రిక్షా.. మేడ్ ఇన్ చైనా
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: నాసిక్ పట్టణంలోని ఓ ‘చైనీస్ రిక్షా’ అందరి దృష్టినీ అకర్షిస్తోంది. పెట్రోల్-డీజిల్, ఎల్‌పీజీ-సీఎన్‌జీ లాంటి ఇంధనాలు అవసరం లేకుండా నడిచే ఈ చైనా రిక్షాను నాసిక్‌లో భరత్ పాటిల్ అనే డ్రైవర్ కొనుగోలు చేసి స్థానికులకు రవాణా సేవలందిస్తున్నాడు. బ్యాటరీల సహాయంతో నడిచే విధంగా ఈ ‘చైనీజ్ రిక్షా’ను తయారు చేశారని, సౌర శక్తితో చార్జ్ అయ్యే ఈ రిక్షా వల్ల ఇంధనం పొదుపవుతుందని, ప్రయోగాత్మకంగా కొనుగోలు చేసి నడుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రయోగం విజయవంతమైతే పట్టణమంతటా వీటిని నడుపుతామన్నారు.
బీజేపీ కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి నాగ్‌పూర్‌లో ఈ చైనా రిక్షాను ప్రారంభించారు. అందులో కూర్చుని ప్రయాణ అనుభూతిని కూడా పొందారు. ప్రస్తుతం ఢిల్లీ, కోల్‌కతా, నోయిడా, పంజాబ్ రాష్ట్రాల్లో వీటిని నడుపుతున్నారని, ఇప్పుడు నాసిక్‌లో ప్రారంభమైందని పాటిల్ తెలిపారు.
ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు
ఈ రిక్షా విలువ రూ.1.30 లక్షలని, దీని ద్వారా వాతావరణం కలిషుతమయ్యే వాయువులేవీ ఉత్పత్తవవు అని పాటిల్ తెలిపారు. సౌర శక్తితో చార్జ్ అయ్యే 100 ఆంపియర్‌ల నాలుగు బ్యాటరీలను రిక్షాలో బిగించారని, వీటి ద్వారా ఇంజిన్ నడుస్తుందన్నారు. ఒకసారి ఫుల్ చార్జయితే సుమారు 80 కిలోమీటర్ల వరకు నడుస్తుందని ఆయన అన్నారు. గంటకు 20 కిలోమీటర్ల వేగం ఉంటుందని, వేగం తక్కువ కాబట్టి లెసైన్సు అవసరం ఉండదన్నారు. ఇందులో ఐదుగురు ప్రయాణికులు కూర్చోవచ్చని పాటిల్ వివరించారు.