
సాక్షి, ఢిల్లీ/అమరావతి: పోలవరం జలాశయం(హెడ్ వర్క్స్) పనుల్లో 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించిన పనులను ‘నవయుగ’ కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఆ పనులను పాత ధరలకే పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ షరతు విధించారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి గడ్కరీ తన కార్యాలయంలో కేంద్ర, ఏపీ జలవనరుల శాఖ అధికారులు, తన సలహాదారు, ట్రాన్స్‌ట్రాయ్, నవయుగ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం..
నెల రోజుల గడువులో పాత కాంట్రాక్టర్ నిర్దేశించిన మేరకు పనులు చేయలేకపోయారని, ఆ పనులను పాత ధరలకే చేయడానికి ముందుకొచ్చిన నవయుగకు నామినేషన్ విధానంలో అప్పగించడానికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు. పనుల విలువ ఎంత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల్లోగా పనుల విలువ లెక్క కడతామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
పనుల విలువను పక్కాగా తేల్చి.. 2019 నాటికి పనులు పూర్తయ్యే ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుని వాటిని నవయుగకు అప్పగించాలని గడ్కరీ ఆదేశించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ప్రధాన జలాశయం), కాఫర్ డ్యామ్‌లు, అనుబంధ పనులతోపాటూ స్పిల్ వేలో మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ప్రతినిధులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment