‘చబహర్’తో పాక్‌కు చెక్
- ఇరాన్‌తో ఓడరేవు అభివృద్ధికి భారత్ ఒప్పందం
- వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్
- మోదీ, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ సమక్షంలో సంతకాలు
- కొత్త చరిత్రకు సాక్షులుగా నిలిచామన్న ప్రధాని మోదీ
- ఉగ్ర పోరుకు సహకారం..వాణిజ్య, రక్షణ, పెట్టుబడులపై 12 ఒప్పందాలు
టెహ్రాన్: ఇరాన్‌తో భారత్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం ఒప్పందంపై సంతకం చేసింది. దీనివల్ల పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, యూరప్‌లతో అనుసంధానత వస్తుంది. ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీలు ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత చబహర్‌తోసహా ఇరు దేశాలు 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటానికి పరస్పర సహకారం అందించుకుంటామని అంగీకరించాయి. భారత ఇంధన దిగుమతి అవసరాలకు ఇరాన్‌లోని చబహర్ కీలకం.
చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్న భారత్... రవాణా, ట్రాన్సిట్ కారిడార్ కోసం ఇరాన్, అఫ్గానిస్తాన్‌తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. మోదీ, రౌహానీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. 2001లో వాజపేయి ఇరాన్‌లో పర్యటించగా, ఆ తర్వాత 15 ఏళ్లకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే. చబహర్ ఒప్పందం ఈ ప్రాంతం చరిత్రను మార్చివేస్తుందని, కొత్త చరిత్రకు మనమంతా సాక్షులుగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘ఈ ఒప్పందం ఒకవైపు దక్షిణ ఆసియాను, మరోవైపు యూరప్‌ను కలుపుతుంది. అమాయకులను చంపడం, చిత్రవధ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై పోరాటానికి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా పర్షియా కవి హఫీజ్ కవితను ఉటంకిస్తూ మోదీ పర్షియా భాషలో మాట్లాడారు. ‘విభజన రోజులు ముగిశాయి. నిరీక్షించే రాత్రులు ముగింపునకు చేరాయి. మా స్నేహం చిరస్థాయిలో ఎప్పటికీ నిలిచిఉంటుంది’ అని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందాల వల్ల ఆర్థిక, వాణిజ్య, రవాణా, ఓడరేవు అభివృద్ధి, నాగరికత, సైన్స్, విద్యా అంశాల్లో సహకారం పెరుగుతుందన్నారు.
ఉగ్ర ముప్పును ఎదుర్కోడానికి..
రౌహానీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్, సైబర్ నేరాలపై పోరాటం చేసేందుకు, నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఉగ్ర ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు గూఢచర్య సమాచారం బదిలీ చేసుకోవాలని నిర్ణయించడంతోపాటు పలు రాజకీయ అంశాలపై చర్చించామన్నారు. కాగా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద శక్తుల్ని వాడుకోవడం, ప్రోత్సహించడాన్ని అన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకించాలని, ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు సహకారం, ఆశ్రయానికి తక్షణం ముగింపు పలకాలని భారత్, ఇరాన్‌లు కోరాయి. మోదీ, రౌహనీల మధ్య విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం మోదీ ఆ దేశ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల ఇరాన్ పర్యటన ముగించుకొని మోదీ భారత్‌కు బయలుదేరారు.
ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు
చబహర్ ఓడరేవు అభివృద్ధి, అల్యూమినియం ప్లాంటు స్థాపన, అఫ్తానిస్తాన్, మధ్య ఆసియాకు అనుసంధానం కుదిరేలా రైల్వే లైన్ ఏర్పాటు, దీనికోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌తో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం, మేధావుల సంప్రదింపులు-విధాన రూపకల్పనపైనా భారత్ ఒప్పందం చేసుకుంది. స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫ్ ఇరాన్‌తో భారత విదేశీ సంస్థ ఒప్పందం, ఇరాన్ ఎగుమతి గ్యారంటీ నిధితో భారత ఎగుమతి గ్యారంటీ కార్పొరేషన్ ఒప్పందం, సైన్స్, పరిశోధన రంగంలో, ప్రాచీన పత్రాలు, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఖమేనీకి అరుదైన బహుమతి
మోదీ ఇరాన్ అగ్రనేత ఖమేనీకి అరుదైన బహుమతి ఇచ్చారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఖమేనీతో భేటీ అయ్యారు. కుఫిక్(అతి పురాతన అరబిక్ భాష) లిపిలో రాసిన 7వ శతాబ్ధి నాటి ఖురాన్‌ను ఆయనకు ఇచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్ సాంస్కృతికశాఖకు చెందిన రామ్‌పూర్ రాజా లైబ్రరీలోనిది. ఇరాన్ విదేశాంగ విధానం, ఇతర కీలక అంశాల్లో ఖమేనీదే తుది నిర్ణయం.
‘చబహర్’ ఎందుకు కీలకమంటే...
ఇరాన్‌లో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసే కీలకమైన ఓడరేవు చబహర్. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్ మీదుగా, అలాగే తూర్పు యూరప్‌తో అనుసంధానానికి వీలు కల్పిస్తుంది. పాక్‌లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వదర్ ఓడరేవు నుంచి చబహర్ ఓడరేవు కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. చబహర్ నుంచి అఫ్గాన్‌తో రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం ఏర్పడుతుంది. ఇది పాక్‌లోని కరాచీ ఓడరేవుకు ప్రత్యామ్నాయం. ఇరాన్-పాక్-భారత్ పైప్‌లైన్ నిర్మాణానికి పాక్ పెద్దగా సహకరించట్లేదు. అదీగాక ఇరాన్-పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. దీంతో చబహర్ చాలా కీలకమవుతుంది. ఇరాన్ పొరుగుదేశమైన అఫ్గాన్‌కు చబహర్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. చబహర్, జహెదాన్ మధ్య 500 కి.మీ. రైల్వే లైను ఏర్పాటుచేస్తామని, దీంతో మధ్య ఆసియాకు అనుసంధానం ఏర్పడుతుందని రోడ్డు రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.