఫాసిస్ట్ శక్తులు శంభాజీ భిటే, మిలింద్ ఎక్బోటేలు బాధ్యులని ఆధారాలున్నా, ఎఫ్ఐఆర్ నమోదైనా వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దళిత, ఆదివాసీలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భీమా కోరేగావ్ హింస వెనుక మావోయిస్టులున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం దళిత, ఆదివాసీలపై కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆరెస్సెస్ శక్తుల, నయా బ్రాహ్మణవాద కుట్రలను ప్రశ్నిస్తున్నందుకే రోనా విల్సన్, ఐపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత కార్యకర్త సుధీర్ దావ్లే, విస్థాపన వ్యతిరేక ఉద్యమకారుడు మహేశ్ రావత్‌ల ను అరెస్టు చేసిందన్నారు. వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ లేఖల కథలల్లుతున్నారని చెప్పారు. ఆ లేఖలను బహిర్గతం చేయాలని, హక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సామాజిక ఉద్యమనేత ఉ.సాంబశివరావు, నారాయణ, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ప్రొఫెసర్ హరగోపాల్ అక్రమంగా అరెస్టు చేసిన రోనా విల్సన్, సరేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, సుధీర్ దావ్లే, మహేశ్ రావత్‌లను వెంటనే విడుదల చేయాలని, ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు మావోయిస్టుల రాజకీయాల గురించి మాట్లాడడమే నేరమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి కాంగ్రెస్‌కు కూడా మావోయిస్టుపార్టీతో సంబంధాలు ఉన్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలు, తప్పుడు లేఖలతో ఈ కుట్రలో వరవరరావును కూడా ఇరికించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఉదంతంపైన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కోరారు. మీడియా అబద్ధపు రాతలను, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, వాస్తవాలను వెలికి తేవాలని కోరారు. దుబ్బాక టౌన్: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రనా..? ఇది నిజమా? ఎవరు నమ్మాలి? వాళ్లే రాజకీయాల్లో సంచలనం కోసం చేసుకుంటున్న ప్రచారం కావచ్చు’ అని ప్రజా గాయకుడు గద్దర్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ హత్యకు కుట్ర జరిగినట్లు వచ్చిన వార్తలను కట్టు కథగా అభివర్ణించారు. ఇలాంటి ప్రచారం ప్రభుత్వాలకు, పెద్ద నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఈ వార్తలపై కేంద్రం సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. అనవసరంగా అమాయకులను ఇబ్బందుల పాలు చేయవద్దన్నారు. సమాజం కోసం, పేదల కోసం పోరాడుతున్న విప్లవకారులను ఒకవైపు బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతూనే, కమ్యూనిస్టు దేశాలైన చైనా, నేపాల్‌లకు వెళ్లి సెల్యూట్లు కొట్టడం మోదీ ద్వంద్వ రాజకీయ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రశ్నించేవారిని కాల్చి చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నేనూ ప్రేమలో పడ్డా!
తమిళసినిమా: సినిమాకు మోడలింగ్ రంగం రాచ మార్గం అనే చెప్పాలి. నేరుగా సినీ రంగప్రవేశం చేయడానికి ముఖ్యంగా హీరోయిన్లకు కష్టతరమే. అదే మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్గా అవకాశం పొందడం సులభతరంగా మారింది. అలా కథానాయకిగా తెరపై మెరవడానికి రెడీ అయిన మోడల్ రైజా. పూర్తి పేరు రైజా విల్సన్. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా మరింత పాపులర్ అయిన ఆ బ్యూటీ తాజాగా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ప్యార్ ప్రేమ కాదల్ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఆమెతో కలిసి మరో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఫేమ్ హరీష్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా రైజా ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. ప్ర: బిగ్‌బాస్ గేమ్ షో అనుభవం గురించి? జ: బిగ్‌బాస్ గేమ్ షో నన్ను చాలా మందికి పరిచయం చేయడం సంతోషాన్ని కలిగించింది. ప్ర: మోడలింగ్ రంగం నుంచి వచ్చినట్లున్నారు? జ: నేను ఆరేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నాను. నా సొంత ఊరు బెంగళూర్ అయినా, దక్షణాది ముఖ్య నగరాల్లో మోడలింగ్ చేశాను.బీకామ్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. ప్ర: సినిమాల్లో నటించడం గురించి? జ: నేనెప్పుడూ సినిమాల్లో నటించడానికి తొందర పడలేదు. యువన్‌శంకర్‌రాజా నిర్మిస్తున్న ప్యార్ ప్రేమ కాదల్ చిత్రంలో హరీష్కల్యాణ్కు జంటగా నటిస్తున్నాను. ఈ చిత్రం విడుదలనంతరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూసి తదుపరి చిత్రాలపై నా నిర్ణయం ఉంటుంది. ప్ర: ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? జ: నేనూ హరీష్‌కల్యాణ్ ఆడిషన్‌కు వెళ్లాం. ఎంపికవుతాననే నమ్మకం నాకుంది. మోడలింగ్ రంగంలో ఉండడం వల్ల ఎలా నటించాలన్నది కొంచెం తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అదే నిజమైంది. ప్ర: అంతకు ముందు వీఐపీ–2 చిత్రంలో నటించినట్లున్నారు? జ: నిజం చెప్పాలంటే అది మోడలింగ్ అసైన్మెంట్. కాజోల్‌తో కలిసి నటించాను. చిత్రం మొత్తం నిలబడే ఉంటాను. నాకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు.అదో వినూత్న అనుభవం. ప్ర:ఎన్ని యాడ్స్‌లో నటించి ఉంటారు? జ: సుమారు 500లకు పైగా చేసి ఉంటాను. 2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నాను.ఆ తరువాతనే మోడలింగ్ రంగంలో అవకాశాలు వచ్చాయి. ప్ర:తమిళంలో మీకు నచ్చిన హీరో? జ: నిజానికి నేను తమిళ చిత్రాలు ఎక్కువగా చూడను. ఇటీవల నేను చూసిన తమిళ చిత్రం విక్రమ్ వేదా.అందులో మాధవన్ నటన అదుర్స్. నా కళ్లు ఆయన్ని మాత్రమే చూశాయి. ఐలవ్యూ మాధవన్. ప్ర: ప్రేమలో పడ్డారా? జ: : కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమ పుట్టింది. సినిమాలు, షికార్లు కూడా చేశాం. అయితే ఆ ప్రేమ విఫలమైంది. ప్ర:పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: కచ్చితంగా ప్రేమ వివాహాన్నే చేసుకుంటాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. -
ఏపీలో విల్సన్ ప్రాధమిక విద్య
-
ఇద్దరు భారతీయులకు ‘మెగసెసె’
- మాన్యువల్ స్కావెంజింగ్‌పై పోరుకుగాను బెజవాడ విల్సన్‌కు -‘నవ్య నాయకత్వం’లో గాయకుడు కృష్ణకు మనీలా : ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు 2016 ఏడాదికి ఇద్దరు భారతీయులకు దక్కింది. కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణ, మాన్యువల్ స్కావెంజింగ్ (చేతులతో మలాన్ని ఎత్తివేసే అమానవీయ విధానం) నిర్మూలనకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న బెజవాడ విల్సన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సఫాయూ కర్మచారి ఆందోళన్(ఎస్కేఏ) జాతీయ కన్వీనర్‌గా ఉన్న విల్సన్.. ఇలాంటి అమానవీయ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకూ కనీస గౌరవం ఉండాలని పోరాటం చేస్తున్నారు. టీఎం కృష్ణ.. సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నానికిగాను ‘ఎమర్జెంట్ లీడర్షిప్’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో నలుగురు( కొంచిత కార్పియో-ఫిలిప్పీన్స్, డోంపెట్ ధువాఫా-ఇండోనేసియా, జపాన్ ఓవర్సీస్ కో-ఆపరేషన్ వలంటీర్స్, లావోస్‌కు చెందిన వీన్తియేన్ రెస్క్యూ బృందం) కూడా ఈ ఏడాదికి మెగసెసె అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును ఆసియాలోనే అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు. మూడో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి జ్ఞాపకార్థం 1958 నుంచి దీన్ని అందిస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం, వారిని చైతన్య పరిచేందుకు ఆసియా దేశాల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రతి ఏటా అందిస్తారు. సంగీతంతో సామాజిక అంతరాల తొలగింపు చెన్నై బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణ ఆరేళ్ల వయసునుంచే సంగీతంపై ఆసక్తి కనబరిచారు. తాత టీటీ కృష్ణమాచారి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. ఇంట్లో అందరికీ సంగీతమంటే మక్కువ. బాల్యం నుంచే కృష్ణ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల వద్ద విద్యనభ్యసించారు. జిడ్డు కృష్ణమూర్తి కాలేజీలో చదివిన టీఎం కృష్ణ.. జీకే ఆలోచనలతోనే సమాజంలోని జాడ్యాలను తొలగించేందుకు నడుంబిగించారు. భారతీయ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, సామాజిక అంతరాలను తొలగించేందుకు సంగీతం కీలకమైన సాధనమని గుర్తించి.. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సంగీతం కొందరికే కాదు.. అందరికీ సొంతమనే ప్రచారం చేస్తున్నారు. గాయకునిగా జీవితాన్ని ప్రారంభించినా తన కళతో సమాజంలో మార్పు తెచ్చేందుకు చేసిన కృషే ఆయన్ను ఈ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. దళితులు, కార్మికుల అభ్యున్నతికి కృషి కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లో పుట్టిన దళిత ఆణిముత్యం బెజవాడ విల్సన్. వీరి కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది కూడా విల్సన్ ఒక్కరే. సమాజంలో దళితులకు ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేస్తున్న విల్సన్.. భారతదేశంలో మానవత్వానికి మచ్చగా మిగిలిన మాన్యువల్ స్కావెంజింగ్(చేతులతో మరుగుదొడ్లను శుభ్రపరచటం, ఈ వ్యర్థాలను తలపై ఎత్తుకుని దూర ప్రాంతాల్లో వేసి రావటం)ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. 32 ఏళ్లుగా ఈ అమానవీయ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పటి నుంచి అంటరానితనాన్ని అనుభవిస్తూ.. ఆ ఆగ్రహాన్ని ఓ యుద్ధంగా మార్చుకున్నారీయన. మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఫలం ఆశించకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నందుకే విల్సన్‌కు ఈ అవార్డు అందజేస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది. మెగసెసె అవార్డు అందుకున్న భారతీయులు అమితాబ్ చౌదరి(1961), జయప్రకాష్ నారాయణ్ (1965), ఎంఎస్.సుబ్బలక్ష్మి(1974), కిరణ్ బేడీ (1994), టీఎన్ శేషన్, లింగ్డో(1996), సందీప్ పాండే (2002), ప్రొఫెసర్ శాంతా సిన్హా (2003), అరవింద్ కేజ్రీవాల్ (2006), నీలిమా మిశ్రా (2011), సంజీవ్ చతుర్వేది (2015). విల్సన్‌కు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: రామన్ మెగసెసె అవార్డు కు ఎంపికైన బెజవాడ విల్సన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు.