అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయివర్షిత్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు డిస్ట్రిక్ కోర్టు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ శిక్ష ఖరారు చేశారు. అంతేకాదు.. సాయివర్షిత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మరో మూడేళ్లపాటు అతనిపై నిఘా కొనసాగనుందని తెలిపారాయన. గ్రీన్‌కార్డు కలిగి శాశ్వత నివాసితుడు కావడంతో కందుల ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు.
అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్(Whitehouse)పై సాయివర్షిత్ దాడికి యత్నించాడు. అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను చంపడానికి కూడా తాను వెనుకాడలేదని విచారణలో సాయి ఒప్పుకున్నాడు.
బైడెన్ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు యూఎస్ అటార్నీ ఇదివరకే ప్రకటించింది. నిజానికి ఈ కేసులో కిందటి ఏడాది ఆగస్టు 23న శిక్ష ఖరారు కావాల్సి ఉండగా.. అది ఆలస్యమైంది.
2023 మే 22న సాయి వర్షిత్ కందుల(Sai Varshith Kandula) అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బీభత్సం సృష్టించాడు. అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ , ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్ అటార్నీ తెలిపింది.
కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం..
మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు.
అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. దీంతో పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.
అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు.
ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు.
- అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా ప్లాన్‌తో..
ఈ దాడి కోసం చాలా కాలం నుంచే ప్లాన్ చేసుకున్నట్లు సాయి వర్షిత్ విచారణలో తెలిపాడు. 2022 ఏప్రిల్‌లో వర్జీనియాలోని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థను సంప్రదించి 25 మంది సాయుధ సిబ్బంది, సాయుధ కాన్వాయ్ కావాలని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించాడు. ఓ పెద్ద కమర్షియల్ ట్రక్కును అద్దెకు తీసుకునేందుకు యత్నించాడు. అవి కుదరకపోవడంతో చివరకు ఓ చిన్నపాటి ట్రక్కును రెంట్‌కు తీసుకుని దాడికి పాల్పడ్డాడు.
ఎవరీ కందుల సాయి వర్షిత్?
మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం. అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నప్పటికీ.. ప్రాంతం వివరాలపై స్పష్టత లేదు. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది. కాగా.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని అక్కడి అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment