ఏడో రోజూ అదే వరుస  | Sensex ends down by 95 points, Nifty at 1127 | Sakshi
Sakshi News home page

ఏడో రోజూ అదే వరుస 

Published Sat, May 11 2019 12:15 AM | Last Updated on Sat, May 11 2019 12:15 AM

Sensex ends down by 95 points, Nifty at 1127 - Sakshi

అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఎన్నికల అనిశ్చితి స్టాక్‌ మార్కెట్‌ను ఊపిరిసలపనివ్వడం లేదు. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కొనసాగుతున్న ఫలితంగా గురువారం కూడా స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. వరుసగా ఏడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోయి 37,559 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 11,302 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌1,475 పాయింట్లు, నిఫ్టీ 446 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే ఈ రెండు సూచీలు 3.7 శాతం చొప్పున క్షీణించాయి. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.6.16 లక్షల కోట్లు ఆవిరైంది.  

ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌...!  
అమెరికా తమ వస్తువులపై సుంకాలు విధిస్తే, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్‌ కూడా బలహీనంగా మొదలైంది.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 384 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతలపై స్పష్టత వచ్చేవరకూ ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడులకు తప్పవని నిపుణులంటున్నారు. 

అగ్రస్థానంలో టీసీఎస్‌....
రిలయన్స్‌ పతనం గురువారం కూడా కొనసాగింది. అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, మోర్గాన్‌ స్టాన్లీ ఈ షేర్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ షేర్‌ 3.4 శాతం నష్టంతో రెండు నెలల కనిష్ట స్థాయి, రూ. వద్ద ముగిసింది.  సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే,. గత నాలుగు రోజుల పతనం కారణంగా ఈ షేర్‌ 10 శాతం పతనమైంది. ఈ నాలుగు రోజుల్లో  కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.96,288 కోట్లు ఆవిరై  రూ.7,95,629 కోట్లకు తగ్గింది. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. అత్యధిక మార్కెట్‌ విలువ గల కంపెనీ అన్న ఘనతను టీసీఎస్‌కు కోల్పోయింది.  టీసీఎస్‌ షేర్‌ 0.75 శాతం పెరిగి రూ.2,169 వద్ద ముగిసింది. దీని మార్కెట్‌ క్యాప్‌ రూ.8,13,780 కోట్లకు చేరింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా, ఈ రెండు కంపెనీల తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలివర్, ఐటీసీలు నిలిచాయి.  175కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బయోకాన్, థైరోకేర్‌ టెక్నాలజీస్, కేసీపీ షుగర్స్, బాష్, లిబర్టీ షూస్, ర్యాలీస్‌ ఇండియా ఈ జాబితాలో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement