
ఇద్దరు భారతీయులకు ‘మెగసెసె’
ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు 2016 ఏడాదికి ఇద్దరు భారతీయులకు దక్కింది.
- మాన్యువల్ స్కావెంజింగ్‌పై పోరుకుగాను బెజవాడ విల్సన్‌కు
-‘నవ్య నాయకత్వం’లో గాయకుడు కృష్ణకు
మనీలా : ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు 2016 ఏడాదికి ఇద్దరు భారతీయులకు దక్కింది. కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణ, మాన్యువల్ స్కావెంజింగ్ (చేతులతో మలాన్ని ఎత్తివేసే అమానవీయ విధానం) నిర్మూలనకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న బెజవాడ విల్సన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సఫాయూ కర్మచారి ఆందోళన్(ఎస్‌కేఏ) జాతీయ కన్వీనర్‌గా ఉన్న విల్సన్.. ఇలాంటి అమానవీయ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకూ కనీస గౌరవం ఉండాలని పోరాటం చేస్తున్నారు. టీఎం కృష్ణ.. సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నానికిగాను ‘ఎమర్జెంట్ లీడర్‌షిప్’ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో నలుగురు( కొంచిత కార్పియో-ఫిలిప్పీన్స్, డోంపెట్ ధువాఫా-ఇండోనేసియా, జపాన్ ఓవర్సీస్ కో-ఆపరేషన్ వలంటీర్స్, లావోస్‌కు చెందిన వీన్‌తియేన్ రెస్క్యూ బృందం) కూడా ఈ ఏడాదికి మెగసెసె అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును ఆసియాలోనే అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు. మూడో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి జ్ఞాపకార్థం 1958 నుంచి దీన్ని అందిస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం, వారిని చైతన్య పరిచేందుకు ఆసియా దేశాల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రతి ఏటా అందిస్తారు.
సంగీతంతో సామాజిక అంతరాల తొలగింపు
చెన్నై బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణ ఆరేళ్ల వయసునుంచే సంగీతంపై ఆసక్తి కనబరిచారు. తాత టీటీ కృష్ణమాచారి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. ఇంట్లో అందరికీ సంగీతమంటే మక్కువ. బాల్యం నుంచే కృష్ణ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల వద్ద విద్యనభ్యసించారు. జిడ్డు కృష్ణమూర్తి కాలేజీలో చదివిన టీఎం కృష్ణ.. జీకే ఆలోచనలతోనే సమాజంలోని జాడ్యాలను తొలగించేందుకు నడుంబిగించారు. భారతీయ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, సామాజిక అంతరాలను తొలగించేందుకు సంగీతం కీలకమైన సాధనమని గుర్తించి.. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సంగీతం కొందరికే కాదు.. అందరికీ సొంతమనే ప్రచారం చేస్తున్నారు. గాయకునిగా జీవితాన్ని ప్రారంభించినా తన కళతో సమాజంలో మార్పు తెచ్చేందుకు చేసిన కృషే ఆయన్ను ఈ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.
దళితులు, కార్మికుల అభ్యున్నతికి కృషి
కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లో పుట్టిన దళిత ఆణిముత్యం బెజవాడ విల్సన్. వీరి కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది కూడా విల్సన్ ఒక్కరే. సమాజంలో దళితులకు ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేస్తున్న విల్సన్.. భారతదేశంలో మానవత్వానికి మచ్చగా మిగిలిన మాన్యువల్ స్కావెంజింగ్(చేతులతో మరుగుదొడ్లను శుభ్రపరచటం, ఈ వ్యర్థాలను తలపై ఎత్తుకుని దూర ప్రాంతాల్లో వేసి రావటం)ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. 32 ఏళ్లుగా ఈ అమానవీయ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పటి నుంచి అంటరానితనాన్ని అనుభవిస్తూ.. ఆ ఆగ్రహాన్ని ఓ యుద్ధంగా మార్చుకున్నారీయన. మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఫలం ఆశించకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నందుకే విల్సన్‌కు ఈ అవార్డు అందజేస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది.
మెగసెసె అవార్డు అందుకున్న భారతీయులు
అమితాబ్ చౌదరి(1961), జయప్రకాష్ నారాయణ్ (1965), ఎంఎస్.సుబ్బలక్ష్మి(1974), కిరణ్ బేడీ (1994), టీఎన్ శేషన్, లింగ్డో(1996), సందీప్ పాండే (2002), ప్రొఫెసర్ శాంతా సిన్హా (2003), అరవింద్ కేజ్రీవాల్ (2006), నీలిమా మిశ్రా (2011), సంజీవ్ చతుర్వేది (2015).
విల్సన్‌కు జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: రామన్ మెగసెసె అవార్డు కు ఎంపికైన బెజవాడ విల్సన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు.