investor
-
కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
సెబీ.. ఇన్వెస్టర్ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహించనుంది. దీంతో ఉచితంగా స్వచ్చంద పద్ధతిలో ఇన్వెస్టర్లు ఆన్లైన్లో పరీక్షను రాయడం ద్వారా సరి్టఫికేషన్‌ను అందుకునేందుకు వీలుంటుంది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విజ్ఞానాన్ని పొందవచ్చని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సహకారంతో అభివృద్ధి చేసిన సర్టిఫికేషన్‌ను సెబీ జారీ చేయనుంది. వెరసి ఇన్వెస్టర్లు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ సెక్యూరిటీల మార్కెట్లో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు పరీక్ష ఉపయోగపడుతుందని తెలియజేసింది. -
అక్కడ రాహుల్ గాంధీ ఇన్వెస్టింగ్.. వంద నుంచి వెయ్యి రెట్ల లాభాలు!
కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. ఈయన దగ్గర ఉన్న మొత్తం విలువ రూ. 20.4 కోట్లుగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు.. జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు గత పదేళ్లలో మంచి వృద్ధిని పొందాయి. రాహుల్ గాంధీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు & పదేళ్లలో ఆ సంస్థల వృద్ధి ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్: +3625.00 శాతం ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్: +467.38 శాతం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్: +4028.06 శాతం దీపక్ నైట్రేట్ లిమిటెడ్: +3510.21 శాతం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: +443.78 శాతం డా. లాల్ పాత్లాబ్స్ లిమిటెడ్: +215.04 శాతం ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: 434.64 శాతం గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్: +3454.00 శాతం జీఎంఎం Pfaudler లిమిటెడ్: +469.09 శాతం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్: +291.49 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్: +363.68 శాతం ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్: +868.50 శాతం ఇన్ఫోసిస్ లిమిటెడ్: +275.39 శాతం ఐటీసీ లిమిటెడ్: +78.80 శాతం ఎల్టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్: +636.42 శాతం మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్: +595.35 శాతం నెస్లే ఇండియా లిమిటెడ్: +434.42 శాతం పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: +816.51 శాతం సుప్రజిత్ ఇంజినీరింగ్ లిమిటెడ్: +475.14 శాతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్: +263.04 శాతం టైటాన్ కంపెనీ లిమిటెడ్: +1123.42 శాతం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్: +1226.25 శాతం వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్: +1276.81 శాతం వినైల్ కెమికల్స్ (ఇండియా) లిమిటెడ్: +2101.45 శాతం బ్రిటానియా ఇండస్ట్రీస్: +1007.61 శాతం -
Anantha Nageswaran: ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే... ► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు. ► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్‌ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి. బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. -
గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇండియా ఎకానమి గ్రోత్‌కు సంబంధించి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. అందుకు అనువుగా స్టాక్‌మార్కెట్లు మరింత పుంజుకుంటున్నాయి. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ 8000 మార్కు వద్ద ఉండేది. ప్రస్తుతం 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని చేరుతుంది. భారత్ వృద్ధిపై ఎలాంటి అనుమానం లేకుండా సమీప భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందనే భావన బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా చాలా మంది స్టాక్మార్కెట్లో మదుపు చేస్తున్నారు. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మదుపరుల డేటా విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 2023లో భారీగా పెరిగింది. ఈ ఏడాదితో మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్ 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ గుజరాత్‌ను అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో యూపీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. -
విస్తరణ దిశగా ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. మార్చి నాటికి హోల్ సేల్, రిటైల్ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?
దివంగత పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝన్ ఝన్‌వాలా తన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దు కునేందుకు కలలు కన్నారు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్‌లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం, మలబార్ హిల్స్ ప్రాంతంలో 14-అంతస్తుల విశాలమైన బంగ్లా నిర్మాణం పూర్తి చేయకముందే కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో 2022 ఆగస్టులో కన్నుమూశారు. 2016-2017 మధ్య కాలంలో రిడ్జ్‌వే అపార్ట్మెంట్స్ అనే మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 371 కోట్లు వెచ్చించిన బిగ్ బుల్ ఝున్‌ఝన్‌వాలా. 2013 సంవత్సరంలో 6 ఫ్లాట్లను స్టాండర్డ్ చార్టర్డ్ నుండి రూ. 176 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు వేచి చూసి మరీ నాలుగేళ్ల తర్వాత, రూ. 195 కోట్లకు అత్యధికంగా బిడ్ చేసి మరీ సొంతం చేసుకున్నారు. (యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే! ) ఇటీవల ట్విటర్ యూజర్ ఝన్‌ఝన్‌వాలా ఇంటికి చెందిన సీఫేస్టెర్రస్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా మారింది. ఆర్జే అని స్నేహితులు ప్రేమగా పిలుచుకునే ఝన్‌ఝన్ వాలా అభిరుచిని గుర్తు చేసుకున్నారు. అబ్బురపరిచే ఈ బంగ్లా జీవితం పట్ల ఆర్జేకు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ బంగ్లా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రేస్‌లో ఆరు-సీట్ల డైనింగ్ టేబుల్, బార్, అవుట్డోర్ సీటింగ్ ఏరియాలు, పచ్చటి గడ్డి కార్పెట్, పచ్చదనంతో చక్కగా ఉండది. అలాగే నాలుగో అంతస్తులో పార్టీల కోసం బాంకెట్ హాల్, ఎనిమిదో అంతస్తులో జిమ్, స్టీమ్ రూమ్, స్పా , ప్రైవేట్ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. బాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, 5వ అంతస్తులో భారీ హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి. పై అంతస్తు 70.24 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్జర్వేటరీ ఏరియా, రీ-హీటింగ్ కిచెన్, పిజ్జా కౌంటర్, అవుట్డోర్ సీటింగ్ స్పేస్, వెజిటబుల్ గార్డెన్‌గా రూపొందించారు. మిగిలినదాన్ని కుటుంబంకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 10వ అంతస్తులో 4 పెద్ద గెస్ట్ బెడ్రూమ్ లున్నాయి. ఇక్కడ పిల్లలు కుమార్తె నిషిత, కవల కుమారులు ఆర్యమాన్ , ఆర్యవీర్ కోసం 11వ అంతస్తులో లగ్జరీ బెడ్ రూంలు ఉండేలా ప్లాన్ చేశారు. Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB — Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023 తన కోసం పెద్ద బెడ్రూం స్టాక్ మార్కెట్ లెజెండ్ ఝున్ఝన్వాలాతన భార్య రేఖతో కలిసి 12వ అంతస్తులో విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలతో మాస్టర్ బెడ్రూమ్ తయారు చేయించుకున్నారు. ఇది సగటు 2BHK కంటే 20 శాతం పెద్దది. అలాగే బాత్రూమ్ ముంబైలో విక్రయించే సగటు 1 BHK అంత పెద్దది. ఇక భోజనాల గది 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ కంటే పెద్దది. అంతేకాదు చిన్నప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అమెరికా బడా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్లను తన ఇంట్లో విందుకు ఆహ్వానించాలనే కోరిక ఉండేదిట. వీటితోపాటు, తన కలల ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన కన్నుమూయడం విషాదం. -
Bhumi Pednekar: అదర్ సైడ్ ఇన్వెస్టార్
‘నీకు తెలియని వ్యాపారంలో పొరపాటున కూడా పెట్టుబడి పెట్టవద్దు’ ‘పెట్టుబడికి సంబంధించిన రెండు రూల్స్ ఏమిటంటే... ఒకటి నష్టం రాకుండా చూసుకోవడం. రెండోది మొదటి రూల్‌ను మరచిపోకపోవడం’ అని పెద్దాయన వారెన్ బఫెట్(ప్రసిద్ధ ఇన్వెస్టర్, అపర కుబేరుడు) చెప్పిన మాటలను ఇష్టపడే బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్‌గా కూడా ‘రాణి’స్తోంది... తాజాగా క్రోమ్ ఆసియా హాస్పిటాలిటీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది భూమి పెడ్నేకర్. ‘మంచి బ్రాండ్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అంటుంది భూమి. క్రోమ్ ఆసియా గ్రూప్ ‘కయా’ పేరుతో గోవాలో బోటిక్ హోటల్‌ను ప్రారంభించింది. భోజనప్రియురాలైన భూమికి ప్రయాణాలు అంటే ఇష్టం. అందుకే ఆ రంగాలకు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ‘పెట్టుబడి పెట్టే ముందు లాభాల కంటే ముందు ఆ కంపెనీకి ఉన్న విశ్వసనీయత గురించి ఆలోచిస్తాను’ అంటుంది భూమి. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’లో ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తీసుకుంది. కమర్షియల్‌గా సక్సెస్ అయిన కామెడీ డ్రామా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’తో తన కెరీర్ ఊపందుకుంది. ఫోర్బ్స్ ఇండియా–2018 ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించింది. మూడు సంవత్సరాల క్రితం ‘క్లైమెట్ వారియర్’ క్యాంపెయిన్ మొదలుపెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తోంది. ముంబైలో జన్మించిన భూమికి మొదటి నుంచి కళలు, పర్యావరణం, వ్యాపారం అంటే ఆసక్తి. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించి నిర్మాణాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్(వెప్) సమావేశంలో మహిళా వ్యాపారవేత్తల గురించి చేసిన ప్రసంగం భూమి పెడ్నేకర్ ఆలోచనలకు అద్దం పడుతుంది. సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది. -
అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!
ఉలి దెబ్బలు తింటేనే.. శిల శిల్పంగా మారుతుంది. నిప్పుల కొలిమిలో కాలితేనే ఇనుము కరిగేది. దాదాపు మనిషి జీవితం కూడా అంతే.. కష్టాల కడిలిని ఈదితేనే...జీవితంలో పైకి రావాలనే కసి పట్టుదల పెరుగుతుంది. మనసు పెడితే... దానికి సంకల్పం తోడైతే కాలం కూడా కలిసి వస్తుంది. విజయం దాసోహమంటుంది. దాదాపు ఇపుడు మనం చదవబోయే కూడా అలాంటిదే. ఒకపుడు బిడ్డకు పాలుకొనడానికి 14 రూపాయలకు వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. మరిపుడు 800కోట్లకు అధిపతి. ప్రముఖ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సక్సెస్ స్టోరీ చూద్దాం రండి..! కోల్‌కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్ బ్రెయిన్ జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్‌పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్‌గా అవతరించాడు. విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చని పోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్‌తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది. అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్ కేడీ. కోల్‌కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో షేర్ మార్కెట్లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు. బుర్రకు పదును బెట్టి, మార్కెట్‌ను స్టడీ చేశాడు. దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్‌రన్ కారణంగా 1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్‌కతా నుంచి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పో లేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్. చక్కటి పోర్ట్‌ఫోలియోతో లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్ నికర విలువ ఇప్పుడు రూ. 800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు. కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రిస్క్ తీసుకునే ధైర్యం,సామర్థ్యం ఉండి తీరాలి. నోట్: ముందే చెప్పినట్టుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు అంటే అంత ఆషామాషీ కాదు. సరియైన అవగాహన, లోతైన పరిజ్ఞానం చాలా అవసరం. -
యూఎస్‌లో హిందుస్తాన్ జింక్ రోడ్‌షోలు.. వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌లో మిగిలిన 29.54 శాతం వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం యూఎస్‌లో రోడ్‌షోలకు ఈ నెలలో తెరతీయనుంది. ప్రమోటర్ సంస్థ వేదాంతా.. తమ గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఇది కంపెనీవద్ద గల భారీ నగదు నిల్వలను వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయంగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో మిగిలిన వాటాను విక్రయించాలని గతేడాదిలోనే నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వేదాంతా ప్రణాళికలను వ్యతిరేకించింది. కాగా.. వేదాంతా జింక్ ఆస్తుల విక్రయ ప్రతిపాదన గడువు గత నెలలో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం సొంత కార్యాచరణకు సన్నాహాలు ప్రారంభించింది. వెరసి ప్రభుత్వ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైలర్లకు విక్రయించేందుకు వీలుగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను పరిశీలిస్తున్నట్లు దీపమ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం హిందుస్తాన్ జింక్‌లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు 298.1 కోట్ల డాలర్లకు విక్రయించాలని వేదాంతా గతంలో ప్రతిపాదించింది. అయితే సంబంధిత పార్టీ లావాదేవీగా ఈ డీల్‌ను పరిగణించాలని, ఫలితంగా నగదురహిత బదిలీ చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయ సంబంధ అవకాశాలనూ పరిశీలించేందుకు నిర్ణయించుకుంది. గతేడాదిలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ).. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల 29.54 శాతం వాటాకు సమానమైన 124.79 కోట్ల షేర్ల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్డ్ ఆరోపణలతో అదానీ గ్రూపు భారీ నష్టాలను మూటగట్టుకుంది. లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్ తుడిచుపెట్టుకుపోతోంది. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీకి చెందిన 'స్టాక్స్ అన్నీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాయి. సంస్థ మార్కెట్ క్యాప్ కూడా పది లక్షల కోట్లను అధిగమించింది. ఈ క్రమంలో టాప్‌ఇన్వెస్టర్ విజయగాథ వైరల్‌గా మారింది. రాజీవ్ జైన్, భారీ లాభాలు జీక్యూజీ పార్ట్నర్స్ చైర్మన్ రాజీవ్ జైన్ అదానీ నాలుగు కంపెనీలలో పెట్టిన పెట్టుబడులతో కేవలలో 100 రోజుల లోపే 65.18 శాతం రాబడిని పొందారు. విలువ పరంగా మార్చి 2న రూ.15,446.35 కోట్లగా ఉన్న పెట్టుబడులు మంగళవారం నాటి ట్రేడింగ్‌తో కలిపి ఏకంగా రూ.10,069 కోట్లు పెరిగి రూ.25,515 కోట్లకు చేరింది. మార్చిలో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ పెట్టుబడి రూ.15,446 కోట్లతో పోలిస్తే ఇది 65 శాతం పెరగడం విశేషం. (ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్ ) కేవలం 52 ట్రేడింగ్ సెషన్లలో జీక్యూజీ పార్టనర్స్ పెట్టుబడి రూ 25 వేల కోట్లకు పెరిగింది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై పెట్టుబడి దారులు ఆశ్చర్య పోనవసరం లేదని, సమర్థుడైన ప్రమోటర్ ద్వారా నిర్వహించిన ఆస్తులని రాజీవ్ జైన్ ప్రకటించారు. కాగా జీక్యూజీ చైర్మన్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ రాజీవ్ జైన్, 2 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ బిలియనీర్స్ 2023 జాబితాలో ప్రవేశించారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలు 20-75 శాతం మధ్య ర్యాలీ చేశాయి. దీనికి తోడు అదానీ గ్రూపులో అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం నియమించిన ప్యానెల్ తేల్చి చెప్పడంతో అదానీ షేర్లలో ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. ఫలితంగా సోమవారం నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. ఫిబ్రవరి 27నాటి కనిష్ట స్థాయి రూ.6.8 లక్షల కోట్ల నుంచి 50 శాతానికి పైగా రికవరీ. ఫిబ్రవరి 8న మొదటిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కు కంటే దిగువకు పడి పోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికకు ఒకరోజు ముందు గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.2 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్‌పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
అదంతా కుట్ర.. వాటిని చట్టపరంగా ఎదుర్కొంటాం: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: ఖాతాల్లో, షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ తమ గ్రూప్ సంస్థలపై అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ కుట్ర చేసిందని ఆరోపించింది. తాము తలపెట్టిన షేర్ల విక్రయాన్ని దెబ్బతీసేందుకే ‘నిర్లక్ష్యపూరితంగా’ వ్యవహరించినందుకు గాను హిండెన్‌బర్గ్‌ను చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు వ్యాఖ్యానించింది. ‘ఎటువంటి పరిశోధన లేకుండా హిండెన్‌బర్గ్ రూపొందించిన దురుద్దేశపూరితమైన నివేదిక .. అదానీ గ్రూప్, మా షేర్హోల్డర్లు, ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. నివేదిక వల్ల భారతీయ స్టాక్ మార్కెట్లలో తలెత్తిన ఒడిదుడుకులు ఆందోళన కలిగించాయి‘ అని గ్రూప్ లీడ్ హెడ్ జతిన్ జలుంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఫాలో ఆన్ ఇష్యూ (ఎఫ్‌పీవో)ను నాశనం చేసేందుకు ఒక విదేశీ సంస్థ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన తీరు తీవ్రంగా కలవరపర్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్‌బర్గ్‌పై తగు చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోకు వస్తున్న తరుణంలో నివేదిక విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఆధార్ కార్డ్‌లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి! -
ఐఆర్‌ఆర్‌ఏ ఏర్పాటుకు అక్టోబర్ డెడ్‌లైన్
న్యూఢిల్లీ: ట్రేడింగ్ మెంబర్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడితే ఇన్వెస్టర్లకు సహాయ సహకారాలు అందించేందుకు తగు వేదికను ఏర్పాటు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం 2023 అక్టోబర్ 1లోగా ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేవాలని స్టాక్ ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లకు శుక్రవారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించింది. ట్రేడింగ్ మెంబర్స్ సిస్టమ్స్‌లో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఓపెన్ పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు వాటిని క్లోజ్ చేయలేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను రద్దు చేసేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ఉపయోగపడనుంది. సర్క్యులర్ ప్రకారం ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసుల వ్యవస్థను ఎక్సే్చంజీలు రూపొందిస్తాయి. సాంకేతిక లోపాలకు గురైన ట్రేడింగ్ మెంబరు (టీఎం) .. ఈ సర్వీసులను అందించాల్సిందిగా ఎక్సేంజీలను అభ్యర్ధించాల్సి ఉంటుంది. ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసును ఆథరైజ్ చేసిన తర్వాత సదరు టీఎం ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను పరిష్కరించుకోవచ్చు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక తిరిగి టీఎం సిస్టమ్ ద్వారా ట్రేడింగ్ యథాప్రకారం కొనసాగుతుంది. అంతకు ముందు ఐఆర్‌ఆర్‌ఏ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలన్నీ టీఎం సిస్టమ్‌లో ప్రతిఫలిస్తాయి. -
ప్రముఖ వ్యాపారవేత్త, బిగ్బుల్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్ ఝన్ వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. జూలై 5,1960లో హైదరాబాద్‌లో జన్మించిన రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2018 నాటికి అతని ఆస్తి రూ.11వేల కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెటర్,ఛార్టర్డ్ అకౌంటెంట్, హంగామా మీడియా,ఆప్టెక్లకు ఛైర్మన్‌గా, అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్ ఝున్ వాలా 'ఆకాశ ఎయిర్' ను ప్రారంభించారు. (చదవండి: పేటీఎం బాస్‌గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు) -
ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు!
Investment Tips On Elss Scheme స్మాల్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. అయితే, 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలన్నీ ఎల్లప్పుడూ మిడ్క్యాప్లోనే ఉంటాయని కాదు అర్థం. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అవి మిడ్క్యాప్లోనే లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు 101 నుంచి 125 వరకు ఉన్న కంపెనీలను ఎంచుకుంటాయి. అవి పేరుకు మిడ్‌క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి 10–20 ఏళ్ల కాలంలో ఎంత మేర రాబడులు ఆశించొచ్చు..? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 30 ఏళ్ల రాబడులు పరిశీలించినా లేక ఈ పథకాలకు సంబంధించి 20 ఏళ్ల కాల రోలింగ్ రాబడులను గమనించొచ్చు. ఈ పథకాల్లో రాబడులు సగటున 15–20 శాతం మధ్య ఉంటాయి. ఈ విభాగంలో చెత్త పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ జమ కావడం) మహిమ ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకోవాలి. ఒకవేళ మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన పెట్టుబడులు ఏవైనా కానీ, పెట్టుబడులు పెట్టేసి మర్చిపోతానంటే కుదరదు. కచ్చితంగా వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి పథకాలన్నవి చెత్తగాను, చెత్త పథకాలుగా ఉన్నవి మంచిగానూ మారిపోతుంటాయి. ఒకే పథకంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లలేం. ఎందుకంటే ఒకవేళ అది చెత్తగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్ ముగిసిపోతుంది. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
శుభవార్త చెప్పిన సెబీ.. ఇన్వెస్టర్ల కోసం కొత్తగా..
SEBI: దేశవ్యాప్తంగా యువతరంలో స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న డీమ్యాట్ ఖాతాలే ఇందుకు ఉదాహారణ. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారికి దారి చూపేందుకు సారథి (Saa~thi) పేరుతో మొబైల్ యాప్‌ని తీసుకొచ్చింది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ. కొత్తగా మార్కెట్‌కి వస్తున్న వారిలో చాలా మంది మార్కెట్ తీరుతెన్నులు, లోతుపాతులు తెలుసుకోకుండా బ్రోక్రర్లను ఆశ్రయించే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కష్టనష్టాల పాలవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు మార్కెట్‌కి సంబంధించిన సమస్త వివరాలు వెల్లడించే విధంగా సారథిని రూపొందించినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. త్వరలోనే సారథి యాప్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ యాప్ అందుబాటులో ఉంది. -
కొత్త అవతారంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త అవతారంతో కన్పించనున్నారు. బెంగుళూరుకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాంలో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్‌గానే కాకుండా సదరు కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా..! ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్‌టెక్ సంస్థ గ్రో (Groww) లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్‌తో పాటుగా కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేశ్రే శనివారం ట్విటర్లో వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ సీఈవోల్లో ఒకరు గ్రోకు ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థికసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని లలిత్ ట్వీట్ చేశారు. భారీ ఆదరణతో ‘గ్రో’త్..! యువతను ఆకర్షించడంలో గ్రో విజయవంతమైంది. తక్కువ కాలంలోనే ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీగా పెట్టుబడులను గ్రో సమీకరించింది. గత ఏడాదిలో జరిగిన రెండు ఫండింగ్ రౌండ్లలో మొత్తంగా 251 డాలర్లను గ్రో సేకరించింది. దీంతో అక్టోబర్ 2021 నాటికి మూడు బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీగా గ్రో అవతరించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటుగా రాబిట్ క్యాపిటల్, సింఖోయా వై కాంబినేటర్, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ పార్ట్నర్స్, ఐకానిక్ గ్రోత్, అల్కెన్, లోన్ పైన్క్యాపిటల్, స్టెడ్‌ఫాస్ట్ మొదలైనవి గ్రో(Groww)కు ఇన్వెస్టింగ్ పార్టనర్స్‌గా ఉన్నాయి. గతంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ 2018లో గ్రోని స్థాపించారు. దీనిలో సుమారు 20లక్షల మంది యూజర్లు ఉన్నారు. Groww gets one of the world’s best CEOs as an investor and advisor. Thrilled to have @satyanadella join us in our mission to make financial services accessible in India. — Lalit Keshre (@lkeshre) January 8, 2022 చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
ఎలన్‌మస్క్ కొంపముంచిన ట్వీట్..! తిరగబడ్డ ఇన్వెస్టర్లు..!
Tesla Investor Files Lawsuit Over Elon Musk: కొద్దిరోజుల క్రితం టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ టెస్లాకు చెందిన 10 శాతం షేర్లను అమ్మే విషయంపై తన ట్విటర్లో ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమే ఇప్పుడు ఎలన్ మస్క్ కొంపముంచనుంది. ఎలన్ వేసిన ట్విట్‌పై విచారణ జరపాలని పలువురు ఇన్వెస్టర్లు కోర్టులో దావాలను వేసినట్లు తెలుస్తోంది. టెస్లా షేర్ ధరలను తగ్గించే విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశారు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు. స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. 2018లో ఇదే రకమైన ట్విట్స్‌ను ఎలన్ వేయగా...వీటిపై కూడా దావాలు నమోదైనాయి. ఈ ట్వీట్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దావాలను పరిష్కరించింది. చదవండి: సీఈవో పదవులకు గుడ్‌బై.. కొత్త అవతారం! తాజా ట్వీట్‌తో కలకలం -
Sachin Tendulkar : అప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో..
ఆస్ట్రేలియన్ ఏస్ లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్‌కి కలలో సైతం చుక్కలు చూపించిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. ఒకప్పుడు స్సిన్ బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన ఈ బ్యాట్స్‌మన్.. ఇప్పుడు స్పిన్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. బ్రాండ్ ఎండార్సర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. ఇప్పటికే అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా పలు కంపెనీల్లో పార్ట్నర్గా ఆయన ఉన్నారు. తాజాగా అప్‌కమింగ్ బిజినెస్‌గా పేర్కొంటున్న యూజ్డ్ కార్ బిజినెస్‌లోకి ఇతర క్రీడాకారులకంటే ముందే అడుగు పెట్టారు. యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న స్పిన్నీకి బ్రాండ్ ఎండార్సర్‌గా సచిన్ వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన స్పిన్నీలో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా సచిన్ పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ఈ సంస్థకు బ్రాండ్ ఎండార్సర్‌గా ప్రచారం కూడా చేయనున్నారు. అయితే సచిన్ ఇందులో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనే అంశాలను స్పిన్ని సంస్థ బహిర్గతం చేయలేదు. పీవీ సింధుతో పాటు సచిన్ స్పిన్ని సంస్థ ఈ ఏడాది ఆరంభంలో పీవీ సింధుతో జత కట్టింది. తాజాగా సచిన్‌ను తమతో చేర్చుకుని మార్కెట్లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు టీనేజ్లోనే బూస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించిన సచిన్ గత పాతికేళ్లలో అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అనేక స్పోర్ట్స్లీగుల్లో పెట్టుబడులు పెట్టారు. స్పిన్ని ప్రస్థానం యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేన్ 1.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు -
బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు
గత కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం స్టాక్మార్కెట్లో లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఒకానొక దశలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 18,604 పాయింట్లతో రికార్డు సృష్టించింది. దీంతో ఇన్వెస్టర్లకు కొంత ఊరట లభిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సౌతాఫ్రికా కొత్త వేరియంట్ భయం దేశీయ మార్కెట్లపై చూపించడంతో సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. ఒకానొక సమయంలో మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగే సమయంలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, బీపీసీఎల్ స్టాక్స్ భారీఎత్తున నష్టపోయాయి. ఎన్ఎస్ఈ అధికారిక లెక్కల ప్రకారం..మార్కెట్ ప్రారంభంలో టాటా మోటార్స్ 4శాతం, ఓఎన్జీసీ 3.9శాతం నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఫార్మా షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డిస్ షేర్లు నష్టాల్ని చవి చూశాయి. దీంతో దేశీయ మార్కెట్‌కు రూ.6.5లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. కొత్త వేరియంట్‌తో భయం భయం దక్షిణాఫ్రికా కొత్త కరోనా వేరియంట్ ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మింట్ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అందుకు ఈ కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 కారణమని తెలుస్తోంది. హాంకాంగ్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో..సైంటిస్ట్‌లు ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త వేరియంట్ వేగంగా విజృంభించే అవకాశం ఉందని,జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇదే భయం ఇతర దేశాలలోని మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సౌతాఫ్రికా కొత్త వేరియంట్ ప్రభావం ప్రపంచ దేశాల మార్కెట్లలో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐపీవో ఎఫెక్ట్.. ఏకంగా బిలియనీర్ అయ్యాడు -
ఇన్వెస్టర్ సర్వీస్ సపోర్ట్.. మార్గదర్శకాలను సరళీకరించిన సెబీ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సర్వీసుల అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సరళీకరించింది. తద్వారా రిజిస్ట్రార్, షేరు బదిలీ ఏజెంట్(ఆర్టీఏ)గా వ్యవహరించే సంస్థల సులభ వ్యాపార నిర్వహణకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఫిజికల్ సెక్యూరిటీస్ కలిగిన వాటాదారులు పాన్, కేవైసీ, నామినేషన్ వివరాలు అందించడంలోనూ మార్గదర్శకాలను జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి తాజా నిబంధనలు అమలుకానున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి సంబంధిత డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి లేకున్నా ఆర్టీఏలు ఇన్వెస్టర్ల ఫోలి యోలను నిలిపివేసేందుకు వీలుంటుంది. డాక్యుమెంట్లు లభించాక మాత్రమే తిరిగి యాక్టివేట్ చేసేందుకు అధికారం లభిస్తుంది. ఇన్వెస్టర్లు 2022 మార్చి 31కల్లా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. -
కాసులు కురిపిస్తున్న ఐటీ స్టాక్స్ ?
ముంబై: ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సర్వీసుల రంగం అత్యధికంగా ఆకట్టుకుంటోంది. దీంతో సాఫ్ట్వేర్ రంగ కంపెనీలలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్ట్ చివరికల్లా ఎఫ్‌పీఐ పెట్టుబడులు 1.3 శాతం పెరిగి 14.67 శాతానికి చేరాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి ఈ రంగంలోని స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు సంప్రదాయంగా ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. అయితే జులైనెలాఖరుకల్లా ఈ రంగంలోని బ్యాంకులు, కంపెనీలలో పెట్టుబడులు 3.05 శాతంపైగా క్షీణించి 31.8 శాతానికి పరిమితమయ్యాయి. ప్రయివేట్ రంగ సంస్థ ఐఐఎఫ్ఎల్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ రూపొందించిన గణాంకాలివి. సాఫ్ట్వేర్ జోరు ఎఫ్‌పీఐల ఆసక్తి నేపథ్యంలో ఐటీ రంగం జోరు చూపుతోంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. ఐటీ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్ట్వరకూ 45 శాతం జంప్‌చేసింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 22 శాతమే పుంజుకోవడం గమనార్హం! గత రెండు నెలలుగా ఐటీ రంగ స్పీడ్ బుల్ ఆపరేటర్లకుసైతం గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐటీ స్టాక్స్ అత్యంత ఖరీదుగా ట్రేడవుతున్నట్లు జేఎం ఫైనాన్షియల్ నిపుణులు మానిక్ తనేజా, కేజీ విష్ణు తెలియజేశారు. కొన్ని కంపెనీల షేర్లు ఐదేళ్ల గరిష్టాలను సైతం దాటి అంటే ప్లస్–3 స్టాండర్డ్ డీవియేషన్లో కదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా కోవిడ్–19 తదుపరి ఐటీ సేవలపై వ్యయాలు పెరగడం కారణమవుతున్నట్లు వివరించారు. ఇది సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. 2004–07లో.. సాఫ్ట్వేర్ సర్వీసుల రంగం 2004–07 మధ్య కాలంలో నమోదైన బుల్లిష్ దశలో ప్రవేశిస్తున్నట్లు మానిక్, విష్ణు అభిప్రాయపడ్డారు. అమ్మకాల పరిమాణం, ధరలపై అజమాయిషీ చేయగల సామర్థ్యం, సరఫరాలో సవాళ్లున్నప్పటికీ మార్జిన్లను నిలుపుకోగలగడం వంటి అంశాలు సానుకూలతను కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఐటీ రంగం అధిక వృద్ధి బాటలో సాగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక (జులై–సెప్టెంబర్) ఫలితాలు స్వల్ప, మధ్యకాలంలో ఈ ట్రెండ్ కొనసాగవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయగలవని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఐటీ రంగ లాభాలు సగటున 20 శాతం పుంజుకోగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ 18 శాతం వృద్ధి నమోదుకాగలదని ఊహిస్తున్నాయి. అంచనాలు ఓకే సాఫ్ట్వేర్ రంగ కంపెనీలు ఈ ఏడాది అంచనాలను అందుకునే వీలున్నట్లు విదేశీ బ్రోకరేజీ జెఫరీస్ ఇటీవల నిర్వహించిన ఐటీ సదస్సులో పేర్కొంది. ఐటీ రంగంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు సహకరించగలవని విశ్లేషించింది. డిమాండ్ బలంగా ఉన్నట్లు తెలియజేసింది. దీంతో రానున్న మూడు నుంచి ఐదేళ్ల కాలంలో అన్ని సాఫ్ట్వేర్ రంగ కంపెనీలూ మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అభిప్రాయపడింది. డీల్ పైప్‌లైన్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా మధ్యస్థాయి డీల్స్ దోహదపడుతున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మెగా డీల్స్ జోరందుకోగలవని అంచనా వేసింది. అయితే వచ్చే రెండు మూడు క్వార్టర్లలో పలు కంపెనీలు సరఫరా సమస్యలను ఎదుర్కొనే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి కనిపించవచ్చని తెలియజేసింది. ఆరు కారణాలు దేశీ ఐటీ రంగం జోష్ కొనసాగనున్నట్లు గత వారం ఫిలిప్ క్యాపిటల్ పేర్కొంది. ఇందుకు ఆరు కారణాలను ప్రస్తావించింది. ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ వేసిన సానుకూల అంచనాలు, గ్లోబల్ మార్కెట్లలో బలపడనున్న వాటా, పటిష్ట డీల్ పైప్‌లైన్, ధరలపై పట్టు, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పేర్కొంది. ఇలాంటి పలు సానుకూల అంశాలతో దేశీ ఐటీ రంగ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందువల్లనే గత ఏడాది కాలంలో ఐటీ రంగ రేటింగ్ మెరుగుపడినట్లు వివరించింది. వెరసి సమీప భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ రంగంలో నెలకొన్న జోష్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ స్టాక్స్ జోరు(షేర్ల ధరలు రూ.లలో) కంపెనీ పేరు జనవరిలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ 1,240 1,679 విప్రో 418 640 టెక్‌మహీంద్రా 962 1,399 హెచ్‌సీఎల్ టెక్ 915 1,279 మైండ్‌ట్రీ 1,643 4,252 కోఫోర్జ్ 2,398 5,336 ఎల్అండ్టీ ఇన్ఫో 3,960 5,731 ఎల్అండ్టీ టెక్ 2,429 4,627 చదవండి : మళ్లీ లాభాల్లోకి మార్కెట్ -
రెండోరోజు అదే జోరు.. లాభాల్లో మార్కెట్
ముంబై: ఐటీ, బ్యాంకు షేర్లు లాభాలు అందిస్తుండటంతో స్టాక్ మార్కెట్ జోరు తగ్గడం లేదు. మంగళవారం కూడా మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరుగుతూ పోయాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,461 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ పుంజుకుంటూ పైపైకి పోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 214 పాయింట్లు లాభపడి 54,617 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 16,274 పాయింట్ల వద్ద మొదలై 60 పాయింట్లు లాభపడి 16,317 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం?
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం? ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఇవి ఉండాలా? ఈక్విటీలో నగదు, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల పరంగా ఉండే వ్యత్యాసాలను అవకాశాలుగా తీసుకుని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. ఈ రూపంలోనే ఇవి రాబడులను ఆర్జిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఎస్’ అనే స్టాక్ ఈక్విటీ మార్కెట్లో రూ.100 వద్ద ట్రేడవుతుందనుకుందాం. ఇదే స్టాక్ ఫ్యూచర్ మార్కెట్లో రూ.101 వద్ద ట్రేడవుతుందనుకుంటే.. ఈ సందర్భంలో ఆర్బిట్రేజ్ ఫండ్ ‘ఎస్’ స్టాక్‌ను ఈక్విటీలో రూ.100కు కొనుగోలు చేసి.. ఫ్యూచర్ మార్కెట్లో రూ.101కు విక్రయిస్తుంది. దీంతో ఒక రూపాయి లాభాన్ని సొంతం చేసుకుంటుంది. సెటిల్మెంట్ తేదీనాడు (అంటే నెల చివర్లో కాంట్రాక్టుల ముగింపు) ధర నగదు, ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కటిగా మారుతుంది. దాంతో ఆర్బిట్రేజ్ ఫండ్ అదే స్టాక్‌కు సంబంధించి మళ్లీ లావాదేవీలను పునరావృతం చేస్తుంది. ఈ సారి నగదు మార్కెట్లో విక్రయించి ఫ్యూచర్ మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. దీంతో ఆయా లావాదేవీలు సమం అవుతాయి. ఒక్క విడత ఇలా చేసినట్టయితే ముందు గడించిన రూపాయి లాభం ఖాయమైనట్టే. అంతేకానీ, సెటిల్మెంట్ తేదీనాటికి ఆయా స్టాక్ ధర పెరిగిందా, తరిగిందా అన్నదానితో సంబంధం ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇదే మాదిరి లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఆర్బిట్రేజ్ అవకాశాల్లేని సమయాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ట్రెజరీ బిల్లులు, స్వల్పకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రిస్క్‌ను పరిశీలించినట్టయితే.. చాలా తక్కువ రిస్క్‌లోనే ఇవి ఉంటాయి. కాకపోతే స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలతో ఉంటుంటాయి. కనీసం మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం కోసం అయితే నష్టాలకు అవకాశాలు చాలా తక్కువ. అదే సమయంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి ఎక్కువ రాబడులను ఆశించరాదు. లిక్విడ్ ఫండ్స్ స్థాయిలో రాబడులను అంచనా వేసుకోవచ్చు. అంటే రాబడులు బ్యాంకు ఖాతాల కంటే మెరుగ్గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద కోసం ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనుకూలం కావు. కొన్ని నెలల నుంచి ఏడాది వరకు తమ నిధులను ఒక్కచోట ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి అనుకూలం. ముఖ్యంగా అధిక పన్ను రేటులో (30 శాతం) ఉన్న వారికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ లాభదాయకం. ఎందుకంటే ఇందులో రాబడులను ఈక్విటీ రాబడులుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. అధిక పన్ను రేటులో లేని వారు, చాలా స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే లిక్విడ్ ఫండ్స్ సరిపోతాయి. ఇప్పటికైతే డివిడెండ్ ఇచ్చే మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా?.. అలాగే కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? – రత్నాకర్ డివిడెండ్ కోసం మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం అన్నది సరైన మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల పెద్దగా రాబడి ఉండదు. ఒక షేరును కొనుగోలు చేస్తే అది మీకు డివిడెండ్ ఇస్తుంది. అది స్టాక్ ధరలో సర్దుబాటు కాదు. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే డివిడెండ్ చెల్లింపు ప్రభావం ఫండ్ యూనిట్ ఎన్ఏవీ (నికర యూనిట్ విలువ)లో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పథకంలో రూ.10 ఎన్‌ఏవీపై రూ.10,000ను ఇన్వెస్ట్ చేశారనుకుందాం. తర్వాత కాలంలో అది వృద్ధి చెంది ఎన్ఏవీ కాస్తా రూ.15కు చేరితే.. మీ పెట్టుబడి విలువ రూ.15,000 అవుతుంది. ఫండ్ సంస్థ రూ.2,000ను డివిడెండ్ కింద చెల్లించాలని నిర్ణయించినట్టయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డివిడెండ్ చెల్లింపు ముగిసిన తర్వాత ఆ పథకంలో మీ పెట్టుబడి విలువ వెంటనే రూ.13,000కు తగ్గిపోతుంది. అంటే మీ పెట్టుబడుల నుంచి మీకు చెల్లింపులు చేయడం. ఫండ్స్‌లో డివిడెండ్ చెల్లింపుల విధానం ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ, చాలా మంది ఫండ్స్ నుంచి వస్తున్న డివిడెండ్ పనితీరు కు నిదర్శనంగా పొరపడుతుంటారు. కానీ, స్టాక్‌లో అలా కాదు. లాభాల నుంచి డివిడెండ్ చెల్లింపులు చేయడం ఉంటుంది. ఫండ్‌ను డివిడెండ్ కోణం నుంచి ఎంపిక చేసుకోవడం సరికాదు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణ సంస్థలకు ఆర్బీఐ కొత్త ఆదేశాలు
ముంబై: లిక్విడిటీ కవరేజీ రేషియో సహా పలు నిబంధనలకు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ నిర్వహణ, ఆస్తుల వర్గీకరణ, లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) ఇందులో ఉన్నాయి. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా హెచ్ఎఫ్సీల వ్యవహార శైలి లేకుండా చూడడమే ఈ ఆదేశాల్లోని ఉద్దేశమని ఆర్బీఐ తెలిపింది. డిపాజిట్లు స్వీకరించే, డిపాజిట్లు స్వీకరించని, రూ.100 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన హెచ్ఎఫ్సీలు లిక్విడిటీ రిస్క్ నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. రూ.10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్ని నాన్ డిపాజిట్ హెచ్ఎఫ్సీలు, అదే విధంగా అన్ని రకాల హెచ్ఎఫ్సీలు 2021 డిసెంబర్ 1 నాటికి కనీసం 50 శాతం ఎల్‌సీఆర్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ప్రముఖ ఇన్వెస్టర్లు చెప్పేది జరుగుతుందా?
‘‘మేము ఇలా ఇన్వెస్ట్ చేశాము, అలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాము, రాబోయే రోజుల్లో ఇలా జరగొచ్చు’’ అంటూ ప్రముఖ ఇన్వెస్టర్లు అన్యాపదేశంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే ఇవన్నీ నిజం కావాల్సిన పనిలేదని, ప్రముఖ ఇన్వెస్టరయినంత మాత్రాన వారు చెప్పేవన్నీ జరుగుతాయని అనుకోవద్దని ప్రముఖ అనలిస్టు అశ్వత్ధ్ దామోదరన్ సూచిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే వారెన్ బఫెట్ ఏమీ గొప్ప వాల్యూ ఇన్వెస్టర్ కాదని, కానీ సాధారణ ఇన్వెస్టర్లు ఆయన్ని పెట్టుబడులకు సంబంధించి దేవుడిలా చూస్తుంటారని చెప్పారు. ఆయన ఏది చెబితే అది జరుగుతుందని నమ్మేవాళ్లు ఎక్కువన్నారు. కానీ ఆయన మాటలన్నీ 90ఏళ్ల వృద్ధుడి చాదస్తపు మాటల్లాగా ఉంటాయని దామోదరన్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలన్నీ సందిగ్ధతతో ఉంటాయని, ప్రస్తుతం జరిగే ఏ అంశంపైనా ఆయనకు స్థిరమైన అభిప్రాయం ఉన్నట్లు కనిపించదని చెప్పారు. ఆయన చెప్పేవి అసహజంగా ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు ఆయన తాజా మాటలు వింటే ప్రజలు ఇక ఎక్కువగా విమానయానం చేయరనే భావన వస్తుందన్నారు. దీన్ని నమ్మి సాధారణ మదుపరి ఎయిర్‌లైన్స్ షేర్లన అమ్ముతాడన్నారు. కానీ నిజానికి విమానయానం కాస్త మందగించినంత మాత్రాన ఎయిర్‌లైన్స్ షేర్లన్నీ చెత్తని చెప్పలేమని దామోదరన్ చెప్పారు. ప్రస్తుతం విమానయాన రంగంలో ఉన్న కంపెనీల్లో కొన్నైనా మూతబడితే అప్పుడీ వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పవచ్చని, అంతేకానీ కేవలం బఫెట్ అభిప్రాయపడ్డాడని ఉన్న ఎయిర్‌లైన్ షేర్లు అమ్ముకోవడం మంచిది కాదని వివరించారు. అంతమాత్రాన ప్రముఖ ఇన్వెస్టర్లంతా మంచి ఇన్వెస్టర్లు కాదని తాను చెప్పడం లేదని, ఎంత ప్రముఖుడైనా.. ఏమి చెప్పినా.. దాన్ని తరచి ప్రశ్నించుకొని నిర్ణయం తీసుకోవాలన్నదే తన సూచనని చెప్పారు. మంచి ఇన్వెస్టర్ కావాలంటే ఎవరికి వారికి సొంత అధ్యయనం ఉండాలని దామోదరన్ సలహా ఇచ్చారు. అంతేకానీ ఎంత గొప్ప ఇన్వెస్టరు సలహా ఇచ్చినా గుడ్డిగా ఫాలో కావద్దని, ‘‘పదిమంది చెప్పింది విను.. సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో’’ అనేది తన సూత్రమని చెప్పారు. -
ఇన్ఫోసిస్..ఇన్వెస్టెర్రర్!
న్యూఢిల్లీ: ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు కుదేలైంది. మంగళవారం ఏకంగా 16 శాతం పతనమైంది. గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపించేందుకు ఖాతాల గోల్మాల్ చేయిస్తున్నారని, అనైతిక విధానాలకు తెరతీశారని సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పష్టం చేశారు. అంతర్గత ఆడిటర్లు ఈవైతో ఆడిట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోందని, స్వతంత్ర విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కోని నియమించుకున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు నీలేకని తెలియజేశారు. ఆడిట్ కమిటీ సిఫార్సులతో చర్యలు.. సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తుతెలియని వారి నుంచి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు నీలేకని తెలిపారు. వీటిలో ఒక దానిపై సెప్టెంబర్ 20వ తేదీ ఉండగా, రెండో దానిపై తేదీ లేకుండా ప్రజావేగు ఫిర్యాదు అని ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటినీ అక్టోబర్ 10న ఆడిట్ కమిటీ ముందు, మరుసటి రోజున బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ సభ్యుల ముందు ఉంచినట్లు నీలేకని తెలిపారు. తేదీ లేని రెండో లేఖలో ప్రజావేగు ప్రధానంగా సీఈవో అమెరికా, ముంబైల పర్యటనల మీద ఆరోపణలు ఉన్నట్లు వివరించారు. ‘అక్టోబర్ 11న బోర్డు సమావేశం అనంతరం ప్రాథమిక విచారణకు సంబంధించి స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో (ఎర్నెస్ట్ అండ్ యంగ్) ఆడిట్ కమిటీ సంప్రతింపులు ప్రారంభించింది. అక్టోబర్ 21న శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో సంస్థను స్వతంత్ర విచారణ కోసం నియమించుకోవడం జరిగింది‘ అని ఆయన పేర్కొన్నారు. 11న బోర్డు సమావేశం తర్వాత తమ ఆడిటర్లకు (డెలాయిట్ ఇండియా) అన్ని విషయాలు పూర్తిగా తెలియజేసినట్లు నీలేకని తెలిపారు. ‘ఈమెయిల్స్ లేదా వాయిస్ రికార్డింగ్స్ లాంటివేవీ మాకు అందలేదు. అయినప్పటికీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇది నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు సీఈవో, సీఎఫ్‌వో దీనికి దూరంగా ఉంటారు‘ అని ఆయన వివరించారు. విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి ఆడిట్ కమిటీ సిఫార్సుల ప్రకారం బోర్డు తగు చర్యలు తీసుకుంటుందని నీలేకని చెప్పారు. సీఈవో, సీఎఫ్‌వోలపై అనైతిక విధానాల ఆరోపణలు ఐటీ దిగ్గజం ఇన్ఫీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంపెనీ షేరు ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కుప్పకూలింది. ప్రజావేగుల ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామంటూ సంస్థ చైర్మన్ నీలేకని దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ.. అమెరికాలో ఇన్ఫీని ఇరకాటంలో పెట్టేందుకు అక్కడి ఇన్వెస్టర్లు క్లాస్ యాక్షన్ దావాకు సిద్ధమవుతున్నారు. దీంతో.. రెండేళ్ల క్రితం సీఈవో, ప్రమోటర్ల మధ్య వివాదాలతో తలెత్తిన సంక్షోభ ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇన్ఫోసిస్ .. తాజాగా మరో సంక్షోభంలోకి జారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్ఫీ షేరు మంగళవారం ఎలా పడిపోయిందంటే.. షేరు క్రితం ముగింపు ధర రూ.768, ఆరంభం 10 శాతం డౌన్ షేరు ధర రూ.691, ఇంట్రాడేలో కనిష్ట ధర రూ.638 17 శాతం క్రాష్ , షేరు ముగింపు ధర రూ. 643,16% డౌన్ 53 వేల కోట్ల మార్కెట్ క్యాప్ హుష్.. ప్రజావేగుల ఆరోపణలపై ఆందోళనలతో ఇన్ఫీ షేరు కుదేలవడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒకే రోజులో ఏకంగా రూ. 53,451 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్ వేల్యుయేషన్ రూ. 2,76,300 కోట్లకు తగ్గింది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా పతనమైన పెద్ద కంపెనీ షేరు ఇదే. బీఎస్ఈలో షేరు ఒక దశలో 16.86 శాతం పతనమై రూ. 638.30 స్థాయిని కూడా తాకింది. 2013 ఏప్రిల్ తర్వాత ఒకే రోజున ఇంత స్థాయిలో షేరు క్షీణించడం ఇదే తొలిసారి. చివరికి 16.21 శాతం క్షీణించి రూ. 643.30 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈలో 16.65 శాతం క్షీణించి రూ. 640 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అమెరికా మార్కెట్లో సోమవారం 14 శాతం పతనమైన ఇన్ఫీ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఒక దశలో మరో 4 శాతం దాకా పడింది. ఇదీ వివాదం.. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సలిల్ పరేఖ్, ఆయనకు తోడుగా నీలాంజన్ రాయ్ ఖాతాలు గోల్మాల్ చేయిస్తున్నారంటూ కొందరు ఉద్యోగుల బృందం.. ఇన్ఫీ బోర్డుకు, అమెరికాలోని విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు చేసిన ఫిర్యాదులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. గత రెండు త్రైమాసికాలుగా ఇలాంటి ధోరణులు పెరిగాయని, అనైతిక విధానాలకు అడ్డు చెప్పిన ఉద్యోగులను పక్కన పెట్టడం జరుగుతోందని ప్రజావేగులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ అన్నీ తమ దగ్గర ఉన్నాయని, తగిన సందర్భంలో అందజేస్తామని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలతో రెండేళ్ల క్రితం ఇన్ఫీ ఉక్కిరిబిక్కిరైన సంగతి తెలిసిందే. దీనిపైనే ప్రమోటర్లతో విభేదాలు రావడంతో సీఈవో విశాల్ సిక్కా అర్ధంతరంగా నిష్క్రమించారు. కొత్త సీఈవోగా సలిల్ పరేఖ్ వచ్చిన తర్వాత మళ్లీ ఇన్ఫీ మెల్లిగా గాడిన పడటం మొదలైంది. అయితే ఇంతలోనే ఆయనపైనా అవకతవకల ఆరోపణలు రావడంతో ఇన్ఫీ వ్యవహారాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
ఏడో రోజూ అదే వరుస
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఎన్నికల అనిశ్చితి స్టాక్ మార్కెట్‌ను ఊపిరిసలపనివ్వడం లేదు. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కొనసాగుతున్న ఫలితంగా గురువారం కూడా స్టాక్ మార్కెట్ నష్టపోయింది. వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 37,559 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 11,302 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్1,475 పాయింట్లు, నిఫ్టీ 446 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే ఈ రెండు సూచీలు 3.7 శాతం చొప్పున క్షీణించాయి. గత ఏడు ట్రేడింగ్ సెషన్ల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.6.16 లక్షల కోట్లు ఆవిరైంది. ఒడిదుడుకులు కొనసాగుతాయ్...! అమెరికా తమ వస్తువులపై సుంకాలు విధిస్తే, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా బలహీనంగా మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 384 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతలపై స్పష్టత వచ్చేవరకూ ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడులకు తప్పవని నిపుణులంటున్నారు. అగ్రస్థానంలో టీసీఎస్.... రిలయన్స్ పతనం గురువారం కూడా కొనసాగింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ఈ షేర్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఈ షేర్ 3.4 శాతం నష్టంతో రెండు నెలల కనిష్ట స్థాయి, రూ. వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే,. గత నాలుగు రోజుల పతనం కారణంగా ఈ షేర్ 10 శాతం పతనమైంది. ఈ నాలుగు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.96,288 కోట్లు ఆవిరై రూ.7,95,629 కోట్లకు తగ్గింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్.. అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీ అన్న ఘనతను టీసీఎస్‌కు కోల్పోయింది. టీసీఎస్ షేర్ 0.75 శాతం పెరిగి రూ.2,169 వద్ద ముగిసింది. దీని మార్కెట్ క్యాప్ రూ.8,13,780 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా, ఈ రెండు కంపెనీల తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్, ఐటీసీలు నిలిచాయి. 175కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బయోకాన్, థైరోకేర్ టెక్నాలజీస్, కేసీపీ షుగర్స్, బాష్, లిబర్టీ షూస్, ర్యాలీస్ ఇండియా ఈ జాబితాలో ఉన్నాయి. -
‘సత్యం’ స్కామ్‌కు దశాబ్దం... అయినా మారని పరిస్థితి
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగి దశాబ్ద కాలం దాటిపోయినా ఇప్పటికీ కార్పొరేట్ సంస్థల ఖాతాల్లో వ్యత్యాసాలను గుర్తించేందుకు చాలా సమయం పడుతోందని టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానీ చెప్పారు. లోపాలకు చెక్ పెట్టేందుకు మరింత మెరుగైన డేటా అనలైటిక్స్ (సమాచార విశ్లేషణ ప్రొగ్రామ్‌లు) అవసరమని అభిప్రాయపడ్డారు. సత్యం కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాల కుంభకోణం 2009 జనవరిలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. వ్యత్యాసాల గురించి అప్రమత్తం చేసేందుకు మన వ్యవస్థలు ఇప్పటికీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, అవే సంక్షోభాలకు దారితీస్తున్నాయని గుర్నాని పేర్కొన్నారు. ‘‘అందరు భాగస్వాములు... బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థలు, కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. సత్యం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాలు తలెత్తకుండా చూసేందుకు, లోపాలను గుర్తించేందుకు మెరుగైన డేటా అనలైటిక్స్, డాష్‌బోర్డులు అవసరం ఉంది. మనమంతా తెలివైన వాళ్లమే. కానీ మనకు మెరుగైన విధానాలు, వ్యవస్థలు కావాలి’ అని గుర్నాని అభిప్రాయపడ్డారు. చిత్రంగా నాడు సత్యం ప్రమోటర్లకు చెందిన మేటాస్ ఇన్ఫ్రాను సొంతం చేసుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కూడా సంక్షోభంలో చిక్కుకుపోవడం గమనార్హం. రూ.94,000 కోట్లకు పైగా రుణభారంతో దివాలా దశకు చేరిన ఈ గ్రూపు నిర్వహణను ప్రభుత్వం ఇటీవలే తన ఆధీనంలోకి తీసుకుంది. వాటాదాలకు ఎనిమిది రెట్ల ప్రలిఫలం... సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి చిన్న ఇన్వెస్టర్లకు ఎనిమిది రెట్ల ప్రతిఫలాన్ని అందించినట్టు టెక్ మహీంద్రా పేర్కొంది. ‘‘2009 ఏప్రిల్‌లో రూ.830 కోట్ల పెట్టుబడిపై రూ.6,614 కోట్ల ప్రతిఫలితాన్ని అందించాం. ఇందులో రూ.332 డివిడెండ్ (ఒక్కో ఇన్వెస్టర్) కూడా ఉంది. చిన్న ఇన్వెస్టర్లకు ఇది సుమారుగా ఎనిమిది రెట్ల ప్రతిఫలం’’ అని సీపీ గుర్నాని వివరించారు. సత్యం కంప్యూటర్స్ వ్యాపారాన్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడానికి, క్లయింట్లలో భరోసా కల్పించేందుకు ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. -
డివిడెండ్ కావాలా..!
ఎవరూ క్లెయిమ్ చేయని డివిడెండ్లు భారీగా ఐఈపీఎఫ్ఏ వద్ద పేరుకుపోతున్నాయి. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని డివిడెండ్ చెల్లింపులు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ(ఐఈపీఎఫ్ఏ) వద్ద ఉన్నాయి. అలాగే క్లెయిమ్ చేయని షేర్లు కూడా రూ.19,000 కోట్ల మేర ఈ సంస్థ వద్ద ఉన్నాయని అంచనా. 29.5 లక్షల మంది ఇన్వెస్టర్లు రూ.19,000 కోట్ల విలువైన షేర్లను క్లెయిమ్ చేసుకోలేదని అంచనా. 25 లక్షల వాటాదారులకు అందని డివిడెండ్లు.. సాధారణంగా కంపెనీలు డివిడెండ్లు ప్రకటిస్తాయి. రికార్డ్ తేదీలోపు తమ ఖాతా పుస్తకాల్లో ఉన్న వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లిస్తాయి. డీమ్యాట్ ఖాతాలున్న ఇన్వెస్టర్లకు డివిడెండ్లు వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి. అయితే కాగితం రూపం (షేర్ సర్టిఫికెట్) వాటాదారులకు మాత్రం డివిడెండ్లు చెల్లింపు కొంచెం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమే. ఇక ఎవరూ క్లెయిమ్ చేయని డివిడెండ్లను కంపెనీలు ఈ సంస్థకు బదిలీ చేస్తాయి. ఇలా ఐఈపీఎఫ్ఏకు దాదాపు 25 లక్షలకు పైగా వాటాదారులకు చెందాల్సిన రూ.2,000 కోట్ల విలువైన డివిడెండ్లు బదిలీ అయ్యాయి. షేర్లు డీమ్యాట్ రూపంలో కాకుండా కాగితం రూపంలో ఉన్న ఇన్వెస్టర్లే ఈ 25 లక్షల మంది ఇన్వెస్టర్లలో అధికంగా ఉంటారని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు.. చాలా షేర్లు కాగితం రూపంలో ఉన్నాయని, మరణించిన వారి షేర్లు వారి వారి వారసులకు బదిలీ చేయకపోవడం వల్లనే ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లింపులు పేరుకుపోయాయని ఆ అధికారి వివరించారు. కాగా కాగితం రూపంలో ఉన్న అన్ని షేర్లను డీమ్యాట్ రూపంలోకి తప్పనిసరిగా మార్చుకోవాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. కాగితం రూపంలో ఉన్న షేర్లు డీమ్యాట్రూపంలోకి మారడానికి ఈ నెల 31ను గడువు తేదీగా సెబీ నిర్దేశించింది. క్లెయిమ్ చేసుకోవచ్చనీ తెలీదు: అసలైన వాటా దారు మరణించిన తర్వాత వారి వారసులకు షేర్ల బదిలీ జరగడం లేదని, అందుకే ఇలా డివిడెండ్లు పేరుకుపోతున్నాయని అలంకిత్ సంస్థ ఎమ్డీ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఐఈపీఎఫ్ఏ వద్ద పేరుకుపోయిన డివిడెండ్లను సంబంధిత ఇన్వెస్టర్లు పొందడానికి అలంకిత్ సంస్థ సాయం చేస్తోంది. ఒక వేళ షేర్ల బదిలీ జరిగినా, సంతకాలు సరిగ్గా మ్యాచ్ కాకపోవడం వల్ల, చాలా మంది షేర్ సర్టిఫికెట్లను పోగొట్టుకోవడం వల్ల కూడా అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు పేరుకుపోతున్నాయని తెలిపారు. కాగా ఐఈపీఎఫ్ఏ వద్ద పోగుపడిన డివిడెండ్లను క్లెయిమ్ చేసుకొని పొందవచ్చనే విషయం కూడా చాలా మందికి తెలియదని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ షేర్ల డివిడెండ్లూ అన్క్లెయిమ్డే... ఏదో ఊరు, పేరులేని కంపెనీల, లేదా ఆషామాషీ కంపెనీల డివిడెండ్లే కాకుండా, సెన్సెక్స్ కంపెనీల డివిడెండ్లు కూడా ఈ సంస్థ వద్ద పేరుకుపోవడం విశేషం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 3,329 మంది భారతీ ఎయిర్టెల్ వాటాదారులు రూ.11 లక్షల విలువైన డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో హీరో మోటా కార్ప్‌కు చెందిన రూ.8 కోట్ల డివిడెండ్లు కూడా ఈ సంస్థ వద్ద పోగుపడ్డాయి. ఇక ఐటీసీ విషయానికొస్తే, దాదాపు రూ.32 కోట్ల డివిడెండ్లను ఎవరూ ఆ ఏడాది క్లెయిమ్ చేయలేదు. ఓఎన్జీసీ డివిడెండ్ల విషయంలో 2,000కు పైగా ఇన్వెస్టర్లు డివిడెండ్లను క్లెయిమ్ చేయలేదు. బజాజ్ ఆటో విషయంలో డివిడెండ్లు క్లెయిమ్ చేయని ఇన్వెస్టర్ల సంఖ్య 1,500 వరకూ ఉంది. ఈ క్లెయిమ్ చేయని డివిడెండ్ల విలువ రూ.4 కోట్ల వరకూ ఉంటుంది. అన్క్లెయిమ్డ్ షేర్ల విలువ రూ.19,000 కోట్లు కంపెనీల చట్టం, 2013, సెక్షన్125 కింద కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐఈపీఎఫ్ఏను 2016లో ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడం, నిధుల పరిరక్షణ నిమిత్తం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. షేర్ల రిఫండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, మెచ్యూరైన డిపాజిట్లు, డిబెంచర్లు ఈ సంస్థ ఆధీనంలోకి వస్తాయి. ఏడేళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని షేర్లను ఐఈపీఎఫ్ఏకు బదిలీచేయాలని ప్రభుత్వం గతేడాది కంపెనీలను ఆదేశించింది. ఈ ఆదేశాల పర్యవసానంగా ఇప్పటివరకూ 1,355కంపెనీలు 48.6 కోట్ల షేర్లను బదిలీ చేశాయి. వీటి విలువ రూ.19,000 కోట్లుగా అంచనా. ఇక గత ఏడాది కాలంలో ఐఈపీఎఫ్ఏ మొత్తం రూ.2 కోట్ల డివిడెండ్లను మాత్రమే రీఫండ్ చేయగలిగింది. ఐఈపీఎఫ్ఏ నుంచి డివిడెండ్ క్లెయిమ్ ఇలా... ►ఐఈపీఎఫ్ఏ వెబ్సైట్లో లభించేఫామ్–5 దరఖాస్తును నింపాలి. ►ఇండెమ్నిటీ బాండ్, ఇతర నిర్ధారణ డాక్యుమెంట్లను జత చేసి, కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు పంపాలి. ►ఈ క్లెయిమ్ దరఖాస్తులను కంపెనీ వెరిఫై చేస్తుంది. 15 రోజుల్లోఐఈపీఎఫ్ఏకు నివేదిక పంపిస్తుంది. ► కంపెనీ నివేదిక ఆధారంగా ఐఈపీఎఫ్ఏ డివిడెండ్లను ఎలక్ట్రానిక్ రూపంలో సదరు ఇన్వెస్టర్‌కు 60 రోజుల్లో చెల్లిస్తుంది. -
చల్లబడిన ఉద్రిక్తతలు.. లాభాల్లో మార్కెట్లు
భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మూడు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం బ్రేక్ పడింది. విదేశీ నిధుల అండతో స్టాక్ మార్కెట్లు మార్చి సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. మార్చి సిరీస్‌లో ఇన్వెస్టర్లు ఎఫ్‌అండ్‌వోలో నూతన పొజిషన్లను తీసుకోవడం కూడా లాభాలకు దారితీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 196 పాయింట్లు పెరిగి 36,064 వద్ద క్లోజ్ అవగా, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,863 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సానుకూలంగా ప్రారంభమై ఇంట్రాడేలో 36,140 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు వెళ్లింది. కాకపోతే కొన్ని స్టాక్స్‌లో లాభాల స్వీకరణ జరగడంతో చివరికి లాభాలు పరిమితయ్యాయి. అంతకుముందు మూడు రోజుల్లో సెన్సెక్స్ 346 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. అటు నిఫ్టీ ఇంట్రాడేలో 10,878 గరిష్ట, 10,823 కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ నికరంగా 192 పాయింట్ల మేర, నిఫ్టీ 71 పాయింట్ల మేర పెరిగాయి. మార్కెట్లు లాభాలో ముగియడం వరుసగా ఇది రెండో వారం. రుణాల వృద్ధి, తయారీ కార్యకలాపాలు, నూతన ఆర్డర్లు, ఉగ్యోగ కల్పనకు సంబంధించి బలమైన డేటాకు తోడు సరిహద్దు ఉద్రిక్తతలు తేలిక పడడం మార్కెట్లకు సానుకూలంగా పనిచేశాయి. స్మాల్‌క్యాప్ ర్యాలీ: ఇండస్ ఇండ్ బ్యాంకు అత్యధికంగా 3 శాతం లాభపడింది. ఆ తర్వాత యస్ బ్యాంకు, వేదాంత, హీరో మోటో, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. నష్టపోయిన వాటిల్లో మారుతి సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఆర్ఐఎల్ ఉన్నాయి. స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2 శాతానికి పైగా లాభపడగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 1.29 శాతం పెరిగింది. ఇన్ఫ్రా, పీఎస్‌యూ, మెటల్ సూచీలు ఒకటిన్నర శాతం నుంచి 2 శాతం మధ్య లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి. -
ఏంజెల్ ట్యాక్స్ సెక్షన్ ఎత్తివేయాలి
ముంబై: స్టార్టప్ సంస్థల్లో ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పన్ను విధించాలన్న వివాదాస్పద సెక్షన్‌ను ఆదాయ పన్ను చట్టం నుంచి తొలగించాలని ముంబై ఏంజెల్స్ నెట్వర్క్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్య పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని సంస్థ సీఈవో నందిని మన్సింఖా పేర్కొన్నారు. అయితే, వివాద పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. సెక్షన్ ఎత్తివేయడం అంత సులభంగా జరగకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. స్టార్టప్, ఏంజెల్ ఇన్వెస్టర్ పదాలను సముచితంగా నిర్వచించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని నందిని చెప్పారు. స్టార్టప్స్‌కి సంబంధించిన పన్నుల చట్టాలు దుర్వినియోగమవుతున్నాయనే ఉద్దేశంతో వీటిల్లోకి వచ్చే పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక సెక్షన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56 (2) ప్రకారం.. సముచిత వేల్యుయేషన్‌కి మించి స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులను ప్రీమియంగా పరిగణించి, 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ఇప్పటికే, తొలి దశలో పెట్టుబడులు పెట్టే ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు దొరక్క సతమతమవుతున్న స్టార్టప్స్‌కి ఇది సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల ఏంజెల్ ఇన్వెస్టర్లు పూర్తిగా దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఈ సెక్షన్‌ను ఎత్తివేయాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్ పొందిన సంస్థలకు దీన్నుంచి కొంత మినహాయింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది. -
మార్కెట్‌ను మెప్పించని ఐటీసీ
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, వ్యవసాయోత్పత్తుల విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ నికర లాభం 4 శాతం పెరిగి రూ. 3,209 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3,090 కోట్లు. ‘క్యూ3లో స్థూల ఆదాయం రూ. 15 శాతం పెరిగి రూ. 9,853 కోట్ల నుంచి రూ.11,340 కోట్లకు చేరింది. ఎఫ్ఎంసీజీ, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ తదితర విభాగాలు రాణించడం ఇందుకు తోడ్పడింది‘ అని ఐటీసీ పేర్కొంది. సిగరెట్స్ విభాగంలో పెను సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగామని ఐటీసీ తెలిపింది. మూడో త్రైమాసికంలో వ్యయాలు 17% పెరిగి రూ. 7,446 కోట్లకు చేరాయి. స్థూల లాభం 11.2 శాతం పెరిగినా.. అధిక వ్యయాల కారణంగా మార్జిన్లు 39.8 శాతం నుంచి 38.5 శాతానికి తగ్గాయి. పరిశ్రమవర్గాలు 40 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాయి. మొత్తం మీద ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించలేకపోవడంతో ఐటీసీ షేరు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 277.70 వద్ద క్లోజయ్యింది. విభాగాలవారీగా ఆదాయాలు చూస్తే .. ►మొత్తం ఎఫ్ఎంసీజీ వ్యాపార ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,274 కోట్లకు పెరిగింది. ఇందులో సిగరెట్స్ వ్యాపార విభాగం ఆదాయం సుమారు 10 శాతం పెరిగి రూ. 5,073 కోట్లకు చేరింది. ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విభాగం 11% పెరిగి రూ. 3,201 కోట్లకు చేరింది. ►ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం 12 శాతం పెరిగి రూ. 452 కోట్లకు చేరింది. సగటు రూమ్ రేటు (ఏఆర్ఆర్) మెరుగుపడటం దీనికి తోడ్పడింది. ►అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం 26 శాతం ఎగిసి రూ. 1,531 కోట్ల నుంచి రూ.1,925 కోట్లకు చేరింది. ►పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1,543 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవటంతో ఫలితాల వెల్లడి అనంతరం ఐటీసీ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. షేరు ఏకంగా 4 శాతానికి పైగా పతనమై రూ.277.70 వద్ద ముగిసింది. -
స్పెషాలిటీ ఉత్పత్తులపై అరబిందో ఫోకస్
హైదరాబాద్: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా విభిన్న ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఆంకాలజీ, హార్మోన్స్, బయాలాజిక్స్, టాపికల్స్, నాసల్స్, పెప్టైడ్స్, ఇన్హేలర్స్, వ్యాక్సిన్స్ వంటి 147 ప్రొడక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. వీటి మార్కెట్ పరిమాణం రూ.8.27 లక్షల కోట్లు అని ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో తెలిపింది. కొత్త ఉత్పత్తుల ద్వారా ఆదాయం 2019–20 తొలి త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుంది. మూడేళ్లలో ఈ ప్రొడక్టులను యూఎస్ఎఫ్డీఏ వద్ద అరబిందో ఫైల్ చేయనుంది. -
భారత్–22 ఈటీఎఫ్ కోసం రూ.15,436 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన విపరీతంగా వచ్చింది. రూ.15,436 కోట్ల విలువ మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం సేకరించాల్సిన దానికి రెట్టింపు ఇది. 22 కంపెనీల్లో ప్రభుత్వం తనకున్న వాటాల్లో కొంత మేర భారత్–22 ఈటీఎఫ్ రూపంలో వేరు చేసి ఇన్వెస్టర్లకు విక్రయిస్తోంది. పెట్టుబడుల ఉససంహరణ ద్వారా నిధుల సమీకరణ కార్యక్రమంలో ఇదీ ఒక భాగమే. ప్రభుత్వం రూ.6,000 కోట్లను ఈటీఎఫ్‌ల జారీ ద్వారా, గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా (అవసరాన్నిబట్టి అదనపు కేటాయింపులు) రూ.2,400 కోట్లను సమీకరించాలనుకుంది. అంటే మొత్తం మీద రూ.8,400 కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉంది. బేస్ ఇష్యూ లక్ష్యమైన రూ.6,000 కోట్ల ప్రకారం చూస్తే 2.57 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయింది. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ చూస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన ఆఫర్ 22న ముగిసింది. అన్ని విభాగాల్లోనూ భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన అనూహ్యమనిఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో, ఎండీ నిమేష్ షా అన్నారు. భారత అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఈ ఈటీఎఫ్ ఓ మార్గమని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. అధిక డివిడెండ్ ఈల్డ్‌తో తక్కువ విలువకు లభిస్తోందన్నారు. -
మీ డివిడెండ్ మీకు చేరిందా?
లేదంటే కంపెనీ దగ్గరే ఉండి ఉంటుంది వివరాలు కంపెనీవెబ్సైట్లో ఉంటాయి ఏడేళ్ల వరకూ కంపెనీ డివిడెండ్ ఖాతాలోనేఆ తర్వాత ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదిలీ ఈ లోపు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగించే కంపెనీలన్నీ దాదాపుగా తమ వాటాదారులకు ఏటా కొంత లాభాన్ని డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ప్రతి మూడు నెలలకూ ఎంతో కొంత డివిడెండ్ చెల్లిస్తాయి కూడా. ఇప్పుడు ఆన్లైన్ డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి కనక దాదాపు అన్ని కంపెనీలూ డివిడెండ్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా డివిడెండ్ వారెంట్లను జారీ చేయటం జరుగుతోంది. ఈ డివిడెండ్ వారెంట్లు వాటాదారు చిరునామాకు నేరుగా వెళతాయి. వాటిని బ్యాంకులో జమ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా మారినా కొత్తది తెలియజేయని వారు... మరణించిన వాటాదారుల పేరిట జారీ అయిన డివెండ్ వారెంట్లు క్లెయిమ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతాయి. ఏడేళ్ల తరవాత ఆ మొత్తాన్ని కంపెనీలు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు (ఐఈపీఎఫ్) బదిలీ చేస్తాయి. ఈ ఫండ్‌ను సెబీ ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడమే కాక వారి ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం తమకు రావాల్సిన డివిడెండ్‌ను పొందడం ఎలాగో ఒకసారి చూద్దాం... లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్‌ను క్లెయిమ్ చేసుకోని వాటాదారుల వివరాలను కచ్చితంగా తమ వెబ్సైట్లలో ప్రదర్శించాలి. పేరు, రికార్డుల్లో నమోదై ఉన్న వారి చిరునామా, ఎంత మేర డివిడెండ్ పెండింగ్‌లో ఉంది తదితర వివరాలను ప్రతి కంపెనీ ఏటా వార్షిక వాటాదారుల సమావేశం ముగిసిన తర్వాత 90 రోజుల్లోపే వెబ్సైట్లో ఉంచాలి. ఇలా క్లెయిమ్ చేసుకోని వాటాదారుల వివరాలను వరుసగా ఏడేళ్ల పాటు వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిచూసుకుని తమ పేరు గనక ఉంటే సంబంధిత డివిడెండ్ కోసం క్లెయిమ్ చేసుకోవాలి. లేదంటే ఏడేళ్ల తర్వాత ఆ మొత్తం ఐఈపీఎఫ్‌కు బదిలీ అవుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ కె.వి.సునీల్ కుమార్ చెప్పారు. డివిడెండే కాదు, రిఫండ్లు కూడా... ఒక్క డివిడెండే కాదు, షేర్ల కోసం ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లించిన మొత్తాన్ని ఒకవేళ ఆ మేరకు షేర్లు అలాట్ చేయలేకపోతే కంపెనీలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది. అలా చెల్లించాల్సి ఉన్న నిధులు, కాల వ్యవధి తీరిన డిపాజిట్లు, డిబెంచర్లు, వాటిపై వడ్డీ సైతం కంపెనీ వద్దే ఉండిపోతే ఆ నిధులను కూడా నిబంధనల మేరకు ఐఈపీఎఫ్‌కు బదిలీ చేయాలని సునీల్ వెల్లడించారు. ‘‘సెక్షన్ 124(5) ప్రకారం ఏడు సంవత్సరాల వ్యవధిలోపు ఎప్పుడు ఇన్వెస్టర్ క్లెయిమ్ చేసుకున్నా ఆ మొత్తం వారికి చెల్లించడం జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు. క్లెయిమ్ ప్రక్రియ ఇలా... ఐఈపీఎఫ్–5 అనే డాక్యుమెంట్‌ను (జ్టి్టp://ఠీఠీఠీ.జ్ఛీpజ.జౌఠి.జీn) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు లేదా డివిడెండ్ ఆదాయం కోసం క్లెయిమ్ చేసుకునే వారు దరఖాస్తులో అన్ని వివరాలనూ పొందు పరచాల్సి ఉంటుంది. ఇందులో క్లెయిమ్ చేసుకుంటున్న వారి పేరు, కంపెనీ పేరు, షేర్లకు సంబంధించిన వివరాలు, ఆధార్ నంబర్, ఎన్ని క్లెయిమ్‌లు, బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతా వివరాలు అన్నీ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ దరఖాస్తును తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఎంసీఏ21కు పేజీ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జారీ అవుతుంది. దీన్ని భవిష్యత్తులో విచారణల కోసం సేవ్ చేసుకోవడం మంచిది. ఇక్కడే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఫీజు ఉన్నా, లేకపోయినా గానీ పే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్, అక్నాలెడ్జ్మెంట్ కాపీలను, ఇండెమ్నిటీ బాండ్‌తో కలిపి ఐఈపీఎఫ్ నోడల్ ఆఫీసర్‌కు అందజేయాలి. క్లెయిమ్ అందిన తర్వాత కంపెనీ 15 రోజుల్లోపు ఐఈపీఎఫ్‌కు వెరిఫికేషన్ రిపోర్ట్ అందచేస్తుందని సునీల్‌కుమార్ తెలిపారు. ఒకవేళ షేర్లు బకాయి ఉంటే వాటిని డీమ్యా ట్ ఖాతాకు బదిలీ చేయడం లేదా ఫిజికల్ సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. వెరిఫికేషన్ రిపోర్ట్ అందిన తేదీ నుంచి 60 రోజుల్లోపు తిరిగి చెల్లించడం పూర్తవుతుంది. -
ట్రావిస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం
ముంబై : ప్రపంచంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా పేరున్న ఉబర్‌కు, పలు కారణాలచే గుడ్‌బై చెప్పిన ట్రావిస్ కలానిక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్, చైనా స్టార్టప్‌ల్లో తన వ్యక్తిగత పెట్టుబడులు కోసం కొత్త ఫండ్‌ను లాంచ్‌చేశారు. 10100 పేరుతో ఈ ఫండ్‌ను కలానిక్ లాంచ్ చేసినట్టు తెలిసింది. కొన్ని నెలల నుంచి కలానిక్ తన కొత్త జర్నీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది. పలు కంపెనీ బోర్డులతో పనిచేయడం, లాభాపేక్ష లేని కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపడం చేస్తున్నట్టు వంటివి చేశారు. ''ఈ ఫండ్ ఎక్కువగా భారత్‌లోని నూతనావిష్కరణలు, స్టార్టప్‌లకు ఎక్కువగా మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల సృష్టి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, భారత్, చైనాల్లో ఈకామర్స్, ఎమర్జింగ్ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించవచ్చు. ప్రస్తుతం లాభాపేక్ష లేని నా పెట్టుబడులు తొలుత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. నగరాల భవిష్యత్తుపై కూడా దృష్టిసారించనున్నాయి'' అని కలానిక్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. దీని కోసం ఉబర్‌లో ఆయనకున్న షేరులో మూడోవంతు విక్రయించాలని కూడా కలానిక్ చూస్తున్నారు. ఈ విక్రయంతో కలానిక్ తన డ్రీమ్ నెరవేర్చుకుని, ఇన్వెస్టర్‌గా మారబోతున్నారు. ఈ సేల్ అనంతరం కలానిక్‌కు 1.4 బిలియన్ డాలర్లను పొందనున్నారు. ఈ ఈక్విటీని జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు కొనుగోలు చేస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. గతేడాది జూన్‌లో కలానిక్ ఉబర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా మాత్రం కొనసాగుతున్నారు. కలానిక్ పెట్టుబడులు చైనా కంటే ఎక్కువగా భారత్‌లో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసంకలానిక్ ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అవకాశాలను వెతకడం కోసం స్థానికంగా కలానిక్ టీమ్ పనిచేస్తుందని కూడా ఐవీ కాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ విక్రమ్ గుప్తా తెలిపారు. -
లైంగిక వేధింపు కేసు : ప్రముఖ ఇన్వెస్టర్ అరెస్ట్
ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, సీడ్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మూర్తిని శుక్రవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళను సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసినట్టు ఈయనపై కేసు నమోదైంది. మూర్తి డిజిటల్ ఏజెన్సీ ఫిన్స్టార్మ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యవస్థాపకుడు కూడా. 2017లో కేంద్ర మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) వద్ద మహిళ తన ఫిర్యాదును నమోదుచేసింది. ఎన్సీడబ్ల్యూ ఆదేశాలతో 2017 డిసెంబర్ 30న ఆయనపై కేసు నమోదైంది. అనంతరం ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం మషేష్ మూర్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 354(డీ), 509 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు ఖార్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ రామ్‌చంద్ర జాదవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ ఇన్వెస్టర్ అభ్యంతరకరమైన, లైంగిక వ్యాఖ్యలు, అసభ్య సంకేతాలతో మహిళలను వేధిస్తున్నట్టు ఎన్సీడబ్ల్యూ, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు లేఖ రాసింది. కొన్ని పోస్టులకు మషేష్ క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యూ, డీజీపీని కోరింది. ఈ మేరకు ఆయన్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టరు?
⇔ వార్తల నేపథ్యంలో 17 శాతం పెరిగిన షేరు ⇔ పన్నులు కట్టకుండా లాభాలు చూపించిన కంపెనీ! సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టర్ దొరికారా? అవుననే చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న బ్యాంకులు వ్యూహాత్మక భాగస్వామికి వాటాలను విక్రయించాలని చూస్తున్నాయని, అందుకోసం అవి తగిన భాగస్వామిని ఎంచుకున్నాయని కూడా మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో ఐవీఆర్సీఎల్ షేరు ధర ఒక్కసారిగా ఎగసింది. వార్తల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఐవీఆర్సీఎల్ షేరు ఒక్కసారిగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.4.85 వద్ద క్లోజయింది. దీంతో ఈ వార్తలపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఎక్సే్ఛంజీలు కోరాయి. తీసుకున్న అప్పులను తీర్చలేకపోవడంతో బ్యాంకులు తమ రుణాలను ఈక్విటీగా మార్చుకొని 51 శాతం వాటాతో కంపెనీ మేనేజ్మెంట్ను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మక రుణ వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) కింద బ్యాంకులు ఈ ఏడాది మే25లోగా కనీసం 26 శాతం వాటాను కొత్త ప్రమోటర్లకు విక్రయించాల్సి ఉండగా, ఆ విషయంలో విఫలమయ్యాయి. కంపెనీ వ్యూహాత్మక భాగస్వామిని అన్వేషించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కంపెనీలోని కీలక వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా వ్యూహాత్మక భాగస్వామిగా చేరటానికి ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ పేరును చెప్పలేం. కానీ త్వరలోనే కొత్త ప్రమోటర్‌ను తీసుకొస్తామన్న నమ్మకం ఉంది’’ అని కీలక అధికారి ఒకరు చెప్పారు. లాభాల్లోకి...: మార్చితో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రూ.686 కోట్ల ఆదాయంపై రూ.626 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికానికి చెల్లించాల్సిన రూ.957 కోట్ల పన్నులు చెల్లించకుండా వాయిదా వేయడమే కంపెనీ లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ పన్నులను తదుపరి త్రైమాసికంలో చెల్లించగలమన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2016–17 సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.131 కోట్లు కాగా, గత నష్టాలతో కలుపుకొంటే మొత్తం నష్టాలు రూ.2,173 కోట్లకు చేరుకున్నాయి. -
ప్రకటనలిస్తే ప్రయోజనం ఉండదు
ఇన్వెస్టర్లను వెతికే విషయమై సెబీపై సహారా ఫైర్ న్యూఢిల్లీ: మదుపరులను గుర్తించేందుకు పత్రికా ప్రకటనలిస్తే సరిపోదని సహారా గ్రూప్ తాజాగా మార్కెట్ రెగ్యులేటర్- సెబీకి స్పష్టం చేసింది. సహారాలో ఇన్వెస్ట్ చేసిన చాలామంది దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొంటూ... బాండ్ హోల్డర్లను గుర్తించేందుకు కావాలంటే తామూ తమ సహాయాన్ని అందిస్తామని ఆఫర్ చేసింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ గురువారం మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహారా ఉదంతాన్ని ప్రస్తావించారు. దీంతో కంపెనీ ఈ ప్రకటన చేసింది. -
కొత్త స్టార్టప్ లకు కోటిన్నర సాయం!
♦ ఈనెలాఖరు నుంచి స్టార్టప్‌లకు గ్రేడింగ్ ♦ దీంతో ఇన్వెస్టర్లకు ఫండింగ్ చేయటం ఈజీ ♦ మార్చి నుంచి స్టార్టప్, ఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో గ్రెక్స్ ఫౌండర్, సీఈఓ మనీష్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలకు నిధులు సమీకరించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే షేర్లు, డిబెంచర్లతో పాటు రకరకాల మార్గాలుంటాయి. లిస్ట్ కాకున్నా పెద్ద పెద్ద కంపెనీలున్నాయంటే వాటిక్కూడా నిధులు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలో, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ల డ్లో ఆదుకుంటాయ్!! మరి, అప్పుడే ప్రారంభించిన స్టార్టప్స్.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఈ) పరిస్థితేంటి? చక్కని ఆలోచనతో ఆరంభించినా.. నిధుల్లేక ఇవి పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీటికోసమే మీమున్నామంటోంది గ్రెక్స్. 2013లో పుణే కేంద్రంగా ప్రారంభమైన గ్రెక్స్ సేవల వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీష్ కుమార్ మాటల్లోనే.. ఏ కంపెనీ విస్తరణ చేపట్టాలన్నా కావాల్సింది పెట్టుబడులే. అయితే అన్ని సంస్థలూ సొంతంగా పెట్టుబడులను సమకూర్చుకోలేవు. నిధులను సమీకరిద్దామంటే ఇన్వెస్టర్లను ఎలా ఒప్పించాలో తెలియదు. ఒకవేళ తెలిసినా ఎంత పెట్టుబడికి ఎంత ఈక్విటీ ఇవ్వాలన్న దానిపై లోతైన అవగాహన ఉండదు. ఇలాంటి స్టార్టప్‌లకు, అన్‌లిస్టెడ్ కంపెనీలకు, ఎంఎస్ఈలకు ఈ పనులను చేసిపెట్టడమే గ్రెక్స్ పని. అంటే ఆయా సంస్థల నిర్వహణ నుంచి మొదలుపెడితే పనితీరు, వాల్యుయేషన్స్‌ను లెక్కగట్టి ఇన్వెస్టర్లను ఒప్పించి పెట్టుబడులు పెట్టేలా చేసే వరకు సంస్థకు తోడుగా ఉంటుందన్న మాట. 450 స్టార్టప్స్, 800 మంది ఇన్వెస్టర్లు.. ప్రస్తుతం గ్రెక్స్లో సోలార్ టౌన్, ఈవెంటస్ సాఫ్ట్వేర్, టురాకో మొబైల్ ప్రై.లి. వంటి 450 స్టార్టప్స్, కునాల్ బజాజ్, రాంపాల్ చావ్లా, చంద్రు బద్రీనారాయణ, రాజేశ్వరీ భట్టాచార్య, రేణు సింగ్ వంటి 800లకు పైగా ప్రైవేట్ ఇన్వెస్టర్లు రిజిస్టరై ఉన్నారు. గ్రేక్స్ వేదికగా ఫండింగ్ పొందిన సంస్థ నెక్స్‌జెన్ పేపర్ సొల్యూషన్ ప్రై.లి. సంస్థ. 2015 అక్టోబర్‌లో ఈ సంస్థ 1.5 కోట్ల నిధులు సమీకరించింది. మరో నాలుగు నెలల్లో 12 స్టార్టప్స్ నిధులను సమీకరించేందుకు రెడీగా ఉన్నాయి. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక్కో స్టార్టప్ కనీసం 1.5 కోట్లు సమీకరిస్తాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 5 కంపెనీలుంటాయి. ‘‘గతేడాది అక్టోబర్‌లో మా సంస్థలో పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్లు రూ.4 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో రూ.8-10 కోట్ల నిధులను సమీకరించేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. ఆయా పెట్టుబడులను గ్రెక్స్ సేవల విస్తరణ, టెక్నాలజీ అభివృద్ధి కోసం వినియోగిస్తామని’’ మనీష్ వివరించారు. స్టార్టప్‌లకు గ్రేడింగ్, రుణాలు:వచ్చే నెల నుంచి గ్రెక్స్లో రిజిస్టరైన స్టార్టప్ గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని ప్రారంభించునున్నాం. ఇందుకోసం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (కేర్)తో ఒప్పందం చేసుకున్నాం. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు మార్గం సులువవుతుంది. అం టే మంచి గ్రేడింగ్ ఉన్న స్టార్టప్‌ను ఎంచుకునే వీలుం టుందని అర్థం. తొలిసారిగా గ్రెక్స్ క్రెడిట్ గ్యారంటీ కింద 7 బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో (ఎన్బీఎఫ్సీ) చర్చిస్తున్నాం. దీంతో గ్రెక్స్ వేదికగా స్టార్టప్‌లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వీలుంటుంది. వచ్చే నెల నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. మెంటరింగ్, వాల్యుయేషన్స్ కూడా.. స్టార్టప్స్, ఎస్ఎంఈలకు ఫండింగ్ వచ్చేలా చేయటమే కాకుండా ఆయా సంస్థలకు మెంటరింగ్, వాల్యుయేషన్ సేవలను కూడా అందిస్తాం. ఇందుకోసం గ్రెక్స్లో ఇక్సిగో.కామ్ అలోక్ బాజ్‌పాయ్, కే క్యాపిటల్ ఎండీ, ముంబై ఏంజెల్స్ కో-ఫౌండర్ సాష మిర్చందానీ, కాస్మిక్ మండాలా 15 గ్రూప్ చైర్మన్ అశిత్ ఎన్ కంపనీ, ఆర్థిక విశ్లేషకుడు స్వాతిప్రసాద్ దొర, ప్రొఫెసర్ శాంతను భట్టచార్య వంటి వారెందరో ఉన్నారు. ఏర్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాండ్స్ ఇండియా, స్మార్ట్ అడ్వైజర్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
భారత్ లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: పన్ను వివాదాల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్.. భారత్‌లో దీర్ఘకాల ఇన్వెస్టరుగా కొనసాగుతామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో తమకు నిర్మాణాత్మక సంబంధాలే ఉన్నాయని పేర్కొంది. దాదాపు రూ. 14,200 కోట్ల పన్ను బకాయిలు కట్టకపోతే సంస్థ ఆస్తులు జప్తు చేస్తామంటూ ఆదాయ పన్ను శాఖ మంగళవారం నోటీసులు పంపిన దరిమిలా వొడాఫోన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆర్థిక అనిశ్చితే పసిడికి దన్ను!
పసిడి.. న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరగదన్న అంచనాలు, పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు, క్రూడ్ ధరల పతనం వెరసి ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగే అవకాశాలు పసిడిని మరింత మెరిసేట్లు చేస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ఏర్పడిన ఈ తరహా సంకేతాలతో బంగారం ధర అనూహ్యంగా పెరిగిన సంగతిని వీరు ఉదహరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు అంతర్జాతీయంగా పసిడిని ఇన్వెస్టర్‌కు ఆకర్షణీయం చేస్తాయన్నది ఈ రంగంలో నిపుణుల అంచనా. ఫెడ్ ఫండ్ రేటు మొదటి దఫా పెంపు అనంతరం పసిడి క్రమంగా నెమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందని గత డిసెంబర్లో నిపుణులు అంచనావేసినా... ‘ఆర్థిక అనిశ్చితి అంచనాల తీవ్రత వల్ల’ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గడచిన వారంలో నెమైక్స్‌లో ఔన్స్ ధర అంతక్రితం వారంతో ధర 1,158 డాలర్లతో పోల్చితే అనూహ్యంగా 81 డాలర్ల లాభంతో 1,239 డాలర్లకు ఎగసింది. నెమైక్స్‌లో వరుసగా నాలుగువారాల నుంచీ పసిడి బలపడుతోంది. దేశీయంగా ఒకేవారం రూ.1,680 అప్... అంతర్జాతీయ ధోరణిని కొనసాగడంతోపాటు రూపాయి బలహీనత, పెళ్లిళ్ల సీజన్ వంటికి అంశాలు దేశీయంగా పసిడిని బలోపేతం చేస్తున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే భారీగా రూ.1,680 పెరిగి రూ.29,260కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో ఎగసి రూ.29,110కి చేరింది. -
షేర్లపై రుణమా? వద్దులెండి..!
మీరో ఇన్వెస్టరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. మీ పోర్టుఫోలియోలో చాలా కంపెనీల షేర్లున్నాయి. కాకపోతే మీకు అర్జెంటుగా డబ్బు అవసరమొచ్చింది. మీ దగ్గరున్న షేర్లను బ్యాంకు దగ్గరో, ఆర్థిక సంస్థ దగ్గరో తనఖా పెట్టి డబ్బు తీసుకుందామనుకున్నారు. అది లాభదాయకమేనా? అలా తీసుకోవటం మంచి నిర్ణయమేనా? మార్కెట్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే మాత్రం... అది సరైన నిర్ణయం కాదు. దీనివల్ల లాభపడే అవకాశం తక్కువ కనక ఈమార్గాన్ని ఎంచుకోవటం సరికాదనేది వారి సూచన. * షేర్ల విలువలో 50 శాతానికి మించి రుణమివ్వరు * వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీలూ ఎక్కువే * లార్జ్ క్యాప్ షేర్లకు మాత్రమే పలు బ్యాంకుల అనుమతి * మార్కెట్ హెచ్చుతగ్గుల దృష్ట్యా వద్దంటున్న నిపుణులు ఏ బ్యాంకు కూడా షేర్లను తనఖా పెడితే వాటి విలువలో 50 శాతం కన్నా ఎక్కువ రుణాన్నివ్వటం లేదు. దీనికితోడు ఈ రుణంపై వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువే. పెపైచ్చు వాయిదా చెల్లింపులో ఆలస్యమైతే చెల్లించాల్సిన అపరాధ రుసుము కూడా అధికం. దీనిపై ట్రాక్ టు ట్రేడ్ సీఈఓ రమణమూర్తి మాట్లాడుతూ... ‘‘మేమైతే ఎవరైనా వ్యక్తులు షేర్లపై రుణం తీసుకుంటామని వస్తే వద్దనే సలహా ఇస్తాం. ఒకవేళ తన అవసరం గురించి తనకు బాగా తెలిసి... దీన్లోని రిస్కులపై కూడా అవగాహన ఉంటే సరేనంటాం. రుణం తీసుకున్న వ్యక్తికి అనుకున్న సమయంలోగా తిరిగి చెల్లించే సామర్థ్యం కచ్చితంగా ఉంటే తప్ప ఇలా రుణం తీసుకోవటాన్ని ప్రోత్సహించం. అధిక వడ్డీలకు తోడు... మంచి విలువలున్న ప్రధాన కంపెనీల షేర్లపై... అదీ తక్కువ మొత్తంలోనే రుణం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు. షేర్లపై రుణం తీసుకోవద్దని చెప్పేవారు... అందుకు చూపిస్తున్న కారణాలు చూస్తే... 50 శాతం కన్నా తక్కువ రుణం... షేర్ల ధరలు తరచూ మారుతాయి. హెచ్చుతగ్గులు అధికం. ఒక్కరోజులో దారుణంగా పడిపోయే సందర్భాలూ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని... బ్యాంకులు మీ షేర్ల విలువలో 50%కి మించి రుణమివ్వవు. దీనర్థం మీకు గనక రూ.2 లక్షల రుణం కావాలనుకుంటే... మీ దగ్గర రూ.4 లక్షలకు మించిన షేర్లుండాలి. ‘‘సాధారణంగా బ్యాంకులు తాము అనుమతించిన జాబితాలో ఉన్న షేర్లకే రుణాన్నిస్తాయి. బ్యాంకు పేర్కొన్న షేర్లు మీ పోర్టుఫోలియోలో లేకుంటే బ్యాంకులు మీ రుణాన్ని తిరస్కరించే అవకాశమూ ఉంది. ఎందుకంటే బ్యాంకులు ఆ షేర్లను త గిన హామీగా పరిగణించలేవు. కాని పక్షంలో రుణ మొత్తాన్ని మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుంది’’ అని రమణమూర్తి వివరించారు. ఖరీదైన వ్యవహారం... షేర్లను తనఖా పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువే. దీంతో పాటు ప్రాసెసింగ్ చార్జీలు, వాయిదాలు సకాలంలో చెల్లించకపోతే వేసే అపరాధ రుసుం... ఇవన్నీ ఎక్కువే. ‘‘కొన్ని సందర్భాల్లో రుణ వాయిదాలు ఆలస్యమైతే చెల్లించాల్సిన అపరాధ రుసుం వార్షిక రేటు 24 శాతం వరకూ ఉండొచ్చు. అంటే నెలకు 2 శాతం. అధిక చార్జీలు, తక్కువ రుణ మొత్తం... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ రుణం చాలా ఖరీదైనదని, దీనిబదులు పర్సనల్ లోన్ నయమని అనిపించకమానదు’’ అని మూర్తి వివరించారు. కొన్ని సందర్భాల్లో షేరు ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది కనక రుణ మొత్తం కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. వారాంతంలో గనక మీ షేర్ల ధరలు బాగా పడిపోయి, మీ రుణ మొత్తం దానికన్నా ఎక్కువగా ఉంటే... తేడాను మీరు సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల విలువైన షేర్లు తనఖా పెట్టి రూ.5 లక్షల రుణం తీసుకున్నారు. మీరు రుణం తీసుకున్నాక ఆ షేర్ల విలువ 20 శాతం పడిపోయింది. అంటే రూ.8 లక్షలకు చేరింది. అప్పుడు మీ రుణ అర్హత రూ.4 లక్షలే కనక... మీరు అప్పటికే రూ.5 లక్షలు తీసుకున్నారు కనక ఆ తేడా మొత్తం రూ.లక్షను బ్యాంకుతో సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు మరిన్ని షేర్లు తనఖా పెట్టడ మో, లేక కొంత రుణాన్ని తీర్చేయటమో చేయాలి. ‘‘మార్కెట్లు బాగా పెరుగుతున్న తరుణంలో షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకోవటమనేది మంచి వ్యూహంగానే కనిపిస్తుంది. కానీ తగ్గుతున్న మార్కెట్లో ఇలాంటివి కలిసిరావు. ఎందుకంటే షేర్ల ధరలు తగ్గినపుడు మార్జిన్ మొత్తాన్ని చెల్లించాల్సి రావటం, కొన్ని సందర్భాల్లో తనఖా పెట్టిన షేర్లను కోల్పోవటం వంటివి కూడా జరుగుతాయి’’ అని మూర్తి వివరించారు. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం పలు రకాల షేర్లు తనఖా పెడితే... కొన్ని బ్యాంకులు తప్ప చాలా బ్యాంకులు... ఒకే కంపెనీకి చెందినవి కాకుండా వివిధ రకాల షేర్లు తనఖా పెడితేనే రుణాన్నిస్తాయి. ఎందుకంటే ఒకటో రెండో కంపెనీల షేర్లయితే రిస్కు ఎక్కువ. ఆ రిస్కును తగ్గించుకోవటానికి ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి. అందుకని ఈ రుణానికి దరఖాస్తు చేసే ముందు కింది అంశాలను సమీక్షించుకోవాలి... * మీ పోర్టుఫోలియోలో వివిధ రకాల షేర్లుండాలి * అవి ఆర్థికంగా బాగున్న కంపెనీలవి అయి ఉండాలి. * మిడ్‌క్యాప్‌లలో రిస్కు ఎక్కువ కనక అధిక షేర్లు లార్జ్క్యాప్వి అయి ఉండాలి. అంటే పెద్ద కంపెనీలవి. * రుణాలివ్వటానికి బ్యాంకులు షేర్లకన్నా భౌతిక ఆస్తులకే ప్రాధాన్యమిస్తాయి. రియల్ ఎస్టేట్ ఆస్తుల విషయంలో వాటి విలువలో 65 శాతం వరకూ రుణమిస్తాయి. ఎందుకంటే షేర్ల మాదిరి వాటి ధరల్లో అధిక హెచ్చుతగ్గులుండవు. మెల్లగా పెరుగుతూనే ఉంటాయి. ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థలున్న కొందరు స్టాక్ బ్రోకర్లు మాత్రం షేర్లపై తక్కువ వడ్డీకి రుణాలిస్తారు. అయితే పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసే ప్రీమియం క్లయింట్లకే దీన్ని వర్తింపజేస్తారు. ఎందుకంటే వీరి ద్వారా సదరు కంపెనీలకు వచ్చే బ్రోకరేజీ ఎక్కువ కనక. అందుకే తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. కాకపోతే ఆ షేర్ల ధరలు తగ్గుతున్నపుడు క్లయింట్లను హెచ్చరించటం.. అయినా వారు రుణం తీర్చకపోతే మార్కెట్లో విక్రయించటం చేస్తుంటారు. -
బ్యాలెన్స్ సరే... మరి రీబ్యాలెన్సో?
* పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అత్యవసరం * అలాగైతేనే పొందిన లాభాలు చేతికొస్తాయ్ ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చంటారు. అలాగే పోర్టుఫోలియో చూసి కూడా సదరు ఇన్వెస్టర్ తెలివైన వాడా? కాదా అని చెప్పొచ్చు. పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడు డైవర్సిఫైడ్‌గా ఉండాలి. రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీతో పాటు తక్కువ రిస్క్ ఉండే డెట్ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే మీ పోర్ట్‌ఫోలియో చాలా బలంగా ఉన్నట్లు అర్థం. ఒకదానిలో నష్టం వచ్చినా... ఇంకొక దానిలో లాభం వస్తే వచ్చిన నష్టం సమానం అవుతుంది. అప్పుడు రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో... దాన్ని రీ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ఎలాగో చూద్దాం.. పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అంటే? పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకుంటామో... అలాగే దాన్ని నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా రీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పోర్ట్‌ఫోలియో, ఫండ్స్ విలువ ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా అసెట్స్ కేటాయింపులు కూడా మారుస్తూ ఉండాలి. దీన్నే ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్గా పేర్కొంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లు పెరుగుతున్నపుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, పతనమవుతున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రీ-బ్యాలెన్స్ విధానంలో మార్కెట్లు పడుతున్నప్పుడు అందులో ఇన్వెస్ట్‌చేసి... పెరుగుతున్నప్పుడు లాభాలు పొంది బయటకు వస్తారు. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ కొన్ని పెరగవచ్చు... అలాగే కొన్ని తగ్గొచ్చు. పెరిగిన స్టాక్స్ అలాగే పెరుగుతూ వె ళ్తాయని చెప్పలేం. అవి కూడా కొంత పెరిగిన తర్వాత తగ్గొచ్చు. ఇలా స్టాక్స్ పెరిగి మళ్లీ తగ్గితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌లకు కేటాయించిన ఇన్వెస్ట్మెంట్లను మార్చుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈక్విటీ మార్కెట్ పతనమైంది. ఇలాంటి సమయాల్లో అందరి పోర్ట్‌ఫోలియోలో డెట్‌పై ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా, ఈక్విటీపై తక్కువగా ఉంటాయి. కానీ రీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. ఈక్విటీ పైనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ తక్కువ ధరల వద్ద ఉంటాయి. అప్పుడు స్టాక్స్ కొంటే అవి వాటి అసలు ధర వద్ద మనకు లభిస్తాయి. అలాగే 2013లో మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి. ఇలా స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ కొనడం వల్ల ఈక్విటీ అసెట్స్‌ను బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా తక్కువ ధరల వద్ద కొన్న స్టాక్స్ తర్వాతి కాలంలో బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ స్టాక్స్‌ను విక్రయించి లాభాలను పొందొచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ లక్ష్యంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను అందిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారాలి... పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు మీ మిగులు సంపదను ఈక్విటీపై 70 శాతం, డెట్ సాధనాలపై 30 శాతం ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నారు. కానీ అప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా ఊపుమీద ఉంది. అలాంటప్పుడు మీరు ఈక్విటీపై 70 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను 80 శాతానికి పెంచుకోవచ్చు. డెట్ సాధనాలపై ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 శాతానికి తగ్గించుకోవచ్చు. ఈక్విటీపై లాభాలను పొందిన తర్వాత తిరిగి మీ ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీపై 70 శాతంగా, డెట్‌పై 30 శాతంగా ఉంచుకోవచ్చు. ఇదే రీబ్యాలెన్స్ వ్యూహం. రీబ్యాలెన్స్ సులువే కానీ.. రీబ్యాలెన్స్ వ్యూహం సులభంగానే కనిపిస్తుంది. కానీ దీనికి క్రమశిక్షణ కావాలి. అనుకున్న వ్యూహాలను అమలు చేయడానికి సరైన సమయం కావాలి. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు పతనమౌతుందో తెలియదు. స్టాక్స్ ధరలు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటాయో ట్రాక్ చేయడం కష్టం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇవ్వడం సులువైన పనికాదు. అలాగే ప్రాఫిట్స్ను బుక్ చేసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. - నిమేష్ షా సీఈఓ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ -
సాఫ్ట్ బ్యాంక్‌తో స్నాప్ ‘డీల్’
రూ. 3,760 కోట్ల పెట్టుబడులు స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు వాటా న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఒకే ఇన్వెస్టర్ నుంచి అతిపెద్ద పెట్టుబడిని సాధించింది. ఈ కంపెనీలో జపాన్‌కు చెందిన టెలికం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 62.7 కోట్ల డాలర్లను(సుమారు రూ. 3,760 కోట్లు) ఇన్వెస్ట్‌చేసింది. దేశీ ఈకామర్స్ రంగంలో ఒకే ఇన్వెస్టర్ చేసిన అత్యధిక పెట్టుబడి ఇది. ఈ సందర్భంగా స్నాప్‌డీల్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా అవతరించినట్లు పేర్కొన్న సాఫ్ట్‌బ్యాంక్ ఎంతవాటాను సొంతం చేసుకున్నదీ వెల్లడించలేదు. స్నాప్‌డీల్ వివిధ ఇన్వెస్టర్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటికే బిలియన్ డాలర్లను(రూ. 6,000 కోట్లు) సమీకరించిన విషయం విదితమే. పెట్టుబడి చేసిన వారిలో రతన్ టాటా కూడా ఉన్నారు. 2.5 కోట్ల వినియోగదారులతో దేశీయ ఈకామర్స్ మార్కెట్లో స్నాప్‌డీల్ మూడో స్థానంలో ఉంది. ఇండియన్ అలీబాబా.... భారత ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాలాగా వృద్ధి సాధించనున్నదని సాఫ్ట్‌బ్యాంక్ అంచనా వేస్తోంది. స్నాప్‌డీల్ భారత దేశపు లలీబాబా అయ్యే అవకాశాలున్నాయని సాఫ్ట్‌బ్యాంక్ అధినేత మసయోషి సన్ భావిస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ అలీబాబాలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఆలీబాబాలో మూడో వంతు పెట్టుబడులు ఈ కంపెనీవే. అలీబాబా అమెరికా స్టాక్ ఎక్స్ఛేం జీల్లో లిస్టయిన సందర్భంగా ఈ పెట్టుబడులపై సాఫ్ట్‌బ్యాంక్ భారీ లాభాలను ఆర్జించింది. ఇప్పడు స్నాప్‌డీల్ పెట్టుబడులపై ఇదే స్థాయి రాబడులు వస్తాయని సాఫ్ట్‌బ్యాంక్ ఆశిస్తోంది. స్నాప్‌డీల్‌లో ఏకైక అతి పెద్ద సింగిల్ ఇన్వెస్టర్ ఈ కంపెనీయే. ఒప్పందం థ్రిల్లింగ్: కునాల్ బెహల్ సాఫ్ట్‌బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ చెప్పారు. అమెరికా ఇంజనీరింగ్, బిజినెస్ డిగ్రీలున్న కునాల్ బెహల్ మైక్రోసాఫ్ట్‌లో కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. అయితే వీసా సమస్యల కారణంగా ఆయన అమెరికాను వీడాల్సి వచ్చింది. భారత్‌కు తిరిగివచ్చిన బెహల్ తన చిన్ననాటి మిత్రుడు ఐఐటీ పట్టభద్రుడు బన్సాల్‌తో జట్టు కట్టాడు. రిటైల్‌తో సహా వివిధ వ్యాపారాలను వీరిరువురు నిర్వహించారు. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. చైనా వెళ్లిన వారికి అలీబాబా రూపంలో అదృష్టం సాక్షాత్కరించింది. చైనాలో లాగానే భారత్‌లో కూడా వినియోగదారుల సంఖ్య భారీగా ఉందని, రిటైల్ సంస్థల విస్తరణకు రియల్టీ ధరలు అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించిన వారిరువురు చైనా ఆలీబాబా స్ఫూర్తితో భారత్‌లో ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కామర్స్ మార్కెట్లో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని బెహల్ చెప్పారు. తాము ఇప్పడే ప్రయాణం ప్రారంభించామని, సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. అలీబాబా గత ఏడాది 24,800 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. వచ్చే ఏడాది కల్లా వంద కోట్ల డాలర్ల విక్రయాలు సాధించాలని స్నాప్‌డీల్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మొత్తం భారత రిటైల్ రంగంలో ఈ కామర్స్ వాటా 0.8 శాతంగానే ఉంది. అమెరికాలో ఇది 7 శాతంగానూ, చైనాలో 10 శాతంగానూ ఉంది. ఓలా క్యాబ్స్లోనూ.... స్నాప్‌డీల్‌లో ఒక్క సాఫ్ట్‌బ్యాంక్ మాత్రమే పెట్టుబడి చేయగా, ఇదే కంపెనీ ఇతర సంస్థలతో కలసి ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా(గతంలో ఓలా క్యాబ్స్)లోనూ 21 కోట్ల డాలర్లను(రూ. 1,260 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. రానున్న కాలంలో ఇండియాలో 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) ఇన్వెస్ట్‌చేయనున్నట్లు ముందురోజు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పెట్టుబడుల వివరాలను ప్రకటించింది. సాఫ్ట్బ్యాంక్సహా కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్ 21 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఓలా తెలిపింది. ఇంటర్నెట్ వినియోగదారులకు ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నదని, అయితే ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ అంతగా విస్తరించలేదని సాఫ్ట్‌బ్యాంక్ కార్ప్ వైస్‌చైర్మన్ నికేష్ అరోరా వ్యాఖ్యానించారు. వెరసి చౌకైన వేగవంతమైన ఇంటర్నెట్ను అందించాల్సి ఉన్నదని చెప్పారు. వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా అరోరాకు స్నాప్‌డీల్ బోర్డులో చోటు లభించనుంది. -
ఇన్వెస్టర్ల సంపద...
ముంబై: ఈ ఏడాది జనవరి మొదలు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 23 లక్షల కోట్లకుపైగా పెరిగింది. వెరసి మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) దాదాపు రూ. 94 లక్షల కోట్లకు చేరింది. 2013 డిసెంబర్ 31 నుంచి అక్టోబర్ 1 వరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25% పుంజుకోగా, ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. 23.3 లక్షల కోట్లమేర జమయ్యింది. అయితే 2013 ఏడాదికి ఇన్వెస్టర్ల సంపద కేవలం రూ. లక్ష కోట్లు మాత్రమే పెరగడంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 70.44 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 93.77 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా రూ. కోటి (100 లక్షల) కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకునేందుకు చేరువైంది. ఈ మైలురాయిని అందుకోవాలంటే ఇకపై ఇన్వెస్టర్ల సంపద కేవలం రూ. 6.22 లక్షల కోట్లు పుంజుకుంటే సరిపోతుంది! 2013 డిసెంబర్ 31 నుంచి చూస్తే అక్టోబర్ 1 వరకూ సెన్సెక్స్ 25.5% పురోగమించింది. ఈ బాటలో సెప్టెంబర్ 8న చరిత్రను సృష్టిస్తూ సెన్సెక్స్ తొలిసారి 27,320 పాయింట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపద పుంజుకోవడానికి లిస్టెడ్ కంపెనీల సంఖ్య పెరగడం కూడా ఒక కారణమని స్టాక్ నిపుణులు చెప్పారు. ప్రస్తుతం బీఎస్ఈలో 5,485 కంపెనీలు లిస్టింగ్ పొందాయి. రూ. లక్ష కోట్ల కంపెనీలు: సెన్సెక్స్‌లో భాగమైన కొన్ని బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ విడిగా రూ. లక్ష కోట్లను అధిగమించడం విశేషం. ఈ జాబితాలో టీసీఎస్, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, విప్రో, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ ఉన్నాయి. కాగా, టీసీఎస్ రూ. 5,43,684 కోట్ల మార్కెట్ విలువతో అగ్రభాగాన నిలుస్తోంది. సుస్థిర ప్రభుత్వం ఎఫెక్ట్ సానుకూల సెంటిమెంట్‌కుతోడు, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం మార్కెట్ల వృద్ధికి ప్రధానంగా దోహదపడింది. భారీ స్థాయిలో తరలివస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు మార్కెట్లకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీ స్టాక్ మార్కెట్లు అత్యంత బుల్లిష్‌గా ఉన్నాయని, ప్రస్తుతం స్థిరీకరణ(కన్సాలిడేషన్) దశ కొనసాగుతున్నదని, రానున్న రోజుల్లో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఈక్విటీ నిపుణుడొకరు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 83,438 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
స్టాక్ మార్కెట్‌కు ఆకాశమే హద్దు
ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది.. - ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనాలు న్యూఢిల్లీ: రానున్న కాలంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగనున్నాయని బిగ్‌బుల్‌గా పిలిచే ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన రాకేష్ దేశీ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థ కొత్త వృద్ధి బాటలో అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు. 2017-18కల్లా జీడీపీ 9% స్థాయిలో పురోగమిస్తుందని అంచనా వేశారు. ఆపై ఏడాది 10% వృద్ధిని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.రానున్న ఐదేళ్లలో రిటైల్ రంగంలో అద్భుత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత రిటైల్ రంగ పరిమాణం ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. భవిష్యత్‌లో దేశీ స్టాక్ మార్కెట్లో పటిష్టమైన బూమ్‌కు అవకాశమున్నదని, అయితే బలమైన యాజమాన్యం, పారదర్శక నిర్వహణ కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిం చారు. వృద్ధి అవకాశాలున్న రంగాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. వీటిలో రిటైల్ రంగం ఒకటని పేర్కొన్నారు. భారీ స్థాయిలో విస్తరించగలిగే కంపెనీలను ఎంపిక చేసుకోవడం మేలని తెలిపారు. పెట్టుబడులకు ముందుగా అవకాశాలపై కన్నేయాలని చెప్పారు. అవకాశంలేనిదే ఆర్థిక చైతన్యం ఉండదని, ఆర్థిక పురోగతి లేకపోతే లాభదాయకతకూ వీలుచిక్కదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనతో కాల్గేట్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా లాభపడినట్లు వెల్లడించారు. ఇక దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం 500 బిలియన్ డాలర్లుకాగా, ఆర్గనైజ్డ్ రంగం వాటా 8% మాత్రమేనని చెప్పారు. ప్రత్యేకత చూపే రిటైల్ సంస్థలకు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. రియల్టీ, రిటైల్ నుంచే..: ఏ దేశానికి చెందిన సంపన్నుల జాబితాను చూసినా రియల్టీ, రిటైల్ రంగాల నుంచి వచ్చిన వారికి తప్పకుండా చోటు లభిస్తుంటుందని వివరించారు. వీటిలో రిటైల్ రంగంలో పలు అవకాశాలున్నాయని చెప్పారు. ఇలాంటి ఆలోచన నుంచే టైటాన్ షేర్లలో ఇన్వెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. టైటా న్లో ఇకపై కూడా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు చెప్పారు. వీటి తరువాత కంపెనీల పోటీతత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదే విధంగా భవిష్యత్‌లో లార్జ్ క్యాప్‌గా మారగల సత్తా ఉన్న మిడ్ క్యాప్ షేర్లను పెట్టుబడులకు పరిశీలించవచ్చన్నారు. -
ఈ టెర్మినేటర్.. మంచి ఇన్వెస్టర్
ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది టెర్మినేటర్ సినిమా. బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్స్, సినిమాలతో కోట్లు సంపాదించాడు. ఆ వచ్చిన సంపాదనను జల్సాలకంటూ ఖర్చు పెట్టేయకుండా ఇన్వెస్ట్ చేయడంలోనూ తెలివిగానే వ్యవహరించాడు. 400 మిలియన్ డాలర్ల పైగా ఆస్తిని ఆర్జించాడు. బాడీబిల్డర్గాను, యాక్టర్‌గాను, గవర్నర్‌గానూ, ఇన్వెస్టర్గాను వివిధ పాత్రల్లో రాణించిన ఆర్నాల్డ్ ఇన్వెస్ట్మెంట్ విశేషాలే ఈ వారం సెలబ్రిటీ స్టోరీ.. ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇన్వెస్ట్ చేశాడు. రెస్టారెంట్లలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కమర్షియల్ జంబో జెట్లను కొనుక్కుని, లీజుకు ఇచ్చేవాడు. ఇవే కాకుండా షేర్లు, బాండ్లు మొదలైన వాటిల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టాడు. పద్ధతిగా పెట్టుబడి.. ఆర్నాల్డ్ 1968లో తోటి బాడీబిల్డర్తో కలిసి నిర్మాణ సామగ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు. తమ మార్కెటింగ్ వ్యూహాలను జోడించి వ్యాపారాన్ని సక్సెస్ చేశాడు. అందులో వచ్చిన లాభాలతో కొరియర్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారాలతో వచ్చిన డబ్బును రియల్టీలోకి మళ్లించాడు. 10,000 డాలర్లు పెట్టి అపార్ట్మెంట్ బిల్డింగ్ కొన్నాడు. ఆ తర్వాత అనేక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. తోటి నటులు బ్రూస్ విల్లీస్, సిల్వెస్టర్ స్టాలోన్ తదితరులతో కలిసి ప్లానెట్ హాలీవుడ్ పేరిట రెస్టారెంట్ చెయిన్‌ని కూడా ప్రారంభించాడు. కానీ దాన్నుంచి తర్వాత వైదొలిగాడు. ఇవే కాకుండా, ఓక్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థ, ఫిట్నెస్ పబ్లికేషన్స్ పేరిట ప్రచురణ సంస్థ కూడా ఏర్పాటు చేశాడు. పాఠాలు పెట్టుబడులు, లక్ష్యసాధనకు సంబంధించి ఆర్నాల్డ్ నుంచి చాలానే నేర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను రాసి పెట్టుకునేవాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా టోటల్ రికాల్ పేరుతో రాసిన తన బయోగ్రఫీలో పొందుపర్చాడు. లక్ష్యాలపై స్పష్టత, ఇన్వెస్ట్ చేసే ముందు అధ్యయనం, ఎప్పుడూ నెగటివ్‌గా ఉండే వ్యక్తులు.. పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం తదితర విషయాలు ఆయన పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియడంతో పాటు ఎప్పుడు వైదొలగాలన్నది కూడా తెలిసి ఉండటం కీలకం అంటాడు ఆర్నాల్డ్. డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు.. మన ం ఎంత దాచుకోగలిగామన్నదే ముఖ్యమని చెబుతాడు. తాను స్టార్‌గా కంటే బిజినెస్ మ్యాన్‌గా అనేక రెట్లు ఎక్కువగా సంపాదించాననే ఆర్నాల్డ్.. డబ్బు అనేది గొప్ప సంతోషాన్నివ్వదంటాడు. ఒకానొక సందర్భంలో..‘నా దగ్గర ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు ఉన్నాయి. కానీ ఇంతకంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను. పెద్దగా తేడా ఏమీ లేదు.’ అని చెప్పుకొచ్చాడు. -
భారతీయుడికి జాక్‌పాట్
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ సైటు ట్విట్టర్ పబ్లిక్ ఇష్యూ ఆ సంస్థ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఇందులో ప్రవాస భారతీయ ఇన్వెస్టరు సుహైల్ రిజ్వీ కూడా ఉన్నారు. రిజ్వీకి ఉన్న 15.6 శాతం వాటాకు 3.8 బిలియన్ డాలర్ల విలువను తెచ్చిపెట్టింది. ఆయన వ్యక్తిగతంగా, తన క్లయింట్ల తరఫున ట్విట్టర్లో సుమారు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారని అంచనా. గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన ట్విట్టర్ షేరు ధర ఏకంగా 73 శాతం ఎగిసి 44.90 డాలర్ల వద్ద ముగియడంతో రిజ్వీ వాటాల విలువ కూడా దానికి అనుగుణంగానే ఎగసింది. 47 ఏళ్ల రిజ్వీ సిలికాన్ వ్యాలీలో ఒక మిస్టరీ ఇన్వెస్టరు. రిజ్వీ ట్రావర్స్ మేనేజ్మెంట్ అనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వహించే రిజ్వీ భారత్‌లో జన్మించారు. అమెరికాలో పెరిగారు. మీడియాకు దూరంగా ఉండే రిజ్వీకి.. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ వంటి శక్తిమంతమైన స్నేహితులు ఉన్నారు. కానీ, ఆయన గురించి, ఆయన ఇన్వెస్ట్మెంట్ల గురించి బైటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన పత్రాలు దాఖలు చేసే దాకా రిజ్వీ గురించి తెలియలేదంటే ఆయన గోప్యత ఎంతో అర్థమవుతుంది. టెలికంలోనూ పెట్టుబడులు.. టెక్ కంపెనీల కన్నా ముందుగా.. రిజ్వీ టెలికం, తయారీ రంగ కంపెనీల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్పైనా దృష్టి పెట్టారు. హాలీవుడ్లో పెట్టుబడులపై 2011లో ఆయన మంచి లాభాలనే ఆర్జించారు. అదే సమయంలో క్రిస్ సాకా అనే ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి ట్విట్టర్ షేర్లను కొన్నారు. అటు తర్వాత తన క్లయింట్ల తరఫున ట్విటర్ ఉద్యోగుల నుంచి కూడా షేర్లను కొన్నారు. ట్విట్టరే కాకుండా ఫ్లిప్‌బోర్డ్, పింట్రెస్ట్ తదితర సంస్థల్లోనూ రిజ్వీ ఇన్వెస్ట్ చేశారు. ట్విట్టర్ ఫౌండర్లకు బిలియన్ డాలర్ల లాభం.. ఐపీవోతో ట్విట్టర్ సహవ్యవస్థాపకులు ఇవాన్ విలియమ్స్, జాక్ డార్సీ పెట్టుబడుల విలువ ఒకే రోజున బిలియన్ డాలర్లకు పైగా ఎగసింది. విలియమ్స్ వ్యక్తిగత సంపద 1.07 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. డార్సీ అర బిలియన్ డాలర్ల మేర లాభపడ్డారు. విలియమ్స్‌కి ట్విట్టర్లో 5.7 కోట్ల షేర్లు ఉండగా, డార్సీకి 2.35 కోట్ల షేర్లు ఉన్నాయి. తాజా ఐపీవోతో వీరిరువురి సంపద విలువ 3.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు కంపెనీ సీఈవో డిక్ కోస్టొలో సంపద 145 మిలియన్ డాలర్లు పెరిగి 345 మిలియన్ డాలర్లకు చేరింది. -
19 ఏళ్ళలో 26 రెట్లు పెరిగింది
25వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 6.49 లక్షలయ్యింది మధ్యలో భారీగా పడినా ఆందోళన చెందలేదు ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ పేరుతో ప్రవేశపెట్టిన కొత్త శీర్షిక మాలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు స్ఫూర్తినిస్తోంది. దీంతో నా సక్సెస్ స్టోరీ కూడా ‘ప్రాఫిట్’ పాఠకులతో పంచుకోవాలనిపించింది.’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ. ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలో పనిచేస్తున్న నేను 1994 సెప్టెంబర్‌లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రైమా ప్లస్ (నాకు తెలిసినంతవరకు ఫ్రాంక్లిన్ ఇండియాకి ఇది తొలి పథకం)లో రూ.25,000 ఇన్వెస్ట్ చేశాను. అది న్యూ ఫండ్ ఆఫర్ కావడంతో ఒక్కొక్క యూనిట్ రూ. 10 చొప్పున 2,500 యూనిట్లు వచ్చాయి. కాని ఇన్వెస్ట్ చేసిన రెండేళ్ళలోనే నా ఇన్వెస్ట్మెంట్ విలువ సగానికి సగం ఆవిరైపోయింది. 1996 డిసెంబర్లో యూనిట్ విలువ రూ.5.88 పడిపోయింది. ఆ సమయంలో కాస్త భయపడ్డాను. అయితే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం కాబట్టి వైదొలగలేదు. ఇలా ధైర్యంగా ఎదురుచూసినందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం నా పెట్టుబడి రూ.25,000 కాస్త ఇప్పుడు ఇంచుమించుగా రూ.6.49 లక్షలకు చేరింది. అంటే ఈ పథకం సగటున 17 శాతం వార్షిక రాబడిని అందించింది. అలాగే నా పెట్టుబడి 26 రెట్లు వృద్ధి చెందినట్లు లెక్క. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ విలువ రూ.3 లక్షలకు పడిపోయింది. అప్పుడు కూడా నేను భయపడలేదు. కాని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. 1996లో భారీగా పడిపోయినప్పుడు చేతిలో డబ్బులుండి మరో రూ.25,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేదని. ఇలాంటి ఆలోచనలు మానవ సహజమే అయినా నా అనుభవంతో ఇన్వెస్టర్లకి చెప్పేది ఒక్కటే. ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచి ఎంత పెరిగింది అన్నది చూడకుండా మంచి పథకంలో ఇన్వెస్ట్ చేసి కనీసం 10 నుంచి 20 ఏళ్ళు ఎదురుచూస్తే తప్పక లాభాలు వస్తాయి. - జి.మురళీకృష్ణ, హైదరాబాద్