ఇన్‌ఫ్రా వృద్ధికి ‘దారే’ది?
కుదేలవుతున్న ఇన్‌ఫ్రా రంగం
⇒ ప్రభుత్వ చర్యలు మాటలకే పరిమితం
⇒ వడ్డీ రేట్లు తగ్గక కంపెనీలు విలవిల
⇒ కనిష్ట స్థాయిలకు చేరుకున్న షేర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజుకు 30 కిలోమీటర్ల రహదారి నిర్మించాలనేది కేంద్రం లక్ష్యం. ఈ విషయం చెప్పింది కూడా స్వయంగా జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ. ఇలా చెప్పి కూడా ఏడాది కావస్తోంది. అయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నది ఇన్‌ఫ్రా కంపెనీల మాట. కేంద్ర ప్రభుత్వం మాటలు చేతల్లోకి రాకపోవటంతో... ఎన్నికల ముందు పరుగులు తీసిన ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు ఇపుడు నేలచూపులు చూస్తున్నాయి.
యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన రూ. 6 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు అడ్డంకులు తొలిగిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వ హామీ ఇంకా నెరవేరలేదు. దీంతో రుణాలు తీసుకుని మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇన్‌ఫ్రా కంపెనీలకు గుదిబండలుగా మారాయి. రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ అంచనాల ప్రకారం దేశంలోని టాప్ 100 కంపెనీలకు 2010లో 10.5 లక్షల కోట్లుగా ఉన్న రుణాలు 2014 నాటికి 18.5 లక్షల కోట్లకు చేరాయి. దీన్నిబట్టే అప్పులు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీల అప్పులే రూ.1.22 లక్షల కోట్లు దాటిపోయాయి. దీంతో కంపెనీల ఆదాయం ఈ రుణాలకు వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోవడం లేదు.
కోటలు దాటుతున్న మాటలు...
రోజుకు 30 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే కనీసం ఏడాదికి 11,500 కి.మీ. రహదారుల్ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ గతేడాది (2014-15) 7,900 కి.మీ రహదారుల ప్రాజెక్టులను అప్పగించినట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. వాస్తవంగా 1,000 కి.మీ రహదారుల పనులు కూడా మొదలు కాలేదన్నది ఇన్‌ఫ్రా కంపెనీలు చెబుతున్న వాస్తవం. ప్రస్తుతం రోజుకు 8-10 కి.మీ. మించి రహదారుల నిర్మాణం జరగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ల నిర్మాణమనేది వాస్తవిక లక్ష్యంగా కనిపించడం లేదని రాష్ట్రానికి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులకు చెల్లించే ఆర్థిక పరిస్థితులు లేనే లేవని మరో ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ‘‘ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు వడ్డీరేట్లు తగ్గింది లేదు. గత మూడు నెలల కాలంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తే ఈ మధ్యనే కొన్ని బ్యాంకులు 0.10 శాతం నుంచి 0.25 శాతం తగ్గించాయి. ఒకవైపేమో వడ్డీ భారం కొండలా పెరిగిపోయింది. ఐదేళ్ళ క్రితం ఏడు శాతం వడ్డీకి తీసుకున్న రుణాలకు ఇప్పుడు 14 శాతం వడ్డీరేటు చెల్లిస్తున్నాం. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్ళినా సరే ప్రభుత్వం వడ్డీరేట్లు తగ్గింపు దిశగా తగు చర్యలు తీసుకోకపోవటం సరికాదు’’ అన్నారాయన.
కుదేలవుతున్న షేర్లు
స్థిరమైన ప్రభుత్వం రాకతో ఇన్‌ఫ్రా రంగానికి పూర్వవైభవం వస్తుందన్న ఆశతో కనిష్ట స్థాయిల నుంచి భారీగా పెరిగిన షేర్లు క్రమంగా మళ్లీ పాత స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నమోదు చేసిన గరిష్ట స్థాయిల నుంచి దాదాపు అన్ని ఇన్‌ఫ్రా రంగ షేర్లు 50 శాతం క్షీణించాయి. వడ్డీరేట్లు తగ్గకపోవడం, కొత్త ప్రాజెక్టులు మొదలు కాకపోవడం ఇన్‌ఫ్రా షేర్లు పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.