సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 90 రోజుల పాటు అప్పు ప్రాతిపదికన స్టీలు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా), విశాఖ ఉక్కు పరిశ్రమ అంగీకరించాయి. అయితే సిమెంట్ ఉత్పత్తి సంస్థలు మాత్రం 90 రోజులు అప్పు కింద సరఫరా చేయలేమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సిమెంట్ ఉత్పత్తి సంస్థలతో మరోసారి సమావేశం కావాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నిర్ణయించారు.
సిమెంట్ కంపెనీలతో మరోసారి భేటీ కానున్న గడ్కరీ
పోలవరం కాంక్రీట్ పనులలో జాప్యానికి స్టీలు, సిమెంటు కొరతే కారణమని చెబుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన గడ్కారీ మంగళవారం ఢిల్లీలో సిమెంటు, స్టీలు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు, కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు 90 రోజులు అప్పు కింద స్టీలు, సిమెంటు సరఫరా చేయాలని, కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆప్ క్రెడిట్ కింద హామీ ఇస్తుందని ఈ సందర్భంగా గడ్కారీ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై సిమెంటు ఉత్పత్తి సంస్థలు అభ్యంతరం తెలిపాయి.
ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 30 రోజుల అప్పు కింద మాత్రమే సరఫరా చేయగలమని, అంతకంటే ఎక్కువ కాలమైతే ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వారితో మరోసారి సమావేశం కావాలని గడ్కారీ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ హామీపై స్టీలు సరఫరాకు సెయిల్, విశాఖ ఉక్కు పరిశ్రమ అంగీకరించాయి. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ, పీపీఏ అధికారులతో పోలవరం పనులపై గడ్కారీ సమీక్ష నిర్వహించారు. కొత్తగా అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటం వల్ల ఉత్పత్తిని నిలిపివేయటంతో కాంక్రీట్ పనుల్లో వేగం మందగించిందని అధికారులు వివరించారు. ఈనెల 23వతేదీ నాటికి అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్‌సిద్ధమవుతుందని, రోజూ 8 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తామని కాంట్రాక్టర్ పేర్కొన్నట్లు తెలిసింది.
గడ్కారీ పర్యటన వాయిదా
26 లేదా 27న పోలవరం సందర్శన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పోలవరం ప్రాజెక్టు సందర్శన పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. ఈనెల 23న పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వస్తున్నట్లు గడ్కారీ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో 23న ఆయన పోలవరానికి వచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈనెల 26న లేదా 27న గడ్కారీ పోలవరానికి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. గడ్కారీ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment