Infra Company
-
వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం
ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ‘డిపాజిట్’ వార్!రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా విమానాశ్రయం, బిహార్‌లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది. -
Hyderabad: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు
-
హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: సుశి ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్-12లో కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సుశి ఇన్ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. -
మౌలిక రంగం డౌన్
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్‌లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్‌లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది. -
ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టరు?
⇔ వార్తల నేపథ్యంలో 17 శాతం పెరిగిన షేరు ⇔ పన్నులు కట్టకుండా లాభాలు చూపించిన కంపెనీ! సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కు కొత్త ఇన్వెస్టర్ దొరికారా? అవుననే చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న బ్యాంకులు వ్యూహాత్మక భాగస్వామికి వాటాలను విక్రయించాలని చూస్తున్నాయని, అందుకోసం అవి తగిన భాగస్వామిని ఎంచుకున్నాయని కూడా మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో ఐవీఆర్సీఎల్ షేరు ధర ఒక్కసారిగా ఎగసింది. వార్తల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఐవీఆర్సీఎల్ షేరు ఒక్కసారిగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.4.85 వద్ద క్లోజయింది. దీంతో ఈ వార్తలపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఎక్సే్ఛంజీలు కోరాయి. తీసుకున్న అప్పులను తీర్చలేకపోవడంతో బ్యాంకులు తమ రుణాలను ఈక్విటీగా మార్చుకొని 51 శాతం వాటాతో కంపెనీ మేనేజ్మెంట్ను తమ చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మక రుణ వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) కింద బ్యాంకులు ఈ ఏడాది మే25లోగా కనీసం 26 శాతం వాటాను కొత్త ప్రమోటర్లకు విక్రయించాల్సి ఉండగా, ఆ విషయంలో విఫలమయ్యాయి. కంపెనీ వ్యూహాత్మక భాగస్వామిని అన్వేషించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కంపెనీలోని కీలక వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా వ్యూహాత్మక భాగస్వామిగా చేరటానికి ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ పేరును చెప్పలేం. కానీ త్వరలోనే కొత్త ప్రమోటర్‌ను తీసుకొస్తామన్న నమ్మకం ఉంది’’ అని కీలక అధికారి ఒకరు చెప్పారు. లాభాల్లోకి...: మార్చితో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ రూ.686 కోట్ల ఆదాయంపై రూ.626 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికానికి చెల్లించాల్సిన రూ.957 కోట్ల పన్నులు చెల్లించకుండా వాయిదా వేయడమే కంపెనీ లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ పన్నులను తదుపరి త్రైమాసికంలో చెల్లించగలమన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2016–17 సంవత్సరానికి కంపెనీ నికర నష్టం రూ.131 కోట్లు కాగా, గత నష్టాలతో కలుపుకొంటే మొత్తం నష్టాలు రూ.2,173 కోట్లకు చేరుకున్నాయి. -
75% వాటా తీసుకుందాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కి ఇచ్చిన అప్పులు మొత్తాన్ని ఈక్వి టీగా మార్చుకోవాలని బ్యాంకులు నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని బ్యాంకులూ కలసి దాదాపు రూ.7,350 కోట్లను ఐవీఆర్‌సీఎల్‌కు రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చుకోవటం ద్వారా, తమ ఖాతా పుస్తకాల నుంచి ఈ కంపెనీకి సంబంధించి ఎన్పీఏలు ఏమీ లేకుండా చూసుకోవాలని ఈ మధ్యనే జరిగిన సీనియర్ లెండర్స్ సమావేశంలో బ్యాంకులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలియవచ్చింది. డిసెంబర్ 19న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంకులు దీన్ని ఈక్విటీగా మార్చుకున్నట్లయితే వాటి ఖాతా పుస్తకాల్లో ఇది ఇక ఎన్పీఏగా కనపడదు. దీంతో సాంకేతికంగా ఎన్పీఏలను తగ్గించుకున్నట్లుగా చూపించే అవకాశం ఉంటుంది. నిజానికి ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఎస్బీఐ నేతృత్వంలో అప్పులిచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఎస్డీఆర్ను అమలు చే యనున్నాయి. తదుపరి కార్యాచరణలో భాగంగా అప్పులు, వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల వాటా ఇప్పటికే 49%కి చేరింది. మొత్తం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకుంటే ఇది 75% దాటుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రమోటర్ల వాటా 8.28% నుంచి 5% దిగువకు పడిపోతుందని అంచనా. కాగా కంపెనీలో మెజారిటీ వాటా బ్యాంకులు చేతికి వెళ్ళినా పాత యాజమాన్యాన్నే కొనసాగిస్తారన్న నమ్మకాన్ని ఐవీఆర్సీఎల్ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ అమలుతో కంపెనీ పనితీరు మెరుగవుతుందని, ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత తీరుతుందని చెప్పారు. -
ఐవీఆర్సీఎల్ నికరనష్టం 155 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్సీఎల్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే గతేడాది ఇదేకాలంలో నమోదుచేసుకున్న రూ. 328 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాల్ని కంపెనీ తగ్గించుకోగలిగింది. తాజా సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,217 కోట్ల నుంచి రూ. 1,027 కోట్లకు తగ్గింది. 2014-15 పూర్తి సంవత్సరానికి రూ. 3,117 కోట్ల ఆదాయం రూ. 672 కోట్ల నష్టం వచ్చింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఏడాదికి రూ. 3,819 కోట్ల ఆదాయంపై రూ. 1,556 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ప్రస్తుతం రూ. 19,244 కోట్ల విలువైన ఆర్డర్లు వున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. -
గణనీయంగా పెరిగిన ఎన్సీసీ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా కంపెనీ ఎన్సీసీ 2014-15 మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.3 కోట్ల నుంచి రూ.52 కోట్లకు ఎగసింది. టర్నోవర్ 9 శాతం పెరిగి రూ.2,488 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.3.3 కోట్ల నుంచి రూ.54 కోట్లను తాకింది. టర్నోవర్ 27 శాతం అధికమై రూ.9,513 కోట్లకు చేరింది. 2014-15లో కంపెనీ రూ.7,381 కోట్ల ఆర్డర్లను సాధించింది. మార్చి 31 నాటికి ఆర్డరు బుక్ రూ.19,323 కోట్లుగా ఉంది. -
ఇన్ఫ్రా వృద్ధికి ‘దారే’ది?
కుదేలవుతున్న ఇన్ఫ్రా రంగం ⇒ ప్రభుత్వ చర్యలు మాటలకే పరిమితం ⇒ వడ్డీ రేట్లు తగ్గక కంపెనీలు విలవిల ⇒ కనిష్ట స్థాయిలకు చేరుకున్న షేర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజుకు 30 కిలోమీటర్ల రహదారి నిర్మించాలనేది కేంద్రం లక్ష్యం. ఈ విషయం చెప్పింది కూడా స్వయంగా జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ. ఇలా చెప్పి కూడా ఏడాది కావస్తోంది. అయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నది ఇన్ఫ్రా కంపెనీల మాట. కేంద్ర ప్రభుత్వం మాటలు చేతల్లోకి రాకపోవటంతో... ఎన్నికల ముందు పరుగులు తీసిన ఇన్ఫ్రా కంపెనీల షేర్లు ఇపుడు నేలచూపులు చూస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన రూ. 6 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు అడ్డంకులు తొలిగిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వ హామీ ఇంకా నెరవేరలేదు. దీంతో రుణాలు తీసుకుని మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇన్ఫ్రా కంపెనీలకు గుదిబండలుగా మారాయి. రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ అంచనాల ప్రకారం దేశంలోని టాప్ 100 కంపెనీలకు 2010లో 10.5 లక్షల కోట్లుగా ఉన్న రుణాలు 2014 నాటికి 18.5 లక్షల కోట్లకు చేరాయి. దీన్నిబట్టే అప్పులు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు ప్రధాన ఇన్ఫ్రా కంపెనీల అప్పులే రూ.1.22 లక్షల కోట్లు దాటిపోయాయి. దీంతో కంపెనీల ఆదాయం ఈ రుణాలకు వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోవడం లేదు. కోటలు దాటుతున్న మాటలు... రోజుకు 30 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే కనీసం ఏడాదికి 11,500 కి.మీ. రహదారుల్ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ గతేడాది (2014-15) 7,900 కి.మీ రహదారుల ప్రాజెక్టులను అప్పగించినట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. వాస్తవంగా 1,000 కి.మీ రహదారుల పనులు కూడా మొదలు కాలేదన్నది ఇన్ఫ్రా కంపెనీలు చెబుతున్న వాస్తవం. ప్రస్తుతం రోజుకు 8-10 కి.మీ. మించి రహదారుల నిర్మాణం జరగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ల నిర్మాణమనేది వాస్తవిక లక్ష్యంగా కనిపించడం లేదని రాష్ట్రానికి చెందిన ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులకు చెల్లించే ఆర్థిక పరిస్థితులు లేనే లేవని మరో ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ‘‘ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు వడ్డీరేట్లు తగ్గింది లేదు. గత మూడు నెలల కాలంలో ఆర్బీఐ వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తే ఈ మధ్యనే కొన్ని బ్యాంకులు 0.10 శాతం నుంచి 0.25 శాతం తగ్గించాయి. ఒకవైపేమో వడ్డీ భారం కొండలా పెరిగిపోయింది. ఐదేళ్ళ క్రితం ఏడు శాతం వడ్డీకి తీసుకున్న రుణాలకు ఇప్పుడు 14 శాతం వడ్డీరేటు చెల్లిస్తున్నాం. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్ళినా సరే ప్రభుత్వం వడ్డీరేట్లు తగ్గింపు దిశగా తగు చర్యలు తీసుకోకపోవటం సరికాదు’’ అన్నారాయన. కుదేలవుతున్న షేర్లు స్థిరమైన ప్రభుత్వం రాకతో ఇన్ఫ్రా రంగానికి పూర్వవైభవం వస్తుందన్న ఆశతో కనిష్ట స్థాయిల నుంచి భారీగా పెరిగిన షేర్లు క్రమంగా మళ్లీ పాత స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నమోదు చేసిన గరిష్ట స్థాయిల నుంచి దాదాపు అన్ని ఇన్ఫ్రా రంగ షేర్లు 50 శాతం క్షీణించాయి. వడ్డీరేట్లు తగ్గకపోవడం, కొత్త ప్రాజెక్టులు మొదలు కాకపోవడం ఇన్ఫ్రా షేర్లు పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. -
నష్టాల బాటలో ఇన్ఫ్రా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 617... 267... 172... ఇవి క్రికెట్ స్కోర్లు కావు. మూడు నెలల్లో రాష్ట్ర ఇన్ఫ్రా కంపెనీలు మూటకట్టుకున్న కోట్ల నష్టాలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ల్యాంకో, జీవీకే, ఐవీఆర్సీఎల్ కంపెనీలు శుక్రవారంనాడు వరుసగా ప్రకటించిన నష్టాలివి. ఇంతటి భారీ నష్టాలు రావడానికి కారణం ఈ కంపెనీలు ఈ మూడు నెలల కాలంలో రుణాలపై వరుసగా రూ.744 కోట్లు, రూ.352 కోట్లు, రూ.159 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి రావటమే. దీనికి తోడు జీవీకే, ల్యాంకో ఇన్‌ఫ్రాలు గ్యాస్ కొరతతో విద్యుదుత్పత్తి చేయకపోవటం వల్ల నష్టాలు మరింత పెరిగాయి. ఐవీఆర్సీఎల్ నష్టం రూ. 172 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా ఆదాయంతో పాటు నష్టాలు తగ్గాయి. ఆదాయం రూ. 956 కోట్ల నుంచి రూ. 645 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 172 కోట్లకు తగ్గాయి. 9 నెలల కాలంలో కంపెనీ రూ. 2,090 కోట్ల ఆదాయంపై రూ.517 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో రూ.17,135 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ఐవీఆర్సీఎల్ షేరు స్వల్ప నష్టాలతో రూ.16.65 వద్ద ముగిసింది. మరింత పెరిగిన జీవీకే నష్టాలు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 209 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టాలు రూ.45 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.735 కోట్ల నుంచి రూ.792 కోట్లకు పెరిగింది. గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వడ్డీ భారం కారణంగా నష్టాలు భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. జీవీకే వరుసగా 13 త్రైమాసికాల నుంచి నష్టాలను ప్రకటిస్తోంది. ఎయిర్పోర్ట్ విభాగంలో ఆదాయం రూ. 547 కోట్ల నుంచి రూ.602 కోట్లకు చేరింది. శుక్రవారం జీవీకే ఇన్ ఫ్రా షేరు 4% నష్టాలతో రూ. 9.90 వద్ద ముగిసింది. ల్యాంకో నష్టం రూ. 617 కోట్లు క్యూ3లో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ. 617 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి రూ. 530 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,588 కోట్ల నుంచి రూ. 2,253 కోట్లకు తగ్గింది. గ్యాస్ కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, వడ్డీ భారం, కొత్త ప్రాజెక్టుల జారీలో ఆలస్యం వంటివి నష్టాలు పెరగడానికి కారణంగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ల్యాంకో చేతిలో రూ. 29,464 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. శుక్రవారం ల్యాంకో ఇన్ఫ్రా షేరు 1% నష్టంతో రూ. 6 వద్ద ముగిసింది.