70 శాతం నీళ్లు కడలిపాలు!
- కనీసం 20 శాతం వినియోగించినా.. దేశంలో పేదరికం ఉండదు
- శ్రీరాం వెదిరె ‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం’ పుస్తకావిష్కరణలో గడ్కరీ
- హాజరైన ఉమా భారతి, దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: 70% నదీజలాలు సముద్రంలోకే చేరుతున్నాయని, అందులో 20% నీటిని వినియో గించుకోగలిగినా దేశంలో పేదరికం ఉండదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొ న్నారు. నదులపై పెద్ద డ్యాములకు బదులు బ్యారేజీల నిర్మాణంతో తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, జల రవాణాకు కూడా దోహదపడుతుందన్నారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, రాజస్తాన్ నదీ జలాల అథారిటీ చైర్మన్ శ్రీరాం వెదిరె రచించిన ‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం తెలంగాణ, జాతీయ దృక్పథం’ ఆంగ్ల పుస్తకాన్ని జల వనరుల మంత్రి ఉమాభారతి, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి గడ్కరీ ఢిల్లీలో ఆవిష్కరించారు.గోదావరి జలాల విని యోగంపై శ్రీరాం వెదిరె రాసిన పుస్తకం ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక వంటిదని, తమ ప్రణాళికల్లో వినియోగించుకుంటామని తెలిపారు. శ్రీరాం వెదిరె 15 ఏళ్లపాటు ఇంజనీర్‌గా అమెరికాలో సేవలందిం చారని, తన నైపుణ్యాన్ని దేశానికి అందించాలని కోరగా ఇక్కడికొచ్చి సేవలందిస్తున్నారని తెలిపారు.
జల రవాణాకు అనుకూలం
నదులపై బ్యారేజీ–గేట్ వేలు నిర్మించడం ద్వారా జల రవాణాకు అనుకూలంగా ఉంటుందని, ఈ దిశగా బుధవారమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆగ్రా వద్ద యమునా నదిపై ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, ఏపీలో ఒకటి నిర్మించాలని ప్రతిపాదించామని వివరించారు. శ్రీరాం వెదిరె సూచించినట్లు కాశేళ్వరం ఎత్తు పెంచితే తెలంగాణ సస్యశ్యామలం అవడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు నీళ్లు అందించవచ్చని వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం సాగు నీటికి కేటాయింపులు పెరగడం సంతోషకరమన్నారు. ఉమాభారతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని నీటి వనరుల కొరత వేధిస్తోందని, రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు. దత్తాత్రేయ మాట్లా డుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు ప్రధానితో మాట్లాడతానన్నారు.
నదుల అనుసంధానంపై చర్చించాం: వెదిరె
శ్రీరాం వెదిరె మాట్లాడుతూ ‘నదుల అనుసందానంపై ఈ పుస్తకంలో చర్చించాం. నదులనే కాలువలుగా ఉపయోగించే విధానాన్ని చర్చించాను. బ్యారేజీల ద్వారా సమర్థంగా నీళ్లు వినియోగించు కోవచ్చు. నదుల అనుసంధానంతో కోటి మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు.