ఎండలో పాండా
సౌరశక్తితో కాలుష్యం తగ్గుతుంది.. పర్యావరణానికి మేలు జరుగుతుంది.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకోవచ్చు. ఇలాంటి మాటలు బోలెడన్ని ఇప్పటికే వినేసుంటాం. పైగా, సోలార్ ఫామ్స్ చూసేందుకు కూడా గొప్పగా ఏమీ ఉండవు.. కనుచూపుమేరలో అన్నివైపులా నల్లటి రంగులో ఒకే రీతిలో సోలార్ ప్యానెల్స్ ఉంటే ఎం బాగుంటుంది చెప్పండి? అయితే చైనా ఇప్పుడు సోలార్‌ఫామ్స్‌ని కూడా ఫ్యాషనబుల్‌గా తయారు చేస్తోంది. ఫొటోలో ఉన్నది అచ్చంగా అలాంటి సోలార్ ఫామే!
చైనీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన జంతువు పాండా ఆకారంలో సిద్ధం చేసిన ఈ సోలార్ ఫామ్ డటాంగ్ ప్రాంతంలో ఉంది. దీని ద్వారా పుట్టే విద్యుత్తు ఎంతో తెలుసా? దాదాపు 50 మెగావాట్లు! పాండా ఆకారంలో నల్లగా కనిపిస్తున్న చోట్ల మోనో క్రిస్టలీన్ సిలికోన్ సోలార్‌సెల్స్‌తో తయారైన ప్యానెల్స్ ఉంటే.. కొంచెం తెలుపు రంగులో ఉన్న ప్రాంతాల్లో అధిక విద్యుత్తును ఉత్పత్తిచేయగల అత్యంత పలుచటి సోలార్ ప్యానెల్స్‌ను వాడారు. ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలో భాగంగా పాండా గ్రీన్ ఎనర్జీ పేరుతో ఏర్పాటైన ఈ సోలార్ ఫామ్‌లో ఈ పాండా ఆకారం తొలి దశ మాత్రమే. త్వరలోనే మరో వంద మెగావాట్ల సామర్థ్యంతో మరో పాండా ఆకారపు ఫామ్ సిద్ధం కానుంది.
ఈ ఫామ్స్ ద్వారా వచ్చే పాతికేళ్లలో కనీసం 27.4 లక్షల టన్నుల విషవాయువులు వాతావరణంలో కలవకుండా నిరోధించవచ్చు. దాదాపు పదిలక్షల టన్నుల బొగ్గు మండడం ద్వారా ఇంత మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇంకో విషయం.. దేశ యువతకు సౌరశక్తిపై మక్కువ పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫామ్స్‌లో ఓ యూత్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారట. రానున్న ఐదేళ్ల కాలంలో పాండా 100 కార్యక్రమంలో భాగంగా ఇలాంటి భారీసైజు సోలార్‌ఫామ్స్ మరిన్ని ఏర్పాటు చేస్తామంటోంది పాండా గ్రీన్ ఎనర్జీ సంస్థ.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్