‘‘స్వర్ణా... అంతా బాగేనా?’’ మల్లేష్.‘బాగే మల్లేషన్నా.. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా.. ఈలోపు నువ్వే..’’ ‘‘షాలినీ కలుస్తుందా స్వర్ణా?’’ ఆమె మాటను పూర్తికానివ్వని మల్లేష్ ఉత్సుకత..‘‘ఫోన్?’’ ‘‘విల్సన్‌తో మాట్లాడకపోయినవా?’’ మల్లేష్.‘‘ఫోన్ చేశా. చాలా రాష్‌గా మాట్లాడాడు షాలినీ గురించి’’ అని ఓ క్షణం ఆగి.. ‘‘ఏం కథ పెట్టింది నీ ఫ్రెండ్? అబార్షన్ ఇల్లీగల్ అని తెలియదా? పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎరక్కపోయి ఇరుకున్నా. ఇలాంటిదని తెలిస్తే.. వీసానే ఇప్పించకపోదును అంటూ చాలా అసహ్యంగా వాగాడు! షాలినీని కలవడానికి, మాట్లాడ్డానికి చాలా ట్రై చేశా. ప్చ్..! ఇప్పుడైతే ఫోన్‌కూడా పనిచేయట్లేనట్టుంది. ఎక్కడుందో.. ఏమో’’ బాధగా స్వర్ణ.‘‘షాలిని వాళ్ల అమ్మ నంబర్ ఏమన్నా ఉందా? ఆమెతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా?’’ అడిగాడు.‘‘ఉన్నట్టుంది.. ఆమెతో మాట్లాడి..నీకు కాల్ చేస్తా..’’ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్వర్ణ. షర్ట్ పాకెట్‌లో ఫోన్ పడేసుకుంటూ గతంలోకి జారుకున్నాడు మల్లేష్. షాలిని ప్రెగ్నెంట్ అని తెల్వంగానే ఇండియా వచ్చేసిండు. అంతకుముందే.. మస్తు సార్ల సేuŠ‡ని చుట్టీ అడిగిండు. ఇయ్యలే. కరెక్ట్‌గా శాలినీ కడుపుతో ఉన్నా అని చెప్పుడు.. చుట్టీ దొరుకుడు ఒక్కసారే అయినయ్. ‘‘మా అమ్మకు బాగాలేదంట షాలినీ..! సోనాపూర్ క్యాంప్‌లో ఉండే మా ఊరాయన మొన్ననే ఇండియా నుంచి అచ్చిండు. మా అమ్మ మంచలకెంచి అస్సలు లేస్తలేదని చెప్పిండు. నేను బోవాలే. పదిహేను రోజులల్ల అస్తా మల్లా!’’ తెల్లవారి ప్రయాణం అనగా ముందు రోజు రాత్రి ఎప్పటిలెక్కనే గ్యారేజ్‌లో కల్సుకున్నడు షాలినీని. గుడ్ల నిండా నీళ్లు దీసుకుంది తప్ప ఏం మాట్లాడ్లే ఆ పిల్ల. దగ్గరకు దీసుకుంటూ చెప్పిండు ‘‘ఏం ఫికర్‌వెట్టుకోకు. తొందరగనే అస్తా..ఒకవేళ రాకపోతే మా అమ్మ ప్రాణం కిందమీదైంది అనుకో. ఫోన్ చేస్తా. ఏజెంట్‌తో మట్లాడి నువ్వే ఇండియాకు వచ్చేటట్టు చేస్తా. సరేనా..’’అని. అయినా ఆమె ఏం మాట్లాడ్లే. ఒక్కసారి తన కండ్లల్లకు జూసింది. గద్వ వట్టుకుని మళ్లా అన్నడు. ‘‘సరేనా’’ అని. కౌగిలి ఇడిపించుకుని ఎన్కకు తిరిగి చూడకుండా పోయింది. అబద్ధం చెప్తుండని ఆ పిల్లకు అర్థమైందా? ప్రెగ్నెంట్ అని తెల్వంగనే పారిపోతున్నడు అనుకుందా? పారిపోవుడు.. భయపడుడు నివద్దే కదా! ఊర్ల పెండ్లాం ఉందని నిజం చెప్పలే. ఇద్దరు పిల్లల తండ్రి అనీ చెప్పలే. లేని అమ్మకు రోగం అంటగట్టిండు. ఏం జేస్తడు? అప్పటికే తుట్టి యెవుసంతో పుట్టెడు అప్పులు. పెండ్లం మెడల పుస్తె అమ్మి మరీ దుబాయ్‌వాయే. ఎప్పుడో చిన్నప్పుడు గమ్మత్‌గా నేర్సుకున్న కార్ డ్రైవింగ్ అక్కరకొచ్చింది. తాను డ్రైవర్‌గా చేసే సేuŠ‡ ఇంట్లనే షాలిని పని మనిషి. తనను జూసి ఆ పిల్ల తెలుగు మాట్లాడేసరికి ప్రాణం లెషొచ్చిన్నట్టయింది. అట్ల అయిన దోస్తాని దొంగతనంగా రొట్టెలు, కూరలు తెచ్చిచ్చేదాకా వెరిగింది. ప్రేమిస్తున్నా అని ఇంకా దగ్గరైండు. ఇల్లు, పిల్లలు ఎవ్వరు గుర్తురాలే. మూడ్నెల్లకు ఒకసారి ఇంటికి పైసలు పంపిస్తున్నప్పుడు ఇంటోల్లకు ఒక కాల్ చేస్తుండే గంతే. ఆ పిల్ల గర్భవతి అని తెల్సినంకనే ఇల్లు, పెండ్లాం, పిల్లలు గుర్తొచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పిచ్చుకొని ఇండియాకొచ్చేషిండు.
టపాటపా వేప చెట్టు ఆకులు రాలుతూండడంతో వాస్తవంలోకి వచ్చాడు మల్లేష్. చుట్టూ చూశాడు. ఎండ మండుతోంది. తను కూర్చున్న చెట్టు తప్ప ఇంకే చెట్టూ ఊగట్లేదు. ఉక్కపోత ఉగ్గబట్టి రవ్వంత గాలికీ చోటివ్వట్లేదు. ఆ పెద్ద వేప చెట్టు మాత్రం వేర్లు పెకలి నేల కూలుతుందా అన్నంతగా ఊగుతోంది.. వింతగా! దడ పట్టుకుంది మల్లేష్‌కి. లేచి నిలబడ్డాడు.అతని ముందుకు ఒక్కసారిగా సుడి గాలి.. మనిషి ఆకారంలో! గిర్రున తిరుగి మాయమైంది. రెండు మొహాలు.. కనిపించాయి.. మల్లేష్‌కి.. అంత వేగంలో కూడా ఒక మొహాన్ని గుర్తుపట్టగలిగాడు.. శాలిని! మరి ఇంకో మొహం..? అపరిచితమైందీ కాదు.. సుపరిచితం అంతకన్నా కాదు. ఎవరు ఆమె.. ఎక్కడ చూశాడు? చూశాడా? లేక భ్రమా?మొహం పాలిపోయింది.. ఎండకు గొంతు తడారి పెదవులు పొడిబారాయి!దాహం.. దాహం.. మంచి నీళ్లు.. నోరు ఎండిపోతోంది. చేనును తడుపుతున్న బోర్ పంప్ దగ్గరికి వెళ్లాడు. నీటి ధారకు దోసిలి పట్టాడు. ఠక్కున నీళ్లు ఆగిపోయాయి. బోర్ మాత్రం నడుస్తూనే ఉంది. ‘‘ఎడారి దేశంలో ఉండొచ్చావ్.. దప్పిక అలవాటవలేదా?’’ వినిపించింది వెనకనుంచి.షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. ఓ స్త్రీ.. ఇందాకటి ఇంకో మొహం.నవ్వుతోంది.. తనను చూసి. నల్ల చీర.. చెవులదాకా వెడల్పు.. మెడ మీద పడేంత పొడవు ఉన్న దట్టమైన తెల్లటి జుట్టు ముడి.. రూపాయి బిళ్లంతా నల్లటి బొట్టుతో ఉంది ఆ స్త్రీ. జలజలమని నీటి ప్రవాహం పంప్ వెంట. ఆ చప్పుడికి అటు వైపు చూశాడు. ‘‘పో..’’ గద్దించింది ఆమె.తన ప్రమేయం లేకుండానే ఎవరో వెనక నుంచి తోసినట్టు.. వచ్చి పంప్ దగ్గర పడ్డాడు. దోసిలి పట్టాడు. మళ్లీ ఆగిపోయింది. బిత్తరపోయి వెనక్కి తిరిగాడు. ఆవిడ లేదు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు దీశాడు. పది అడుగులు వేస్తే వచ్చే ఇల్లు.. ఎంత పరిగెత్తినా రావట్లేదు. మధ్యాహ్నం మొదలుపెడితేపొద్దుగుంకింది.. చూస్తుండగానే చీకట్లూ అలుముకున్నాయి. అల్లంత దూరంలోనే కనపడుతోంది ఇల్లు.. అయినా చేరుకోలేకపోతున్నాడు. మొసతో వగరుస్తున్నాడు. ఇంట్లో లైట్‌వెలుగుతోంది. భార్య చేటలో బియ్యం చెరుగుతోంది. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నీడలుగా కనపడుతున్నారు. చేయి చాస్తే అందుకునేంత చేరువగా ఉన్నారు. ఆయసంతో అడుగులు వేయలేక చేయి చాచాడు.. ఎవరినీ అందుకోలేకపోతున్నాడు. గుండెలో నొప్పి.. ఓ చేత్తో గుండెను పట్టుకొనే ఇంకో చేత్తో తన వాళ్లను అందుకోవాలనే ఆరాటంతో పరిగెడ్తున్నాడు.. అర్ధరాత్రి అయింది.. అయినా ఇల్లు చేరలేదు మల్లేష్. ఆగిపోయాడు.. తన వల్ల కాదు.. మాట్లాడలేనంత ఎండిపోయి ఉంది నోరు.. దాహం.. దాహం.. మాట గొంతులో ఉంది.. బయటకు రావట్లేదు..కళ్లు మూతలు పడ్తున్నాయి..ఎదరుగా ఆమె.. ‘‘చేరుకున్నావా నీ వాళ్లను? వీళ్ల కోసమే కదా.. షాలినీని ఒంటరిగా వదిలి వచ్చేశావ్? పిరికితనంతో బిడ్డను పుట్టకుండానే చంపేశావ్.. వెళ్లు... నీ వాళ్ల దగ్గరకు వెళ్లు.. పో... ఊ.. ’’ గర్జించింది ఆ స్వరం. మళ్లీ అప్రయత్నంగానే పరుగు మొదలుపెట్టాడు మల్లేష్. జేబులో ఉన్న ఆయన ఫోన్ మోగుతోంది.. చాలా సేపటి నుంచి.. ఛాతి దగ్గర ఎడమవైపు కలుక్కు మంటూంటే.. చేత్తో పట్టుకున్నాడు. ఆ స్థానంలోనే ఉన్న జేబులోని ఫోన్ ప్రెస్ అయి స్పీకర్‌తో సహా ఫోన్ కాల్ ఆన్ అయింది..‘‘మల్లేషన్నా.. షాలినీ మీద బెంగతో వాళ్లమ్మ చనిపోయిందట అన్నా.. ’’ కుప్పకూలిపోయాడు మల్లేష్.
- సరస్వతి రమ
దుబాయ్
Published Sun, Apr 28 2019 12:29 AM | Last Updated on Sun, Apr 28 2019 12:29 AM
Comments
Please login to add a commentAdd a comment