క్యూల్లోలం | humer plus | Sakshi
Sakshi News home page

క్యూల్లోలం

Published Sun, Dec 25 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

క్యూల్లోలం

క్యూల్లోలం

హ్యూమర్‌ ప్లస్‌

బ్యాంకుల దగ్గర క్యూల్లో నిలబడి నిలబడి సుబ్బారావు లాంగ్వేజి, బాడీలాంగ్వేజి రెండూ మారిపోయాయి. అర్ధరాత్రి ఏటీఎంలో డబ్బులొస్తున్నాయని తెలిసి చలికి వణుకుతూ పరిగెత్తాను. ఒక శాలువా కప్పుకుని బూచాడిలా తగిలాడు సుబ్బారావు. ఒకవైపు చలి, మరోవైపు కవి. మోడీ పెడుతున్న ఇక్కట్ల ముందు కవులు ఏ పాటి అని ధైర్యంగా నిల్చున్నాను.‘‘దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే క్యూలోయి’’ అన్నాడు సుబ్బారావు. రైలు బ్రేక్‌ వేసినపుడు పెట్టెలన్నీ ఒక్కసారిగా కదిలిసర్దుకున్నట్టు, క్యూలైన్‌ అంతా ఒక్కసారిగా కొంత వణికింది.ఎవరో తెలిసినవాడు కనిపిస్తే ‘‘క్యూఎ, క్యూలా, క్యూవు, క్యూన్నా, క్యూవు’’ అని అడిగాడు. అది లేడీస్‌టైలర్‌ సినిమాలోని జమజచ్చ భాషని అర్థమైంది.వెంటనే అవతలివాడు ‘‘క్యూశ్ఛ క్యూటే క్యూవశా, క్యూటండ్రే, క్యూటాక్స్‌’’ అని బాహుబలి కాలకేయుడిలా అన్నాడు.

నేను కొంత జడుసుకుని ‘‘నీ భాష అర్థమైంది. కానీ వాడిదేం భాష?’’ అని సుబ్బారావుని అడిగాను.‘‘వాడి పిండాకూడు భాష. నెలరోజుల నుంచి లైన్లలో నిలబడి, వాడికి కనెక్షన్‌ కట్టయ్యింది’’ అని చెప్పాడు. క్యూలైన్‌ కొద్దిగా కదిలింది.‘‘మోడీ గొప్పవాడు. దేశం మొత్తాన్ని తమ కాళ్ళపైన తాము నిలబడేలా చేశాడు. ప్రపంచం మొత్తం మీద నాకు నచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి క్యూబా, తెలుగులో రాస్తే క్యూబాలో క్యూ వుంది. రెండు ఖతర్, ఇంగ్లీ్లష్‌లో రాస్తే ఖతర్‌లో క్యూ వుంది. అసలీ ప్రపంచానికి పట్టిన దరిద్రమేంటో తెలుసా? ఏ అగ్రదేశం పేరులోనూ క్యూ లేకపోవడం’’

ఐక్యూ అంటే ఐయామ్‌ ఇన్‌ క్యూ. నేను క్యూలో వున్నానంటే నేను జీవించి వున్నాననే అర్థం. క్యూ ఎలా వుంటుందో చెప్పు. ఇంగ్లీష్‌లో రాస్తే వంకాయ బాంబులా వుంటుంది. ఒక సున్నాకి కింద తోక వదిలితే క్యూ. ఆ తోకకి నిప్పుపెట్టి లంకా దహనానికి పూనుకున్నాడు మన ప్రధాని. దశరథుడు వనవాసం వెళ్ళమన్నాడు కాబట్టి సరిపోయింది, అదే బ్యాంక్‌ క్యూలో నిలబడమని అడిగుంటే రాముడు పితృవాక్యానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి ‘పితాశ్రీ, వనవాసంలో ఎవడో ఒకడు హెల్ప్‌ చేస్తాడు. కానీ క్యూలైన్‌లో హెల్ప్‌లైన్‌లుండవు అనేవాడు...’’ ఇలా సుబ్బారావు ఏదో చెబుతుండగా ఆయన భార్య వచ్చి ఏమండీ?’’ అని అరిచింది.

సుబ్బారావు కోపంగా చూసి ‘‘క్యూ లైన్‌లో వరుసే తప్ప వావి వుండదు’’ అని ఒక కర్ర తీసుకుని ఆమెని తరుముకున్నాడు.సుబ్బారావు ఎటుపోయాడో తెలియదు కానీ, ఆయన భార్య నా దగ్గరికి వచ్చి ‘‘చెవి, తాళం చెవి ఒకటే అనుకునే వెర్రిమాలోకం సార్‌ ఆయన. కార్డు మరిచి క్యూలోకి వచ్చాడు’’ అని కార్డు నా చేతికిచ్చింది.‘‘అసలేమైంది?’’ అని అడిగాను ‘‘ఇరవై రోజులుగా క్యూల్లో నిలబడి, క్యూ పిచ్చి పట్టింది. ఇంటి దగ్గర భోజనానికి కూడా క్యూలోనే వస్తున్నాడు. మొన్న పెళ్ళికెళితే ఫంక్షన్‌ హాల్లోకి అందరూ క్యూలో రావాలని కర్ర తీసుకుని వెంటపడ్డాడు. ఈయన దెబ్బకి డోలు కొట్టేవాళ్ళు పారిపోయారు. క్యూలో రావడం కల్చరని బర్రెల గుంపుకి ఉపన్యాసమిస్తే అవి కంగారుపడి కొమ్ములతో కుమ్మాయి. రోడ్డు మీద నడుస్తూ క్యూ క్యూ అని కేకలు పెడుతూ వుంటే వీధికుక్కలు వెంటపడి మొరుగుతున్నాయి.

ఇంగ్లీష్‌ భాషలో క్యూ తప్ప వేరే అక్షరమే లేదని వాదిస్తున్నాడు. భార్యాభర్తలు పి, క్యూల్లాగా ఎడమొహం పెడమొహంలా వుండాలట’’ అని ఆమె గోడు వెళ్ళబోసుకుంది.ఇంతలో సుబ్బారావు వచ్చాడు. ఆయన భార్య జారుకుంది. కార్డుని ఇచ్చాను.‘‘కార్డు వల్ల సుఖమేంటో తెలుసా? డబ్బులతోపాటు వీపుని కూడా గోక్కోవచ్చు. క్యాష్‌లెస్‌ అంటే దేశానికి మొత్తం దురద పుట్టించడమే’’అన్నాడు సుబ్బారావు.
లైన్‌ స్లోగా వుండేసరికి చలిమంట వేసుకున్నాం. అగ్నికీలల్ని చూసేసరికి సుబ్బారావు కవిత్వం ఎత్తుకున్నాడు. క్యూ అంది కోయిలమ్మక్యూరియాసిటీ పెరిగింది నాలోక్యూతవేటు దూరంలోక్యూల్లోలం రేగింది..మామూలుగా అయితే జనం కకావికలయ్యేవారే కానీ, కవిత్వాన్ని కూడా తట్టుకునేంత గుండె ధైర్యాన్ని జనం నెలరోజుల్లో సంపాదించారు. అదే విచిత్రం!

– జి.ఆర్‌. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement