న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్‌లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు.
ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే...
► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించారు.
► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు.
► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి.
► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్‌లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్‌ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి.
బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం..
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment