ఏపీ రహదారులకు రూ.లక్ష కోట్లు
కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన 3,000 కిలోమీటర్ల రహదారులను రూ.75,000 కోట్లతో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మధ్య ఒప్పందం కుదిరింది.
అదేవిధంగా రాజధాని అమరావతి చుట్టూ రూ.23,430 కోట్లతో 426 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయడానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)తో ఒప్పందమూ కుదిరింది. ఇవిగాక రూ.3,500 కోట్లతో 30 ఆర్‌వోబీలను అభివృద్ధి చేయడంతోపాటు కేంద్ర రహదారుల నిధి(సీఆర్‌ఎఫ్)కి రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా శనివారం ‘పారిశ్రామిక కారిడార్లతో పారిశ్రామికాభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో గడ్కరీ మాట్లాడారు.