ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టరు?
⇔ వార్తల నేపథ్యంలో 17 శాతం పెరిగిన షేరు
⇔ పన్నులు కట్టకుండా లాభాలు చూపించిన కంపెనీ!
సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టర్ దొరికారా? అవుననే చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న బ్యాంకులు వ్యూహాత్మక భాగస్వామికి వాటాలను విక్రయించాలని చూస్తున్నాయని, అందుకోసం అవి తగిన భాగస్వామిని ఎంచుకున్నాయని కూడా మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో ఐవీఆర్‌సీఎల్ షేరు ధర ఒక్కసారిగా ఎగసింది. వార్తల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఐవీఆర్‌సీఎల్ షేరు ఒక్కసారిగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.4.85 వద్ద క్లోజయింది.
దీంతో ఈ వార్తలపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఎక్సే్ఛంజీలు కోరాయి. తీసుకున్న అప్పులను తీర్చలేకపోవడంతో బ్యాంకులు తమ రుణాలను ఈక్విటీగా మార్చుకొని 51 శాతం వాటాతో కంపెనీ మేనేజ్‌మెంట్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మక రుణ వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్) కింద బ్యాంకులు ఈ ఏడాది మే25లోగా కనీసం 26 శాతం వాటాను కొత్త ప్రమోటర్లకు విక్రయించాల్సి ఉండగా, ఆ విషయంలో విఫలమయ్యాయి.
కంపెనీ వ్యూహాత్మక భాగస్వామిని అన్వేషించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కంపెనీలోని కీలక వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా వ్యూహాత్మక భాగస్వామిగా చేరటానికి ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ పేరును చెప్పలేం. కానీ త్వరలోనే కొత్త ప్రమోటర్‌ను తీసుకొస్తామన్న నమ్మకం ఉంది’’ అని కీలక అధికారి ఒకరు చెప్పారు.
లాభాల్లోకి...: మార్చితో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రూ.686 కోట్ల ఆదాయంపై రూ.626 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికానికి చెల్లించాల్సిన రూ.957 కోట్ల పన్నులు చెల్లించకుండా వాయిదా వేయడమే కంపెనీ లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ పన్నులను తదుపరి త్రైమాసికంలో చెల్లించగలమన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2016–17 సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.131 కోట్లు కాగా, గత నష్టాలతో కలుపుకొంటే మొత్తం నష్టాలు రూ.2,173 కోట్లకు చేరుకున్నాయి.