సాక్షి, హైదరాబాద్: భీమా కోరేగావ్ హింసకు కారకులైన నిందితులను తప్పించేందుకే దళిత, ఆదివాసీ ఉద్యమనేతలను, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని, కుట్ర కేసులు బనాయిస్తోందని విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోపించారు.
రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రోనా విల్సన్ వద్ద లభించినట్లు చెబుతున్న లేఖల్లో వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత చిక్కుడు ప్రభాకర్ తదితరులతో కలసి మాట్లాడారు.
రోనావిల్సన్ వద్ద లభించినట్లుగా చెబుతున్న లేఖలన్నీ అబద్ధాలనీ, కట్టుకథలనీ, మావోయిస్టులు రాసినట్లుగా చెబుతు న్న ఆ లేఖల్లోని భాష, రాసిన తీరు ఈ అంశాలను వెల్లడి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆరు నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీగ్రాఫ్ పడిపోతోందని, ప్రజల్లో సానుభూతిని పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రధానిని హతమార్చే కుట్రకు పాల్పడుతున్నట్లు తప్పుడు ప్రచారాన్ని సృష్టించుకున్నారని చెప్పారు.
ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా ఈ అబద్ధపు రాతలు, లేఖల ఆధారంగా అసత్య కథనాలను ప్రచారం చేస్తోందని, సత్యం గొంతులోంచి వెలువడక ముందే అసత్యం ప్రపంచాన్ని పదిసార్లు చుట్టివచ్చినట్లుగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని దుయ్యబట్టారు.
ఆ లేఖలు ముమ్మాటికీ పోలీసుల సృష్టే....
‘సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులకు మావోయిస్టు పార్టీ రాసే లేఖలు ఎలా ఉంటాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భం గా అందరికీ తెలుసు. ప్రజాజీవితంలో ఉన్న తనను ‘మా మహానేత’ అని సంబోధిస్తూ మావోయిస్టులు రాసినట్లుగా చెబుతున్న లేఖల్లో ఉందని అంటున్నారు. సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులను మావోయిస్టు పార్టీ ఎప్పటికీ అలా సంబోధించదు. అదే లేఖలో మరో చోట ‘లాల్ జోహార్’ అనే మాట ఉన్నట్లు తెలిసింది.
లాల్‌జోహార్ అనే పదం అమరు లకు నివాళులర్పించేటప్పుడు చెబుతారు. కానీ ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులకు రాసే లేఖల్లో అలా ఉం డదు. పైగా ‘వరవరరావు’ అని పూర్తి పేరు లేఖలో రాసినట్లుగా ప్రస్తావించారు. ఇలాంటి అనేక అం శాలు ఆ లేఖలు పచ్చి అబద్ధాలు, పోలీసుల కల్పితాలేనని తెలియజేస్తున్నాయి. కానీ, వాస్తవాలను నిర్ధారించుకోకుండా జాతీయస్థాయి మీడియా సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.
200 ఏళ్లనాటి భీమా కోరేగావ్ పోరాటంలో అమరులైనవారిని స్మరించుకొనేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, సుధీర్ రావత్, పీబీ సావంత్ వంటి ప్రముఖుల సారథ్యంలో తరలివచ్చిన దళిత, ఆదివాసీలపై ఆరెస్సెస్ శక్తులు హింసకు పాల్పడ్డాయని, అందుకు బ్రాహ్మణీయ ఫాసిస్ట్ శక్తులు శంభాజీ భిటే, మిలింద్ ఎక్బోటేలు బాధ్యులని ఆధారాలున్నా, ఎఫ్‌ఐఆర్ నమోదైనా వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దళిత, ఆదివాసీలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భీమా కోరేగావ్ హింస వెనుక మావోయిస్టులున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం దళిత, ఆదివాసీలపై కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఆరెస్సెస్ శక్తుల, నయా బ్రాహ్మణవాద కుట్రలను ప్రశ్నిస్తున్నందుకే రోనా విల్సన్, ఐపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత కార్యకర్త సుధీర్ దావ్లే, విస్థాపన వ్యతిరేక ఉద్యమకారుడు మహేశ్ రావత్‌ల ను అరెస్టు చేసిందన్నారు. వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ లేఖల కథలల్లుతున్నారని చెప్పారు. ఆ లేఖలను బహిర్గతం చేయాలని, హక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సామాజిక ఉద్యమనేత ఉ.సాంబశివరావు, నారాయణ, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ప్రొఫెసర్ హరగోపాల్
అక్రమంగా అరెస్టు చేసిన రోనా విల్సన్, సరేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, సుధీర్ దావ్లే, మహేశ్ రావత్‌లను వెంటనే విడుదల చేయాలని, ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు మావోయిస్టుల రాజకీయాల గురించి మాట్లాడడమే నేరమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆఖరికి కాంగ్రెస్‌కు కూడా మావోయిస్టుపార్టీతో సంబంధాలు ఉన్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలు, తప్పుడు లేఖలతో ఈ కుట్రలో వరవరరావును కూడా ఇరికించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఉదంతంపైన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కోరారు. మీడియా అబద్ధపు రాతలను, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, వాస్తవాలను వెలికి తేవాలని కోరారు.
దుబ్బాక టౌన్: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రనా..? ఇది నిజమా? ఎవరు నమ్మాలి? వాళ్లే రాజకీయాల్లో సంచలనం కోసం చేసుకుంటున్న ప్రచారం కావచ్చు’ అని ప్రజా గాయకుడు గద్దర్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ హత్యకు కుట్ర జరిగినట్లు వచ్చిన వార్తలను కట్టు కథగా అభివర్ణించారు. ఇలాంటి ప్రచారం ప్రభుత్వాలకు, పెద్ద నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
ఈ వార్తలపై కేంద్రం సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. అనవసరంగా అమాయకులను ఇబ్బందుల పాలు చేయవద్దన్నారు. సమాజం కోసం, పేదల కోసం పోరాడుతున్న విప్లవకారులను ఒకవైపు బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతూనే, కమ్యూనిస్టు దేశాలైన చైనా, నేపాల్‌లకు వెళ్లి సెల్యూట్‌లు కొట్టడం మోదీ ద్వంద్వ రాజకీయ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రశ్నించేవారిని కాల్చి చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment