అహమహం
హ్యూమర్ ఫ్లస్
ఒక స్వాములవారు ఉపదేశ భాషణం మొదలుపెట్టారు. ‘‘ఈ ప్రపంచంలో అన్ని సమస్యలు అహం వల్లే వస్తాయి. దీన్ని ఇంగ్లిష్‌లో ఇగో అంటారు. ఇగో అనే పదంలోనే ‘గో’ ఉంది. గో అంటే వెళ్లడం. ఇగో ఉండటమంటే మనలోని మనిషిని వెళ్లగొట్టడం. అహం అంటే నాకు తెలుసు అనుకోవడం. నాకు మాత్రమే తెలుసు అనుకోవడం. జ్ఞానం నా బ్యాంకు లాకర్‌లో ఉంది అనుకోవడమే అహం.
ప్రపంచ యుద్ధాలన్నీ ఇగో వల్లే జరిగాయి. నేను గొప్పవాడిని అని హిట్లర్ ఇగో ఫీల్ కావడం వల్ల ప్రపంచం నాశనం అయిపోయింది. పాండవులని పూచిక పుల్లల్లా చూడ్డం వల్ల దుర్యోధనుడు గుల్లయిపోయాడు. ఒక సభలో యాభై మంది ప్రముఖులుంటే అందరిని వరుసబెట్టి పొగడాలి. ఎవణ్ణి మరిచిపోయినా వాడు ఇగో ఫీలై లేచి వెళ్లిపోతాడు. అందుకే సభలన్నీ బాజా భజంత్రీలుగా మారిపోతున్నాయి. ఈ మధ్య ఒక పుస్తకావిష్కరణ సభకు వెళితే ఎవడు ఎవణ్ణి పొగుడుతున్నాడో ఎవడికీ అర్థం కాలేదు. రచయితని మరిచిపోయి ఎవడికి అవసరమైనవాడిని వాడు పొగిడాడు. లేకపోతే ఇగో హర్ట్. ఈ మధ్య ఒకాయనకి ఇగో హర్టయ్యి హార్ట్ ఎటాక్ వచ్చింది.
ఒక పోలీస్ అధికారి పదవిలో ఉన్నంతకాలం నమస్కారాలకీ, పొగడ్తలకీ అలవాటుపడ్డాడు. ఆయన ఎక్కడికెళ్లినా తబలా వాయించేవాళ్లు, డోలు కొట్టేవాళ్లు, సన్నాయి మోగించేవాళ్లు క్యూలో నిలబడి తమ పని కానిచ్చేవాళ్లు. రిటైరయ్యేసరికి అంతా నిశ్శబ్దం. బతికుండగానే జనం ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. చొరవ తీసుకుని తానే రెండు మూడు సభలకి వెళ్లడానికి ప్రయత్నించాడు. జనం తెలివైనవాళ్లు. వర్తమానాన్నే ప్రేమిస్తారు. గతం వ్యక్తిగతం. దాంతో సమాజానికి పనిలేదు. అధికారికి గుండె చిల్లులుపడి ఆస్పత్రిలో చేరి స్వంత డబ్బు వదిలించుకున్నాడు.
మన నాయకులు ఇగో కోసం కోట్లు ఖర్చుపెడతారు. దండలు, దండాలు లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. దీన్ని రాజకీయ స్పృహ అంటారు. సామాన్య జనానికి కూడా ఇగో తక్కువేం కాదు. నానా చెత్తని గెలిపించేది ఇగో ఎక్కువ కావడం వల్లే. అందువల్ల ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెరిగినట్టు ఇగో పెరిగితే ముప్పు. పోలీసులు సామాన్యుల్ని చితక్కొట్టినట్టు, నాయకులు అమాయకుల్ని పీడించినట్టు మనం కూడా ఇగో చితక్కొట్టి, దాన్ని పీడించి వదిలించుకోవాలి. ఈ అంశంపై సందేహాలుంటే అడగండి’’ అని భక్తుల్ని అడిగాడు.
‘‘స్వామీ! మొన్న టీవీలో చెవులానందస్వామి మాట్లాడుతూ, ‘అహం అంటే పరబ్రహ్మం. దాన్ని మనం కాపాడుకోవాలి’ అన్నారు’’ మైకు తీసుకుని ఒక భక్తుడు చెప్పాడు.స్వాములవారి కళ్లు కొలిమి నిప్పులయ్యాయి. చలిజ్వరం వచ్చినవాడిలా వణికాడు. గడ్డాన్ని బరబరా బరికి, ‘‘చెవులానందస్వామి అంటే ఎవడ్రా? టీవీలో ఆంజనేయస్వామి తాయెత్తులు అమ్ముకునేవాడూ నేనూ ఒకటేనా! నేను నాలుగు వేదాలు చదివాను. వేదంలో ఒక్క పాదమైనా వాడికి తెలుసా? వాడి పేరు ఎత్తితే డొక్క చించుతా’’ అని కర్ర తీసుకుని ప్రశ్న అడిగిన భక్తుని వెంటపడ్డాడు. భక్తుడు ఎటు పారిపోయాడో ఇంకా ఆచూకీ తెలియదు.
- జి.ఆర్.మహర్షి