లవ్-ఇష్క్-కాదల్
హ్యూమర్ ప్లస్
మనిషితో పాటే ప్రేమ పుట్టింది. కాకపోతే తొలి ప్రేమ వెనుక సైతాను ఉన్నాడు. ఆ మహానుభావుడు లేకపోయినా ఆడం, ఈవ్‌లు ఆపిల్‌ను తినేసి మన కొంప ముంచేవాళ్లు. మంచి చెబితే వినకపోవడం అక్కణ్ణుంచే మొదలైంది. ప్రేమ, దోమ ఎప్పుడూ కుడుతూనే ఉంటాయి. కొంతమందికి లేట్‌గా. కొందరికి టూ ఎర్లీగా. మా స్కూల్లో బాబు అని ఒకడుండేవాడు. టూమచ్ వాడు. మేస్టార్ ఎంత చావబాదినా ఇంగ్లిష్‌లో వాడు నేర్చుకున్నది ఒకే ఒక వాక్యం.. ఐ లవ్ యూ. అమ్మాయిలు కనిపిస్తే గజనీలాగా పిచ్చి చూపులు చూసి తనలోని అపరిచితుణ్ణి బయటికి తెచ్చేవాడు. కమ్యూనికేషన్లు లేని కాలం. సినిమాల్లో తప్ప బయట ఫోన్లు చూసినవారు, చేసినవారు అరుదు. లవ్ లెటర్లే దిక్కు. వీటితో సమస్య ఏమిటంటే కష్టపడి రాయాలి. ధైర్యంగా ఇవ్వాలి. బాబు స్పెషాలిటీ ఏమంటే వాడికి ఏ భాషా రాదు. ఆ విషయం వాడికి తెలియదు. ఒకమ్మాయికి లెటర్ ఇచ్చాడు. వీడి బాడీ లాంగ్వేజీ అర్థమైంది కానీ, లెటర్‌లో లాంగ్వేజీ అర్థం కాలేదు. తీసుకెళ్లి వాళ్ల నాన్నకిచ్చింది. ఆయన బాబు వాళ్ల నాన్నకు షేర్ చేశాడు. కట్ చేస్తే జల్లికట్టులో ఎద్దు పరిగెత్తినట్టు బాబు వీధుల్లో పరిగెత్తాడు. వెనుక కర్రతో వాళ్ల నాన్న.
అనేక దండయాత్రల్లో ఓడిపోయినా, చివరికి ఈ బాబు ఒకమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాడు ఇంగ్లిష్‌లో నేర్చుకున్న రెండో వాక్యం లవ్ ఈజ్ ఇన్‌జ్యూరియస్ టు హెల్త్. దేవదాసు, మజ్నూలు భగ్న ప్రేమికులు కాబట్టే కథల్లోకి ఎక్కారు కానీ, పెళ్లయి ఉంటే వాళ్ల కథ కంచికి చేరేది. అక్కడ పార్వతి, లైలాలు కలిసి పట్టు చీరలు షాపింగ్ చేసేవాళ్లు. బోలెడంత మంది గొప్ప ప్రేమికులు పెళ్లయింతర్వాత వేదాంతులుగా మారిపోయారు. కొందరు సన్యాసుల్లో చేరిపోయారు. సన్యాసుల్ని చేయడమే తప్ప, సన్యాసంలో కలిసిపోయే అవకాశం ఆడవాళ్లకు లేనందువల్ల వాళ్లు గరిటెతో క్రికెట్ ఆడడం నేర్చుకున్నారు. గ్రౌండ్‌కి బదులు మొగుడి బుర్ర ఉంటుంది అంతే తేడా.
సోక్రటీసుది కూడా లవ్ మ్యారేజే అయి ఉంటుంది. లేకపోతే నెత్తిన నీళ్ల కుండ బోర్లించేంత కోపం ఆవిడకెందుకొస్తుంది? జంకు లేకుండా విషం తాగడం వెనుక ఆయనకి అలాంటి అనుభవాలు బోలెడు ఉండే ఉంటాయి. ప్రేమించుకునేటప్పుడు లైన్‌లో లవర్స్ మాత్రమే ఉంటారు. పెళ్లయిన తర్వాత పాలవాడు, అద్దెవాడు, కిరాణా కొట్టు వాడు.. ఇలా కొట్టి డబ్బులు లాక్కోడానికి చాలామంది లైన్‌లో కొస్తారు. ఆ తర్వాత పిల్లలు లైన్‌లోకి వస్తారు. గుర్రుపెట్టి నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఈ ఎలుగుబంటినా నేను లవ్ చేసింది అని కంగారుతో నిద్రలేచిన భార్యలు ఎందరో ఉన్నారు. ప్రతి రోజూ ప్రేమికుల రోజే. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రేమికుల రోజు వచ్చింది. అయితే కొందరు పూనకం వచ్చి అడ్డుకోవాలని కూడా చూస్తున్నారు. ప్రేమని, గాలిని బంధించడం కష్టం. టెక్నాలజీ పెరిగి ప్రేమ కూడా సులభమైపోయింది. ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లతో ఎదిగిపోతూ ఉంది. గతంలో ప్రేమ పెరగడానికి, విరగడానికి కాస్త టైమ్ పట్టేది. ఇప్పుడంతా పర్ఫెక్ట్ టైమింగ్. ఉదయం స్టార్ట్ అయి, ఈవెనింగ్‌కి బ్రేకప్ కూడా అయిపోతూ ఉంది. మచ్చల్ని వెతకడం మూర్ఖత్వం. చంద్రుణ్ణి చూడడం ఆనందం.
- జి.ఆర్.మహర్షి