ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. జనవరి మొదటి వారంలో వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు.
వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. జనవరి మొదటి వారంలో వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి నాలుగు రోజుల ఖరారైందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. రోజువారీ కార్యక్రమాలపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 3న కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తారు. జనవరి 4న మళ్లీ వచ్చి 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. జనవరి 4న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆలేరు-వరంగల్ జాతీయ రహదరి విస్తరణ పనులను ప్రారంభిస్తారు. అనంతరం ఏటూరునాగారంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. ఆరోజు సాయంత్రం హన్మకొండలో బస చేస్తారు. గణపురం మండలం చెల్పూరులో కొత్తగా నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్రాజెక్టును జనవరి 5న ప్రారంభిస్తారు.
ఆ రోజు సాయంత్రం కూడా హన్మకొండలోనే బస చేస్తారు. మరుసటి రోజు 6వ తేదీన గ్రేటర్ వరంగల్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు గతంలో శంకుస్థాపన చేసిన పనులను పర్యవేక్షిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో అభివృద్ధి పనులను వరంగల్ నుంచే ప్రారంభించారు. జనవరి 8, 9, 10, 11 తేదీల్లో వరంగల్‌లో ఉండి డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మళ్లీ సంవత్సరం తరువాత సీఎం రెండోసారి జిల్లాలో వరుసగా నాలుగు రోజులు పర్యటించనున్నారు.