Minister Nitin Gadkari
-
NCAP: ఇక దేశీయంగా కార్ల క్రాష్ టెస్టింగ్..
న్యూఢిల్లీ: వాహనాలను మరింత సురక్షితం చేసే దిశగా కేంద్రం దేశీయంగా తొలి కార్ల క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (భారత్ ఎన్‌క్యాప్)ను ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. విదేశాలతో పోలిస్తే చౌకగా దేశీయంగానే కార్ల క్రాష్ టెస్టింగ్‌ను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని గడ్కరీ చెప్పారు. ‘విదేశాల్లో ఈ పరీక్షలు చేయించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లవుతుంది. అదే భారత్ ఎన్‌క్యాప్ కింద చేస్తే సుమారు రూ. 60 లక్షలవుతుంది. కాబట్టి దీనికి మంచి మార్కెట్ కూడా ఉండగలదు‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం కింద కార్ల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా తమ వాహనాలను పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల్లో వాహనాల పనితీరును బట్టి 0–5 వరకు స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధానం కింద 30 పైగా మోడల్స్‌ను టెస్ట్ చేయించుకునేందుకు పలు కంపెనీలు సంప్రదించినట్లు గడ్కరీ తెలిపారు. -
‘పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే’
సాక్షి విశాఖపట్నం : పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదు.. దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రెండు రోజులు కోస్తాలో పర్యటనలో బిజీబిజీగా ఉన్న కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం పర్యటించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. అంతేకాక పోలవరం సివిల్ కన్స్ట్రక్షన్ పార్టును ఫిబ్రవరి 8 లోపల పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం కోసం భూ సేకరణ సమస్యగా ఉంది.. అందుకు కొన్ని ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ‘పోలవరం భూ నిర్వాసితులు అభివృద్ధికి కేంద్రం చిత్త శుద్ధితో ఉంది. పోలవరం భూసేకరణపై కేంద్రానికి ఇచ్చిన మొదటి డీపీఆర్ కంటే ఇప్పుడు భూసేకరణ రెట్టింపు ఉంది. దీనిపై సొంత శాఖతో నివేదిక రప్పిస్తాం.1941లో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాకే పురోగతి వచ్చింది. అభివృద్ధికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది. రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టడం లేదు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. కేంద్రం వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఏపీ రైతాంగం ఆయిల్ సీడ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాలు చూస్తారు.అరబ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం కేంద్రం రూ. 8 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దానిని రూ. 2 లక్షల కోట్లకు తగ్గించాలని చూస్తున్నాం’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
ఎన్‌హెచ్ 161కి కేంద్రం అనుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారి 161 నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ మధ్య 157 కి.మీ. మేర ఎన్‌హెచ్ 161 నిర్మాణానికి ఈ మేరకు అనుమతులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఎంపీ జితేందర్‌రెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి పలు జాతీయ రహదారులకు అనుమతుల మంజూరుపై ఆయన చర్చించారు. అలాగే చౌటుప్పల్, షాద్‌నగర్, కంది మధ్య 205 కి.మీ. జాతీయ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సమర్పించామని, టెండర్లకు అనుమతులివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు దేశంలోని అన్ని జాతీయ రహదారులకు కలిపే యూనిక్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు విషయమై గతంలో కేంద్ర మంత్రిని కలిశారని వివరించారు. దీనిపై రాష్ట్ర అధికారులతో చర్చించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. మహబూబ్‌నగర్–జడ్చర్ల రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చడంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక సీఆర్ఎస్ కింద తెలంగాణకు రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. ‘మహా’గవర్నర్ విద్యాసాగర్‌రావును కలసిన తుమ్మల మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యాసాగర్‌రావును కేజీ మార్గ్‌లోని మహారాష్ట్ర సదన్‌లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. -
పోలవరం పనులు నవయుగకే!
సాక్షి, ఢిల్లీ/అమరావతి: పోలవరం జలాశయం(హెడ్ వర్క్స్) పనుల్లో 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించిన పనులను ‘నవయుగ’ కన్స్ట్రక్షన్స్కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఆ పనులను పాత ధరలకే పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ షరతు విధించారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి గడ్కరీ తన కార్యాలయంలో కేంద్ర, ఏపీ జలవనరుల శాఖ అధికారులు, తన సలహాదారు, ట్రాన్స్ట్రాయ్, నవయుగ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం.. నెల రోజుల గడువులో పాత కాంట్రాక్టర్ నిర్దేశించిన మేరకు పనులు చేయలేకపోయారని, ఆ పనులను పాత ధరలకే చేయడానికి ముందుకొచ్చిన నవయుగకు నామినేషన్ విధానంలో అప్పగించడానికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు. పనుల విలువ ఎంత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల్లోగా పనుల విలువ లెక్క కడతామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పనుల విలువను పక్కాగా తేల్చి.. 2019 నాటికి పనులు పూర్తయ్యే ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుని వాటిని నవయుగకు అప్పగించాలని గడ్కరీ ఆదేశించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ప్రధాన జలాశయం), కాఫర్ డ్యామ్‌లు, అనుబంధ పనులతోపాటూ స్పిల్ వేలో మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రతినిధులను కేంద్ర మంత్రి ఆదేశించారు. -
ఉక్కు సరే... సిమెంట్ ఇవ్వలేం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 90 రోజుల పాటు అప్పు ప్రాతిపదికన స్టీలు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా), విశాఖ ఉక్కు పరిశ్రమ అంగీకరించాయి. అయితే సిమెంట్ ఉత్పత్తి సంస్థలు మాత్రం 90 రోజులు అప్పు కింద సరఫరా చేయలేమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సిమెంట్ ఉత్పత్తి సంస్థలతో మరోసారి సమావేశం కావాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నిర్ణయించారు. సిమెంట్ కంపెనీలతో మరోసారి భేటీ కానున్న గడ్కరీ పోలవరం కాంక్రీట్ పనులలో జాప్యానికి స్టీలు, సిమెంటు కొరతే కారణమని చెబుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన గడ్కారీ మంగళవారం ఢిల్లీలో సిమెంటు, స్టీలు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు, కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు 90 రోజులు అప్పు కింద స్టీలు, సిమెంటు సరఫరా చేయాలని, కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆప్ క్రెడిట్ కింద హామీ ఇస్తుందని ఈ సందర్భంగా గడ్కారీ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై సిమెంటు ఉత్పత్తి సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 30 రోజుల అప్పు కింద మాత్రమే సరఫరా చేయగలమని, అంతకంటే ఎక్కువ కాలమైతే ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వారితో మరోసారి సమావేశం కావాలని గడ్కారీ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ హామీపై స్టీలు సరఫరాకు సెయిల్, విశాఖ ఉక్కు పరిశ్రమ అంగీకరించాయి. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ, పీపీఏ అధికారులతో పోలవరం పనులపై గడ్కారీ సమీక్ష నిర్వహించారు. కొత్తగా అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటం వల్ల ఉత్పత్తిని నిలిపివేయటంతో కాంక్రీట్ పనుల్లో వేగం మందగించిందని అధికారులు వివరించారు. ఈనెల 23వతేదీ నాటికి అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్సిద్ధమవుతుందని, రోజూ 8 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తామని కాంట్రాక్టర్ పేర్కొన్నట్లు తెలిసింది. గడ్కారీ పర్యటన వాయిదా 26 లేదా 27న పోలవరం సందర్శన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పోలవరం ప్రాజెక్టు సందర్శన పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. ఈనెల 23న పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వస్తున్నట్లు గడ్కారీ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో 23న ఆయన పోలవరానికి వచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈనెల 26న లేదా 27న గడ్కారీ పోలవరానికి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. గడ్కారీ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే!
♦ పర్యావరణహిత ఇంధనాలకు మళ్లండి... ♦ లేకుంటే మీరు తీవ్రంగా నష్టపోతారు... ♦ పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదు ♦ దిగుమతులకు, కాలుష్యానికి చెక్ పెడదాం ♦ ఎలక్ట్రికల్ వాహనాలపై కేబినెట్ నోట్ సిద్ధం ♦ బ్యాటరీ చార్జింగ్ కేంద్రాల వ్యవహారమూ దాన్లో ఉంటుంది ♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీదారులకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్యాక్సీలు, బైక్లదేనని, దేశం ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కార్ల తయారీవైపు మళ్లాలని ఆటోమొబైల్ కంపెనీలకు సూచించారు. లేకుంటే వాటికి భవిష్యత్తు లేదని, వాటిని పక్కన తీసి పారేయటానికి కూడా తాము వెనకాడబోమని నిష్కర్షగా చెప్పారు. కాలుష్యంతోపాటు దిగుమతులకూ చెక్ పెడతామన్నారు. ‘‘ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మనం అడుగులు వేయాలి. వేసి తీరాలి. మీకు ఇష్టమున్నా, లేకున్నా నేను దీన్ని అమలు చేయబోతున్నాను. దీనికి మీ ఆమోదం కూడా అవసరం లేదు. దిగుమతులను తగ్గించడం, కాలుష్యానికి చెక్ పెట్టడంపై మాకు స్పష్టమైన విధానం ఉంది’’ అని గురువారం ఢిల్లీలో జరిగిన ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల(సియామ్) వార్షిక సమావేశంలో గడ్కారీ ప్రకటించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకునే వారికి ప్రయోజనం ఉంటుందన్న ఆయన, అలా కాకుండా పైసలే పరమావధిగా పనిచేసుకుపోయేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘మేం నిర్ణయం తీసుకుంటాం. ఆ తరవాత... అయ్యో! మా దగ్గర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడవని వాహనాల నిల్వలు చాలా ఉండిపోయాయంటూ ప్రభుత్వం దగ్గరకు రావద్దు. ముందే మేల్కొంటే మంచిది’’ అని స్పష్టంచేశారు. ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించిన విధానాన్ని తీసుకురానుందని గడ్కారీ చెప్పారు. ‘‘కేబినెట్ నోట్ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నాం. దీన్ని సాధ్యమైనంత త్వరలో అమల్లోకి తీసుకువస్తాం’’ అని గడ్కారీ వివరించారు. పాత వాహనాలను తొలగించే విధానం జీఎస్టీ అంశాల కారణంగా నిలిచిపోయిందని, త్వరలోనే వాటిని పరిష్కరించి అమల్లోకి తెస్తామని గడ్కారీ హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టండి ‘‘నేను మిమ్మల్ని (కార్ల తయారీదారులు) గౌరవంగా కోరేదేమంటే ముందు ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయండి. బ్యాటరీ ఖరీదైన వ్యవహారమంటూ మీరు నాకు చెప్పారు. ఇప్పుడు మీరు తయారీ ప్రారంభిస్తే బ్యాటరీ తయారీ వ్యయాన్ని భారీ ఉత్పత్తితో తగ్గించొచ్చు. ప్రారంభంలో ఇబ్బందులనేవి ఎక్కడైనా ఉండేవే’’ అని గడ్కారీ కార్ల కంపెనీలకు హితవు చెప్పారు. దిగుమతులు, కాలుష్యం రెండు సమస్యలన్న ఆయన ఏటా దిగుమతులపై రూ.7 లక్షల కోట్లు వ్యయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక రంగానికి పెద్ద గుదిబండగా దీన్ని వర్ణించారు. ప్రత్యామ్నాయ ఇంధనమే దీనికి పరిష్కారమన్నారు. ప్రభుత్వం రెండో తరం ఎథనాల్ తయారీకి 15 పరిశ్రమలను ప్రారంభించనుందని చెప్పారు. పత్తి, గోధు మ, వరి గడ్డి నుంచి కూడా ఎథనాల్‌ను సులభంగా తయారు చేయొచ్చన్నారు. ఇక, ప్రభుత్వం 2,000 డ్రైవింగ్ స్కూళ్లను ఒక్కోటీ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు గడ్కారీ వెల్లడించారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం: సియామ్ సియామ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వినోద్ దాసరి మంత్రి గడ్కారీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వం దిగుమతులు, కాలుష్యం తగ్గింపు దిశగా అడుగులు వేయడం పట్ల ప్రశంసించారు. ఇందుకు పరిశ్రమ సైతం మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘మూడేళ్లలోనే బీఎస్–4 నుంచి బీఎస్–6కు మళ్లబోతున్నాం. ప్రపంచంలోనే ఇది అత్యంత తక్కువ వ్యవధి. అయితే, విధానంలో నిలకడ ఉండాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒకసారి విధానాన్ని రూపొందించిన తర్వాత దాన్ని మార్చొద్దు. కోర్టులు జోక్యం చేసుకున్నా దాన్ని సమర్థించుకోవాలి’’ అని దాసరి ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమ సిద్ధంగానే ఉన్నప్పటికీ పదేళ్లుగా బీఎస్–4 ఉద్గార ప్రమాణాలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంధన లభ్యత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ... బీఎస్ –6 ప్రమాణాల అమలు సమయంలోనైనా ఈ ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటే పాత వాహనాలను నిషేధించడంపై దృష్టి పెట్టాలని దాసరి సూచించారు. అంతేకానీ కొత్త కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకోరాదన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల్ని నిషేధించాలి కేంద్రానికి సియామ్ సూచన న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్... 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఇలాంటి వాహనాలను రోడ్లపై తిరగనివ్వకుండా చట్టాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ‘కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహన పరిశ్రమ చాలా చేస్తోంది. బీఎస్–6 ఉద్గార నిబంధనలకు మారడంపై పనిచేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కూడా 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలి’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ కె దాసరి వ్యాఖ్యానించారు. ఆయన ఇక్కడ జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో మాట్లాడారు. నేషనల్ ఆటోమోటివ్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. తరచూ మారుతున్న పాలసీ విధానాల కారణంగా ప్రస్తుతం దేశీ వాహన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ బలమైన వాహన పరిశ్రమను కలిగి ఉన్నాయని, భారత్ కూడా ఆటోమోటివ్ రంగ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో వాహన పరిశ్రమ దాదాపు 50 శాతం వాటా కలిగి ఉందని గుర్తు చేశారు. -
ఆ వంతెనలు ఏ క్షణంలోనైనా కూలొచ్చు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రహదారులపై ఉన్న దాదాపు 100 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అవి ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గురువారం ఆయన లోక్‌సభలో ఈ విషయమై మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆడిట్లో దేశంలోని సుమారు 1.60 లక్షల బ్రిడ్జిలలో వంద వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలోని సావిత్రి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన గత ఏడాది కొట్లుకుపోవడంతో రెండు బస్సులు, కొన్ని ప్రైవేట్ వాహనాలు గల్లంతయ్యాయని ఆయన తెలపారు. రోడ్డు ఆక్రమణలు, భూసేకరణ, పర్యావరణ అడ్డంకుల కారణంగా అనేక చోట్ల వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3.85 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. -
70 శాతం నీళ్లు కడలిపాలు!
కనీసం 20 శాతం వినియోగించినా.. దేశంలో పేదరికం ఉండదు శ్రీరాం వెదిరె ‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం’ పుస్తకావిష్కరణలో గడ్కరీ హాజరైన ఉమా భారతి, దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: 70% నదీజలాలు సముద్రంలోకే చేరుతున్నాయని, అందులో 20% నీటిని వినియో గించుకోగలిగినా దేశంలో పేదరికం ఉండదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొ న్నారు. నదులపై పెద్ద డ్యాములకు బదులు బ్యారేజీల నిర్మాణంతో తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, జల రవాణాకు కూడా దోహదపడుతుందన్నారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, రాజస్తాన్ నదీ జలాల అథారిటీ చైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం తెలంగాణ, జాతీయ దృక్పథం’ ఆంగ్ల పుస్తకాన్ని జల వనరుల మంత్రి ఉమాభారతి, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి గడ్కరీ ఢిల్లీలో ఆవిష్కరించారు.గోదావరి జలాల విని యోగంపై శ్రీరాం వెదిరె రాసిన పుస్తకం ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక వంటిదని, తమ ప్రణాళికల్లో వినియోగించుకుంటామని తెలిపారు. శ్రీరాం వెదిరె 15 ఏళ్లపాటు ఇంజనీర్‌గా అమెరికాలో సేవలందిం చారని, తన నైపుణ్యాన్ని దేశానికి అందించాలని కోరగా ఇక్కడికొచ్చి సేవలందిస్తున్నారని తెలిపారు. జల రవాణాకు అనుకూలం నదులపై బ్యారేజీ–గేట్ వేలు నిర్మించడం ద్వారా జల రవాణాకు అనుకూలంగా ఉంటుందని, ఈ దిశగా బుధవారమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆగ్రా వద్ద యమునా నదిపై ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, ఏపీలో ఒకటి నిర్మించాలని ప్రతిపాదించామని వివరించారు. శ్రీరాం వెదిరె సూచించినట్లు కాశేళ్వరం ఎత్తు పెంచితే తెలంగాణ సస్యశ్యామలం అవడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు నీళ్లు అందించవచ్చని వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం సాగు నీటికి కేటాయింపులు పెరగడం సంతోషకరమన్నారు. ఉమాభారతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని నీటి వనరుల కొరత వేధిస్తోందని, రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు. దత్తాత్రేయ మాట్లా డుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు ప్రధానితో మాట్లాడతానన్నారు. నదుల అనుసంధానంపై చర్చించాం: వెదిరె శ్రీరాం వెదిరె మాట్లాడుతూ ‘నదుల అనుసందానంపై ఈ పుస్తకంలో చర్చించాం. నదులనే కాలువలుగా ఉపయోగించే విధానాన్ని చర్చించాను. బ్యారేజీల ద్వారా సమర్థంగా నీళ్లు వినియోగించు కోవచ్చు. నదుల అనుసంధానంతో కోటి మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. -
ఏపీ రహదారులకు రూ.లక్ష కోట్లు
కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన 3,000 కిలోమీటర్ల రహదారులను రూ.75,000 కోట్లతో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ), రాష్ట్ర ఆర్అండ్బీ మధ్య ఒప్పందం కుదిరింది. అదేవిధంగా రాజధాని అమరావతి చుట్టూ రూ.23,430 కోట్లతో 426 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయడానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)తో ఒప్పందమూ కుదిరింది. ఇవిగాక రూ.3,500 కోట్లతో 30 ఆర్వోబీలను అభివృద్ధి చేయడంతోపాటు కేంద్ర రహదారుల నిధి(సీఆర్ఎఫ్)కి రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా శనివారం ‘పారిశ్రామిక కారిడార్లతో పారిశ్రామికాభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో గడ్కరీ మాట్లాడారు. -
అప్పు చేసైనా రోడ్లేస్తాం: తుమ్మల
మా హయాంలోనే పూర్తి చేస్తాం మంజూరు చేసిన రోడ్లపై మంత్రి వ్యాఖ్యలు హైదరాబాద్: అనుమతులిచ్చిన రోడ్లను తమ హయాంలోనే, రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. నిధుల విషయంలో ఆందోళన అవసరం లేదని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పారని, ఎంతైనా ఇస్తామన్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారులుగా (ఎన్‌హెచ్) అభివృద్ధి చేసేవన్నీ టోల్ రోడ్లేనని, వాటి విషయంలో ఆందోళనే అవసరం లేదని వివరించారు. మరీ అవసరమైతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులెలా వచ్చాయో.. అలాగే రోడ్లకూ తీసుకొస్తామని, అప్పు చేసైనా రోడ్లను వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జి’లు అంశంపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 21 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని, అందులో రూ. 13,360 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో వేసిన రోడ్లు తొందరగా దెబ్బతిన్నాయని, అందుకే రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్ ప్రమాణాలతో వేసేందుకు చర్యలు చేపట్టడం వల్ల మొదటి ఏడాది ఆలస్యమైందన్నారు. పక్క రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రంలో రోడ్లు వేయాలన్నదే తమ ఆలోచనని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామని మంత్రి వివరించారు. రూ.100 కోట్లతో హైదరాబాద్ ఎన్‌హెచ్‌ల అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీ సుముఖంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించారని, ఇంకా రూ. 2,500 కోట్ల రోడ్లకు ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లోని ఎన్హెచ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రైపోర్టు అధ్యయనాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించామని.. ఇప్పటివరకు భువనగిరి, జహీరాబాద్, జడ్చర్లను పోర్టుల కోసం గుర్తించారని తెలిపారు. ఇంకా ఒకటీ రెండు ప్రాంతాలు ఉంటాయని, తుది నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. గోదావరిపై అన్ని బిడ్జిలను జల రవాణకు అనుగుణంగా నిర్మిస్తున్నామని, భద్రాచలం నుంచి మహారాష్ట్రకు జల రవాణాపై కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. బీటీ వేసిన పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బీ రోడ్లుగా మార్చుతామని, మండల కేంద్రాల నుంచి కొత్త జిల్లాలకు భవిష్యత్తులో నాలుగు లేన్ల రోడ్లు వేస్తామన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో మాత్రం డబుల్ రోడ్లను వేస్తామని మంత్రి వివరించారు. -
లక్ష కి.మీ. పరిధిలో హరిత రహదార్లు:గడ్కారీ
10 లక్షల మందికి ఉపాధి న్యూఢిల్లీ: జాతీయ రహదారుల వెంట లక్ష కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ శుక్రవారం పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్ కింద 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు, అంతేకాక రహదారుల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించనున్నట్లు చెప్పారు. 1,500 కిలోమీటర్ల పరిధిలో ఈ మిషన్ కోసం తక్షణమే రూ.300 కోట్లను వెచ్చించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టార్టప్‌ను గడ్కారీ ఆహ్వానించారు. 2019 లోగా రూ.5 లక్షల కోట్లను జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నామని.. అందులో 1 శాతం రూ.5 వేల కోట్లను ‘పచ్చ పందిర్ల’ ఏర్పాటుకు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం ఒక కిలోమీటరు పరిధిలో మొక్కల పెంపకం ద్వారా 10 మంది ఉపాధి పొందవచ్చని, మొత్తం 1,500 కి.మీ. పరిధిలో 15,000 మందికి ఈ పథకంతో ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ పథకంలో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. -
‘చబహర్’తో పాక్‌కు చెక్
- ఇరాన్‌తో ఓడరేవు అభివృద్ధికి భారత్ ఒప్పందం - వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ - మోదీ, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ సమక్షంలో సంతకాలు - కొత్త చరిత్రకు సాక్షులుగా నిలిచామన్న ప్రధాని మోదీ - ఉగ్ర పోరుకు సహకారం..వాణిజ్య, రక్షణ, పెట్టుబడులపై 12 ఒప్పందాలు టెహ్రాన్: ఇరాన్‌తో భారత్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం ఒప్పందంపై సంతకం చేసింది. దీనివల్ల పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, యూరప్‌లతో అనుసంధానత వస్తుంది. ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీలు ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత చబహర్తోసహా ఇరు దేశాలు 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటానికి పరస్పర సహకారం అందించుకుంటామని అంగీకరించాయి. భారత ఇంధన దిగుమతి అవసరాలకు ఇరాన్‌లోని చబహర్ కీలకం. చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్న భారత్... రవాణా, ట్రాన్సిట్ కారిడార్ కోసం ఇరాన్, అఫ్గానిస్తాన్‌తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. మోదీ, రౌహానీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. 2001లో వాజపేయి ఇరాన్లో పర్యటించగా, ఆ తర్వాత 15 ఏళ్లకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే. చబహర్ ఒప్పందం ఈ ప్రాంతం చరిత్రను మార్చివేస్తుందని, కొత్త చరిత్రకు మనమంతా సాక్షులుగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ ఒప్పందం ఒకవైపు దక్షిణ ఆసియాను, మరోవైపు యూరప్‌ను కలుపుతుంది. అమాయకులను చంపడం, చిత్రవధ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై పోరాటానికి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా పర్షియా కవి హఫీజ్ కవితను ఉటంకిస్తూ మోదీ పర్షియా భాషలో మాట్లాడారు. ‘విభజన రోజులు ముగిశాయి. నిరీక్షించే రాత్రులు ముగింపునకు చేరాయి. మా స్నేహం చిరస్థాయిలో ఎప్పటికీ నిలిచిఉంటుంది’ అని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందాల వల్ల ఆర్థిక, వాణిజ్య, రవాణా, ఓడరేవు అభివృద్ధి, నాగరికత, సైన్స్, విద్యా అంశాల్లో సహకారం పెరుగుతుందన్నారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోడానికి.. రౌహానీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్, సైబర్ నేరాలపై పోరాటం చేసేందుకు, నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఉగ్ర ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు గూఢచర్య సమాచారం బదిలీ చేసుకోవాలని నిర్ణయించడంతోపాటు పలు రాజకీయ అంశాలపై చర్చించామన్నారు. కాగా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద శక్తుల్ని వాడుకోవడం, ప్రోత్సహించడాన్ని అన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకించాలని, ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు సహకారం, ఆశ్రయానికి తక్షణం ముగింపు పలకాలని భారత్, ఇరాన్‌లు కోరాయి. మోదీ, రౌహనీల మధ్య విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం మోదీ ఆ దేశ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల ఇరాన్ పర్యటన ముగించుకొని మోదీ భారత్‌కు బయలుదేరారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు చబహర్ ఓడరేవు అభివృద్ధి, అల్యూమినియం ప్లాంటు స్థాపన, అఫ్తానిస్తాన్, మధ్య ఆసియాకు అనుసంధానం కుదిరేలా రైల్వే లైన్ ఏర్పాటు, దీనికోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌తో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం, మేధావుల సంప్రదింపులు-విధాన రూపకల్పనపైనా భారత్ ఒప్పందం చేసుకుంది. స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫ్ ఇరాన్‌తో భారత విదేశీ సంస్థ ఒప్పందం, ఇరాన్ ఎగుమతి గ్యారంటీ నిధితో భారత ఎగుమతి గ్యారంటీ కార్పొరేషన్ ఒప్పందం, సైన్స్, పరిశోధన రంగంలో, ప్రాచీన పత్రాలు, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఖమేనీకి అరుదైన బహుమతి మోదీ ఇరాన్ అగ్రనేత ఖమేనీకి అరుదైన బహుమతి ఇచ్చారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఖమేనీతో భేటీ అయ్యారు. కుఫిక్(అతి పురాతన అరబిక్ భాష) లిపిలో రాసిన 7వ శతాబ్ధి నాటి ఖురాన్‌ను ఆయనకు ఇచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్ సాంస్కృతికశాఖకు చెందిన రామ్‌పూర్ రాజా లైబ్రరీలోనిది. ఇరాన్ విదేశాంగ విధానం, ఇతర కీలక అంశాల్లో ఖమేనీదే తుది నిర్ణయం. ‘చబహర్’ ఎందుకు కీలకమంటే... ఇరాన్లో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసే కీలకమైన ఓడరేవు చబహర్. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్ మీదుగా, అలాగే తూర్పు యూరప్‌తో అనుసంధానానికి వీలు కల్పిస్తుంది. పాక్‌లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వదర్ ఓడరేవు నుంచి చబహర్ ఓడరేవు కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. చబహర్ నుంచి అఫ్గాన్‌తో రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం ఏర్పడుతుంది. ఇది పాక్‌లోని కరాచీ ఓడరేవుకు ప్రత్యామ్నాయం. ఇరాన్-పాక్-భారత్ పైప్‌లైన్ నిర్మాణానికి పాక్ పెద్దగా సహకరించట్లేదు. అదీగాక ఇరాన్-పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. దీంతో చబహర్ చాలా కీలకమవుతుంది. ఇరాన్ పొరుగుదేశమైన అఫ్గాన్‌కు చబహర్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. చబహర్, జహెదాన్ మధ్య 500 కి.మీ. రైల్వే లైను ఏర్పాటుచేస్తామని, దీంతో మధ్య ఆసియాకు అనుసంధానం ఏర్పడుతుందని రోడ్డు రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. -
రింగ్ రోడ్డు అభివృద్ధికి నిధులివ్వండి
కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం సాక్షి, బెంగళూరు: బెంగళూరు శివార్లలో ఉన్న ఎనిమిది ఉప నగరాలకు చేరుకునేందుకు వీలుగా 340 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. బెంగళూరు శివార్లలో ఉన్న రామనగర, కనకపుర, నెలమంగళ, మాగడి, ఆనేకల్, హొసకోటె, దేవనహళ్లి, దొడ్డబళ్లాపుర ప్రాంతాలను కలిపేలా చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు పనులు ఇప్పటికే 110కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మరో 230 కిలోమీటర్ల మేర ఉన్న పనులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సహాయం అందజేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. -
జనవరిలో సీఎం రాక
వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. జనవరి మొదటి వారంలో వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి నాలుగు రోజుల ఖరారైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. రోజువారీ కార్యక్రమాలపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 3న కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తారు. జనవరి 4న మళ్లీ వచ్చి 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. జనవరి 4న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆలేరు-వరంగల్ జాతీయ రహదరి విస్తరణ పనులను ప్రారంభిస్తారు. అనంతరం ఏటూరునాగారంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. ఆరోజు సాయంత్రం హన్మకొండలో బస చేస్తారు. గణపురం మండలం చెల్పూరులో కొత్తగా నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్రాజెక్టును జనవరి 5న ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం కూడా హన్మకొండలోనే బస చేస్తారు. మరుసటి రోజు 6వ తేదీన గ్రేటర్ వరంగల్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు గతంలో శంకుస్థాపన చేసిన పనులను పర్యవేక్షిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో అభివృద్ధి పనులను వరంగల్ నుంచే ప్రారంభించారు. జనవరి 8, 9, 10, 11 తేదీల్లో వరంగల్‌లో ఉండి డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మళ్లీ సంవత్సరం తరువాత సీఎం రెండోసారి జిల్లాలో వరుసగా నాలుగు రోజులు పర్యటించనున్నారు. -
త్వరలో కొత్త జాతీయ రహదారులు
1,018 కి.మీ. రోడ్లకు కేంద్ర మంత్రి హామీ * గడ్కారీని కలసిన మంత్రి తుమ్మల, ఎంపీల బృందం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలో కొత్తగా 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. గత 50 ఏళ్లలో రాని రహదారులను 5 ఏళ్లలో ఇస్తామని భరోసా ఇచ్చారు. రహదారుల గురించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్, మరికొందరు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో కేంద్ర మంత్రి గడ్కారీని కలసి వినతి పత్రాన్ని అందచేసింది. భేటీ అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల సమస్యను, వామపక్షతీవ్రవాద ప్రాబల్యప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్ల నిర్మాణాల అంశాలను గడ్కరీ దృష్టికి తెచ్చామన్నారు. డ్రైపోర్టులు, జలరవాణా మార్గాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న 1,018 కి.మీలలో 220 కి.మీ కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి చెప్పారు. కాగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలు, ప్రాజెక్టులన్నిటినీ తెలంగాణకు వర్తింప చేయాలని మంత్రి తుమ్మల.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు. అశోక గజపతిరాజుతో తుమ్మల భేటీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖ స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రతిపాదనలు, కొత్తగూడెం, వరంగల్‌లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇచ్చే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దానిని పౌరవిమానాశ్రయంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. -
మావోయిస్ట్ రాష్ట్రాల్లో అభివృద్ధి: గడ్కారీ
న్యూఢిల్లీ: దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రూ.11వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేశామని కేంద్ర ఉపరితలరవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించారు. ఎన్డీఏ ఏడాది పాలనలో మంత్రిత్వశాఖ సాధించిన ప్రగతి సూచిక ఈ-పుస్తకాన్ని గురువారం ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ జీడీపీలో ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రిత్వశాఖ 2 శాతం అభివృద్ధి రేటు భాగస్వామ్యం తీసుకుందన్నారు. రానున్న ఏళ్లలో రోడ్డురవాణా, నౌకాయాన రంగం ద్వారా 25 లక్షలఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఆరు నెలల్లో కనీసం రూ.3.50 లక్షల కోట్ల పనుల వ ర్క్ ఆర్డర్లుఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
ఇన్ఫ్రా వృద్ధికి ‘దారే’ది?
కుదేలవుతున్న ఇన్ఫ్రా రంగం ⇒ ప్రభుత్వ చర్యలు మాటలకే పరిమితం ⇒ వడ్డీ రేట్లు తగ్గక కంపెనీలు విలవిల ⇒ కనిష్ట స్థాయిలకు చేరుకున్న షేర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజుకు 30 కిలోమీటర్ల రహదారి నిర్మించాలనేది కేంద్రం లక్ష్యం. ఈ విషయం చెప్పింది కూడా స్వయంగా జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ. ఇలా చెప్పి కూడా ఏడాది కావస్తోంది. అయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నది ఇన్ఫ్రా కంపెనీల మాట. కేంద్ర ప్రభుత్వం మాటలు చేతల్లోకి రాకపోవటంతో... ఎన్నికల ముందు పరుగులు తీసిన ఇన్ఫ్రా కంపెనీల షేర్లు ఇపుడు నేలచూపులు చూస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన రూ. 6 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు అడ్డంకులు తొలిగిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వ హామీ ఇంకా నెరవేరలేదు. దీంతో రుణాలు తీసుకుని మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇన్ఫ్రా కంపెనీలకు గుదిబండలుగా మారాయి. రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ అంచనాల ప్రకారం దేశంలోని టాప్ 100 కంపెనీలకు 2010లో 10.5 లక్షల కోట్లుగా ఉన్న రుణాలు 2014 నాటికి 18.5 లక్షల కోట్లకు చేరాయి. దీన్నిబట్టే అప్పులు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు ప్రధాన ఇన్ఫ్రా కంపెనీల అప్పులే రూ.1.22 లక్షల కోట్లు దాటిపోయాయి. దీంతో కంపెనీల ఆదాయం ఈ రుణాలకు వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోవడం లేదు. కోటలు దాటుతున్న మాటలు... రోజుకు 30 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే కనీసం ఏడాదికి 11,500 కి.మీ. రహదారుల్ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ గతేడాది (2014-15) 7,900 కి.మీ రహదారుల ప్రాజెక్టులను అప్పగించినట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. వాస్తవంగా 1,000 కి.మీ రహదారుల పనులు కూడా మొదలు కాలేదన్నది ఇన్ఫ్రా కంపెనీలు చెబుతున్న వాస్తవం. ప్రస్తుతం రోజుకు 8-10 కి.మీ. మించి రహదారుల నిర్మాణం జరగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ల నిర్మాణమనేది వాస్తవిక లక్ష్యంగా కనిపించడం లేదని రాష్ట్రానికి చెందిన ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులకు చెల్లించే ఆర్థిక పరిస్థితులు లేనే లేవని మరో ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ‘‘ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు వడ్డీరేట్లు తగ్గింది లేదు. గత మూడు నెలల కాలంలో ఆర్బీఐ వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తే ఈ మధ్యనే కొన్ని బ్యాంకులు 0.10 శాతం నుంచి 0.25 శాతం తగ్గించాయి. ఒకవైపేమో వడ్డీ భారం కొండలా పెరిగిపోయింది. ఐదేళ్ళ క్రితం ఏడు శాతం వడ్డీకి తీసుకున్న రుణాలకు ఇప్పుడు 14 శాతం వడ్డీరేటు చెల్లిస్తున్నాం. ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్ళినా సరే ప్రభుత్వం వడ్డీరేట్లు తగ్గింపు దిశగా తగు చర్యలు తీసుకోకపోవటం సరికాదు’’ అన్నారాయన. కుదేలవుతున్న షేర్లు స్థిరమైన ప్రభుత్వం రాకతో ఇన్ఫ్రా రంగానికి పూర్వవైభవం వస్తుందన్న ఆశతో కనిష్ట స్థాయిల నుంచి భారీగా పెరిగిన షేర్లు క్రమంగా మళ్లీ పాత స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నమోదు చేసిన గరిష్ట స్థాయిల నుంచి దాదాపు అన్ని ఇన్ఫ్రా రంగ షేర్లు 50 శాతం క్షీణించాయి. వడ్డీరేట్లు తగ్గకపోవడం, కొత్త ప్రాజెక్టులు మొదలు కాకపోవడం ఇన్ఫ్రా షేర్లు పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ గడప దాటించేందుకు ఎన్డీఏ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ బిల్లుకు మరిన్ని సవరణలు ప్రతిపాదిస్తే చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజాగా మరిన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ఎటువంటి నియంత్రణా లేదని చెప్పారు. అయితే బిల్లును ఆలస్యం చేసేలా, రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసే సవరణలను మాత్రం తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. లోక్‌సభలో భూ బిల్లుకు సంబంధించి తొమ్మిది సవరణలకు తాము అంగీకరించామని, ఇప్పుడు కూడా సవరణలు ప్రతిపాదిస్తే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. పెద్దల సభలోనూ తమకు మద్దతు లభిస్తుందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మార్పు రావాలి
బయోఇంధనంతో నడిచే వాహనాలు ఆవశ్యం 1988 రవాణా చట్టం రద్దుకు విపక్షాల మద్దతు త్వరలో నూతన చట్టం కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారీ కోలారు : బయో ఇంధనంతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా భారతదేశాన్ని కాలుష్య రహితంగా మార్చే ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో స్కానియా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు తయారీ పరిశ్రమను ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రస్తుతం స్కానియా కంపెనీ ప్రారంభించిన బస్ తయారీ కేంద్రం భారత దేశంలోనే నూతన సాంకేతిక పరిజా‘నానికి నాంది పలికి నటై్లందన్నారు. మిథనాల్, బయో ఫూయల్తో నడిచే వాహనాల తయారీ ద్వారా దేశంలో 95 శాతం కాలుష్యాన్ని నివారించడానికి సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో భారత దేశం విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం తగ్గించాల్సి ఉందని దీనికి బయోఫూయల్ వాడకమే ఉత్తమ మార్గమని అన్నారు. స్కానియా కంపెనీ ప్రస్తుతం బస్సులు , ట్రక్కులు మాత్రమే తయారు చేస్తోందని, భవిష్యత్తులో కార్లు తదితర వాహనాలను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. కర్ణాటకలో రవాణా వ్యవస్థ చక్కగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. మధ్య ప్రదేశ్‌లోని నాగ్‌పూర్ తదితర ప్రాంతాలలో బయోపూయల్తో నడిచే వాహనాలను నడపడానికి ఆ రాష్ట్రం సుముఖత చూపుతుండగా స్కానియా కంపెనీ ఆ రాష్ట్రంలోనూ తమ కంపెనీని నెలకొల్పాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత నిస్తోందన్నారు. దేశంలో ఎంతోమంది రైతులు పరిశ్రమల స్థాపన కోసం తమ భూములను అందించారని, అలాంటి కుటుంబాలకు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్లు, రైల్వే, నది మార్గాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుండగా. భవిష్యత్తులో కృష్ణ, కావేరి నదుల అనుసంధానం ద్వారా ఉత్తమ జల రవాణా వ్యవస్థను కల్పిస్తున్నట్లు తెలిపారు. 1988 నాటి బూజు పట్టిని రవాణా చట్టాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాలలో రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రతి పక్షాలు కూడా మద్దతు తెలుపు తున్నాయని అన్నారు. ప్రస్తుతం రవాణా చట్టం బలహీనంగా ఉందని జపాన్, జర్మనీ తరహాలో నూతన రవాణా చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, కోలారు ఎంపి కే హెచ్ మునియప్ప, స్కానియా కంపెనీ అధ్యక్షుడు మార్టిన్ లండ్స్టర్డ్, ఉపాధ్యక్షుడు ఆండర్స్ గ్రండ్ స్ట్రామర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాగరమాల’లో 12 స్మార్ట్‌సిటీలు
పలుచోట్ల తీర ప్రాంత ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తాం జీడీపీలో 2% పెరుగుదల నమోదవుతుందని గడ్కారీ వెల్లడి న్యూఢిల్లీ: తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు ద్వారా 12 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామని, పలు తీరప్రాంత ఆర్థిక మండళ్ల(సీఈజెడ్)ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2 శాతం పెరుగుదల నమోదవుతుందని చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. గురువారమిక్కడ గడ్కారీ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టు కింద ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సమీపంలోని ఎస్ఈజెడ్కు రూ.4 వేల కోట్లు కేటాయించాం. గుజరాత్‌లోని కండ్లా పోర్టు తీరప్రాంత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తాం. ఈ పోర్టు ఆధీనంలో 2లక్షల ఎకరాల భూమి ఉంది. 12 స్మార్ట్ సిటీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు 1,208 దీవులను అభివృద్ధి చేస్తాం. 189 లైట్‌హౌస్‌లను నెలకొల్పుతాం’’ అని మంత్రి వివరించారు. తీరప్రాంతాల్లో సాగరమాల ప్రాజెక్టు అమలుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆరునెలల్లోగా రూపొందిస్తామని చెప్పారు. ఇందులో ఎస్ఈ జెడ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టు ల సామర్థ్యం మరింత పెంచుతామని, ఎగుమతులు-దిగుమతులను పెంచడం, తీరప్రాంతా ల్లో దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీరప్రాంతాల్లో 12స్మార్ట్‌సిటీలను ఒక్కోదాన్ని రూ.50 వేలకోట్లతో అభివృద్ధి చేస్తామని గతం లో గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 2 జాతీయ జల మార్గాలు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా చట్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది. -
రిక్షా.. మేడ్ ఇన్ చైనా
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: నాసిక్ పట్టణంలోని ఓ ‘చైనీస్ రిక్షా’ అందరి దృష్టినీ అకర్షిస్తోంది. పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ-సీఎన్జీ లాంటి ఇంధనాలు అవసరం లేకుండా నడిచే ఈ చైనా రిక్షాను నాసిక్‌లో భరత్ పాటిల్ అనే డ్రైవర్ కొనుగోలు చేసి స్థానికులకు రవాణా సేవలందిస్తున్నాడు. బ్యాటరీల సహాయంతో నడిచే విధంగా ఈ ‘చైనీజ్ రిక్షా’ను తయారు చేశారని, సౌర శక్తితో చార్జ్ అయ్యే ఈ రిక్షా వల్ల ఇంధనం పొదుపవుతుందని, ప్రయోగాత్మకంగా కొనుగోలు చేసి నడుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రయోగం విజయవంతమైతే పట్టణమంతటా వీటిని నడుపుతామన్నారు. బీజేపీ కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి నాగ్‌పూర్‌లో ఈ చైనా రిక్షాను ప్రారంభించారు. అందులో కూర్చుని ప్రయాణ అనుభూతిని కూడా పొందారు. ప్రస్తుతం ఢిల్లీ, కోల్‌కతా, నోయిడా, పంజాబ్ రాష్ట్రాల్లో వీటిని నడుపుతున్నారని, ఇప్పుడు నాసిక్‌లో ప్రారంభమైందని పాటిల్ తెలిపారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ఈ రిక్షా విలువ రూ.1.30 లక్షలని, దీని ద్వారా వాతావరణం కలిషుతమయ్యే వాయువులేవీ ఉత్పత్తవవు అని పాటిల్ తెలిపారు. సౌర శక్తితో చార్జ్ అయ్యే 100 ఆంపియర్ల నాలుగు బ్యాటరీలను రిక్షాలో బిగించారని, వీటి ద్వారా ఇంజిన్ నడుస్తుందన్నారు. ఒకసారి ఫుల్ చార్జయితే సుమారు 80 కిలోమీటర్ల వరకు నడుస్తుందని ఆయన అన్నారు. గంటకు 20 కిలోమీటర్ల వేగం ఉంటుందని, వేగం తక్కువ కాబట్టి లెసైన్సు అవసరం ఉండదన్నారు. ఇందులో ఐదుగురు ప్రయాణికులు కూర్చోవచ్చని పాటిల్ వివరించారు.