కొక్కోరోకో | humer plus story | Sakshi
Sakshi News home page

కొక్కోరోకో

Published Sun, Mar 12 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

కొక్కోరోకో

కొక్కోరోకో

హ్యూమర్‌ ప్లస్‌

మన నమ్మకాలే నమ్మకాలు. ఎదుటివాళ్ళ నమ్మకాలు మూఢనమ్మకాలు. లోకం సజావుగా నడవాలంటే మన మీద మనకి విశ్వాసం, ఎదుటివాళ్ళ మీద అవిశ్వాసం ఉండాలి. నిప్పు పట్టుకుంటే కాలదని వెనకటికి మావూళ్ళో ఒకాయన వాదించేవాడు. కాలుతుందని మనం నమ్మడం వల్లే అది కాలుస్తుందని అనేవాడు. కానీ బొబ్బలు ఎక్కడినుంచి వస్తాయని అడిగితే పెడబొబ్బలు పెట్టి తన సిద్ధాంతాన్ని విడమర్చి చెప్పేవాడు. నొప్పి అనేది స్పందనా లోపమని, గాయం ఒక దృశ్య లోపమని, భావనే ప్రపంచాన్ని నడిపిస్తుందని అనేవాడు. తర్కం తర్కించడానికే తప్ప పరీక్షించడానికి కాదని కూడా ఆయనకి తెలుసు. అందుకే నిప్పుని ఎప్పుడూ ముట్టుకోలేదు. నమ్మించడానికి పెద్ద ప్రపంచమే వుంటుంది. కానీ నమ్మడానికి మనది చాలా చిన్న జీవితం. రసాయన సిద్ధాంతాన్ని ఎంత బోధించినా భౌతికశాస్త్రాన్ని విస్మరించరాదు. అందుకే గతితార్కిక భౌతిక అధివాస్తవిక, సూత్ర చలన, గమనశీల అనే ఉపన్యాసాలతో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళంతా నయా రివిజనిస్ట్, బూర్జువా, భూస్వామ్య ఫ్యూడల్‌ అవశేష పదజాలంలో కలిసిపోయారు.

కోడిపుంజుని మనం వంటకంగా భావిస్తాం కానీ, అది మాత్రం తనని తాను మేధావిగా భావిస్తూ పుంజుకుంటూ వుంటుంది. తన కూతతోనే సూర్యుడు కళ్ళు తెరుస్తాడని నమ్ముతుంది. ఈ లోకానికి తానే వెలుగు ప్రసాదిస్తున్నాననే జ్ఞాన కాంతిపుంజంతో రెక్కలు విప్పుకుంటూ వుంటుంది. జ్ఞానులని నమ్మిన ప్రతివాడ్ని ఈ ప్రపంచం గొంతుకోసి చంపుతుంది. ఆయుధాన్ని కనుగొన్నప్పుడే మనిషి జ్ఞానాన్ని వేటాడ్డం మొదలుపెట్టాడు.సత్యాన్ని ఆవిష్కరించాలనుకున్న తన పూర్వీకులంతా కత్తికి ఎరగా మారారని ఒక కోడిపుంజు గ్రహించింది. తన స్వరమహిమ చాటాలని బయలుదేరింది.

ఒక రాతి బండ కింద గుటకలు మింగుతున్న కప్ప కనిపించింది. తనకి, సూర్యుడికి గల అవినాభావ సంబంధాన్ని ‘కొరకొర’ శబ్దంతో వివరించింది. అంతా విన్న కప్ప నాలుగు అడుగులు ముందుకి, రెండు అడుగులు వెనక్కి గెంతింది. ‘‘నీ గురించి నీకెంత తెలుసో, నా గురించి నాకు అంతే తెలుసు. బండచాటు నుంచి నేను బయటకు వచ్చిన ప్రతిసారి వర్షం వస్తుంది. అంటే ఈ లోకానికి జలాన్ని ప్రసాదించే శక్తి నాకు మాత్రమే వుంది. చిటపట చినుకులకి, బెకబెకలకి సంబంధముంది. ఈ సత్యాన్వేషణ గురించి లోకానికి తెలియజేయాలనుకుని యాత్రార్ధులై వెళ్ళిన నా పూర్వీకులందరూ చైనీస్‌ హోటళ్ళలో తేలారు. ప్రకృతి శక్తి గురించి తెలిసిన ప్రతివాడ్ని ఈ లోకం వండుకు తింటుంది జాగ్రత్త’’ అని కప్ప రాతిలో జరిగే జీవపరిణామం, తద్వారా ఉద్భవించే పురుగుల అన్వేషణకి బయలుదేరింది.

ప్రతివాడికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనది మనం చెప్పడానికి ప్రయత్నిస్తే అవతలివాడు వాడిది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రెండింటి వైరుధ్యాల మధ్య యుద్ధం జరిగి కొత్తది పుడుతుంది. ఇతరుల్ని మనం అంగీకరిస్తే, మనల్ని అంగీకరించేవాడు ఎక్కడో తగలకపోడని నమ్మి పుంజు బయలుదేరింది. ఒక తొండ తగిలింది. సూర్య సిద్ధాంతాన్ని వివరించేలోగా అది అందుకుంటూ ‘‘ఈ లోకానికి వ్యాయామాన్ని నేర్పించిందే నేను. తొలి సిక్స్‌ప్యాక్‌ రూపకర్తను నేను’’ అంటూ బస్కీలు మొదలుపెట్టింది. ఈసారి ఊసరవెల్లి తగిలింది. డ్రామాలో ఫోకసింగ్‌ లైట్లని మార్చినట్టు ఒంటిమీద రంగుల్ని మార్చింది.

‘‘ప్రపంచాన్ని వర్ణశోభితం చేసింది నేనే. పెయింటర్లందరికీ నేనే స్ఫూర్తి’’ అని డబ్బా అందుకుంది.పుంజుకి తత్వం బోధపడింది. ఎవరికి వాళ్ళు తామే ఈ లోకాన్ని నడుపుతుంటామని భావిస్తారని, స్వీయజ్ఞానం అంటే ఇదేనని అర్థమైంది. దుఃఖంతో కోళ్ళ గంప చేరుకుంది. మరుసటిరోజు మబ్బులు పట్టి సూర్యుడు రాలేదు. తాను కూయకపోతే సూర్యుడు రాడని మారుజ్ఞానం పొందింది.
– జి.ఆర్‌. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement