శతకోటి సంబరం! | Hundred Crore Covid Jabs Milestone In India Editorial Vardhelli Murali | Sakshi
Sakshi News home page

శతకోటి సంబరం!

Published Fri, Oct 22 2021 12:30 AM | Last Updated on Fri, Oct 22 2021 12:45 AM

Hundred Crore Covid Jabs Milestone In India Editorial Vardhelli Murali - Sakshi

ఇది సంతోషించాల్సిన విజయం. సంబరం చేసుకోవాల్సిన సందర్భం. తొమ్మిది నెలల క్రితం అనేక అనుమానాల మధ్య మొదలై, సవాలక్ష సమస్యలను దాటి గురువారం నాటికి అన్నీ కలిపి 100 కోట్ల కోవిడ్‌ టీకా డోసులు వేయడంలో మన దేశం సఫలమైంది. ప్రపంచం ముంగిట సగర్వంగా నిలిచింది. ఇప్పటికి 22 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఓ మహమ్మారిపై పోరాటంలో... దేశవాళీ టీకాల రూపకల్పనతో భారత్‌ సృష్టించిన చరిత్ర ఇది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న రెండు ప్రపంచ దేశాల్లో ఒకటిగా టీకాకరణలో భారత సువర్ణాధ్యాయం ఇది.

జూన్‌లో చైనా వంద కోట్ల మార్కు దాటాక, మళ్ళీ ఆ పని సాధ్యం చేసింది మనమే. విధాన రూపకర్తల మొదలు టీకా తయారీదార్లయిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ లాంటి సంస్థలు, అనుమానాలను తీర్చి టీకాలను ప్రజలకు చేర్చిన డాక్టర్లు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించిన సామాన్య ఆరోగ్య కార్యకర్తల దాకా కొన్ని కోట్ల మంది కృషి ఫలితం ఇది. 

మన దేశంలో ఈ జనవరి 16న మొదలైన ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ విజృంభించిన ఈ ఏడాది వేసవిలో టీకాల కొరత నుంచి ఇప్పుడు టీకాలు దండిగా దొరికే రోజుల దాకా చూశాం. తొలి డోసు అనుమానాల నుంచి మూడోదైన బూస్టర్‌ డోస్‌కు సై అనే దాకా వచ్చాం. నెల మొత్తం మీద 7 కోట్ల డోసుల తయారీకే ఆపసోపాలు పడిన క్షణాల నుంచి ఇప్పుడు నెలకు 20 కోట్ల డోసుల తయారీకి పురోగమించాం. కావాల్సిన ఔషధాలు, ఆక్సిజన్‌ దొరక్క అవస్థ పడిన రోజులు పోయి... కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌–వి సహా అనేక టీకాలు అందుబాటులో ఉండడం చూశాం. పడవలు, డ్రోన్లతోనూ టీకాల రవాణా చేశాం. తొలి రోజుల్లో సమస్యలెదురైనా, దేశీయంగా రూపొందించిన కోవిన్‌ యాప్‌ ద్వారా టీకాలపై సమాచారం, తక్షణ డిజిటల్‌ సర్టిఫికెట్లు విజయవంతంగా అందుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 కోట్ల డోసుల విజయం ఓ మైలురాయే. మరిన్ని సవాళ్ళు ముందున్నాయి.  

ఈ ఏడాది చివరి కల్లా 100 కోట్ల వయోజన భారతీయులకు పూర్తిగా టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అనుకున్నంత సులభం కాదు. అది సాధించాలంటే, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఈ బృహత్తర యజ్ఞంలో ఇప్పటికి మన దేశంలోని వయోజనుల్లో (18 ఏళ్ళ వయసు దాటినవారు) నూటికి 75 మందికి కనీసం ఒక డోసయినా టీకా వేసినట్టయింది. అదే సమయంలో మరో 25 శాతం మంది వయోజనులు ఇంకా టీకా ఫస్ట్‌ డోస్‌కే నోచుకోవాల్సి ఉంది. నిజానికి రెండు డోసులూ వేస్తేనే టీకా వేయడం పూర్తయి, కరోనా నుంచి పూర్తి రక్షణ వచ్చినట్టు లెక్క. అందుకే,  శతకోటి డోసులు పూర్తయినంత మాత్రాన శతాధిక కోట్ల భారతీయులకూ టీకా వేయడం పూర్తయినట్టు కాదు. తలా రెండు డోసులు పడేవరకూ ప్రతి ఒక్కరూ సురక్షితమూ కాదు. 

అమెరికా తర్వాత అత్యధికంగా 3.4 కోట్ల పైగా కోవిడ్‌ కేసులు వచ్చింది మన దేశంలోనే. అమెరికా, బ్రెజిల్‌ తరువాత అధికంగా 4.52 లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయిందీ భారత్‌లోనే. క్లిష్టమైన ఈ ప్రయాణంలో ప్రాణాంతక వైరస్‌ నుంచి దేశం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ప్రజారోగ్యంపై, ప్రాథమిక ఆరోగ్య వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకులకు మరోసారి గుర్తొచ్చింది.

లాక్డౌన్‌లు, వలస జీవుల వెతలు, దెబ్బతిన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థల నడుమనే సమష్టి కృషితో దేశం కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. 278 రోజుల్లో ఇలా శతకోటి డోసులు పూర్తయ్యాయంటే, సగటున రోజుకు 36 లక్షల టీకాలు వేసినట్టు లెక్క. కానీ, జనవరి నుంచి చూస్తే, ఏప్రిల్, సెప్టెంబర్‌ వగైరాల్లో టీకాప్రక్రియ వేగవంతం కావడం, అనేక కారణాలతో మధ్యలో మందకొడిగా సాగడం గమనార్హం. 

ప్రధాని మోదీ 71వ పుట్టినరోజైన సెప్టెంబర్‌ 17న రికార్డు స్థాయిలో 2 కోట్లకు పైగా డోసులు పడ్డాయి. కానీ,ఆ వేగం తగ్గి, అక్టోబర్‌లో సగటున రోజుకు 53 లక్షలే వేయగలిగాం. కానీ, డిసెంబర్‌ ఆఖరుకు అర్హులైన భారతీయులందరికీ టీకా అనే లక్ష్యం సాధించాలంటే, ఇకపై రోజూ 1.2 కోట్లకు పైగా డోసులు వేయాలి. అలాగే, పిల్లలు, యువకులకు ఇప్పటికీ టీకాలు వేయాల్సి ఉంది. 12 ఏళ్ళు పైబడిన వారందరికీ తొలిసారిగా సూదితో అవసరం లేని జైకోవ్‌–డి టీకాను దేశీయంగా రూపొందించడం ఒక శుభసూచకం. అయితే, ఇప్పటికీ పట్టణ – గ్రామీణ ప్రాంతాల మధ్య, అలాగే స్త్రీపురుషుల మధ్య టీకాకరణలో అంతరం ఆలోచించాల్సిన విషయం. పురుషులతో పోలిస్తే 6 శాతం తక్కువ మంది స్త్రీలు టీకాలు వేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ అంతరాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుతం మన దేశంలో కోవిడ్‌ కేసులు రోజూ సగటున 20 వేల లోపే ఉండడం, తెలుగు రాష్ట్రాలు రెండూ కలిపినా వెయ్యి లోపలే కేసులు నమోదవుతుండడం సంతోషించదగ్గ విషయమే. కానీ, ఇక్కడే అసలు చిక్కు. తొలి డోసు తర్వాత నిర్ణీత గడువు దాటినా కొన్ని లక్షల మంది రెండో డోసు వేసుకోకపోవడం ఆందోళనకరం. అలాగే, షరతుల సడలింపులతో కోవిడ్‌ నిబంధనల్ని గాలికి వదిలేయడం ఇప్పటికే ఎక్కువైంది. మాస్కులు, భౌతిక దూరాలు మానేయడం మనకే ముప్పు.

మాస్కులు ధరించడం... గాలి, వెలుతురు ఉండే చోట పనిచేయడం... కరోనాకు పండగగా మారే ఉత్సవాలకు దూరంగా ఉండడమే అసలు టీకా అని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. వేరియంట్లకు వ్యాక్సిన్లు, ఉత్పరివర్తనాలకు (మ్యూటెంట్లకు) మాస్కులు ఇదే రక్షణ మంత్రం అన్నది నిపుణుల నినాదం. 

అందుకే, శతకోటి సంబరంతో చప్పట్లు కొట్టి, పాటలు పాడి, దీపాలు వేసి సేదతీరితే సరిపోదు. మానవాళికి ముప్పు ఇంకా తొలగిపోలేదు. రూపు మార్చుకొంటున్న వైరస్‌తో అమెరికాలో 90 వేలు, బ్రిటన్‌లో 50 వేలు, రష్యాలో 33 వేలకు పైగా రోజువారీ కేసులు వస్తున్నాయని మర్చిపోకూడదు. అగ్రరాజ్యాలలోనే పరిస్థితి ఇలా ఉంటే, మామూలు దేశాల పరిస్థితి ఊహించుకోవచ్చు.

థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్న మన దేశంలో కరోనా టీకాల రెండు డోసులూ ఇప్పటికి చేరింది 30 శాతం (29.1 కోట్ల) మందికే! ఆ సంగతి మనం మర్చి పోకూడదు. అర్హులందరికీ టీకా లక్ష్యం చేరితే, పొరుగుదేశాలతో పాటు ఆఫ్రికా లాంటి చోట్లకు మన ‘వ్యాక్సిన్‌ మైత్రి’ దౌత్యంతో స్నేహవారధి నిర్మించుకోవచ్చు. అసలైన ప్రయాణం ఇంకా ముందుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement