G.R.. Maharishi
-
ఆకాశవాణి
హ్యూమర్ ప్లస్ ఇప్పుడైతే పాట చెవుల్లోకి దూరి వీధుల్లో మాయలైంది కానీ, ఒకప్పుడు పాట కుళాయి నీళ్ళలా ఎక్కడ చూసినా ప్రవహించేది. ఘంటసాల ఇంటింటి గాయకుడే. రేడియోలు గురగురమని, గడగడమని, స్టేషన్ మార్చినప్పుడల్లా సౌండ్ చేసేవి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్‌లా ఆగకుండా విజిల్ వేసేవి. హోటళ్ళలో హార్మోనియం పెట్టె సైజ్‌లో కరెంట్ రేడియోలుండేవి. ఈ రేడియో చేసే సౌండ్‌కి ఒక్కోసారి కస్టమర్లు తింటున్న ఇడ్లీలు కూడా వదిలేసి పారిపోయేవాళ్ళు. భక్తిగీతాల దగ్గర నుంచి కార్మికుల కార్యక్రమం వరకూ రేడియో గొంతు వినిపిస్తూనే వుండేది. దేవుడి దయవల్ల ఆకాశవాణి కేంద్రాలకి మధ్యలో విరామం కూడా వుండేది. కరెంట్ రేడియోకి సిస్టర్ ట్రాన్సిస్టర్. దాని పొట్టనిండా బ్యాటరీలు కూరిస్తే తప్ప అది మాట్లాడదు. బుష్, మర్ఫీ అని రెండు కంపెనీలుండేవి. మా ఇంట్లో ఉన్న బుష్ రేడియో నెత్తిమీద నాలుగైదు మొత్తితే తప్ప మూలిగేది కాదు. కడప స్టేషన్ రావాలంటే తూర్పుకి, హైదరాబాద్ రావాలంటే దక్షిణానికి తిప్పాలి. సిలోన్ మాత్రం తొందరగానే తగులుకునేది, కాకపోతే ‘గీక్గుటగుట’ అని గ్యాస్ట్రబుల్ వచ్చినోడి లాగా శబ్దతరంగాలు చేసేది. శ్రీలంక స్టేషన్లో మీనాక్షి పొన్నుదురై అనే అనౌన్సర్ ఒక సెలబ్రిటీ. ఆమె గొంతు వినడం ఒక ఫ్యాషన్. గంటసేపు ప్రోగ్రాంలో భక్తి కార్యక్రమాలు, ప్రకటనలు పోగా గట్టిగా ఐదు పాటలొచ్చేవి. వాటికోసం చెవుల్ని కోసి, రేడియోకి అతికించి వినేవాళ్ళం. అందరిళ్ళలో ఒకేసారి రేడియో మోగడం వల్ల వీధంతా మైక్ పెట్టినట్టుండేది. రేడియోకి లైసెన్స్‌లు కూడా వుండేవి. ఒక పాస్ పుస్తకంలో రకరకాల స్టాంపులుండేవి. పోస్టాఫీస్‌లో డబ్బు కడితే వాటిమీద ముద్రలేసి ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత గవర్నమెంట్ లైసెన్స్‌ని రద్దు చేసింది. జనం రేడియోని రద్దు చేశారు. మావూళ్ళో చెన్నకేశవులు అని ఒకాయనుండేవాడు. ఆయనకి రేడియో అంటే ఇష్టం. కొనుక్కునే స్థోమతుండేది కాదు. రేడియో వినడానికి ఇళ్ళముందు తచ్చాడేవాడు. ప్రాణాన్ని చెవుల్లోకి తెచ్చుకుని వినేవాడు. ఆయన కొడుకు మిలట్రీలో చేరిన తరువాత తండ్రికి ఒక రేడియో, సైకిల్ కొనిపెట్టాడు. చెన్నకేశవులు పూలరంగడు తిరిగినట్టు చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఒక రౌండేశాడు. సైకిల్‌కి ముందు ఒక బుట్ట, దాంట్లో రేడియో పెట్టుకుని, అట్లాస్ సైకిల్ తొక్కుతుంటే ఆ కతే వేరు. కానీ ఒకరోజు తన చేతుల్తోనే రేడియో పగలగొట్టాడు. మిలట్రీలో కొడుకు చనిపోయిన దుఃఖం అలాంటిది. క్రికెట్ పిచ్చి ఎక్కువయ్యేసరికి పాకెట్ రేడియోలు పుట్టాయి. అర్థమైనా కాకపోయినా కామెంట్రీ వింటూ, గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తే వికెట్ పడిందని డిసైడ్ అయ్యేవాళ్ళు. బెల్‌బాటం ప్యాంట్ వేసుకోకపోయినా, క్రికెట్ కామెంట్రీ వినకపోయినా అనాగరికుడని భావించే కాలం. బ్లాక్ అండ్ వైట్ టీవీ దొంగలా ఇంట్లోకి ప్రవేశించింది. అప్పటివరకూ దొరలా జీవించిన రేడియోకి కష్టకాలం మొదలైంది. చెవులకి పనితగ్గి, కళ్ళు యాక్టివ్ అయ్యాయి. వస్తుందో రాదో తెలియని తెలుగు పాటకోసం ఇల్లంతా ‘చిత్రలహరి’ ముందు కూర్చునేవాళ్ళు. ఈలోగా జపాన్ వాళ్ళు పగబట్టి డొక్కు టేప్రికార్డర్లను తయారుచేసి జనం మీదికి వదిలారు. ఖాళీ క్యాసెట్ ఇస్తే పాటలు రికార్డు చేసేవాళ్ళు వీధుల్లో పుట్టుకొచ్చారు. గ్రామ్‌ఫోన్ రికార్డులు బ్రేక్ కావడం కూడా మొదలైంది. పాట సామూహికంగా మాయమై వ్యక్తిగతంగా మారింది. మార్నింగ్ వాక్‌లో అందరి చెవుల్లోనూ వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి కానీ, ఎవరేం పాట వింటున్నారో తెలియదు. అసలు వినాలనిపించే పాటలు వస్తున్నాయో లేదో కూడా తెలియదు. పాటల వల్ల హిట్టయ్యే సినిమాలూ లేవు, పాటలకోసం సినిమాలు చూసేవాళ్ళూ లేరు. తమాషా ఏమంటే ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లు గురించి కూడా పాతికేళ్ళ తరువాత నాలాంటి వాడొకడు కాలమ్ రాస్తాడు. రాయడం అనే మాట తప్పేమో, అప్పటికి పేపర్లు ఉండకపోవచ్చు. – జి.ఆర్. మహర్షి -
కొక్కోరోకో
హ్యూమర్ ప్లస్ మన నమ్మకాలే నమ్మకాలు. ఎదుటివాళ్ళ నమ్మకాలు మూఢనమ్మకాలు. లోకం సజావుగా నడవాలంటే మన మీద మనకి విశ్వాసం, ఎదుటివాళ్ళ మీద అవిశ్వాసం ఉండాలి. నిప్పు పట్టుకుంటే కాలదని వెనకటికి మావూళ్ళో ఒకాయన వాదించేవాడు. కాలుతుందని మనం నమ్మడం వల్లే అది కాలుస్తుందని అనేవాడు. కానీ బొబ్బలు ఎక్కడినుంచి వస్తాయని అడిగితే పెడబొబ్బలు పెట్టి తన సిద్ధాంతాన్ని విడమర్చి చెప్పేవాడు. నొప్పి అనేది స్పందనా లోపమని, గాయం ఒక దృశ్య లోపమని, భావనే ప్రపంచాన్ని నడిపిస్తుందని అనేవాడు. తర్కం తర్కించడానికే తప్ప పరీక్షించడానికి కాదని కూడా ఆయనకి తెలుసు. అందుకే నిప్పుని ఎప్పుడూ ముట్టుకోలేదు. నమ్మించడానికి పెద్ద ప్రపంచమే వుంటుంది. కానీ నమ్మడానికి మనది చాలా చిన్న జీవితం. రసాయన సిద్ధాంతాన్ని ఎంత బోధించినా భౌతికశాస్త్రాన్ని విస్మరించరాదు. అందుకే గతితార్కిక భౌతిక అధివాస్తవిక, సూత్ర చలన, గమనశీల అనే ఉపన్యాసాలతో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళంతా నయా రివిజనిస్ట్, బూర్జువా, భూస్వామ్య ఫ్యూడల్ అవశేష పదజాలంలో కలిసిపోయారు. కోడిపుంజుని మనం వంటకంగా భావిస్తాం కానీ, అది మాత్రం తనని తాను మేధావిగా భావిస్తూ పుంజుకుంటూ వుంటుంది. తన కూతతోనే సూర్యుడు కళ్ళు తెరుస్తాడని నమ్ముతుంది. ఈ లోకానికి తానే వెలుగు ప్రసాదిస్తున్నాననే జ్ఞాన కాంతిపుంజంతో రెక్కలు విప్పుకుంటూ వుంటుంది. జ్ఞానులని నమ్మిన ప్రతివాడ్ని ఈ ప్రపంచం గొంతుకోసి చంపుతుంది. ఆయుధాన్ని కనుగొన్నప్పుడే మనిషి జ్ఞానాన్ని వేటాడ్డం మొదలుపెట్టాడు.సత్యాన్ని ఆవిష్కరించాలనుకున్న తన పూర్వీకులంతా కత్తికి ఎరగా మారారని ఒక కోడిపుంజు గ్రహించింది. తన స్వరమహిమ చాటాలని బయలుదేరింది. ఒక రాతి బండ కింద గుటకలు మింగుతున్న కప్ప కనిపించింది. తనకి, సూర్యుడికి గల అవినాభావ సంబంధాన్ని ‘కొరకొర’ శబ్దంతో వివరించింది. అంతా విన్న కప్ప నాలుగు అడుగులు ముందుకి, రెండు అడుగులు వెనక్కి గెంతింది. ‘‘నీ గురించి నీకెంత తెలుసో, నా గురించి నాకు అంతే తెలుసు. బండచాటు నుంచి నేను బయటకు వచ్చిన ప్రతిసారి వర్షం వస్తుంది. అంటే ఈ లోకానికి జలాన్ని ప్రసాదించే శక్తి నాకు మాత్రమే వుంది. చిటపట చినుకులకి, బెకబెకలకి సంబంధముంది. ఈ సత్యాన్వేషణ గురించి లోకానికి తెలియజేయాలనుకుని యాత్రార్ధులై వెళ్ళిన నా పూర్వీకులందరూ చైనీస్ హోటళ్ళలో తేలారు. ప్రకృతి శక్తి గురించి తెలిసిన ప్రతివాడ్ని ఈ లోకం వండుకు తింటుంది జాగ్రత్త’’ అని కప్ప రాతిలో జరిగే జీవపరిణామం, తద్వారా ఉద్భవించే పురుగుల అన్వేషణకి బయలుదేరింది. ప్రతివాడికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనది మనం చెప్పడానికి ప్రయత్నిస్తే అవతలివాడు వాడిది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రెండింటి వైరుధ్యాల మధ్య యుద్ధం జరిగి కొత్తది పుడుతుంది. ఇతరుల్ని మనం అంగీకరిస్తే, మనల్ని అంగీకరించేవాడు ఎక్కడో తగలకపోడని నమ్మి పుంజు బయలుదేరింది. ఒక తొండ తగిలింది. సూర్య సిద్ధాంతాన్ని వివరించేలోగా అది అందుకుంటూ ‘‘ఈ లోకానికి వ్యాయామాన్ని నేర్పించిందే నేను. తొలి సిక్స్‌ప్యాక్ రూపకర్తను నేను’’ అంటూ బస్కీలు మొదలుపెట్టింది. ఈసారి ఊసరవెల్లి తగిలింది. డ్రామాలో ఫోకసింగ్ లైట్లని మార్చినట్టు ఒంటిమీద రంగుల్ని మార్చింది. ‘‘ప్రపంచాన్ని వర్ణశోభితం చేసింది నేనే. పెయింటర్లందరికీ నేనే స్ఫూర్తి’’ అని డబ్బా అందుకుంది.పుంజుకి తత్వం బోధపడింది. ఎవరికి వాళ్ళు తామే ఈ లోకాన్ని నడుపుతుంటామని భావిస్తారని, స్వీయజ్ఞానం అంటే ఇదేనని అర్థమైంది. దుఃఖంతో కోళ్ళ గంప చేరుకుంది. మరుసటిరోజు మబ్బులు పట్టి సూర్యుడు రాలేదు. తాను కూయకపోతే సూర్యుడు రాడని మారుజ్ఞానం పొందింది. – జి.ఆర్. మహర్షి -
బష్ ఎక్షా పోశా!
హ్యూమర్ ప్లస్ రాశి ఫలాల్లో వాహనయోగం అని వుంటే ఏంటో అనుకున్నా. టూ వీలర్ చెడిపోయి బస్సెక్కడం అనుకోలేదు. బైక్ సైలెన్సర్ సైలెంట్‌గా వుండక దగ్గడం మొదలుపెట్టింది. వంద సిగరెట్లు తాగిన దానిలా పొగ వదలసాగింది. నల్లటి దట్టమైన పొగకి, నా వెనుక వస్తున్నవాళ్ళు కకావికలైపోతున్నారు. జిపిఎస్ లాగా నేనెక్కడున్నానో ఆ పొగని చూసి గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. పోకుండా, పొగపెట్టిన ఆ బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాను. నాడి పట్టి పరిశీలించి పెదవి విరిచాడు. దింపుడు కళ్ళెం ఆశ వదిలేసి కర్మకాండ జరిపించమన్నాడు.తరువాత సిటీబస్సు ఎక్కడం ప్రారంభించాను. దీంట్లో వున్న సుఖం ఏమంటే మనం నడపక్కరలేదు, మనల్ని ఎవరో నడుపుతారు. కాకపోతే రన్నింగ్‌లో ఎక్కి రన్నింగ్‌లో దిగడం తెలిసుండాలి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడ ఎక్కుతున్నానో, దిగుతున్నానో తెలిసేది కాదు. చిల్లరదో సమస్య. టికెట్ వెనుక కండక్టర్లు రాస్తారు. చిన్నప్పుడు చూసిన షోలే సినిమాలో డైలాగులు గుర్తుంటాయి కానీ, చిల్లర గుర్తుండదు. చెల్లని చెక్కుల్లా జేబులో టికెట్లు మిగిలిపోతున్నాయి.డబ్బులు లేకపోయాయి కానీ, బస్సులో బోలెడంత కాలక్షేపం, కామెడీ. ఈమధ్య ఫిల్మ్‌నగర్ సిగ్నల్ దగ్గర ఒకడు వుండలా దొర్లుకుంటూ ఎక్కాడు, లేదా ఎగబ్రాకాడు. సీటులో సగమే కూచుని ‘బష్ ఎక్షా పోశా’ అన్నాడు. అదే రకం భాషో లేడీ కండక్టర్‌కి అర్థం కాలేదు. ‘టికెట్’ అంది తన భాషలో. ‘బష్ ఎక్షాపోశా కక్ర్’ అని వాడు మరాఠీ బెంగాలీ కలిపి వాగాడు. ఫుల్‌గా తాగినట్టున్నాడు. కిక్కెక్కినపుడు బస్సు ఎందుకు ఎక్కాడో అర్థం కాలేదు. ‘‘ఏమంటున్నాడన్నా వీడు’’ అడిగింది కండక్టర్. వాడి భాషపై నాక్కొంచెం భాషాభిమానం వుండడం వల్ల అనువాదం చేసి ‘‘బస్సు ఎక్కడికి పోతుంది కండక్టర్’’ అని అడుగుతున్నాడని చెప్పాను. ‘‘నువ్వెక్కడికి పోవాలా’’ అడిగింది కండక్టర్. మనవాడు సేమ్ డైలాగ్ పాములాంటి బుసతో రిపీట్ చేశాడు. లేడీ కండక్టర్ బాడీ బిల్డర్‌లా మారి విజిల్ కొట్టి బస్సు ఆపి వాడిని బయటికి విసిరేసింది. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఒక కరెంటు పోల్ కింద సెటిలయ్యాడు. ∙∙ ఇంకోసారి ఒక సీనియర్ సిటిజన్ తగిలాడు. రూల్స్‌కి రోల్ మోడల్లా వున్నాడు. చిరిగిపోయి వంద రూపాయలిచ్చి టికెటివ్వమన్నాడు. నోట్ వేరేది ఇవ్వమన్నాడు కండక్టర్.‘‘నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి అవునా కాదా?’’ అని అడిగాడు సిటిజన్. అవునన్నాడు కండక్టర్ అయోమయంగా.‘‘మరి మీ గవర్నమెంట్ ప్రింట్ చేసిన నోట్‌ని, గవర్నమెంట్ ఎంప్లాయిగా నువ్వెందుకు తీసుకోవు?’’‘‘అన్నా, ఆ నోటు నేనియ్యలే కదా నీకు’’ అన్నాడు.‘‘ఇచ్చింది మీ గవర్నమెంటే కదా’’‘‘అరే, లొల్లి చేయకురా భయ్’’సిటిజన్ వినలేదు. దాంతో కండక్టర్‌కు ఏం చేయాలో తెలియక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, బస్సుని స్లోగా నడుపుతున్న డ్రయివర్ వరకూ అందర్నీ తిట్టాడు. ఎందుకు తిట్టాడో అతనికి కూడా తెలియదు. ‘‘మీ గవర్నమెంట్ మీద మీకే గౌరవం లేకపోతే మాకెందుకుండాలి?’’ అని సిటిజన్ దిగిపోయాడు. ‘‘ఎక్కణ్నుంచి వస్తార్రా ఈ ఎర్రగడ్డ బ్యాచంతా’’ అని కండక్టర్ గొణుక్కుంటూ రైట్ చెప్పాడు. బస్సులు లేనపుడు సర్వీస్ ఆటోల్లో ఎక్కడానికి ప్రయత్నించాను కానీ అదంత సులభం కాదు. డ్రైవర్ మీద ప్రయాణీకులు కూచుంటారో, ప్రయాణీకుల మీదే డ్రైవర్ కూచుంటాడో అర్థం కాదు. ఒక్కోసారి డ్రైవర్ నిలబడి కూడా డ్రైవ్ చేస్తాడు. గోతులు, స్పీడ్ బ్రేకర్లు దేన్నీ లెక్కచేయడు. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. తిరుపతిలో జెవిఆర్కె రెడ్డి అని మంచి మిత్రుడున్నాడు. మనిషి ఎంత మృదువో, డ్రైవింగ్‌లో అంత కఠినం. స్పీడ్‌బ్రేకర్ల దగ్గర బ్రేక్ వేయకూడదని ఆయన సిద్ధాంతం. ఆయన బండిలో కూచుంటే ఇంటికే పోతామో, డాక్టర్ దగ్గరికి పోతామో చెప్పలేం. వాహనాల గురించి ఎప్పుడు రాసినా, ఆయన్ని స్మరించకుండా వుండలేను. – జి.ఆర్. మహర్షి -
తుగ్లక్ కాలంలోకి..
హ్యూమర్ ప్లస్ ఎవరో పనిలేనాయన ౖటñ ం మెషిన్ని కనిపెట్టాడు. ఇది తెలిసి నాకెంతో ఇష్టమైన తుగ్లక్ పాలనని చూడ్డానికి వెళ్లాను. తుగ్లకంటే నాకెందుకు ఇష్టమంటే ఆయన సర్వాంతర్యామి. అన్ని రాజ్యాల్లోనూ ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది.తుగ్లక్ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా కనిపించారు. కొంతమంది ‘తకిథినథోం’ అని డాన్స్ కూడా చేస్తున్నారు!‘‘మీ ఆనందానికి కారణమేంటి?’’... నాన్ స్టాప్‌గా స్టెప్పులు వేస్తున్న ఒకాయన్ని అడిగాను.‘‘తుగ్లక్ ప్రభువే’’ అన్నాడు డాన్స్ ఆపకుండా.‘‘ఆయన అంత బాగా పాలిస్తున్నాడా?’’‘‘పాలన, దండన ఇక్కడ రెండూ ఒకటే. ఆనందంగా కనబడకపోతే వంద కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.నేను భయంతో ‘హిహిహి’ అని ఇకిలించుకుంటూ ముందుకెళ్లాను. అక్కడ ఒకాయన ఒంటి కంటితో సూర్యుణ్ణి చూస్తున్నాడు.‘‘ఏం చేస్తున్నావ్’’ అని అడిగాను. ‘‘సూర్యుడిపై ఒక కన్నేసి ఉంచుతున్నాను. ఇక్కడి గూఢచారులు సూర్యచంద్రుల్ని కూడా వదలరు’’ అన్నాడు. ‘‘కళ్లు పోతాయి’’ అన్నాను. ‘‘ఇప్పటికి చాలామందికి పోయాయి. నేను కొత్తగా విధుల్లోకి వచ్చాను’’ అన్నాడు. ఇంకో చోటికి వెళితే ఒకాయన నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ పది మంది భటులు కాపలా ఉన్నారు. నన్ను చూసి, ‘‘నిద్రాభంగం కలిగించకు. ఆయన న్యాయాధికారి’’ అన్నాడో భటుడు.‘‘మీ దేశంలో న్యాయం ఇలా నిద్రపోతూ ఉంటుందా?’’‘‘మెలకువల వల్ల అనర్థాలు ఉన్నప్పుడు, నిద్రపోవడమే న్యాయం. ఆయన నిద్రలో కలలు కని, వాటి ఆధారంగా తీర్పులు చెబుతాడు’’.‘‘కలల్ని బట్టి తీర్పులు చెబుతాడా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘కలలతో తీర్పులేంటి, పాలనలే జరుగుతాయి. చాలాసార్లు కలలే పాలిస్తాయి. వ్యవస్థలు నిద్రపోతేనే వ్యక్తులకు న్యాయం జరిగేది’’.ఇంతలో న్యాయాధికారి గురక కూడా ప్రారంభించాడు. ఆ శబ్ధానికి నాలుగైదు గుర్రాలు బెదిరి పరుగులు తీశాయి. ఒక లేఖకుడు గురకని జాగ్రత్తగా వింటూ ఏదో రాసుకుంటూ ఉన్నాడు. గురకలో రాసుకోడానికి ఏముందో నాకర్థం కాలేదు. అదే అడిగాను.‘‘గురక గాఢతకు చిహ్నం. వినడానికి ఒకేలా ఉన్నా అందరూ ఒకేలా గురక పెట్టలేరు. శబ్ధం శబ్ధిస్తే దాన్ని గురక అంటారు. అర్థం కాకపోయినా శబ్ధానికి అర్థం ఉంటుంది. శబ్ధార్థాలు, అర్ధశబ్ధాలు జమిలి పదాలు’’ అన్నాడు. వాడు చెప్పిందాంట్లో అర్థం వెతకడం కంటే యూనివర్సిటీ థీసిస్ల్లో అర్థాలు వెతకడం ఈజీ.ఇంతలో ఒకాయన సైన్యంతో కవాతు చేస్తూ ఎదురొచ్చాడు. ‘‘ఎక్కడికి?’’ అని అడిగాను.‘‘యుద్ధానికి’’ కవాతు ఆపకుండా చెప్పాడు. ‘‘ఎవరి మీద?’’‘‘ఈ రాజ్యంలో ఎవరు ఎవరి మీదయినా యుద్ధం చేయవచ్చు. రాజు ప్రజలతో, ప్రజలు రాజుతో, ప్రజలు ప్రజలతో. యుద్ధం ఇక్కడ సర్వనామం. యుద్ధం తెలిసి చేస్తే అది ధర్మయుద్ధం. తెలియకుండా చేస్తే అది యుద్ధవ్యూహం అంటారు’’.నేను తికమకగా నడుస్తూ ఉంటే సాక్షాత్తూ తుగ్లక్ ప్రభువే ఎదురొచ్చాడు. ఆనందంగా దండం పెట్టాను. చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు.‘‘చూడ్డానికి ఇంత హూందాగా ఉన్నారే, మీకు పిచ్చి తుగ్లక్ అని పేరెందుకొచ్చింది?’’ అని అడిగాను.‘‘పిచ్చి వాళ్లను పాలించడం వల్ల’’ అన్నాడు. ‘‘అయితే మీకు పిచ్చి లేదా?’’‘‘పిచ్చిలో ఉన్న పిచ్చి గొప్పతనం ఏంటంటే, అది వున్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. ఇలా ప్రశ్నలు అడిగేవాళ్లను మా రాజ్యంలో యాభై కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.భటుడు కొరడా తీసేలోగా నేను టైం మిషన్‌లో పారిపోయి వచ్చాను.మన కాలంలోకి రాగానే ‘ట్రంపెట్’ మోగింది.మనం ఏ కాలంలో జన్మించినా ఆయా కాలాల్లో తుగ్లక్‌లు పుడుతూనే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒక తుగ్లక్‌ని మోస్తూనే ఉంటుంది. – జి.ఆర్.మహర్షి -
క్యూల్లోలం
హ్యూమర్ ప్లస్ బ్యాంకుల దగ్గర క్యూల్లో నిలబడి నిలబడి సుబ్బారావు లాంగ్వేజి, బాడీలాంగ్వేజి రెండూ మారిపోయాయి. అర్ధరాత్రి ఏటీఎంలో డబ్బులొస్తున్నాయని తెలిసి చలికి వణుకుతూ పరిగెత్తాను. ఒక శాలువా కప్పుకుని బూచాడిలా తగిలాడు సుబ్బారావు. ఒకవైపు చలి, మరోవైపు కవి. మోడీ పెడుతున్న ఇక్కట్ల ముందు కవులు ఏ పాటి అని ధైర్యంగా నిల్చున్నాను.‘‘దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే క్యూలోయి’’ అన్నాడు సుబ్బారావు. రైలు బ్రేక్ వేసినపుడు పెట్టెలన్నీ ఒక్కసారిగా కదిలిసర్దుకున్నట్టు, క్యూలైన్ అంతా ఒక్కసారిగా కొంత వణికింది.ఎవరో తెలిసినవాడు కనిపిస్తే ‘‘క్యూఎ, క్యూలా, క్యూవు, క్యూన్నా, క్యూవు’’ అని అడిగాడు. అది లేడీస్టైలర్ సినిమాలోని జమజచ్చ భాషని అర్థమైంది.వెంటనే అవతలివాడు ‘‘క్యూశ్ఛ క్యూటే క్యూవశా, క్యూటండ్రే, క్యూటాక్స్’’ అని బాహుబలి కాలకేయుడిలా అన్నాడు. నేను కొంత జడుసుకుని ‘‘నీ భాష అర్థమైంది. కానీ వాడిదేం భాష?’’ అని సుబ్బారావుని అడిగాను.‘‘వాడి పిండాకూడు భాష. నెలరోజుల నుంచి లైన్లలో నిలబడి, వాడికి కనెక్షన్ కట్టయ్యింది’’ అని చెప్పాడు. క్యూలైన్ కొద్దిగా కదిలింది.‘‘మోడీ గొప్పవాడు. దేశం మొత్తాన్ని తమ కాళ్ళపైన తాము నిలబడేలా చేశాడు. ప్రపంచం మొత్తం మీద నాకు నచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి క్యూబా, తెలుగులో రాస్తే క్యూబాలో క్యూ వుంది. రెండు ఖతర్, ఇంగ్లీ్లష్లో రాస్తే ఖతర్‌లో క్యూ వుంది. అసలీ ప్రపంచానికి పట్టిన దరిద్రమేంటో తెలుసా? ఏ అగ్రదేశం పేరులోనూ క్యూ లేకపోవడం’’ ఐక్యూ అంటే ఐయామ్ ఇన్ క్యూ. నేను క్యూలో వున్నానంటే నేను జీవించి వున్నాననే అర్థం. క్యూ ఎలా వుంటుందో చెప్పు. ఇంగ్లీష్‌లో రాస్తే వంకాయ బాంబులా వుంటుంది. ఒక సున్నాకి కింద తోక వదిలితే క్యూ. ఆ తోకకి నిప్పుపెట్టి లంకా దహనానికి పూనుకున్నాడు మన ప్రధాని. దశరథుడు వనవాసం వెళ్ళమన్నాడు కాబట్టి సరిపోయింది, అదే బ్యాంక్ క్యూలో నిలబడమని అడిగుంటే రాముడు పితృవాక్యానికి ఫుల్స్టాప్ పెట్టి ‘పితాశ్రీ, వనవాసంలో ఎవడో ఒకడు హెల్ప్ చేస్తాడు. కానీ క్యూలైన్లో హెల్ప్లైన్లుండవు అనేవాడు...’’ ఇలా సుబ్బారావు ఏదో చెబుతుండగా ఆయన భార్య వచ్చి ఏమండీ?’’ అని అరిచింది. సుబ్బారావు కోపంగా చూసి ‘‘క్యూ లైన్లో వరుసే తప్ప వావి వుండదు’’ అని ఒక కర్ర తీసుకుని ఆమెని తరుముకున్నాడు.సుబ్బారావు ఎటుపోయాడో తెలియదు కానీ, ఆయన భార్య నా దగ్గరికి వచ్చి ‘‘చెవి, తాళం చెవి ఒకటే అనుకునే వెర్రిమాలోకం సార్ ఆయన. కార్డు మరిచి క్యూలోకి వచ్చాడు’’ అని కార్డు నా చేతికిచ్చింది.‘‘అసలేమైంది?’’ అని అడిగాను ‘‘ఇరవై రోజులుగా క్యూల్లో నిలబడి, క్యూ పిచ్చి పట్టింది. ఇంటి దగ్గర భోజనానికి కూడా క్యూలోనే వస్తున్నాడు. మొన్న పెళ్ళికెళితే ఫంక్షన్ హాల్లోకి అందరూ క్యూలో రావాలని కర్ర తీసుకుని వెంటపడ్డాడు. ఈయన దెబ్బకి డోలు కొట్టేవాళ్ళు పారిపోయారు. క్యూలో రావడం కల్చరని బర్రెల గుంపుకి ఉపన్యాసమిస్తే అవి కంగారుపడి కొమ్ములతో కుమ్మాయి. రోడ్డు మీద నడుస్తూ క్యూ క్యూ అని కేకలు పెడుతూ వుంటే వీధికుక్కలు వెంటపడి మొరుగుతున్నాయి. ఇంగ్లీష్ భాషలో క్యూ తప్ప వేరే అక్షరమే లేదని వాదిస్తున్నాడు. భార్యాభర్తలు పి, క్యూల్లాగా ఎడమొహం పెడమొహంలా వుండాలట’’ అని ఆమె గోడు వెళ్ళబోసుకుంది.ఇంతలో సుబ్బారావు వచ్చాడు. ఆయన భార్య జారుకుంది. కార్డుని ఇచ్చాను.‘‘కార్డు వల్ల సుఖమేంటో తెలుసా? డబ్బులతోపాటు వీపుని కూడా గోక్కోవచ్చు. క్యాష్‌లెస్ అంటే దేశానికి మొత్తం దురద పుట్టించడమే’’అన్నాడు సుబ్బారావు. లైన్ స్లోగా వుండేసరికి చలిమంట వేసుకున్నాం. అగ్నికీలల్ని చూసేసరికి సుబ్బారావు కవిత్వం ఎత్తుకున్నాడు. క్యూ అంది కోయిలమ్మక్యూరియాసిటీ పెరిగింది నాలోక్యూతవేటు దూరంలోక్యూల్లోలం రేగింది..మామూలుగా అయితే జనం కకావికలయ్యేవారే కానీ, కవిత్వాన్ని కూడా తట్టుకునేంత గుండె ధైర్యాన్ని జనం నెలరోజుల్లో సంపాదించారు. అదే విచిత్రం! – జి.ఆర్. మహర్షి -
బుర్ర తిరుగుడు
హ్యూమర్ ప్లస్ ఎవడికీ అర్థం కాకుండా మాట్లాడ్డమే జ్ఞానమని ఒకాయన కనిపెట్టాడు. ‘‘మారుతున్న విలువల మానవీకరణ నేపథ్యంలో నిర్దిష్ట కార్యాచరణ సూత్ర చందోబద్ధమైన మనిషి అశాస్త్రీయ ఆలోచనల వితర్కమే నేటి సమాజం’’ అనేవాడు. అంతా అర్థమైనట్టే వుండేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇలాంటి బ్రహ్మ పదార్థాలను చూస్తే మన యూనివర్సిటీలకి అమితానందం. కర్రకి బుర్రకి అవినాభావ సంబంధముందని నమ్మి, ఈ అంశంపై తులనాత్మక పరిశోధన కూడా చేసి డాక్టరేట్ పుచ్చుకున్న ఒక ప్రొఫెసర్‌కి పైన చెప్పిన భాషా శాస్త్రవేత్త తగిలాడు. ఇద్దరూ కలిసి ఒక సెమినార్ ఏర్పాటు చేసుకున్నారు. మన ప్రొఫెసర్ ప్రత్యేకత ఏమంటే ఆయన చేతిలో ఒక పొన్నుకర్ర వుంటుంది. తన వాగ్ధాటిని కంట్రోల్ చేయడం తనకే చేతకాని క్లిష్ట సమయాల్లో కర్రతో నెత్తిన ఒకటిచ్చుకుంటాడు. చేతివైద్యమన్నమాట. అప్పుడు రేడియోలో స్టేషన్ మారినట్టు ఆయన భావజాలం ట్యూనింగ్ మార్చుకుంటుంది. ఎదుటివాళ్లు ఎక్కువ మాట్లాడినా కూడా ఇదే ట్రీట్మెంట్. ఎవడైనా మైకుని కేకు కొరికినట్టు కొరకడం మొదలుపెడితే ఆయన బెల్లు కొట్టకుండా కర్రతో నెత్తిన కొడతాడు. తలాతోకా లేకుండా మాట్లాడేవాళ్లు కూడా ఈ దెబ్బకి కుదురుకుంటారు. లేదంటే తలకట్టే. సెమినార్ ప్రారంభమైంది. కర్ర పుచ్చుకుని ప్రొఫెసర్ అధ్యక్షత వహించాడు. భాషా శాస్త్రవేత్త మైకు తీసుకున్నాడు. ‘‘సమాజ చలన సూత్ర కాలానుగుణ పరిశీలనా క్రమగతిని పరిశీలిస్తే, నిరూపిత సత్య సంక్లిష్ట భావావేశమే సాహిత్యం. ఎగసిన వాయు వీచికల విధ్వంస నిర్లక్ష్య నిర్హేతుక సకల చరాచర ఎగసిపడిన కెరటమే కవిత్వం..’’ అని మొదలుపెట్టాడు. కర్రతో బుర్ర గోక్కుంటూ ప్రొఫెసర్ కూచున్నాడు. స్టూడెంట్లకు ఏమీ అర్థంకాకపోయినా అర్థమైనట్టే ముఖకవళికలు మార్చి చూస్తున్నారు. ఒకడు లేచి డౌట్ కూడా అడిగాడు. ‘‘సామ్రాజ్యవాద దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్థీకృత సరళతలో సాహిత్య పరాన్నభుక్కులు గరిటెడు విషవాయువుకి లోనై అదనపు విలువను మరిచిన మార్కెట్ శక్తుల మృదంగ ధ్వనిలో సాహిత్యపు ఉనికి ఆధారభూతమా? భ్రమా భరితమా?’’ అని అడిగాడు. తనకి సమవుజ్జీ దొరికాడని శాస్త్రవేత్త ఆనందపడ్డాడు. ‘‘నిరంకుశవాద దుష్టసంస్కృతి పరిరక్షణలో హక్కుల ఉద్యమ క్షీణదశ ఉత్థాన పతనాల ఆరోపిత పెట్టుబడిదారి సంక్షోభ విలయంలో సాహిత్యం హత్యాపాతక సదృశమై సన్నిహిత సామాజిక క్షణంలో...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ప్రొఫెసర్ లేచి కర్రతో ఒకటిచ్చాడు. శాస్త్రవేత్త ఒక్కక్షణం బుర్ర తడుముకుని, పదాల్లో తడబడ్డాడు. ‘‘గంభీర తటాక తరంగ ఉత్తేజిత గండరగండ, గండభేరుండ గండపెండేరాన్ని గ్రహించిన వారికి గడకర్రకి, దుడ్డుకర్రకి లవలేశ తేడా నిర్మాణం తెలియకపోవచ్చు. ఇంతకీ నన్నెందుకు కొట్టావు?’’ అని అడిగాడు. ‘‘చేతన్ చేన్ తోడన్ తోన్’’ అనేది ఏ విభక్తో నాకు తెలియదు కానీ, కోట్ కొట్టున్ కొడుతూనే వుండనేది భక్తి విభక్తి. దండం దశగుణమన్నారు. దండానికి దండం పెట్టనివాడు లేనే లేడు’’ అన్నాడు ప్రొఫెసర్. ఇప్పుడు ప్రొఫెసర్ ప్రసంగ పాఠమొచ్చింది. కర్రని శాస్త్రవేత్త పుచ్చుకోబోతే ప్రొఫెసర్ వారించాడు. ‘‘నా బుర్ర తిరుగుడు నాకు చెడుగుడుతో సమానం. ఎవడి బుర్రని వాడు మరమ్మతు చేసుకోవడమే ఇప్పుడు సమాజానికి కావాల్సిన కసరత్తు. విద్వత్తు నత్తులు కొట్టదు. ఒత్తులు మరిస్తే భాషలో ఒత్తిడికి గురవుతాం’’ అని ప్రొఫెసర్ బుర్రని ఒకసారి టంగ్మనిపించుకుని మైకు తీసుకున్నాడు. ‘‘శూన్య పాలపుంత అంతరిక్ష మండల నక్షత్ర ధూళి సంవేదనా ధరిత్రిలో మనుగడ సాగిస్తూ, వాయుసమ్మిళిత బుడగలో ఆయువు వూదుతూ సంపూర్ణ అసంపూర్ణ అమానవీయ చారిత్రక విభాత సంధ్యల్లో విస్పష్ట వికసన...’’ ఇలా కాసేపు సాగిన తరువాత తనకి తానే బ్రేకు వేసుకుని బుర్రపై ఒకటిచ్చుకున్నాడు. ‘‘ఎవడికి వాడు హింసించుకోవడం నాగరికత, ఇతరుల్ని హింసించడం జరుగుతున్న కథ’’ అని గొణుక్కున్నాడు శాస్త్రవేత్త. ఇదే అదునుగా ఒక స్టూడెంట్ లేచి ‘‘నిర్జర గర్జర సాగర సంభ్రమంలో విభ్రాంతికర సమ్మోహితమై నిశ్శబ్దయుద్ధవేళ మనమెటు వెళ్ళాలి ప్రొఫెసర్’’ అడిగాడు. ప్రొఫెసర్ వెంటనే కర్రతో వాడి నోరు మూయించాడు. జ్ఞాన సభ పూర్తయిన వెంటనే అక్కడున్న చెత్తని వూడుస్తున్న వ్యక్తి ‘‘పాపం, వీళ్లంతా మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నారు’’ అని నిట్టూర్చాడు. ‘‘మేధావులకి సామాన్యులు అర్థం కాకపోవడం, మేధావులు మేధావులకే అర్థం కాకపోవడం చాలా పాతకథ... ఇది అనంతం.’’ - జి.ఆర్. మహర్షి -
మా డ్రిల్లు కథ
హ్యూమర్ ఫ్లస్ పెద్దయింతరువాత ఏదేదో అయిపోతామని చిన్నప్పుడు అనుకుంటాం, ఏమీ కాకుండానే పెద్దవాళ్లమైపోతాం. రంగుల కలలు మాయమై గడ్డాలు మీసాలు బ్లాక్ అండ్ వైట్‌గా మారిపోతాయి. బ్లాక్‌ని వైట్‌మనీ చేసే మోడీ పథకాలుగా, వైట్‌ని బ్లాక్ హెయిర్ చేసే పథకాన్ని గోద్రేజ్వారు ఎప్పుడో ప్రవేశపెట్టారు. జుత్తుకి రంగేసిన తరువాత ఏదోఒకరోజు దురద తప్పదు. బాస్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడే అది మొదలవుతుంది. గోక్కుంటే కొరివితో తల గోక్కున్నట్టే. వాడు మాట్లాడే పిచ్చివాగుడు అర్థం కాక తల గోక్కుంటున్నామని అనుకుంటాడు. కథకి సంబంధం లేకుండా మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్ ఉన్నట్టు నేనిప్పటివరకు చెప్పిన హెయిర్డైకి ఇప్పుడు చెప్పబోయే దానికి ఏమీ సంబంధం లేదు. ప్రజలతో ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించినట్టు, కార్యకారణాలు లేకుండా జీవితం గడిచిపోతుంది. చిన్నప్పుడు నాకు ఆటలంటే ఇష్టం. చదువుకోవాలంటే బుర్ర కావాలి. అది మన దగ్గర లేదు. లేనిది ఉన్నట్టు అభినయించాలంటే కొంచెం వయసు రావాలి. గోలీలు, బొంగరాలు, కోతికొమ్మచ్చి ఇవి మన ఆటలు. బుద్ధున్న ఏ డ్రిల్లు అయ్యవారూ ఇవి నేర్పడు. ఏమీ నేర్పకపోగా వూరికే గ్రౌండ్లో పరిగెత్తమనేవాడు. పరిగెత్తకపోతే బెత్తంతో పిర్రలపై కొట్టేవాడు. వూరికే విజిల్ వూదడం తప్ప ఏ ఆటా నేర్పించేవాడు కాదు. ఎప్పుడైనా డిఇవో వచ్చినప్పుడు, మెడకో డోలు తగిలించుకుని దబ్దబ్మని బాదుతూ మాతో డ్రిల్లు చేయించేవాడు. ఒకసారి లేడీ డిఇవో వచ్చింది. మేము లెఫ్ట్ రైట్ కొట్టి, ఎప్పుడో ఒకసారి కనిపించే డిఇవో కంటే ఎప్పుడూ కనిపించే మా డ్రిల్లు అయ్యవారే గొప్పవాడని భావించి ఆయనకు మాత్రమే సెల్యూట్ చేశాం. ఆమె ఇగో హర్టయింది. ఇడియట్, బ్రూట్, స్టుపిడ్.. ఇంకా మాకు అర్థంకాని అనేక ఇంగ్లీష్ పదాలతో తిట్టింది. (ఇంగ్లిష్‌లో మాకు ప్రావీణ్యం లేకపోవడానికి కారణం మా ఇంగ్లిష్ మాస్టార్లకి ఇంగ్లిష్ రాకపోవడమే. అసలే ఇంగ్లిష్, ఆయనేం చెబుతున్నాడో ఆయనకే తెలియదు. ఇక మాకేం తెలుస్తుంది? స్కూళ్లలో ఇంగ్లిష్ ప్రవేశపెట్టకపోయినట్టయితే బ్రిటిష్ వాళ్ల మీద మనకు అంత ద్వేషం వుండేది కాదు. ఇంకో రెండొందల ఏళ్లు మనకు అర్థంకాని రీతిలో మనల్ని పాలించే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు). ఆ స్త్రీమూర్తి తిడుతున్నప్పుడు మా డ్రిల్లు అయ్యవారు సియాచిన్‌లో ఐస్‌వాటర్ తాగుతున్నట్టు గజగజ వణికాడు. ఆయన మోకాళ్లు టకటక కొట్టుకున్నాయి. ఆయన బెత్తం దెబ్బలతో బండబారిన మా ఒళ్లు ఆనందంతో పులకించింది. ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నందువల్ల మరుసటిరోజు నుంచి బెత్తాన్ని నాట్యం చేయించాడు. మమ్మల్ని ఆడుకోవడం తప్ప, మాకు ఆటలు నేర్పే అవకాశమే లేదని అర్థమై స్పోర్ట్స్మన్షిప్ని స్వయంకృషితో సాధించాలనుకున్నాం. ఎక్కడినుంచో ఓ చిరిగిపోయిన ఫుట్‌బాల్ తీసుకొచ్చి చెప్పులు కుట్టే ఆయన దగ్గర కుట్టించాం. సైకిల్ షాప్‌లో గాలి కొట్టించాం. గేమ్స్ ఆడేవాళ్ళు బూట్లు వేసుకోవాలనే విషయం కూడా మాకు తెలియదు. కాళ్లకి స్లిప్పర్లు కూడా లేని బ్యాచ్ మాది. ఫుట్‌బాల్ చూసిన ఆనందంలో యాహూ అని అరిచి కిక్ కొట్టాను. బాల్ ఎటుపోయిందో తెలియదు కానీ ఒక హృదయవిదారకమైన కెవ్వుకేక వినిపించింది. మాలో ఒకడికి తగలరాని చోట తగిలింది. అందరం పరారీ. వెతికి పట్టుకుని మరీ ఫుట్‌బాల్ ఆడారు. ఈసారి క్రికెట్ మీద మీద పడ్డాను. కొంతమంది స్టయిల్‌గా సోల్కర్, గవాస్కర్, పటౌడీ అని ఏవేవో గొణిగేవారు. మనకి పకోడీ తప్ప పటౌడీ ఏం తెలుసు. ఇంకొంతమంది ట్రాన్సిస్టర్‌లో కామెంట్రీ వినేవాళ్లు. ఆ రేడియో మా తాత గురకలాగా కాసేపు, ఫుల్‌గా తినొస్తే వచ్చే త్రేన్పుల్లా కాసేపు రకరకాల సౌండ్స్ చేసేది. కామెంట్రీ ఇంగ్లిష్ అక్షరం అర్థం కాకపోయినా, మన తెలుగు సినిమా యంగ్ హీరోల్లా సంబంధం లేని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్లు. ఏ ఆటా ఆడకుండానే టెన్త్ పాసయ్యాం. ఇంటర్లో నో డ్రిల్లు. యూనివర్సిటీలో ఏదో ఒక ఆటలో మాస్టర్ కావాలని డిసైడై పేకాట నేర్చుకున్నాం. చిన్నప్పుడు మాకు కనీసం గ్రౌండ్స్, డ్రిల్లు అయ్యవార్లు అయినా వుండేవాళ్లు. ఇప్పటి పిల్లలకి అదీ లేదు. కంప్యూటర్ గేమ్స్ తప్ప ఇంకొకటి తెలియనివాళ్లు లక్షల్లో వున్నారు. సింధు మెడల్ తెచ్చినప్పుడు మనందరం చప్పట్లు కొట్టి ఆనందంతో టీవీల ముందు కన్నీళ్లు కార్చాం. తెలుగు అమ్మాయి సింధుని చూసి గర్వపడడం మన హక్కు. కానీ టిఫిన్ కారియర్ సర్దుకుని, బరువైన పుస్తకాల సంచితో ఆటోల్లో వేలాడుతూ వెళుతున్న మీ అమ్మాయిల్లో కూడా సింధు దాగివుందేమో ఎప్పుడైనా గమనించారా? - జి.ఆర్. మహర్షి -
ఆర్ట్ ఆఫ్ డ్రామా
హ్యూమర్ ప్లస్ మా చిన్నప్పుడు నాటకాలు ఆడేవాళ్లు. రాగం తీస్తే జీడిపాకమే. ఎంతకూ తెగదు. నోట్లోకి నాలుగైదు రెక్కల పురుగులు వెళ్లి కాసేపు సరాగాలు ఆడుకున్నా చలించేవాళ్లం కాదు. రాగానికి రాగానికి మధ్య కొంతమంది కునుకు కూడా తీసేవాళ్లు. రాగం వేగం పుంజుకునే కొద్దీ హార్మోనిస్ట్ వేళ్లు మెట్ల మీద నాట్యం చేసేవి. మా ఊళ్లో సాంబశివయ్య అనే హార్మోనిస్టు ఉండేవాడు. మంచి సంగీత విద్వాంసుడే కానీ, మందు పడితే హార్మోన్లు పని చేయవు. ఈ మందుకున్న గొప్పతనం ఏమంటే నిజమైన కళాకారుల్ని నిద్రపుచ్చుతుంది. డూప్లికేట్ కళాకారుల్ని మేల్కొలుపుతుంది. అందుకే వైన్‌షాపుల్లో బోలెడంత మంది మంచింగ్‌తో పాటు సింగింగ్‌ని కూడా నంజుకుంటారు. స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులకంటే కూడా ఎక్కువ ఇంగ్లిష్ వినిపించేది ఇక్కడే. ఇంతకూ మన సాంబశివయ్య ఏం చేశాడంటే, నాటకం పరదాలు ఎత్తుతున్న సమయంలో బాటి ల్ మూత తీశాడు. మందుని బిగించాడు. మైక్ టెస్టింగ్‌లు జరుగుతూ ఉండగా నిశ్శబ్దంగా స్టేజి కిందికెళ్లి నిద్రపోయాడు. గురకలు తీశాడు కానీ అది మైక్ శబ్దం అనుకున్నారు. తబలావాడు ‘తదిగిణతోం’ అని దరువేసి హార్మోనిస్టుని కేకేశాడు. యముడి మహిషపు లోహపు గంటలు వినిపించినా లేచే పరిస్థితిలో లేడు సాంబశివుడు. తబలాకి అర్థమైంది, తనని వదిలి హార్మోనియం మందేసిందని. ‘తక్కిట తక్కిట’ అని కోపాన్నంతా తబలాపై తీర్చుకున్నాడు. మద్యం వల్ల పద్యానికి ఇబ్బంది వచ్చిందని నిర్వాహకులు గ్రహించారు. ప్రతి ఇల్యూజన్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల రామదాస్ రంగంలోకి వచ్చాడు. రామడోస్ అని ఆయనకో ముద్దు పేరు కూడా ఉంది. తనకి హార్మోనియం వస్తుందన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావని అడిగారు. ఎక్కడా నేర్చుకోలేదని చెప్పాడు. సంగీతాన్ని కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి నేర్చుకుంటారు. మన రామదాస్ హార్మోనియం వాయించడాన్ని చూశాడంతే. లోకంలోని మహా పండితులంతా గొప్ప గొప్ప విద్యల్ని ఇలాగే నేర్చుకున్నారు. కనీసం వరుసలైనా తెలుసా అని రామదాసుని అడిగితే తనకి వావి వరసలు లేవన్నాడు. వెళ్లి హార్మోనియం ముందు కూర్చున్నాడు. హార్మోనియంలు రెండు రకాలు. చేత్తో గాలిని తోసేవి. కుట్టు మిషన్ తొక్కినట్టు కాలితో తొక్కేవి. టెంట్ హాల్లో లాగా ఇలా రెండు క్లాసులు ఉంటాయని మనవాడికి తెలియదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసేసి రామదాసు బర్రుమని సౌండ్ చేశాడు. మందు వల్ల ఆల్రెడీ వణుకుతున్నందు వల్ల ఇతని ప్రమేయమేమీ లేకుండానే అవి మెట్ల మీద అటు ఇటు దొర్లాయి. తాము ఏమి పాడారో, వీడేం వాయించాడో నటులకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు ఏవో గావు కేకలు, పెడబొబ్బలు వినిపించాయి. స్టేజ్ టు లో ఉన్న సాంబశివుడు ఎంత నికార్సయిన కళాకారుడంటే తన హార్మోనియంపై ఎవరో దాడి చేసి హింసిస్తున్నారని అతను నిద్రలోనే గ్రహించాడు. వస్త్రాపహరణం నాటకంలో ద్రౌపదిలాగా తన పెట్టె వేడుకుంటూ ఉందని కలలోనే తెలుసుకుని మేల్కొన్నాడు. లేచి చూస్తే రామదాసు సైకిల్ తొక్కినట్టు హార్మోనియాన్ని తొక్కుతున్నాడు. వేళ్లు దబేల్ దబేల్ మని బాదుతుంటే కొన్ని మెట్లు ముక్కలు చెక్కలై ఉన్నాయి. తబలాకి ఏం వాయించాలో తెలియక మౌనం వహించింది. సాంబశివుడు మూడో కన్ను తెరిచాడు. స్టేజి పైన స్తంభంలోంచి రావాల్సిన నరసింహస్వామి స్టేజి కింద నుంచి వచ్చాడు. ప్రమాదం గ్రహించిన రామదాసు, హార్మోనియంని గాలికొదిలి సేఫ్టీ కోసం స్టేజి ఎక్కాడు. పెద్ద దుడ్డుకర్ర తీసుకుని వెంటపడి కొండంత రాగం తీస్తున్న నటులకి కూడా సాంబశివుడు రెండు వడ్డించాడు. రామదాసు మాత్రం దొరకలేదు. డోస్‌లో ఉన్నా జోష్ తగ్గకుండా పారిపోయాడు. ఇప్పుడు స్టేజి మీద ఆడే నాటకాలు తగ్గిపోయాయి. అవి జీవితాన్ని ఆక్రమించేశాయి. ఎవడికి వాడే మహా నటుడుగా మారిపోతున్నాడు. కొత్త నాటకాలకి తెరలు, రంగులు అక్కర్లేదు. ప్రాంప్టింగ్తో పని లేదు. డైలాగ్‌లు ఇన్‌స్టంట్‌గా తయారైపోతున్నాయి. నటుడు, ప్రేక్షకుడు ఒకే మనిషిలో కనిపించే ఆధునిక నాటకాలు ఇవి. - జి.ఆర్. మహర్షి -
లవ్-ఇష్క్-కాదల్
హ్యూమర్ ప్లస్ మనిషితో పాటే ప్రేమ పుట్టింది. కాకపోతే తొలి ప్రేమ వెనుక సైతాను ఉన్నాడు. ఆ మహానుభావుడు లేకపోయినా ఆడం, ఈవ్లు ఆపిల్‌ను తినేసి మన కొంప ముంచేవాళ్లు. మంచి చెబితే వినకపోవడం అక్కణ్ణుంచే మొదలైంది. ప్రేమ, దోమ ఎప్పుడూ కుడుతూనే ఉంటాయి. కొంతమందికి లేట్‌గా. కొందరికి టూ ఎర్లీగా. మా స్కూల్లో బాబు అని ఒకడుండేవాడు. టూమచ్ వాడు. మేస్టార్ ఎంత చావబాదినా ఇంగ్లిష్‌లో వాడు నేర్చుకున్నది ఒకే ఒక వాక్యం.. ఐ లవ్ యూ. అమ్మాయిలు కనిపిస్తే గజనీలాగా పిచ్చి చూపులు చూసి తనలోని అపరిచితుణ్ణి బయటికి తెచ్చేవాడు. కమ్యూనికేషన్లు లేని కాలం. సినిమాల్లో తప్ప బయట ఫోన్లు చూసినవారు, చేసినవారు అరుదు. లవ్ లెటర్లే దిక్కు. వీటితో సమస్య ఏమిటంటే కష్టపడి రాయాలి. ధైర్యంగా ఇవ్వాలి. బాబు స్పెషాలిటీ ఏమంటే వాడికి ఏ భాషా రాదు. ఆ విషయం వాడికి తెలియదు. ఒకమ్మాయికి లెటర్ ఇచ్చాడు. వీడి బాడీ లాంగ్వేజీ అర్థమైంది కానీ, లెటర్లో లాంగ్వేజీ అర్థం కాలేదు. తీసుకెళ్లి వాళ్ల నాన్నకిచ్చింది. ఆయన బాబు వాళ్ల నాన్నకు షేర్ చేశాడు. కట్ చేస్తే జల్లికట్టులో ఎద్దు పరిగెత్తినట్టు బాబు వీధుల్లో పరిగెత్తాడు. వెనుక కర్రతో వాళ్ల నాన్న. అనేక దండయాత్రల్లో ఓడిపోయినా, చివరికి ఈ బాబు ఒకమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాడు ఇంగ్లిష్‌లో నేర్చుకున్న రెండో వాక్యం లవ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్. దేవదాసు, మజ్నూలు భగ్న ప్రేమికులు కాబట్టే కథల్లోకి ఎక్కారు కానీ, పెళ్లయి ఉంటే వాళ్ల కథ కంచికి చేరేది. అక్కడ పార్వతి, లైలాలు కలిసి పట్టు చీరలు షాపింగ్ చేసేవాళ్లు. బోలెడంత మంది గొప్ప ప్రేమికులు పెళ్లయింతర్వాత వేదాంతులుగా మారిపోయారు. కొందరు సన్యాసుల్లో చేరిపోయారు. సన్యాసుల్ని చేయడమే తప్ప, సన్యాసంలో కలిసిపోయే అవకాశం ఆడవాళ్లకు లేనందువల్ల వాళ్లు గరిటెతో క్రికెట్ ఆడడం నేర్చుకున్నారు. గ్రౌండ్‌కి బదులు మొగుడి బుర్ర ఉంటుంది అంతే తేడా. సోక్రటీసుది కూడా లవ్ మ్యారేజే అయి ఉంటుంది. లేకపోతే నెత్తిన నీళ్ల కుండ బోర్లించేంత కోపం ఆవిడకెందుకొస్తుంది? జంకు లేకుండా విషం తాగడం వెనుక ఆయనకి అలాంటి అనుభవాలు బోలెడు ఉండే ఉంటాయి. ప్రేమించుకునేటప్పుడు లైన్లో లవర్స్ మాత్రమే ఉంటారు. పెళ్లయిన తర్వాత పాలవాడు, అద్దెవాడు, కిరాణా కొట్టు వాడు.. ఇలా కొట్టి డబ్బులు లాక్కోడానికి చాలామంది లైన్లో కొస్తారు. ఆ తర్వాత పిల్లలు లైన్లోకి వస్తారు. గుర్రుపెట్టి నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఈ ఎలుగుబంటినా నేను లవ్ చేసింది అని కంగారుతో నిద్రలేచిన భార్యలు ఎందరో ఉన్నారు. ప్రతి రోజూ ప్రేమికుల రోజే. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రేమికుల రోజు వచ్చింది. అయితే కొందరు పూనకం వచ్చి అడ్డుకోవాలని కూడా చూస్తున్నారు. ప్రేమని, గాలిని బంధించడం కష్టం. టెక్నాలజీ పెరిగి ప్రేమ కూడా సులభమైపోయింది. ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లతో ఎదిగిపోతూ ఉంది. గతంలో ప్రేమ పెరగడానికి, విరగడానికి కాస్త టైమ్ పట్టేది. ఇప్పుడంతా పర్ఫెక్ట్ టైమింగ్. ఉదయం స్టార్ట్ అయి, ఈవెనింగ్‌కి బ్రేకప్ కూడా అయిపోతూ ఉంది. మచ్చల్ని వెతకడం మూర్ఖత్వం. చంద్రుణ్ణి చూడడం ఆనందం. - జి.ఆర్.మహర్షి -
కంకాళకేయుడి కథ
హ్యూమర్ ఫ్లస్ ఫ్లాష్‌బ్యాక్‌లు వినివిని మైండ్ బ్లాకయిపోయిన ఆజానుబాహుబలి రిలీఫ్ కోసం వంటల పోటీకి వెళ్లాడు. గాడి పొయ్యి అంటించి అగ్గిరాముడై వెలుగుతుండగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ‘బాహుబలి’ అని గొణిగాడు. ఒళ్లంతా తారు పూసుకుని ఒక కంటికి గాజు కన్నుని ఎకస్రా ్టఫిట్టింగ్ చేసుకుని ఉన్నాడతను. అతని పక్కనున్న వ్యక్తి గంగాళంలోకి గరిటెకి బదులు చెయ్యిని పెట్టి కెవ్వున అరిచి ‘బాహుబలా?’ అన్నాడు. దాంతో అందరూ పూనకం పట్టినట్టు ‘బాహుబలి’ అని అరిచారు. ఇది చూసి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ప్రమాదముందని గ్రహించిన బలి పారిపోడానికి ప్రయత్నించాడు. గాజు కన్ను అడ్డుగా నిలబడ్డాడు. ‘‘తప్పేముంది స్టార్ట్ చెయ్యి’’ అన్నాడు బలి నిస్సహాయంగా. ‘‘నా పేరు కంకాళకేయుడు. కంటితో చూసిందేదీ నిజం కాదని గ్రహించిన నేను ఈ గాజుకన్నుతో లోకాన్ని చూస్తున్నాను. మీ నాన్న చేతిలో మానం పోయి నగ్నసత్యాన్ని తెలుసుకున్న కళావర్కేయుడు మా అన్న. అరటి ఆకులు కప్పుకుని ఎదుట నిలబడిన మా అన్నని చూసి ఏం జరిగిందని అడిగాను. ‘హరహర మహాదేవ సాంబశివగామి’ అని అరిచాడు. నేను జడుసుకుని ఆ శబ్దానికి అర్థమేమిటని అడిగాను. ఆమె ఒక స్త్రీమూర్తని, ఆమెతో ఏం మాట్లాడినా ప్రమాదమని చెప్పి, ప్రపంచంలో ఎవరికీ అర్థంకాని భాషలో ఆమెతో మాట్లాడితే బతికి బట్టకట్టొచ్చన్నాడు. దాంతో మా రాజ్యంలో నిఘంటువులు అమ్మేవాడిని పిలిచి ఎవరికీ అర్థం కాని భాష తయారు చేయమన్నాను. ఐదు నిముషాల్లో వాడు కిలకిల భాషని రెడీ చేశాడు. శాంపిల్‌గా ‘మిన్కిన్ డంకిన్, చెన్బన్ డమాడమాన్’ అని ఒక వాక్యం వదిలాడు. ఆకారాలను చూసి కాకుండా నకారాలను చూసి భయపడ్డం అదే మొదలు. యుద్ధానికి బయలుదేరాం. అనుకున్నట్టుగానే సాంబశివగామి చర్చలకు వచ్చింది. ‘‘లకలకన్, మకన్టెకన్, నిన్నన్కున్’’ అని అన్నాను. శివగామి చిరునవ్వు నవ్వి తమకు నమ్మకంగా ఉంటూ శత్రువులకి అతినమ్మకంగా రహస్యాలు చేరవేసే ఆఠీన్ జాకీని అనువాదకునిగా ప్రవేశపెట్టింది. వాడు తుండు గుడ్డని నోట్లో కుక్కుకుని ‘నా నోటితో చెప్పలేనమ్మగారూ’ అంటూ బోరున ఏడవసాగాడు. నేను తత్తరపడ్డాను. ‘‘మీ మీద వాడు మనసుపడ్డాడు అమ్మగారు’’ అని వాడు అనువాదం చేశాడు. నేను కోపంతో ‘‘చెత్తనా... (బీప్) నా లాంగ్వేజ్‌కి అర్థమే లేనపుడు ఎలా అనువాదం చేస్తావురా’’ అని బండబూతులు తిట్టాను. ‘‘మీ బాడీ లాంగ్వేజి ద్వారా అనువాదం చేశాను. ప్రపంచంలో అసలైన ప్రమాదం అనువాదమే. అనువాదకుడికి అర్థాలతో పనేలేదు. అసలు ఏ భాషా రాకుండా తెలుగులో పుస్తకాలే అనువాదం చేసినవాళ్లు ఎందరో వున్నారు తెలుసా’’ అన్నాడు జాకీ. వాడికి ఏ కీలుకాకీలు విరుద్దామనుకుంటూ ఉంటే శివగామి పళ్లునూరింది. కొడుకులు కత్తులు నూరారు. వాళ్ల వ్యూహాలన్నింటిని నేను చిత్తు చేస్తూ వుంటే శివగామి ‘గుర్రప్పా’ అని అరిచింది. గుర్రప్ప గుర్రంలా దబేలుమని దూకి అశ్వవ్యూహం అమలు చేశాడు. గుర్రం ఆకారంలో సైన్యం నిలబడి మమ్మల్ని వెనుక కాళ్లతో తన్నసాగింది. మా సైన్యంలో యుద్ధం చేసేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ ఉండడంతో తన్నులు తిని ఓడిపోయాం. అవమాన జ్వాలతో తిరిగి వెళ్లలేక ఇలా మంటముందు వంటవాడిగా మిగిలిపోయాను’’ అని కంకాళకేయుడు ముగించాడు. ఆజానుబాహుబలి కోపంతో ఊగిపోతూ ‘‘ప్రతివాడు ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పడమే కానీ ఇంతకూ మా నాన్న, వంటవాడు ఎలా అయ్యాడో చెప్పిచావండి’’ అని అరిచాడు. ‘‘అది మీ అమ్మ చారుసేన మాత్రమే చెప్పగలదు. పుట్టిన వెంటనే కేర్‌కేర్ మనకుండా చారుచారు మనడంతో ఆమెకాపేరు. డైమండ్ బళ్లాలుడి కోటలో ఉంది వెళ్లి అడుగు.’’ ‘‘ఎలా గుర్తుపట్టడం?’’ ‘‘కాలికి సంకెళ్లు వేసుకుని, ఎవరైతే కట్టెపుల్లలు ఏరి, పొయ్యిలో పెట్టి కాఫీ చేస్తూ ఉంటారో ఆమే చారుసేన.’’ - జి.ఆర్.మహర్షి -
కొలతలే వేరు
ప్రపంచంలో పుణ్యాత్ములకు కొదువలేదు కానీ నైపుణ్యాలకు మాత్రం కొదువే. మా ఊళ్లో ఒక టైలరుండేవాడు. ఆయన కొలతలే వేరుగా ఉండేవి. షర్ట్‌ని జాకెట్లా, ప్యాంట్‌ని నిక్కర్‌లా కుట్టేవాడు. డాక్టర్ స్టెతస్కోప్ మెడలో వేసుకున్నట్టు, టేప్‌ని మెడలో నాగుపాములా అటూ ఇటూ తిప్పేవాడు. కొలతలు తీసుకునేటప్పుడు కితకితలు పెట్టేవాడు. ప్రతిదీ లెక్కప్రకారం ఉండాలనేది ఆయన వాదన. కానీ లెక్కలు తప్పేవి. లోకంలో ఎవడి లెక్కలు వాడికుంటాయి. అవి మనకు మ్యాచ్ కాకపోతేనే ప్రాబ్లమ్. ఆ టైలర్కెంత ఆత్మవిశ్వాసమంటే తాను బొంబాయిలో ఉండాల్సినవాడినని (అప్పటికింకా బొంబాయే) బతికున్నంత కాలం నమ్మాడు. మనమెన్నడూ చూడనివాడికి పీకని అప్పగించడం ఒక్క బార్బర్ షాప్‌లోనే జరుగుతుంది. ఈ మధ్య ఒక షాపుకెళితే ఒక కుర్రాడు టీవీలోని సినిమా చూస్తూ నావైపు చూడకుండానే నా భుజానికి ఒక టవల్ కప్పాడు. టీవీని చూస్తూనే నా గడ్డాన్ని నిమిరాడు. మొక్కలకు నీళ్లు చిలకరించినట్టు ముఖానికి నీళ్లు కొట్టాడు. నేను తేరుకుని... వచ్చింది షేవింగ్‌కి కాదు, కటింగ్కని చెప్పాను. టీవీలో జోక్‌కి కిలకిల నవ్వుతూ, చేతినిండా నురగ తీసుకుని రెండు చెంపలూ టపా టపా వాయించాడు. నోరు తెరిచేలాగా పీకకి కత్తిపెట్టాడు. నోరు మూసుకున్నాను, కళ్లు మూసుకోడానికి భయమేసింది. స్క్రీన్‌పై బ్రహ్మానందం రాగానే గట్టిగా నవ్వుతూ కత్తిని పీకకి అదిమిపెట్టాడు. పీక నుంచి కత్తిని తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉండగా కరెంట్ పోయింది. అప్పుడు కుర్చీలో ఒక శాల్తీ ఉందని అతను గ్రహించి గడ్డాన్ని చదును చేస్తూ ఉండగా కరెంట్ వచ్చింది. చివరికి రక్తపు చారికలతో ఎలాగోలా బయటపడ్డాను. అప్పటినుంచి టీవీలు ఉన్న షాపులకు దూరంగా ఉంటూ, టీవీ లేని షాపుకి వెళ్లాను. అక్కడున్న ఆసామి శాలువాలాగా నాకో తెల్లటి వస్త్రాన్ని ఒళ్లంతా కప్పి చేతికి కత్తెర తీసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అవతలివాడితో గట్టిగా అరుస్తూ భరతనాట్యం, కూచిపూడి ఆడుతూ చివరికి ఏదో హరికథ చెప్పి వందన సమర్పణ చేస్తూనే కత్తెర టకటకలాడించాడు. క్రాఫు కాస్తా గుండైంది. తన నైపుణ్యాన్ని వెనుకాల ఒక అద్దం ద్వారా చూపించాడు. ఈ మధ్య స్కానింగ్ కోసం నెట్ సెంటర్కెళితే అక్కడున్న అమ్మాయి నా కాగితాలపై అనేక ప్రయోగాలు చేసి చివరికి తనకు స్కానింగ్ రాదని చెప్పింది. టికెట్ రిజర్వేషన్ కోసం వెళితే ఫేస్బుక్లో మునిగితేలుతున్న ఆ కుర్రాడు చెన్నైకి బుక్ చేశాడు. వాడిని ఫోన్లో నుంచి బయటకు లాగి నేను వెళ్లాల్సింది బెంగళూరుకని చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. మా బంధువుకి ఆరోగ్యం బాగాలేక బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పిస్తే గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష చేయడానికి అక్కడున్న నర్సుకి చేతకాక మూడు నాలుగుసార్లు రక్తాన్ని కళ్లజూసింది. మనకు మనుషులకు కొదువలేదు కానీ అందులో పనిమంతులెందరు అన్నదే ప్రశ్న. అరకొరగా పని తెలిసినవాళ్లు రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఎందరికి ఎన్ని అనవసర జబ్బులు తెచ్చిపెడుతున్నారో డాక్టర్లకే ఎరుక.మనమెంత జాగ్రత్తగా ఉన్నా ఈ బ్యాడ్ ఎక్స్‌పర్ట్‌లు మనకు తగులుతూనే ఉంటారు. ఇది పుణ్యభూమి కానీ నిపుణుల భూమి కాదు. - జి.ఆర్.మహర్షి -
అహమహం
హ్యూమర్ ఫ్లస్ ఒక స్వాములవారు ఉపదేశ భాషణం మొదలుపెట్టారు. ‘‘ఈ ప్రపంచంలో అన్ని సమస్యలు అహం వల్లే వస్తాయి. దీన్ని ఇంగ్లిష్‌లో ఇగో అంటారు. ఇగో అనే పదంలోనే ‘గో’ ఉంది. గో అంటే వెళ్లడం. ఇగో ఉండటమంటే మనలోని మనిషిని వెళ్లగొట్టడం. అహం అంటే నాకు తెలుసు అనుకోవడం. నాకు మాత్రమే తెలుసు అనుకోవడం. జ్ఞానం నా బ్యాంకు లాకర్లో ఉంది అనుకోవడమే అహం. ప్రపంచ యుద్ధాలన్నీ ఇగో వల్లే జరిగాయి. నేను గొప్పవాడిని అని హిట్లర్ ఇగో ఫీల్ కావడం వల్ల ప్రపంచం నాశనం అయిపోయింది. పాండవులని పూచిక పుల్లల్లా చూడ్డం వల్ల దుర్యోధనుడు గుల్లయిపోయాడు. ఒక సభలో యాభై మంది ప్రముఖులుంటే అందరిని వరుసబెట్టి పొగడాలి. ఎవణ్ణి మరిచిపోయినా వాడు ఇగో ఫీలై లేచి వెళ్లిపోతాడు. అందుకే సభలన్నీ బాజా భజంత్రీలుగా మారిపోతున్నాయి. ఈ మధ్య ఒక పుస్తకావిష్కరణ సభకు వెళితే ఎవడు ఎవణ్ణి పొగుడుతున్నాడో ఎవడికీ అర్థం కాలేదు. రచయితని మరిచిపోయి ఎవడికి అవసరమైనవాడిని వాడు పొగిడాడు. లేకపోతే ఇగో హర్ట్. ఈ మధ్య ఒకాయనకి ఇగో హర్టయ్యి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఒక పోలీస్ అధికారి పదవిలో ఉన్నంతకాలం నమస్కారాలకీ, పొగడ్తలకీ అలవాటుపడ్డాడు. ఆయన ఎక్కడికెళ్లినా తబలా వాయించేవాళ్లు, డోలు కొట్టేవాళ్లు, సన్నాయి మోగించేవాళ్లు క్యూలో నిలబడి తమ పని కానిచ్చేవాళ్లు. రిటైరయ్యేసరికి అంతా నిశ్శబ్దం. బతికుండగానే జనం ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. చొరవ తీసుకుని తానే రెండు మూడు సభలకి వెళ్లడానికి ప్రయత్నించాడు. జనం తెలివైనవాళ్లు. వర్తమానాన్నే ప్రేమిస్తారు. గతం వ్యక్తిగతం. దాంతో సమాజానికి పనిలేదు. అధికారికి గుండె చిల్లులుపడి ఆస్పత్రిలో చేరి స్వంత డబ్బు వదిలించుకున్నాడు. మన నాయకులు ఇగో కోసం కోట్లు ఖర్చుపెడతారు. దండలు, దండాలు లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. దీన్ని రాజకీయ స్పృహ అంటారు. సామాన్య జనానికి కూడా ఇగో తక్కువేం కాదు. నానా చెత్తని గెలిపించేది ఇగో ఎక్కువ కావడం వల్లే. అందువల్ల ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెరిగినట్టు ఇగో పెరిగితే ముప్పు. పోలీసులు సామాన్యుల్ని చితక్కొట్టినట్టు, నాయకులు అమాయకుల్ని పీడించినట్టు మనం కూడా ఇగో చితక్కొట్టి, దాన్ని పీడించి వదిలించుకోవాలి. ఈ అంశంపై సందేహాలుంటే అడగండి’’ అని భక్తుల్ని అడిగాడు. ‘‘స్వామీ! మొన్న టీవీలో చెవులానందస్వామి మాట్లాడుతూ, ‘అహం అంటే పరబ్రహ్మం. దాన్ని మనం కాపాడుకోవాలి’ అన్నారు’’ మైకు తీసుకుని ఒక భక్తుడు చెప్పాడు.స్వాములవారి కళ్లు కొలిమి నిప్పులయ్యాయి. చలిజ్వరం వచ్చినవాడిలా వణికాడు. గడ్డాన్ని బరబరా బరికి, ‘‘చెవులానందస్వామి అంటే ఎవడ్రా? టీవీలో ఆంజనేయస్వామి తాయెత్తులు అమ్ముకునేవాడూ నేనూ ఒకటేనా! నేను నాలుగు వేదాలు చదివాను. వేదంలో ఒక్క పాదమైనా వాడికి తెలుసా? వాడి పేరు ఎత్తితే డొక్క చించుతా’’ అని కర్ర తీసుకుని ప్రశ్న అడిగిన భక్తుని వెంటపడ్డాడు. భక్తుడు ఎటు పారిపోయాడో ఇంకా ఆచూకీ తెలియదు. - జి.ఆర్.మహర్షి